సాధారణంగా కాలం మారుతున్నప్పుడు జ్వరాలు రావడం సహజం. అయితే, ప్రస్తుతం చిన్నారులకు వచ్చే జ్వరాలు సాధారణంగా ఉండడం లేవని అవి స్కార్లెట్ జ్వరం కూడా కావొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అసలు ఏంటి ఈ స్కార్లెట్ జ్వరం..? ఎందుకు వస్తుంది..? ఎవరికీ వస్తుంది..? వస్తే ఏం చేయాలి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్కార్లెట్ జ్వరం ముఖ్యంగా 5-15 వయసు గల చిన్నారులకు వస్తుంది. ఈ జ్వరం రావడానికి ముఖ్య కారణం స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా. ఈ జ్వరంతో బాధపడుతున్న పిల్లలు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లు ద్వారా పక్కనున్న పిల్లలకు వ్యాప్తి చెందుతుంది.
ఇది సోకిన వెంటనే చికిత్స తీసుకోకపోతే కొంతమంది చిన్నారులకు న్యూమోనియా, రుమాటిక్ ఫీవర్, తీవ్రమైన కీళ్ల నొప్పులు, గుండె సమస్యు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్కార్లెట్ జ్వరం లక్షణాలు
*102 డిగ్రీలతో కూడిన జ్వరం
*ఆకస్మాత్తుగా గొంతు నొప్పి
*కడుపునొప్పి
*తలనొప్పి
*వికారం
* వాంతులు
*శరీరంపై దద్దుర్లు
*నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం
*గొంతు, నాలుకపై తెల్లని పూత రావడం
* జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి ముందుగా కనిపిస్తాయి.
నివారణ ఎలా
మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్ళండి. వెంటనే యాంటిబయోటిక్స్ తీసుకుంటే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వీలైనంత వరకు ఎవరితోనూ కలవకుండా ఉండడానికి ప్రయత్నించాలి.