HEALTH & LIFESTYLE

న్యుమోనియా వ్యాధి ప్రమాదకరం, ప్రాణాంతకం

 2021లో న్యుమోనియా అంటువ్యాధితో 2.2 మిలియన్లు మరణించగా అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు.  ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి న్యుమోనియా. కోవిడ్‌-19 కారణంతో మరో 10 మిలియన్లు కూడా అదనంగా మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక ప్రాణాలను గైకొంటున్న వ్యాధుల్లో న్సుమోనియా ప్రధానమైనదని తేలింది.

వాతావరణ ప్రతికూల మార్పులు, గాలి కాలుష్యం కోరలు చాచడంతో శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నం కావడం, న్యుమోనియా మహా విపత్తు వస్తుందనే భయం కూడా ఉందని, మిలియన్ల జనులు న్యుమోనియా సోకే ప్రమాదపు అంచున ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. న్యుమోనియా వ్యాధి ఐదేండ్ల లోపు పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. టీకాలు వేయించుకోని వారు, పోషకాహారలోపాలు, ఇంట్లో వంట చెరుకు వాడే వారు, కలుషిత గాలి పీల్చే పెద్ధలు, పొర త్రాగే దురలవాటు ఉన్న వారు అధికంగా న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంటుంది.

ప్రపంచ న్యుమోనియా దినం-2024 థీమ్‌::

న్యుమోనియా వ్యాధి తీవ్రత, ప్రమాదాన్ని గుర్తించిన అంతర్జాతీయ సమాజం 2009 నుంచి ప్రతి ఏట 12 నవంబర్‌ రోజున “ప్రపంచ న్యుమోనియా దినం” పాటిస్తూ ఆ వ్యాప్తి పట్ల కనీస అవగాహన కల్పించడం జరుగుతోంది. బ్యాక్టీరియా, వైరస్‌ లేదా ఫంగీ సంక్రమణ కారణంగా తాపజనక శ్వాస రుగ్మత (ఇన్‌ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిసార్డర్‌) లేదా న్యుమోనియా వ్యాధి అంటుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లో చేరి “ఎల్వియోలి” అనే భాగంపై ప్రభావాన్ని చూపి న్యుమోనియాకు దారి తీస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. బలహీన వ్యాధినిరోధకశక్తి కలిగిన పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా సోకి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ప్రపంచ న్యుమోనియా దినం -2024 థీమ్‌గా “ప్రతి శ్వాస ముఖ్యమే : న్యుమోనియాను మార్గంలోనే ఆపేద్దాం(ఎవ్రీ బ్రీత్‌ కౌంట్స్‌ : స్టాప్‌ న్యుమోనియా ఇన్‌ ఇట్స్‌ ట్రాక్‌)” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. 

న్యుమోనియాలో రకాలు:

న్యుమోనియా నివారించదగిన అంటు వ్యాధి. వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం లాంటి సందర్భాల్లో మరొకరికి సంక్రమిస్తుందని తెలుసుకోవాలి. పిల్లల్లో బ్యాక్టీరియా కారణ స్ట్రెప్టోకోకల్‌ న్యుమోనియా అతి ప్రధానమైనది. దాని తర్వాత హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లుయెంజా రెండవ ప్రధానమైనది.‌ న్యుమోనియాలో రెస్పిరేటరీ సిన్సిటియల్‌ వైరస్ వ్యాధి వైరస్‌ వర్గంలో ముఖ్యమైనది. ‌  న్యుమోనియా వ్యాధికి చికిత్స కూడా అందుబాటులో ఉన్నది. ప్రపంచ న్యుమోనియా దినం వేదికగా ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్‌జిఓలు, ఇతర సంస్థలు కలిసి న్యుమోనియా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగగ్రస్థులకప చికిత్సా పద్దతులు వివరించడం మంచి ఫలితాలను ఇస్తాయి. న్యుమోనియాను తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. 

న్యుమోనియా సోకడానికి కారణాలు:

 ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ప్రతి ఏట 14 లక్షల పిల్లలు న్యుమోనియా సోకి చనిపోవడం, పిల్లల మరణాల్లో 18 శాతం వరకు న్యుమోనియా కారణం కావడం గమనార్హం. యూనిసెఫ్‌ వివరాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు న్యుమోనియాతో మరణిస్తున్నాడు. వృద్ధుల్లో న్యుమోకోకల్‌ న్యుమోనియా అధికంగా సోకుతుంది. న్యుమోసిస్టిక్‌ జిరోవెస్సీ వ్యాధి ఫంగస్‌ సోకడంతో వస్తుంది. గాలి కాలుష్యం, స్మోకింగ్‌ వల్ల 16 లక్షల వృద్ధులు మరణిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఒ, యూనిసెఫ్‌లు సంయుక్తంగా న్యుమోనియా, డయేరియా వ్యాధుల కట్టడికి గ్లోబల్‌ ఆక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులు, పర్యావరణ కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న జనులు, హెచ్‌ఐవి/క్యాన్సర్‌ లాంటివి సోకిన వ్యాధిగ్రస్థులు న్యుమోనియా ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ. 

నివారణ మార్గాలు:

టీకాలు వేయించడం, పోషకాహారం అందిచడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల న్యుమోనియా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఆంటీబ్యాక్టీరియల్‌, అంటీ వైరల్‌, ఆంటీ ఫంగల్‌ ఔషధాలతో న్యుమోనియా కట్టడి జరుగుతుంది. భౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం, పబ్లిక్‌ పిరజేశాల్లో ఉమ్మి వేయకుండా ఉండడం, దగ్గినపుడు లేదా తుమ్మినపుడు కండువా కప్పుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, గాలి కాలుష్యాన్ని కట్టడి చేయడం, నదుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం లాంటి పలు దాగ్రత్తలు న్యుమోనియా కేసులను తగ్గిస్తాయి. 

 పిల్లలకు, పెద్దలకు అతి ప్రమాదకరమైన అంటు వ్యాధిగా నిలిచిన న్యుమోనియా పట్ల సరైన అవగాహన పెంచుకొని అలాంటి ప్రాణాంతక రుగ్మతకు చరమగీతం పాడదాం, న్యుమోనియా కానరాని భారతాన్ని నిర్మించుకుందాం. 

Show More
Back to top button