శరీరంలోని ఏదైనా ఒక అవయవ భాగంలో కణజాలం అపరిమితంగా, నియంత్రణ లేకుండా పెరగడం, ఇతర కణజాలాలకు వ్యాపించడం కారణంగా ఆయా భాగాల్లో గడ్డలు లేదా రాచ పుండు ఏర్పడడాన్ని క్యాన్సర్ వ్యాధిగా పిలుస్తారు. అతి ప్రమాదకర, ప్రాణాంతక క్యాన్స్‌ర్‌కు సరైన చికిత్స లేదు. తొలి దశలో గుర్తించడం వల్ల చికిత్సతో నయం చేయవచ్చు. క్యాన్సర్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మన చేతుల్లో ఉందని గమనించాలి. క్యాన్సర్ పట్ల పూర్తి అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు, చికిత్సా మార్గాలు, తెలి దశలో గుర్తించడం లాంటి పలు అంశాలను చర్చించే వేదికగా ప్రతి ఏట 07 నవంబర్ రోజున “జాతీయ క్యాన్స్‌ర్ అవగాహన దినం (నేషనల్ క్యాన్సర్ అవేర్‌నెస్ డే)”ను 2014 నుంచి పాటించుట ఆనవాయితీగా మారింది.
క్యాన్సర్‌లు పలు రకాలు:
క్నాన్సర్ చికిత్సలో వినియోగపడే రేడియేషన్ థెరపీకి అవసరమైన రేడియం, పొలోనియం రేడియోధార్మిక మూలకాలను కనుగొన్ననోబెల్ బహుమతి గ్రహీత మేడమ్ క్యూరీ జన్మదినం సందర్భంగా 07 నవంబర్ రోజున క్యాన్సర్ అవగాహన దినంగా పాటిస్తున్నాం. వందకు పైగా క్యాన్సర్ రకాలున్నాయి. వీటిలో రొమ్ము, నోటి, గర్భాశయ, ఊపిరితిత్తుల, క్లోమ, ప్రోస్టేట్, ఎముకలు, రక్తం లాంటి అవయవాల క్యాన్సర్లు ప్రధానమైనవి. క్యాన్సర్లలో కార్సినోమా (చర్మ, రొమ్ము, క్లోమ, ఇతర గ్రంథులకు), సర్కోమా (రక్తనాళాల, ఎముకల, కండరాల), మెలనోమా (చర్మ, పిగ్మెంట్), లింఫోమా (లింఫోసైట్స్), ల్యుకేమియా (రక్తం) అనబడే వర్గాలు ఉన్నాయి. క్యాన్సర్లలో క్లోమ లేదా పాంక్రియాటిక్ క్యాన్సర్ అతి ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. భారత్‌లో ప్రతి రోజు 1,300 మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. మన దేశ పురుషుఌో ఊపిరితిత్తుల క్యాన్సర్, మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌లు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
భారత్‌ను కబళించ చూస్తున్న క్యాన్సర్ భూతం:
ప్రపంచవ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులతో 71 శాతం మరణాలు నమోదు కాగా భారత్‌లో మాత్రం 63 శాతం మరణాలు సంభవిస్తుండగా, ఇందులో 9 శాతం మరణాలు క్యాన్సర్ వల్లనే నమోదు అవుతున్నాయి. 1975లో భారత ప్రభుత్వం ప్రారంభించిన “జాతీయ క్యాన్సర్ నియంత్రణ ప్రోగ్రామ్” ద్వారా క్యాన్సర్‌కు వైద్య సదుపాయాలను దేశవ్యాప్తంగా నెలకొల్పడం, 1984-85 నుంచి నివారణ చర్యలు/తొలి దశలో గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, హంగేరి, బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఐర్లాండ్, అమెరికా లాంటి దేశాల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నట్లు తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం గరిష్టంగా 8.17 శాతం క్యాన్సర్ పేగులు భారత్‌లోనే ఉన్నట్లు పేర్కొనబడింది.
భారత్‌లో 2.25 మిలియన్ల క్యాన్సర్ రోగులు ఉండగా, ప్రతి ఏట 1.1 మిలియన్ల కొత్త కేసులు బయట పడుతుండడం ప్రమాదకర హెచ్చరికగా భావించాలి. మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక గర్భాశయ క్యాన్సర్ రోగి మరణిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. క్యాన్సర్ కేసుల్లో 66 శాతం వరకు ముదిరిన తర్వాతనే బయట పడడంతో ఆ రోగులను కాపాడడం కష్టం అవుతున్నది. భారతీయుల్లో ప్రతి 10 మందిలో ఒక్కరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, చనిపోయిన ప్రతి 15 మందిలో ఒక్కరు క్యాన్యర్ వ్యాధితో మరణిస్తున్నారని తెలుస్తున్నది. పొగాకు ఉత్పత్తుల దురలవాట్లతో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు కావడంతో పాటు భారతీయ మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా కనిపిస్తున్నాయి. వీటికి కోడు ఆల్కహాల్, మాదకద్రవ్యాలు, ఆహారలేమి, పోషకాహారలోపం, కాలుష్యం లాంటి కారణాలు కూడా క్యాన్సర్‌కు ఆజ్యం పోస్తున్నాయి.
క్యాన్సర్ లక్షణాలు, చికిత్సా మార్గాలు, జాగ్రత్తలు:
క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించని కారణంగా తొలి దశలో గుర్తించడం కష్టంగా తోస్తున్నది. క్యాన్సర్ రోగ లక్షణాల్లో విరోచనాలు, దగ్గు, చర్మంపై మచ్చలు, ఉమ్మితే రక్తం పడడం, రక్తహీనత, రొమ్ములో గడ్డలు, మూత్ర సంబంధ మార్పులు, మలంలో రక్తం పడడం, బీజాల్లో గడ్డలు లాంటివి పేర్కొబడినవి. భారతంలో దాదాపు 50 శాతం క్యాన్సర్ కేసుల్లో రొమ్ము, గర్భాశయ, ఊపిరితిత్తుల, జీర్ణకోశ, పెద్ద పేగు క్యాన్సర్లు బయట పడుతున్నాయి. క్యాన్సర్ ప్రధాన చికిత్సల్లో ఇమ్యునోథెరపీ, రేడియోషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, స్టెమ్ సెల్ మార్పిడి, శస్త్ర చికిత్స, ప్రిసీషన్ మెజిసిన్ లాంటివి బహుళ ప్రచారంలో ఉన్నాయి. శరీర బరువు నియంత్రణ, పోషకాహారం, శారీరక శ్రమ, టీకాలు, క్రమం తప్పకుండా చెక్అప్‌లు, తీవ్రమైన ఎండ పడకుండా చూసుకోవడం, పొగాకు/ఆల్కహాల్ దురలవాట్లకు దూరంగా ఉండడం లాంటి జాహ్రత్తలు క్యాన్సర్ రోగం బారినపడకుండా అడ్డుకుంటాయి.
శరీరంలోని ఏ భాగంలోనైనా గడ్డలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి అని గమనించాలి. క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండడం, జీవనశైలిని మార్చుకోవడం లాంటి చర్యలతో క్యాన్సర్‌ను తిప్పికొట్టి క్యాన్సర్ లేని ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలు చేద్దాం.