
ప్రస్తుతం చూసుకుంటే ఎవరికెప్పుడు ఏ అనారోగ్య పరిస్థితి ఎదురవుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ ముందుగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా.. ఏదోరకంగా దాని క్లెయిమ్స్‌ను పాలసీ కంపెనీ వారు రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి, మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫైల్ చేసే ముందు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా మీ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తున్న హాస్పిటల్ వివరాలను మొత్తం తెలుసుకోవాలి. ట్రీట్‌మెంట్ ప్లాన్‌ను, అడ్మిషన్ డేట్‌ను, అయ్యే ఖర్చుల అంచనా వేసుకోవాలి. బీమా సంస్థ లేదా టీపీఏకి 48 నుంచి 72 గంటల ముందే మీ ట్రీట్‌మెంట్ ప్లాన్‌పై ప్రీ– అథరైజేషన్ కోరుతూ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. తర్వాత హాస్పిటల్ ద్వారా ఈ రిక్వెస్ట్ పంపాలి. బీమా సంస్థ మీ ప్రీ–అథరైజేషన్ రిక్వెస్ట్‌ను ఒప్పుకుంటే ఆ లెటర్‌ను, వ్యాలిడ్ ఫొటో ఐడీని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే ముందు సబ్మిట్ చేయాలి.
కొన్ని హాస్పిటల్స్ అడ్వాన్స్‌గా కొంత అమౌంట్‌ను డిపాజిట్ చేయమని కోరొచ్చు. ఈ అమౌంట్‌ను డిశ్చార్జ్ అయ్యాక లేదా మీ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తయ్యాక రిఫండ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కేవైసీ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం మర్చిపోకూడదు. పాలసీ రూల్స్ ప్రకారం రియంబర్స్ కాని ఖర్చులను పేషెంటే భరించాలి.
మెడికల్ రిపోర్ట్ కాపీలను, డిశ్చార్జ్ డాక్యుమెంట్లను జాగ్రత్తగా ఉంచాలి. పాలసీ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారా? లేదా? అని చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే.. వెంటనే వాటిని సబ్మిట్ చేయండి. ముఖ్యంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా, క్లెయింలో లోపాలు ఉండటం వల్ల పాలసీ క్లెయింను అంగీకరించకపోవచ్చు. ఇదేమీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాంటి టైమ్లో బీమా సంస్థ చెప్పిన అభ్యంతరాలను సరి చేసుకుని, తిరిగి క్లెయిం చేసుకోవచ్చు.
మరో విషయం ఏంటంటే.. కొన్నిసార్లు వయసు, ఇప్పటికే ఉన్న వ్యాధుల వివరాల విషయంలో దాపరికం తగదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వాటి గురించి తెలియజేయాలి. వీటికి సంబంధించి ఏవైన సమాచారం వెల్లడించకపోయిన సందర్భాల్లోనూ క్లెయిం తిరస్కరిస్తుంది బీమా సంస్థ.
ఒకవేళ మీ వైపు అంతా కరెక్ట్‌గా ఉన్నా.. క్లైయిం రిజక్ట్ అయితే పాలసీదారులకు సరైన సహాయం అందించేందుకు బీమా సహాయ కేంద్రాలుంటాయి. వాటిని సంప్రదించి, మీ సమస్యను వివరించాలి. తద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ మీకు వారు ఇచ్చిన సమాధానం నచ్చకపోతే బీమా సంస్థ ఫిర్యాదు సెల్‌ను సంప్రదించవచ్చు.
IRDA మార్గదర్శకాల ప్రకారం 14 రోజుల్లో మీకు సమాధానం రావాలి. లేకపోతే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ (జీఆర్‌ఓ)కి విషయాన్ని తెలియజేయవచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకపోతే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే బీమా సంస్థ, పాలసీదారుడు మధ్య అంబుడ్స్‌మన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. ఇక్కడ దాదాపు మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది.