
నేడు ఎక్కడ చూసినా జనాలకు సినిమాల గురించే ఆసక్తి. ఈ సినిమాల గురించి విస్తృత ప్రచారం జరగడానికి ప్రస్తుతం ఉన్న వివిధ రకాల ప్రసార మాధ్యమం (మీడియా) ప్రచారమే కారణం. కానీ వంద సంవత్సరాల నాటి సినిమా చరిత్ర గురించి ఆరా తీస్తే మనల్ని ఆలోచింపజేసే ఎన్నో ప్రశ్నల తలెత్తుతాయి. సామాజిక జీవితంలో మార్పుతో పాటు, నేటి ప్రజల మనస్తత్వం కూడా మారిపోయింది. యాభై సంవత్సరాల క్రితం సామాజిక పరిస్థితులను అనుసరించి సినిమాలు నిర్మించబడ్డాయి. అందువలన ఆ యుగంలోని భారతీయ సినిమా యొక్క ప్రతీ అధ్యాయంలో సామాజిక జీవితం, మహిళలకు అన్యాయం, స్త్రీల స్వేచ్ఛను ప్రకటించడం, సనాతన హిందూ సామాజిక వ్యవస్థ, పేద గ్రామీణ సాధారణ జీవితం, సంస్కృతి ప్రతిబింబిస్తాయి.
ప్రఖ్యాత చిత్ర దర్శకులు “సత్యజిత్ రాయ్” తెరకెక్కించిన “పథేర్ పాంచాలి” భారతీయ సినిమా చరిత్రలో ఒక అద్భుతం. 1955 లో నిర్మించబడిన ఈ సినిమా ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది. స్వాతంత్ర్యానంతర కాలంలో ఒక మారుమూల గ్రామం యొక్క నిజ జీవిత పరిస్థితులను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు ప్రతిబింబింపజేస్తుంది. పురాతన సినిమా చలన స్వభావం గల ఈ సినిమా ఆధునిక సినిమా నాగరికత మరియు సంస్కృతికి చాలా భిన్నంగా ఉంటుంది. భారతీయ నాగరికతలో ప్రాచీన సినిమా పాత్ర ఏమిటి అనేది ఇలాంటి చిత్రాలను మూలంగా తీసుకుంటే అర్థం అవుతుంది.
ప్రస్తుత నాగరికత మరియు సంస్కృతిని పరిశీలన చేస్తే ఆధునికత సంతరించుకున్న సినిమా శైలి మనకు అవగతమవుతుంది. నేటి యుగంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఉన్నత స్థాయి సినిమా హాళ్లు, అధునాతన పట్టణ సంస్కృతి, గ్రామీణాభివృద్ధి, విద్య మరియు సంస్కృతి అభివృద్ధి, మహిళా స్వేచ్ఛ, ఉద్యోగాల ద్వారా డబ్బు సంపాదన, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మొదలైనవి ప్రజల యొక్క మనస్తత్వాన్ని మార్చి పడేశాయి. ప్రస్తుతం ఎవ్వరైనా సినిమాలలో నటించాలనుకుంటే ముందుగా విద్యను ప్రధాన మార్గంగా ఎంచుకుంటారు. వీటంతటికి కారణం విషయాల వాహకం మరియు వాహకం యొక్క పెద్ద ప్రకటనల యంత్రాంగం మరియు ప్రసార మాధ్యమం యొక్క విస్తృత వ్యాప్తి. కానీ వీటన్నింటికీ ఆధారం వంద సంవత్సరాల నాటి సినిమా యొక్క సైద్ధాంతిక ఫలితం.
భారతీయ సినిమా ప్రారంభం సంవత్సరం…
భారతీయ సినిమా చరిత్రలో 1913 వ సంవత్సరం నిశ్శబ్ద చిత్రాలతో చలనచిత్ర కొత్త యుగం ప్రారంభమైంది. మొట్టమొదటి భారతీయ నిశ్శబ్ద చిత్రం “రాజా హరీశ్చంద్ర”. దీనిని 1913లో దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వం వహించి నిర్మించారు. ఆ కాలంలో సినిమాలంటే చిన్న చూపు ఉండేది. సినిమాలను చాలా తక్కువగా, ఏహ్యంగా చూసేవారు. అందులోనూ నటీనటులను ఇంకా ఈసడించుకునే కాలం అది. అప్పట్లో స్త్రీలెవ్వరూ సినిమాలో నటించడానికి, చిత్ర పరిశ్రమలో పని చేయడానికి వచ్చేవారు కాదు. అందువలన స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించేవారు. భారతీయ మొట్టమొదటి నిశ్శబ్ద చలనచిత్రం యొక్క పూర్తి నిడివి దాదాపు 50 నిమిషాలు. 03 మే 1913 నాడు ఈ సినిమా విడుదలైంది.
ఈ సినిమా మొట్టమొదటిసారిగా బొంబాయి లోని గిర్‌గావ్ లో గల “కొరోనేషన్” హాలులో 03 మే 1913 నాడు ప్రేక్షకుల కొరకు ప్రదర్శించారు. హాలు బయట ప్రజలంతా బారులు తీరి నిలబడ్డారు. భారతదేశం లో నిర్మించిన మొట్టమొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులకు ఇదొక వింత అనుభూతిలా తోచింది. ఈ సినిమా ప్రజాదరణను పొంది విజయవంతం అయ్యింది. ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాలలోనూ ప్రదర్శించడానికి కూడా దాదాసాహెబ్ ఫాల్కే ఏర్పాట్లు చేశారు. భారతీయ తొలి నిశ్శబ్ద సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు దర్శక, నిర్మాతగా వ్యవహరించి భారతీయ సినిమాలకు ఆద్యుడుగాను నిలిచి భారతీయ చలనచిత్ర పితామహుడుగా చరిత్ర పుటల్లోకెక్కారు దాదాసాహెబ్ ఫాల్కే.
భారతీయ తొలి శబ్ద చిత్రం “ఆలం ఆరా “…
1913 నుండి 1931 మధ్య ఉన్న 18 సంవత్సరాల పాటు భారతదేశంలో అనేక విదేశీ నిశ్శబ్ద చిత్రాలు అనుకరించబడిన నిశ్శబ్ద చిత్రాలు వచ్చాయి. భారతీయ సినిమా చరిత్రను పరిశీలన చేస్తే, చలనచిత్రాన్ని అప్పట్లో ‘బయోస్కోప్’ అని పిలిచేవారు. 1931 తరువాత శబ్ద చిత్రాలు వచ్చాయి. భారతీయ సినిమా రంగంలో ప్రథమ టాకీ (సంభాషణలు, శబ్దాలతో కూడిన) సినిమా “ఆలమ్ ఆరా”. 14 మార్చి 1931 నాడు ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమాను స్థానిక “కరొనేషన్ థియేటర్” లో ప్రదర్శన మొదలుపెట్టారు. మొదటిరోజు బయటి ప్రేక్షకుల కన్నా అందులోని నటీనటులే ఎక్కువ వచ్చారు. మొత్తం ఐదు ఆటలకు గాను కేవలం 57 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. “అర్దేషిర్ ఇరానీ” దర్శకత్వంలో తెరకెక్కిన ఈ “ఆలం ఆరా” అనే ధ్వని చిత్రం 1931లో బొంబాయిలోని మెజెస్టిక్ సినిమాలో హిందీ మరియు ఉర్దూ భాషలలో విడుదలైంది. ఈ శబ్ద చిత్రం ఎంతగా విజయవంతం అయ్యిందంటే సినిమాకు వచ్చిన ప్రేక్షకులను అదుపులో పెట్టడానికి పోలీసుల సహాయము తీసుకోవలసి వచ్చింది.
తమిళ – తెలుగు తొలి శబ్ధచిత్రం “కాళిదాస్” (1931)…
మాటలు నేర్చిన శబ్ధచిత్రం “కాళిదాస్” 1931లో తమిళం మరియు తెలుగు రెండు భాషలలో మద్రాసులోని “కినిమా థియేటర్”లో విడుదలై భారీ ప్రజాదరణ పొందింది. ఇది తమిళం మరియు తెలుగు భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి శబ్ద చిత్రంగా మరియు ద్రావిడ భాషలో నిర్మించిన మొట్టమొదటి శబ్ద చిత్రంగా చరిత్రకెక్కింది. సంస్కృత కవి కాళిదాసు జీవితం ఆధారంగా రూపొందించబడినది కనుక ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు. పి.జి. వెంకటేశన్, టి.పి. రాజలక్ష్మి మరియు ఎల్.వి. ప్రసాద్ నటించిన ఈ చిత్రానికి హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వం వహించగా “ఇంపీరియల్ ఫిల్మ్స్ బ్యానర్” పై అర్దేషిర్ ఇరానీ నిర్మించారు. కాళిదాస్ మొదటిసారిగా మద్రాసులోని కినెమా సెంట్రల్ థియేటర్ (ఇప్పుడు మురుగన్ థియేటర్ అని పిలుస్తారు) లో 31 అక్టోబర్ 1931 నాడు దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. మద్రాసులో “కాళిదాస్” శబ్ద చిత్రం ప్రదర్శింపబడిన వెంటనే నిశ్శబ్ద సినిమా యుగం ముగిసింది.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని వివిధ చిత్ర ప్రదర్శన శాలలలో వివిధ రకాల దేశీయ మరియు విదేశీ సినిమాలు ప్రదర్శించబడ్డాయి. పురాతన సాంప్రదాయ సినిమా హాళ్లలో కొన్ని “హౌరా సినిమా హాల్”, “చిత్ర సినిమా హాల్”, బి.ఎన్. సర్కార్ నిర్మించిన “న్యూ థియేటర్లు”, ముంబైలో “రాయల్ థియేటర్”, “ఇంపీరియల్ థియేటర్”, “గుల్షన్ థియేటర్” మొదలైనవి ఉన్నాయి.
స్త్రీ పాత్రలు కూడా పురుషులు ధరించేవారు…
గంభీరత నుండి హాస్యం వస్తుందని హాస్యం నుండి గాంభీర్యం పుట్టాలని చార్లీ చాప్లిన్ చెప్పారు. భారతదేశానికి నిశ్శబ్ద సినిమాలు మొదలైన తొలినాళ్ళలో తీసిన సినిమాలను వాళ్ళు నిష్కపటంగా, శ్రద్ధ పెట్టి ఆలోచిస్తూ తీసినా, ఇవాళ వాటిని తలుచుకుంటేనే నవ్వొస్తుంటుంది. స్తబ్దుగా ఉండవలసిన బొమ్మ తెరమీద కదులుతున్నప్పుడు ఆనాటి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. అదొక గొప్ప వింత. నిశ్శబ్ద చిత్రాలు, కథాచిత్రాలుగా జనాకర్షణ పొందుతున్నప్పుడు కూడా స్త్రీలు, స్త్రీ పాత్రలు ధరించడానికి ముందుకు రాలేదు. దీపాల వెలుగులో కెమెరా ముందు నిలుచుంటే తమ అందం అంతరిస్తుందేమోనని మూఢ విశ్వాసంలో ఉండేవారట. అందువలన మన దేశంలో తయారైన మొట్టమొదటి శబ్దరహిత చిత్రం “రాజా హరిశ్చంద్ర” (1913) సినిమాలో కూడా స్త్రీ పాత్రను పురుషులే ధరించారు.
“రాజా హరిశ్చంద్ర” సినిమాకు శబ్దం లేదు కనుక గొంతులు కూడా మగ గొంతులే అయి ఉండాలి అనేది అప్పటి విశ్లేషకుల అభిప్రాయం. మన దేశంలో సినిమాలు తెరకెక్కించడానికి ముందు విదేశాల నుండి మూగ చిత్రాలు దిగుమతి అయ్యేవి. “రాజా హరిశ్చంద్ర” తీసిన దాదాసాహెబ్ ఫాల్కే ఆ తరువాత కూడా చాలా చిత్రాలు తీశారు. అప్పట్లో విదేశాల నుండి దిగుమతి అయిన ముడి ఫిల్మ్ కి పక్కన స్ప్రాకెట్స్ (ప్రొజెక్టర్లో తిరగడానికి ఫిలిమ్ ప్రక్కన చిల్లులు) ఉండేవి కాదు. దాదాసాహెబ్ ఫాల్కే చీకటి గది (డార్క్ రూం) లో కూర్చుని వేలాది అడుగుల ఫిల్మ్ కి సమాన దూరంలో చేత్తో చిల్లులు పొడిచేవారు. నేడు బాగా విస్తరించిన, విజృంభించిన సినిమాకి ఆదిలో అలా విశేష శ్రమకి, కష్టానికి లోనయ్యారు సినిమా పెద్దలు.
దీపాలు ఆర్పవద్దని ప్రేక్షకుల గగ్గోలు…
తెలుగు సినిమా తొలితరం హస్యనటులు కస్తూరి శివరావు మొదట సినిమా ఆపరేటర్. అలాగే మూగ సినిమాలకు వ్యాఖ్యానం చెబుతూనే ఆయన కొన్ని జోక్స్ చెబుతూ ఉండేవారు. తాను పనిచేస్తున్న పెండాలు (అప్పట్లో సినిమా థియేటర్ ను అలా అనేవారు) యజమాని ఒక రోజు కస్తూరి శివరావును చడామడా తిట్టి ఆయన ఉద్యోగం పీకేసారట. దానికి కారణం ఒక మూకీ సినిమా. అది అమెరికన్ సినిమా. అందులో ఒక అమ్మాయి దుస్తులు మార్చుకుంటూ ఉంటుంది. మనకు మొత్తం బ్యాక్ షాట్ లోనే కనిపిస్తుంది. ఆ దృశ్యం రాగానే థియేటర్ యజమాని తెర వెనకకు వెళ్లి నిలుచునేవాడు. తెర వెనుక కూడా అలాగే కనిపిస్తుందని ఆయనకు తెలియదు. దాంతో కోపగ్రస్తుడై “నేను ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా నువ్వు బొమ్మ మార్చేస్తున్నావు. నాకు వీపు మాత్రమే కనిపిస్తోంది. నీ పొగరు నేను భరించలేను, నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నాను” అని నేను ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నా ఉద్యోగం ఊడగొట్టాడని చెప్పాడు శివరావు.
అదేవిధంగా ప్రతీ రోజు ఒకతను వచ్చి ఒక సినిమా చూసేవాడు. అతను ఎందుకు అలా రోజూ వస్తున్నాడంటే ఆ సినిమాలో రైలు వచ్చి ఆగే దృశ్యం ఉంది. రోజూ అది సరైన సమయానికే వస్తుంది. ఏ ఒక్క రోజైనా ఆలస్యంగా రాకపోదా అనేది అతని ఉద్దేశ్యమట. అలాగే శివరావు మరో హాస్యాన్ని తెప్పించే సన్నివేశం గురించి చెప్పేవారు. నిశ్శబ్ద సినిమాలు వచ్చిన తొలి రోజులలో సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ లో దీపాలు ఆర్పితే జనం “దీపాలు ఆర్పకండి బాబోయ్, మాకు భయం” అని అరిచేవారట. కొన్నాళ్ళు గడిచిన తరువాత గానీ అది సర్దుకోలేదు. అమెరికా లో మొదటిసారిగా సినిమా చూసిన వాళ్ళు హీరోయిన్ క్లోజప్ రాగానే దగా! మోసం! ఆవిడ నడుము, కాళ్లు ఏవి అని గట్టిగా అరిచారట. అలాగే మన తెలుగు సినిమా మాటలు నేర్చుకున్న కొత్తలో ఒక పాత్ర పద్యం చదువుతూ ఉంటే ఇంకో పాత్ర “రియాక్షన్” షాట్ వేస్తే ఒప్పుకునే వారు కాదట. పద్యమో, పాటో పాడుతున్న పాత్ర మాత్రమే కనిపించాలి. ఈ మాటలు ఆంధ్రదేశంలో మొట్టమొదటి సినిమా ధియేటర్ కట్టించిన పోతిన శ్రీనివాసరావు చెప్పారు.
నాటకాలను వీక్షించేందుకే ప్రేక్షకుల ప్రాధాన్యత…
అప్పట్లో పోతిన శ్రీనివాసరావు అనేక మూగ సినిమాలు తెప్పించి ఆంధ్రలో ఆడించేవారు. ఒక పౌరాణిక ముఖచిత్రంలో భూమిడి మధ్యలో మీసం ఓడిపోతుంది. ఆ విషయం సినిమా తీసిన వాళ్ళు గమనించలేదు, కానీ సినిమా చూసిన ప్రేక్షకులు గమనించారు. అప్పుడు ఆ ప్రేక్షకులు “మీసం ఊడిన భీముడు, మీసం జారిపోయిన భీముడు” అని గోల చేశారు. ఊరంతా కూడా వారు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ పోతిన శ్రీనివాసరావు “ఇవాళ భీముడికి మీసం ఊడదు దయచేసి రండి” అని మరొక ప్రకటన చేయించారు. అలాగే మేళ తాళాలు పెట్టి మరీ చెప్పించారు. అదే సమయంలో ఆయన సినిమా ఆపరేటర్ తో చెప్పి మీసం ఊడిన భాగం వరకు కత్తిరించేసి అతికించేయమన్నారు. అప్పుడు అది ఎవ్వరికీ తెలియదు గనుక ప్రేక్షకులు అందరూ సంతోషించారని పోతిన శ్రీనివాసరావు చెప్పారు.
