CINEMATelugu Cinema

“కష్టాల కడలిలో మునిగిన కన్నీటి నావ” ఆమె జీవితం… నటి పుష్పవల్లి…

కథానాయిక “పుష్పవల్లి” ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి. 1938లో మొదలుకొని 1950 వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా అలనాటి ప్రముఖ కథానాయకుల సరసన నటించినా గానీ భానుమతి, కాంచనమాల, అంజలీదేవి గార్ల వంటి వారికి వచ్చినంత పేరు ఆమెకు రాలేదు. 1950 తరువాత ఆమె చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. ఈమె కుమార్తె అందంలోనూ, అభినయంలోనూ మూడు దశాబ్దాలుగా కథానాయికగా వెలుగొందుతూనే ఉన్నారు. బాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. ఆమె అసలు పేరు కందాల వెంకట పుష్పవల్లి తయారమ్మ. పుష్పవల్లి నట జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ చాలా విలక్షణమైన సంఘటనలు ఉన్నాయి. పుష్పవల్లి గారి జీవితం పాఠాలు చెబుతుంది, గుణపాఠాలు చెబుతుంది. ఏమి చేయాలో చెబుతుంది, ఏమి చేయకూడదో చెబుతుంది, ధైర్యంగా ఎలా జీవించాలో కూడా చెబుతుంది. 

స్థూలంగా చూసుకుంటే పుష్పవల్లి గారు ఎక్కడో తాడేపల్లిగూడెంలో జన్మించి ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా చదువుకు స్వస్తి చెప్పడం, పదకొండు సంవత్సరాల వయస్సుకే ఆసక్తిగా సినిమాల్లోకి చేరడం, తనను కన్నవారి సంక్షేమం కోసం సినిమాల్లో నటించడం, ఇరవై ఏళ్ల వైవాహిక జీవితంలో ఐదేళ్లలోనే విడిపోవడం, కథనాయికగా ఎదుగుతూనే మొదటి వరుసకు చేరలేకపోవడం, వివాహితులతో సహజీవనం, అందుకు సాక్ష్యంగా ఇద్దరు పిల్లలకు తల్లి అవ్వడం. తాను సహజీవనం చేసిన వ్యక్తి మొదట్లో తన పితృత్వాన్ని అంగీకరించకపోయినా చెదరకుండా, బెదరకుండా ఇద్దరు కూతుర్లను, తర్వాత ముగ్గురు సంతానాన్ని పెంచి పోషించడం, గడ్డు పరిస్థితుల్లో తనను కన్న తల్లిదండ్రుల కోసం చిన్న చిన్న వేషాలకైనా సిద్ధపడటం, కుమార్తె రేఖ బొంబాయిలో కథనాయికగా స్థిరపడే వరకు పుష్పవల్లి గారు కొనసాగించిన పట్టువీడని పోరాట జీవితం విలక్షణం, విభిన్నం.

జీవితంలో ఒక జీవనశైలిని ఎంచుకున్నా అందులో ఎదురయ్యే కష్టనష్టాలకు ఆటుపోట్లకు తానే బాధ్యత వహించడం, ఆ క్రమంలో జరిగిన పొరపాటులకు ఎవరినో నిందించి వర్తమానాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం కంటే భవిష్యత్తు మీద భరోసాతో ఒంటరి పోరాటం సాగించడం. ఇలా పుష్పవల్లి గారి జీవితం ఒక ప్రత్యేక కోణం నైతికం, అనైతికం. సమాజం నిర్వచించిన విలువలు, ఏర్పరిచిన చట్టాలు అన్నీ ఒకవైపున నా జీవితం నా నిర్ణయం మరోవైపు అంటూ ధైర్యంగా ముందుకు వెళ్లడం ఒక మహిళగా ఎనభై సంవత్సరాల క్రిందట సినిమా రంగంలో పుష్పవల్లి లాంటి ఏ కొద్దిమందికో సాధ్యపడేది. 

