HEALTH & LIFESTYLE

నిద్రని దూరం చేసేవి ఇవే

మనం ఆరోగ్యంగా ఉండాలంటే విశ్రాంతి అవసరం. ప్రతి రోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇది మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. నిద్ర అనేది శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. రోజులో తగినంత నిద్రపోతే తలనొప్పి, జలుబు, నీరసం, ఒళ్లు నొప్పులు వంటి చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది వారి బిజీ లైఫ్ కారణంగా కనీసం 6 గంటలు కూడా నిద్రించడం లేదు. అందుకే కొంతమంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. ఇలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నిద్రకు భంగం కలిగించే 5 రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

టమాటాలు

ఇందులో టైరమైన్ ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను ప్రేరేపించి నిద్రను దూరం చేస్తుంది. టమాటాలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. పడుకునే ముందు టమాటా తీసుకుంటే అజీర్ణం, అసిడిటీ వస్తుంది. అలాగే నిద్రపోయే ముందు నారింజ వంటి ఇతర సిట్రస్ ఆహారాలకు దూరంగా ఉండాలి.

వైట్ బ్రెడ్

ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. కొన్ని పరిశీలనల ప్రకారం ఇవి ఇన్‌సోమ్నియా(నిద్ర లేమి)కి కారణమవుతాయని తేలింది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. ఇది ప్రశాంతమైన నిద్రను నాశనం చేస్తాయి.

స్పైసీ ఫుడ్స్

రాత్రి టైంలో ఎక్కువమంది స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ, ఇది మన శరీరంలో వేడిని పెంచి నిద్రను నాశనం చేస్తుంది. కారంగా ఉంటే ఆహారాలను తినడం వల్ల వచ్చే గ్యాస్, అజీర్తి వంటివి నిద్రను చెడగొడతాయి. రాత్రిళ్లు జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను దూరం పెట్టండి.

 ఐస్ క్రీం

ఐస్‌క్రీంలో ఫ్యాట్, షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. ఇవి నిద్రలేమికి గురి చేస్తాయి. అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచి నిద్రలేమికి కారణమవుతాయి.

చాక్లెట్

నిద్రకు ముందు చాక్లెట్ ఉన్న పదార్థాలు తినడం మానుకోవాలి. కొన్ని చాక్లెట్లలో టైరోసిన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతుంది. డార్క్ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ ఉంటుంది. ఇది హార్ట్ బీట్ రేటును పెంచుతుంది. ఫలితంగా నిద్ర లేమికి కారణమవుతుంది. 

Show More
Back to top button