
శరీర అవయవాల్లో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బాడీలో ఉండే వ్యర్థపదార్థాలను బయటకు పంపుతుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి కిడ్నీలో రాళ్లు వస్తే, ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదు.
కిడ్నీ రాళ్లల్లో కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్పేట్ అని రెండు రకాలుగా ఉంటాయి. మూత్రంలో ద్రావణంతో పాటు పొటాషియం, సోడియం, యూరిక్ యాసిడ్, కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలతో కలిగిన సాలిడ్ కంపోనెంట్ ఉంటుంది. ఈ సాలిడ్ కంపోనెంట్లు మూత్రంలో కరగకపోతే.. అవి చిన్న చిన్న గుళికలుగా మారతాయి. ఇవి మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి, కిడ్నీలో రాళ్ల సమస్యను ముందుగానే గుర్తించగలిగితే సరైన చికిత్స తీసుకుని నివారించుకోవచ్చు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కొంత మంది వ్యక్తులలో అధికంగా ఉంటుంది. అది ఎవరంటే, అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్ పేషెంట్స్, వ్యాయామం చేయనివారు, నీళ్లు తక్కువగా తాగిన వారికి, మాంసాహారం అధికంగా తిన్నవారికి, స్టిరాయిడ్లను ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. టైమ్‌కు భోజనం చేయకపోయినా, శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నా, విటమిన్ డి అధికంగా ఉన్నా, నిద్రలేమి, కణితులు ఉన్నప్పుడు, కిడ్నీలకు తరచుగా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కూడా రాళ్లు ఏర్పడవచ్చు. భరించలేని నొప్పి, యూరినేషన్ సమయంలో నొప్పి, యూరిన్‌లో రక్తం, యూరిన్‌లో వాసన రావడం లాంటివి కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు కలిగే లక్షణాలు. ఒకవేళ మీలో ఈ లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యులను కలిసి కావాల్సిన చికిత్స పొందండి.