పరిస్థితులు విషయనాగులై బుసలు కొట్టనీ, సమాజం నీతి సూత్రాల త్రాచుల్లో జీవితానికి విలువలు నిర్ణయించనీ, నమ్మిన వాళ్లు నట్టేట ముంచనీ నా పిల్లల కోసం నేను నిలబడాలనుకొని ఒంటరి తల్లిగా ఏ సందర్భంలోనూ ఒకరిని నిందించడం, పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడం, పేపర్లకు ఎక్కి పదిమందితో చెప్పుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా ముందుకు సాగాలంటే ఎంతో ఆత్మస్థైర్యం కావాలి, ఎంతో గుండె నిబ్బరం కావాలి, స్వతంత్ర్య వ్యక్తిత్వం కావాలి, అన్నింటిని మించి దేనినైనా ఎదిరించే మనస్తత్వం కావాలి. అదే పుష్పవల్లి గారి జీవితం.

ఇంకొక మాట చెప్పాలంటే పుష్పవల్లి గారితో మొదలైన ఆమె నట జీవితం తనకు మాత్రమే పరిమితం కాలేదు. ఆమె కుమార్తె “భాను రేఖ” (రేఖ భాను) అందరికీ తెలుసు. ఆమె మరొక కుమార్తె రాధ కూడా బాలనటిగా ఒక రెండు సినిమాల్లో నటించారు. వాళ్ళ అబ్బాయి బాబ్జి కూడా కొన్ని సినిమాలలో నటించారు. పుష్పవల్లి గారి చెల్లెలు సూర్యప్రభ గారు. ఆమె కూడా 1948 – 1952 ప్రాంతంలో కొన్ని సినిమాల్లో నటించారు. సూర్యప్రభ గారి అమ్మాయి సుధా కూడా కృష్ణ గారి “గూడుపుఠాణి” సినిమాలో కథనాయికగా నటించారు. ఆ తర్వాత గుణచిత్ర నటిగా నటించారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం : వెంకట పుష్పవల్లి తయారు 

ఇతర పేర్లు : చిట్టి 

జననం : 03 జనవరి 1926

స్వస్థలం : పెంటపాడు గ్రామం, తాడేపల్లిగూడెం (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్)

తండ్రి : కందాళ తాతాచారి 

తల్లి : రామకోటమ్మ 

వృత్తి : సినిమా నటి, గాయని

క్రియాశీల సంవత్సరాలు : 1936–1969

భాగస్వామి : రంగాచారి, జెమినీ గణేశన్..

పిల్లలు : బాబ్జి, రామ, భానురేఖ, రాధ..

మరణం : 28 ఏప్రిల్ 1991 (వయస్సు 65)

మద్రాసు , తమిళనాడు , భారతదేశం

నేపథ్యం…

పుష్పవల్లి గారు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు గ్రామంలో కందాల రామకోటమ్మ మరియు కందాల తాతాచారి దంపతులకు 03 జనవరి 1926 పుష్పవల్లి గారు జన్మించారు. ఆమె అసలు పేరు “కందాల వెంకట పుష్పవల్లి తాయారమ్మ”. కానీ అందరూ పిలుచుకునే పేరు చిట్టి. పుష్పవల్లి గారి తల్లిదండ్రులకు చాలామంది పిల్లలు పుట్టి పోవడంతో వారు దేవునికి మొక్కుకున్నారు. ఆ తరువాత వీరికి పుట్టిన మొదటి సంతానం పేరు “వెంకట పుష్పవల్లి తయారమ్మ”. వీరి తరువాత సూర్యప్రభ గారు జన్మించారు. 1932 ప్రాంతంలో వాళ్ల ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక టూరింగ్ టాకీస్ ఉండేది. ఆ ఊర్లో సినిమా ఆడితే అక్కడి గోడలకు సినిమా టాకీస్ వారు పోస్టర్లు అతికిస్తుండేవారు.

