HEALTH & LIFESTYLE

మానసిక ఆందోళనలతో తీవ్ర ప్రతికూల ఫలితాలు

10 అక్టోబర్‌ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ సందర్భంగాప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం జ్వరం లేకపోవడం మాత్రమే ఆరోగ్యం కాదని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంత ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యవంతులని వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌజన్యంతో ప్రతియేటా 10 అక్టోబర్‌ రోజున ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ పాటించడం ఆనవాయితీ వస్తున్నది.

1992లో ప్రారంభమైన ప్రపంచ మానసిక ఆరోగ్య దినం వేడుకల్లో భాగంగా విశ్వ మానవాళికి మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను తెలపడం, మానసిక రుగ్మతలతో బాధ పడుతున్న వారికి చికిత్స అందించడం, మానసిక వికాసానికి పాటించాల్సిన జాగ్రత్తలను వివరించడం జరుగుతుంది. మానసిక దృఢత్వం కలిగిన వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మానసిక వ్యాధికి మందు లేదనే నానుడి మనందరికి తెలుసు.

జీవనోపాధికి బజారుకు వెళ్ళి కాయకష్టం చేసుకునే వారు కూడా నిత్యం విపత్తుల భయం గప్పిట్లో జీవిస్తూ, మానసిక ఆందోళనకు గురౌతున్నారు. అనారోగ్యంగా ఉండే వారు మానసిక దృఢత్వంతో ఉండి తొందరగా కోలుకున్నారు. ఔషధాలతో నయం కాని రోగాలు మానసిక ధైర్యంతో నయం అవుతాయని ప్రచారం చేయుట జరగాలి. వ్యాధి కన్న భయం ప్రమాదకరమైందని గమనించాలి. 

ప్రపంచ సమస్యగా మానసిక అనారోగ్యం:

  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మానసిక ఆరోగ్య సాధనపై దృష్టి సారించి, పలు జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. భయం, ఒత్తిడి, ఉద్రేకం, నిరాశ, అధిక పని ఒత్తిడి,  ఒంటరితనం, భావోద్వేగ ఆందోళనలు లాంటివి మానసిక ఆరోగ్యానికి ప్రతిబంధకాలు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 450 మిలియన్లకు పైగా ప్రజలు మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారని అంచనా. విశ్వవ్యాప్తంగా 13 శాతం అనారోగ్యాలు మానసిక సంబంధమైనవిగా గుర్తించారు.

ప్రపంచ స్థాయిలో మానసిక ఆందోళనలతో ఏడాదికి 8 లక్షల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అసంఖ్యాకులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని తేలింది. మానసిక బలహీనతలతో 79 శాతం ఆత్మహత్యలు దిగువ పేద మరియు మధ్య తరగతి కుటుంబాలలో నమోదవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సమాఖ్య అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానసిక సంక్షోభం స్థితి వచ్చిందని, అన్ని దేశాల్లో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని, వీటిని తగ్గించడానికి 16 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక భారం పడుతుందని విశ్లేషించారు. విశ్వ ఆరోగ్య స్థాపనకు బహుముఖీన మానసిక ఆరోగ్య వికాస చర్యలు అవసరం అవుతాయని గుర్తించారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినం-2023 నినాదం:

‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం-2023’ నినాదంగా “మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు” అనబడే అంశాన్ని తీసుకొని అసమానతలు రూపుమాపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మానసిక రోగుల్లో పేద, మధ్య ఆదాయ దేశాల ప్రజలు మాత్రమే 75-95 శాతం ఉన్నారని అంచనా. శారీరక ఆరోగ్యానికి మానసిక దృఢత్వం తప్పనిసరి అని అందరం గమనించాలి. 

మానసిక ఆరోగ్య రహస్యాలు:

 మానసిక ఆరోగ్యం ఒక రోజులో సాధించేది కాదని, మన జీవనశైలి, ఆలోచనా విధానంతో దీర్ఘకాలిక జాగ్రత్తలతోనే సత్ఫలితాలు కనిపిస్తాయని అర్థం చేసుకోవాలి. మనసు విప్పి గలగల మాట్లాడడం, చలాకీగా ఉండడం, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవడం, నవ్వటంతో పాటు నవ్వించడం, ప్రశాంతంగా నిద్ర పోవడం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం, సమయపాలన పాటించడం, శారీరక వ్యాయామానికి సమయమివ్వడం, మిత్రులతో సమస్యలను చర్చించడం, ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కోవడం లాంటి అలవాట్లతో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని నమ్మాలి.

మానసిక ఆరోగ్య పరిరక్షణకు సకారాత్మక అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యులు పలు అంశాల్లో మనసు విప్పి మాట్లాడుకోవడం తప్పనిసరి. సమస్యలు లేని జీవితం లేదు. విఫలం కాని వీరుడు లేడు. కష్టాలు మనకు మాత్రమే రాలేదు. కష్టసుఖాల సంగమమైన జీవితంలో విజయంలో విర్రవీగక, అపజయంలో ఆందోళన పడక, మానసిక పరిపక్వతతో అడుగులు వేసిన వారిని మానసిక ఆరోగ్యం వరిస్తుందని తెలుసుకోవాలి. 

మానసిక ఆరోగ్యంతోనే పనిలో సఫలత సిద్ధిస్తుందని, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, మానసిక ఆందోళన ప్రతికూల ఫలితాలను ఇస్తుందని తెలుసుకోవాలి. మానసిక ఆందోళనతో శారీరక సామర్థ్యం తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ తమ విధులను నిర్వహిస్తూ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొంది దేశాభివృద్ధిలో పాలు పంచుకుందాం. శారీరక మానసిక ఆరోగ్యమే మనిషి ప్రగతికి తొలి మెట్టు అవుతుందని గట్టిగా నమ్ముదాం. మానసిక ఆరోగ్యమే మహాభాగ్యమని నినదిద్దాం. 

Show More
Back to top button