నిజానికి ఆ రోజులలో ప్రేక్షకులు ఎక్కువగా నాటకాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పట్లో కదిలే బొమ్మ జనానికి వింత కలిగించినా, జనం సినిమాలకు ఎక్కువగా వచ్చే వారు కాదట. తమ ఎదురుగా పాటలు కనిపిస్తూ పద్యాలు, పాటలు పాడుతున్న నాటకాలకే వారు ఎక్కువగా ఎగబడేవారట. అందువలన సినిమా వాళ్ళు సినిమా మధ్యలో ఉచితంగా కిళ్ళీలు, సోడాలు ఇస్తామని ప్రకటన వేసేవాళ్ళు. వాటి కోసమైనా జనం వస్తారేమో అని వారి అభిప్రాయం. కానీ ఊర్లో నాటక ప్రదర్శన లేకపోతే ప్రేక్షకులు సినిమాలకు వచ్చేవారు. మొత్తానికి మూగ (నిశ్శబ్ద) చిత్రాల ప్రదర్శన నష్టాలలోనే నడిచింది అని పోతిన శ్రీనివాసరావు చెబుతూ ఉండేవారు.
“నీళ్లు, నీళ్లు” అని కేకలు పెట్టిన ప్రేక్షకులు…
భారతీయ చలనచిత్ర పితామహులు దాదాసాహెబ్ ఫాల్కే కూడా మూగ సినిమాలు తెరకెక్కించినప్పుడు ఎన్నో అవస్థలు పడ్డారు. ఆయన తన రెండవ మూగ సినిమా “లంకా దహన్” (1917) అనే సినిమా విడుదల చేసినప్పుడు “నిజంగానే లంకా దహనం కనిపిస్తుంది రండి అన్నట్టుగా ప్రకటనలు చేయించారు. అందులో హనుమంతుడు లంకను దహనం చేస్తున్న దృశ్యం రాగానే ప్రొజెక్టర్ ముందు ఎర్రని అద్దం ముక్క పెట్టి చూపించగానే బొమ్మ ఎర్ర బారింది. మొదటి రోజున ఆ సినిమా వీక్షించిన ప్రేక్షకులకు నిజంగానే మండుతున్న బ్రాంతి కలిగింది. అందులో కొందరు ప్రేక్షకులు “నీళ్లు, నీళ్లు” అని కేకలు కూడా పెట్టారట. ఇలాంటి ట్రిక్కునే తెలుగులో వచ్చిన “సతీ సావిత్రి” కి కూడా చేశారు. యమలోకం దృశ్యం రాగానే ఎర్ర రంగు అద్దం ముక్క విక్షేపణి (ప్రొజెక్టర్) వద్ద పెట్టి ఆ దృశ్యం అంతా కూడా ఎర్రగా చూపించేవారు.
అలాగే 1936 వ సంవత్సరంలో తెరకెక్కిన “సంపూర్ణ రామాయణం” సినిమాను రాజమండ్రిలో చిత్రీకరించారు. రావణుడు, సీతను ఎత్తుకుపోయిన సన్నివేశం తరువాత రామలక్ష్మణులు ఇద్దరు గోదావరి ఒడ్డున సీత కోసం గాలిస్తూ ఉంటే, వెనకాల వంతెన మీద నుండి రైలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవ్వరూ దానిని చూసుకోలేదు. వాస్తవానికి ఈ రోజులలో లాగా సన్నివేశం తీసిన వెంటనే చిత్రాన్ని మరొకసారి చూసుకునే సౌకర్యాలు ఆ రోజులలో లేవు. అదేవిధంగా ఆ తరువాత వచ్చిన అనేక పౌరాణిక చిత్రాలలో ఎలక్ట్రిక్ స్తంభాలు, వైర్లు, తారు రోడ్లు కనిపిస్తాయి. పూర్వం రోజులలో సినిమాలలో పాటలు, పద్యాలు అక్కడికక్కడే రికార్డు అయ్యేవి. నటీనటులు నడుస్తూ పాడుతూ ఉంటే ఆర్కెస్ట్రా వారిని ట్రాలీ మీద కూర్చోబెట్టి నటీనటులతో పాటే నడిపించేవారు. 1935లో వచ్చిన అరోరా ఫిలిమ్స్ వారి అనసూయ లోనో, కుచేల సినిమా లోనో ఒకచోట వాయిద్యాలు వాయిస్తూ ఒకే షాట్ లో కనిపించారని ఒక ప్రముఖ సంగీత దర్శకులు అప్పట్లో చెప్పారు.