చిన్న పిల్ల ఆయన పుష్పవల్లి ఆ పోస్టర్లు చూసి చూసి స్కూల్ కి వెళ్లడం మర్చిపోయింది. వాళ్ళమ్మ గారు పుష్పవల్లిని పాఠశాలకు పంపిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా సినిమాకు తీసుకెళుతుండేవారు. సినిమా చూసి ఇంటికి రాగానే సినిమాను బట్టి పట్టినట్టుగా అందులో పాటలు పాడుతూ ఉండేవారు పుష్పవల్లి గారు. అంత చిన్న వయస్సులోనే వాళ్ళ కుటుంబానికి అతి దగ్గర వ్యక్తి అయిన అచ్యుతరామయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో పుష్పవల్లి గారి గురించి వాళ్ళ అమ్మ అచ్యుతరామయ్య గారికి చెప్పింది. రాజమండ్రి దగ్గర సినిమా చిత్రీకరణ జరుగుతుండగా పుష్పవల్లి కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్లారు.

బాలనటిగా “సంపూర్ణ రామాయణం”.. 

ఆ రోజుల్లో రాజమండ్రిలో నిడమర్తి సూరయ్య అనే ఫుట్ బాల్ క్రీడాకారుడు ఉండేవారు. తాను భారతదేశం అంతటా ఫుట్ బాల్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. నిడమర్తి సూరయ్య గారు 1924లో రాజమండ్రిలో ఒక సినిమా హాల్ కట్టించార. దాని పేరు కృష్ణ సినిమా థియేటర్. అందులో మూకీ సినిమాలు వేసేవారు. 1932లో టాకీ సినిమాలు వచ్చాయి. దాంతో అందులో టాకీ సినిమాలు వేసేవారు. సూరయ్య గారు 1936లో వాళ్ల తమ్ముడు దుర్గయ్యతో కలిసి రాజమండ్రిలో ఒక తోట మధ్యలో “దుర్గా సినీ టోన్” అనే స్టూడియోను నెలకొల్పారు. అందులో లేబరేటరీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ అబ్బాయి ఎన్.ఎస్ మూర్తిని బొంబాయి పంపించి, శిక్షణ ఇప్పించి తాను తిరిగి వచ్చాక 1936 లో ఒక సినిమా తీద్దామని అనుకున్నారు. 

“దుర్గా సినీ టోన్” అనే స్టూడియో రాజమండ్రిలో తెలుగు ప్రాంతంలో మొట్టమొదట కట్టిన తొలి స్టూడియో. ఇందులో సంపూర్ణ రామాయణం అనే ఒక తెలుగు సినిమా చిత్రీకరిద్దామని నిర్ణయించుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న మొట్టమొదటి చిత్రం “సంపూర్ణ రామాయణం”. నిడమర్తి సూరయ్య గారు అచ్యుతరామయ్య గారికి పరిచయం గనుక అక్కడికి పుష్పవల్లి కుటుంబాన్ని తీసుకెళ్లారు. చిన్నపిల్లగా ఉన్న పుష్పవల్లిని చూసి సినిమాలో నటిస్తావా అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి నటిస్తాను అంది. కానీ వాళ్ళ అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు. నటన కంటే కూడా కెమెరా ముందు నుంచుంటే ఆయుష్షు తగ్గిపోతుందని నమ్మకం ఆ రోజుల్లో చాలామందికి ఉండేది. లేక లేక పుట్టిన పుష్పవల్లి ఏమైపోతుందో అన్న భయం వారికి ఉండేది. ఆ విధంగా తన పది సంవత్సరాల వయస్సులో “సంపూర్ణ రామాయణం” చిత్రంలో ఎంపికైంది. 

తొలి పారితోషికం మూడు వందల రూపాయలు..

ఈ “సంపూర్ణ రామాయణం” సినిమాలో ముగ్గురు సీతలు ఉన్నారు. బాల్యంలో ఒక సీత, యుక్త వయస్సులో ఒక సీత, పెద్దయ్యాక ఒక సీత. అందులో మొదటి సీతగా పుష్పవల్లి ఎంపికయ్యారు. ఆ సినిమా 08 ఆగస్టు 1936 నాడు విడుదలైంది. రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే పుష్పవల్లి గారి మొదటి చిత్రం 1936 ఆగస్టులో విడుదలైంది. ఆ చిత్రంలో ఆమె పేరు “పుష్పవల్లి తాయారమ్మ” అని వ్రాశారు. మూడు రోజుల చిత్రీకరణ జరిపారు. ఆ మూడు రోజులకు గానూ పారితోషికంగా పుష్పవల్లి గారికి మూడు వందల రూపాయలు ఇచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు.

