TRAVEL ATTRACTIONS

ఏజెన్సీలో.. వెన్నెల హొయలు.. చూసొద్దామా..!

ఏజెన్సీ ప్రాంతంలో.. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన వెన్నెల జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వర్షాలు భారీగా కురుస్తున్న వేళ.. వెన్నెల జలపాతం అందాలు, హొయలు అద్భుతాన్ని సంతరించుకుంది. పర్యాటక ప్రదేశాల్లో చోటు సంపాదించుకున్న వెన్నెల జలపాతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలోని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పట్టణ శివారు అడవిలో ఉంది ఈ వెన్నెల జలపాతం. ఎత్తైన గుట్టల మధ్య నుండి నీటి ధారలు జాలువారుతూ ఉంటాయి. ఈ గుట్టనే రథం గుట్ట అని పిలుస్తారు. రధం గుట్ట నుంచి పాలనురగల్లా నీటి ధారలు జలజలా జాలువారుతూ ఉంటాయి. పర్యాటకులకు ఆ దృశ్యం అద్భుతంగా కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి పర్యాటకులు వెన్నెల జలపాతాన్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. దట్టమైన అడవి మధ్యలో నుండి ఓ దారిలో ఈ జలపాతాన్ని చూసేందుకు వెళ్లే సౌకర్యం ఉంది. చల్లటి వాతావరణం, పర్యాటకుల్ని కనువిందు చేసే మనోహరమైన పచ్చదనం, ఉవ్వెత్తున ఎగిసిపడే వెన్నెల జలపాతం మనోహరంగా కనిపిస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలోని చుట్టూ.. కొండ కోనల నడుమ ఉన్నటువంటి ఈ జలపాతం ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షిస్తోంది. వర్షాకాలం కావడంతో జలపాతం అందాలు మరింత రెట్టింపు అయ్యాయి.

ప్రకృతి నడుమ ఉన్నటువంటి ఈ జలపాతం ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ.. గత రెండు సంవత్సరాల నుండి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. జలపాతం ఉందని అందరికీ తెలుసు కానీ, అడవి మధ్యలో వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండేది.  అయితే పర్యాటకుల తాకిడిని గుర్తించిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు. ప్రకృతి ప్రేమికులు ఆకర్షించే విధంగా జలపాతం వరకు రహదారిని ఏర్పాటు చేసి.. పలుచోట్ల సేద తీరేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. అప్పటినుండి వెన్నెల జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

ఒకప్పుడు ఇటువంటి జలపాతాలను చూడాలంటే ఇతర దేశాలకు గాని, రాష్ట్రాలకు గాని వెళ్లాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఇటువంటి జలపాతాలను అభివృద్ధి చేయడం వల్ల దగ్గర్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు.

ఉరుకుల, పరుగుల జీవితంతో బిజీగా గడిపే నేటి సమాజం కుటుంబంతో సహా.. జల  ఈ జలపాతం వద్ద వాలిపోతుంది. కుటుంబ సభ్యులు అంతా కలిసి జలపాతం వద్ద ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు.

పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ జలపాతం వద్ద మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పర్యటకులు కోరుతున్నారు. జిల్లా పర్యాటక కేంద్రంగా మార్చాలని పర్యాటకులు అంటున్నారు. వాటర్ ఫాల్ కి వెళ్లేందుకు రహదారిని మరింతగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ మరింత అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రాంతం మరింత పేరు సంపాదించుకుంటుందని పర్యటకులు చెబుతున్నారు.

వాటర్ ఫాల్ నిర్వహకులు పర్యాటకుల వద్ద నుండి చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. సరైన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదని ఆరోపణలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఈ జలపాతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంతో పాటు భద్రాద్రి జిల్లా కూడా మరింత పేరు సంపాదించుకుంటుందని పర్యటకులు కోరుతున్నారు.

Show More
Back to top button