తొలి టాకీ కి హరతులు పట్టిన జనం…
భారతదేశ తొలి శబ్ద చిత్రం “ఆలం ఆరా” 1931లో విడుదలైంది. సినిమాకి మాట వచ్చిన సంవత్సరం కూడా అదే. మాట్లాడే బొమ్మ (మూకీ మాట్లాడుతుంది కనుక టాకీ) అప్పట్లో అందరూ టాకీ అనేవారు. ఇప్పుడు సినిమాకి వెళ్దామా, సినిమా చూద్దామా అన్నట్టుగా, ఆ రోజులలో టాకీ కి వెళదామా అనేవారు. కొందరు ఆ రోజులలో సినిమాలను బయోస్కోప్ అనేవారు. ఇప్పటికీ కూడా గ్రామాలలో పెద్ద వయస్సు గల వాళ్ళు బయోస్కోప్ అంటూంటారు. “ఆలం ఆరా” సినిమాను తొలిసారిగా మద్రాసు తీసుకొచ్చినప్పుడు రైల్వే స్టేషన్ అంతా జననంతో కిటకిటలాడిందట. టాకీకి స్వాగతం పలికారట. ఆ ప్రింటు తెచ్చిన వారిని పూలమాలతో స్వాగతించారట. అయితే వాళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఆ టాకీ పట్టుకుని ఊరురా తిరుగుతూ కాంజీవరం వెళ్లారు. కానీ అక్కడికి జనం రాలేదట. అందుకు గల కారణం ఏమిటంటే అంతకుముందు ఒకాయన టాకీ అని చెప్పి, మూకీ సినిమా వేసి వెనకాల మనుషులను నిలబెట్టి పాటలు పాడించారట. ఇది తెలుసుకున్న ప్రేక్షకులు అతడి మక్కెలు విరగొట్టారు. అయితే ఇది ఎలాంటి మోసం కాదు, నిజంగానే టాకీ. కాబట్టి రండి చూడండి అని విశేషంగా ప్రచారం చేస్తే అప్పుడు అక్కడికి జనం వచ్చారు.
సినిమాను తెలుగులో మాట్లాడించాలని అభ్యర్థన…
సింహల దేశం వెళ్లి “జఫ్నా” లో “ఆలం ఆరా” హిందీ టాకీ సినిమా వేస్తే, హిందీ మాకొద్దు సింహాళ భాషలో వేయాలి అని వీక్షకులు గోల చేశారు. అలా కుదరదు, బొమ్మతో బాటే శబ్దం ఉంటుందని ఎంత చెప్పినా వాళ్లకు అర్ధం కాలేదు. అంతకుముందు స్పీకర్లలో సింహం పాటలు వేశారు కదా! అదే స్పీకర్లలో సింహాళ భాష రావడానికి ఏం రోగం? అన్నది వాళ్ళ అభిప్రాయం. అదేవిధంగా నెల్లూరులో “ఆలం ఆరా” సినిమా వేసినప్పుడు విరామం సమయంలో ఒక న్యాయవాది టాకీ ఆడిస్తున్న మనుషులను కలిసి “టెక్నిక్ బాగా పెరిగింది. బొమ్మ కదలడం మరియు మాట్లాడడం బాగుంది. మీరు ఉత్తర హిందూ దేశంలో సినిమాను హిందీలో మాట్లాడించండి. ఇక్కడ మాత్రం తెలుగులో మాట్లాడించండి. ఇంత టెక్నిక్ తెలిసిన మీకు అదేమంత కష్టం కూడా కాదు. కనీసం మా నెల్లూరులోనైనా మీ సినిమా చేత తెలుగు మాట్లాడించండి” అని ఆ న్యాయవాది వారిని అభ్యర్థించారు. ఈ విధమైన ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు ఎన్నో ఎన్నో సినిమా తొలినాళ్ల విశేషాలలో చోటుచేసుకున్నాయి.