మూడు వందల రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. ఆ పారితోషికం చూసిన వాళ్ళ అమ్మానాన్నలు మిక్కిలి సంతోషించారు. దాంతో పుష్పవల్లి గారికి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర సంగీతం కూడా నేర్పించారు. ఈ సినిమా అయిపోయాక పూర్ణ పిక్చర్స్ స్థాపించిన సినీ నిర్మాత మంగరాజు దశావతారం సినిమా తీస్తున్నారు. అందులో మోహినీ అవతరానికి పుష్పవల్లి గారిని తీసుకున్నారు. అప్పటికే ఆవిడ వయస్సు పదకొండు సంవత్సరాలు. సినిమా చిత్రీకరణ ఆరు నెలలు పూణేలో జరిగింది. పుష్పవల్లి గారు తన అమ్మానాన్నల సమక్షంలో పూణేలో జరిగిన దశావతారం చిత్రీకరణ పూర్తిచేశారు. అది ఏప్రిల్ 1937లో విడుదలైంది.

సి.పుల్లయ్య గారి “చల్ మోహన రంగ” పాటలో…

రాజమండ్రిలో దుర్గా సినీ టోన్ లో చిత్తజల్లు పుల్లయ్య గారు “శ్రీ సత్యనారాయణ” అనే సినిమాను ప్రారంభించారు. వాడుక భాషలో వచ్చిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం “శ్రీ సత్యనారాయణ”. ఆ సినిమా పూర్తిచేశాక చూస్తే ఆ నిడివి సరిపోలేదు. అందుకని దానికి తోడు “కాసులపేరు” అనే సాంఘిక చిత్రం తీసి రెండు కలిపి విడుదల చేద్దాం అనుకున్నారు. చివర్లో “చల్ మోహన్ రంగ” అనే పాటను జత చేశారు. ఈ పాటను కూడా కలిపి మూడింటిని విడుదల చేయాలనుకున్నారు పుల్లయ్య గారు. చాలా వినూత్నమైన ఆలోచన అది. ఆ పాట కోసమని “పుష్పవల్లి” గారిని పిలిచారు చిత్తజల్లు పుల్లయ్య గారు. పుష్పవల్లి గారితో బాటు ఒక అబ్బాయి కూడా నటించారు. తన పేరు వాలి సుబ్బారావు. తరువాత రోజులలో కళాదర్శకుడిగా పనిచేశారు వాలి సుబ్బారావు గారు. ఆ మూడు సినిమాల సమ్మేళనం 21 జనవరి 1938 విడుదలైంది. దాంతో ఆమె పేరు అందాలతార గా అందరికీ తెలిసిపోయింది.

సి.పుల్లయ్య సినిమాలకు ఒప్పంద కథనాయికగా..

“మోహినీ భస్మాసుర” సినిమా తీస్తూ చిత్తుజల్లు పుల్లయ్య గారు పుష్పవల్లి గారికి మోహినీ పాత్ర ఇచ్చారు. ఆ సమయానికి ఆమెకు పదమూడు సంవత్సరాలు. ఆ సినిమా చాలా బాగా ఆడింది. ఆ సినిమాతో మొట్టమొదటిసారిగా ఒక అందాలతార ఉందని ఆవిడ పేరు మారుమ్రోగిపోయింది. ఆమె అందాలతారఅని పుష్పవల్లి గారిని గుర్తించిన సినిమా మోహినీ భస్మాసుర. ఆ సినిమాతో ఆమెకు బాగా పేరు వచ్చేసరికి చిత్తజల్లు పుల్లయ్య గారు తన తెలుగు చిత్రాలలోనే నటించాలని పుష్పవల్లి గారితో ఒక కాంట్రాక్టు వ్రాయించుకున్నారు. దాని ప్రకారం ఆమె మూడు సంవత్సరాలు బయట సినిమాలలో నటించకూడదు.

తన సినిమాలలోనే నటించాలి. నెలకు రెండు వందల రూపాయల పారితోషికంతో మూడు సంవత్సరాల ఒప్పందం మీద సంతకం పెట్టారు పుష్పవల్లి గారు. దాంతో మూడు సంవత్సరాలలో వరవిక్రయం, మాలతీ మాధవం చిత్రాల చిత్రీకరణ కలకత్తాలో జరిగింది. ఈ రెండింటిలోనూ పుష్పవల్లి గారు నటించారు. భానుమతి గారి మొట్టమొదటి “వరవిక్రయం”. ఆ సినిమాలో భానుమతి గారికి అక్కగా నటించారు పుష్పవల్లి గారు. పుల్లయ్య గారి ఒప్పందంలో ప్రకారం వేరే సినిమాలలో నటించే అవకాశాలు ఆమెకు లేకపోవడం, పుల్లయ్య గారి సినిమాలు ఆలస్యం అవ్వడంతో 1940 ఆ ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. 

అందాలతారగా పేరు తెచ్చిన “చూడామణి”…

మొట్టమొదటి టాకీ సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి గారు మద్రాసులో “బాలనాగమ్మ” సినిమా తీస్తున్నారు రండి అని పుష్పవల్లిని పిలిచారు రఘుపతి వెంకయ్య గారి కుమారులు ఆర్.ఎస్.ప్రకాష్. ఆయన “తారాశశాంకం” అనే సినిమాను మొదలుపెట్టారు. అందులో తారగా పుష్పవల్లి గారు నటించారు. పుష్పవల్లి గారు పూర్తిస్థాయి కథనాయికగా నటించిన సినిమా “తారాశశాంకం”. ఆ సినిమా 23 ఫిబ్రవరి 1941 నాడు విడుదలైంది. అప్పటికే ఆమె వయస్సు 16 సంవత్సరాలు. అందులో ఆమె పేరు “శ్రీమతి పుష్పవల్లి” అని వేశారు. “తారాశశాంకం” తరువాత “చూడామణి” అనే చిత్రంలో అవకాశం వచ్చింది. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు గారు నటించిన మొట్టమొదటి సాంఘిక చిత్రం చూడామణి. అప్పట్లో వచ్చిన సాంఘిక చిత్రాలలో వాణిజ్యాంశాలు కలగాలిసిన చిత్రం “చూడామణి”. అందులో “చూడామణి” పాత్రను పుష్పవల్లి గారు పోషించారు. ఈ చిత్రం బాగా ఆడింది. పుష్పవల్లి పేరు అప్పటికే అందరికీ తెలిసిపోయింది. కాంచనమాల తరువాత అందాలతార “పుష్పవల్లి” అని ప్రేక్షకులకు అనిపించిన చిత్రం చూడామణి. అది 1949లో విడుదలైంది. అప్పటికే ఆమె జీవితం పెద్ద మలుపు తిరిగింది. 

జెమినీ స్టూడియోతో ఒప్పందం…

జెమినీ స్టూడియో వాళ్ళు తనను ఒప్పందం (కాంట్రాక్టు) మీద కథనాయికగా తీసుకున్నారు. జెమినీ వాసన్ గారు ఎవరినైనా తీసుకుంటే ఒప్పందం (కాంట్రాక్టు) మీద వ్రాయించుకుని కొన్ని సంవత్సరాలు నటించాలి అని సంతకం పెట్టించుకున్నారు. అలా సుమారు పుష్పవల్లి గారు పది సంవత్సరాలకు తను పూర్తిస్థాయి కళాకారిణి క్రింద సంతకం చేయించుకున్నారు. దాని ప్రకారం ఆమె నటించిన మొట్టమొదటి సినిమా “బాలనాగమ్మ”. ఇందులో కాంచనమాల బాలనాగమ్మ గా వేస్తే సంగు పాత్రలో పుష్పవల్లి గారు నటించారు. ఈ సినిమా డిసెంబరు 1942 లో విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. ఆ సమయంలో పుష్పవల్లి గారు తన కుటుంబ సభ్యులతో కలిసి మద్రాసులో ఉండేవారు. పుష్పవల్లి గారి చెల్లెలు సూర్యప్రభ గారు కూడా వారితో బాటుగా ఉండేవారు. ఆమెను మద్రాసులోనే ఆంధ్ర మహాసభలో చేర్పించి పాఠశాల చదువు చెప్పించేవారు. చదువుతో పాటు తనకు డాన్సులు కూడా చెప్పించేవారు.

ఐ.వి. రంగచార్యుల భార్యగా…

జెమిని వారు 1945లో పుష్పవల్లి గారికి కేవలం నెల జీతం మాత్రమే ఇచ్చేవారు. అందువలన తాను వేరే సినిమాలు చేయకపోవడంతో తాను ఆర్థికంగాను ఎదగలేకపోయారు. స్టార్ కథానాయిక కూడా కాలేకపోయారు. జీవితం నడుస్తుంది, కానీ మొట్టమొదటి కథానాయిక స్థాయికి రాలేకపోయింది. 1945లో పుష్పవల్లి గారి గురించి పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ “శ్రీమతి పుష్పవల్లి గారు, ఐ.వి.రంగాచార్యులు అనే వ్యక్తికి భార్య. రంగాచార్యులు గారు మద్రాసులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పుష్పవల్లి ప్రముఖులైనప్పటికీ ఆమె భర్తకు వంట చేసి పెడతారు, అని ఇంకా ఏమేమో వ్రాశారు. అలా వ్రాసిన ఆ పాత్రికేయుడు పుష్పవల్లి గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆమె సమాధానం చెప్పారు. కానీ ఆవిడ పాత్రికేయుడు వ్రాసిన వార్తలను ఖండించలేదు. 1941 నుంచి 1947 వరకు ఐ.వి.రంగాచార్యుల భార్య గానే ఉన్నారని అనుకోవచ్చు.

జెమినీ గణేశన్ తో పరిచయం..

1947 లో జెమిని వారు తీసిన “మిస్ మాలిని” అనే తమిళ సినిమా. ఓ మాదిరిగా తమిళంలో మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో మాలిని గా “పుష్పవల్లి” నటించారు. అందులో ఒకే ఒక సంభాషణ, పాత్ర ఉన్న ఒక కుర్రవాడు ఉన్నాడు. అతని పేరు తెరపై ఆర్.జి. అని వచ్చింది. ఆ ఆర్.జి. నే “రామస్వామి గణేషన్” (జెమినీ గణేషన్). 1947 లో వింధ్యారాణి లో నటించారు పుష్పవల్లి గారు. ఇది పింగళి నాగేంద్రరావు గారికి మొట్టమొదటి సినిమా. ఈ సినిమాలో జెమినీ వారి ఆధ్వర్యంలో వింజమూరు అనసూయ దేవి గారి భర్త ఆయన శేషగిరిరావు కూడా నటించారు. అది 1948లో విడుదలైంది. జెమిని వారు తీసిన చక్రధారిలో నాగయ్య గారితో కలిసి పుష్పవల్లి గారు నటించారు. అందులో కూడా రామస్వామి గణేషన్ చిన్న పాత్ర వేశారు. రామస్వామి గణేషన్ గారు జెమిని స్టూడియోలో పనిచేశారు గనుక తనను జెమిని గణేషన్ అనేవారు.

జెమినీ గణేశన్ తో ప్రణయం..

1951 లో జెమినీ స్టూడియో వారి ఒప్పందం అయిపోయిన పుష్పవల్లి అవకాశాల కోసం తిరుగుతున్నారు. రామస్వామి గణేష్ గారు కూడా జెమినీ స్టూడియో నుండి బయటకు వచ్చి అవకాశాల కోసం తిరుగుతున్నారు. 1951 లో జెమినీ గణేషన్, పుష్పవల్లి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ సందర్భంగా వారి సాన్నిహిత్యం గురించి జెమినీ గణేషన్ గారు ఓ పుస్తకంలో ఇలా వ్రాస్తూ..

“ఒక రోజు నేను ఎక్కడో బీచ్ లో కూర్చున్నాను. పుష్పవల్లి నా దగ్గరకు వచ్చారు. నాతో స్నేహం చేస్తా అన్నారు. అలా మా స్నేహం ప్రారంభమైంది. కాకపోతే కొన్ని నెలల తర్వాత నేనే బాధపడ్డాను. అప్పటికే నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు. వారికి నేను మోసం చేస్తున్నానో ఏమో అని మదనపడ్డాను. పుష్పవల్లితో చర్చించాను. ఇద్దరు విడిగా ఉందామని అనుకున్నాము. కానీ ఒకరోజు పుష్పవల్లి నా దగ్గరకు వచ్చి కారులో ఉన్నాను, మీరు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అనడంతో ఆ సంబంధం మళ్ళీ కొనసాగించాల్సి వచ్చింది”. ఇలా జెమినీ గణేషన్ గారు తన పంథాలో తనకు సంబంధించిన పుస్తకంలో వ్రాసుకున్నారు.

ఏది ఏమైనా గానీ వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది. దానికి సాక్ష్యంగా వారికి ఇద్దరమ్మాయిలు. రేఖ భాను (1954), రాధ (1955) జన్మించారు. 

జెమినీ గణేశన్ తో ముగిసిన బంధం..

1951 నుంచి 1955 వరకు జెమినీ గణేష్ గారితో సంబంధం కొనసాగుతూనే కూడా, జెమినీ గణేష్ గారు సావిత్రి గారిని వివాహం చేసుకున్నారు. 1952 లో మొదలైన వారి అనుబంధం గురించి నాలుగు సంవత్సరాల వరకు తెలియలేదు. 1957లో వారు బహిరంగ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం జరగడానికి ముందు పుష్పవల్లి గారితో సంబంధం తగ్గిస్తూ వచ్చారు. కానీ పుష్పవల్లి గారు కూడా జెమినీ గణేషన్ తో సంబంధం ముగిసిందని గానీ, తనను మోసం చేశారని గానీ, తనను వదిలేశారని గానీ, ఎక్కడా పత్రికా ప్రకటన కానీ ఇవ్వలేదు. జెమినీ గణేశన్ గారు రేఖ, రాధాల పితృత్వాన్ని చాలా రోజుల వరకు అంగీకరించలేదు.

పుష్పవల్లి గారు కూడా ఆయన తండ్రి అని ఎప్పుడూ అనలేదు. ఐదుగురు పిల్లలను పోషించడానికి ఒంటరి తల్లిగా చిన్న చిన్న వేషాలకు వెళ్లారు. ఆ సందర్భం గురించి చెబుతూ ఒక ఇంటర్వ్యూలో ఇలా తెలియజేశారు. “నేను విధి వంచితురాలినయ్యాను. నా దాంపత్య జీవితం గురించి నేను చెప్పడం కంటే కూడా నా గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం చాలా బాగుంటుంది. నాది వైవాహిక జీవితం అనుకోండి. లేదా సహజీవనం అనుకోండి. అది పెద్ద నిట్టూర్పు. నా మదిలో కరుడుగట్టుకుపోయిన బాధ. ఆ బాధలో నిజం తెలుసుకున్న తర్వాత నా ప్రేమను పిల్లల మీద, నటన మీద కేంద్రీకరించాను. నేనంటే జాలిపడిన కొందరు నిర్మాతలు వేషాలు ఇస్తున్నారు” అని 1960లో ఆమె యొక్క స్థితి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

రేఖ బాలనటిగా రంగులరాట్నం...

రేఖ గారు “రంగులరాట్నం” సినిమాలో బాలనాటిగా రంగప్రవేశం చేశారు. ఆ రోజుల్లో ఐదుగురు పిల్లల్ని పోషిస్తూ తల్లి చేసిన ఒంటరి పోరాటం, ఆ తరువాత 1966 – 67 లో రేఖ, రాధా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లకు వెంపటి సత్యం గారి దగ్గర నాట్యం నేర్పించారు. “రంగులరాట్నం” సినిమాలో పుష్పవల్లి గారు నటిస్తూనే తన ఇద్దరు పిల్లల్ని అందులో నటింపజేశారు. తెరపై పేర్లలో బేబీ రేఖ, బేబి రాధా అని ఉంటుంది. “అమ్మ కోసం” సినిమాలో భాను రేఖ కృష్ణంరాజు పక్కన కథనాయికగా నటించారు. ఆ తరువాత హిందీలోకి వెళ్లిన రేఖా గారు “సావన్ బాదో” చిత్రంలో నటించి అనతి కాలంలోనే కథనాయికగా స్థిరపడ్డారు. 1953 లో “పెంపుడు కొడుకు” సినిమాలో పుష్పవల్లి, సావిత్రి గార్లు కలిసి నటించారు. 1954లో “బహుత్ దిన్ హువే” హిందీలో తీస్తూ దానిని “బాలనాగమ్మ” గా జెమినీ వాళ్ళు తెలుగులో తీశారు. ఆ సినిమాలో పుష్పవల్లి గారు ఒక చిన్న పాత్ర వేశారు.

కలిసి నటించిన సావిత్రి – పుష్పవల్లి…

1958లో “ఇంటిగుట్టు” లో సావిత్రి, పుష్పవల్లి గార్లు నటించారు. పుష్పవల్లి గారు తన పిల్లల చదువుల విషయంలో ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. తరువాత “బంగారు పంజరం” (1968) లో చివరిసారిగా పుష్పవల్లి గారు నటించారు. రేఖ గారు హిందీలో స్థిరపడ్డారు. చెల్లెలు రాధాను బొంబాయిలో టెక్స్ టైల్స్ ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలును చేశారు. 1976లో సయ్యద్ ఉస్మాన్ తో రాధకు వివాహం అయ్యింది. రేఖ గారు సినీ పరిశ్రమలో స్థిరపడిన తరువాత జెమినీ గణేషన్ గారు వీళ్ళిద్దరూ (రేఖా, రాధ) నా పిల్లలేనని బహిరంగంగా పత్రికా ప్రకటన చేశారు.

1976లో రాధకు వివాహం అయ్యాక వారు బొంబాయి లోనే కొనసాగారు. 1981లో రాధ, ఆమె భర్త అమెరికాలో స్థిరపడ్డారు. రాధా ప్రఖ్యాత చిత్రకారిణి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఆవిడ చురుగ్గా ఉంటూనే విదేశాలలో ఉండే అనాథలైన పిల్లల బొమ్మల్ని, అమెరికాలో బడి పిల్లలతో పెయింట్ వేయించి మళ్లీ వెనక్కి పంపిస్తూ ఉండేవారు. ఆ మధ్యకాలంలో “ఇండియా వెస్ట్” అనే భారతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, వారి తల్లిని గుర్తు చేస్తూ “తెలియని వారికి సహాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది” అని మా అమ్మ చెబుతుండేవారు. అందుకని ఏదో పరాయి దేశంలో ఉంటూనే నేను అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నాను, అని రాధా గారు చెప్పారు.

మరణం…

1981లో సావిత్రి గారు మరణించారు. ఆమె అంత్యక్రియలకు హాజరైన అశేష జనవాహినిలో “పుష్పవల్లి” గారు కూడా ఉన్నారు. ఆ తరువాత 28 ఏప్రిల్ 1992లో పుష్పవల్లి గారు మరణించారు. అప్పుడు సితార పత్రికలో వచ్చిన కథనం యధాతధంగా… “పుష్పవల్లి గారు కొంతకాలంగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. అది ఇటీవల తీవ్రం కాగా మద్రాసు వడపళని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. ఆమె వ్యాధి నివారణ కోసం వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. కానీ ఫలితం లేకపోయింది. రెండు వారాల క్రితం ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో తన కూతురు రేఖ మద్రాసుకు వచ్చి తన చెల్లెలు రాధని అమెరికా నుండి రప్పించారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న వెంటనే రేఖ గారు బొంబాయి నుండి మద్రాసుకు వచ్చి తన తల్లి “భౌతిక కాయం” పై పడి గోరుగోరున ఏడ్చారు. అదేరోజు మద్రాసులో పుష్పవల్లి గారి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. ఆమె ఏకైక పుత్రుడు బాబ్జి ఆమె చితికి నిప్పంటించాడు. పుష్పవల్లికి బాబ్జి కాక రేఖ, రమ, రాధా, ధనలక్ష్మి అనే నలుగురు కుమార్తెలు ఉన్నారు” అని ఈ విశేషాలన్నీ కూడా ఆ పత్రికలో వ్రాశారు.

Show More
Back to top button