
దాదాపు 20 ఏళ్లపాటు తూర్పు, పడమరలా ఉన్న థాకరే సోదరులు ఒకే వేదికను పంచుకోవడమే ఇందుకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బ్రదర్స్ తిరిగి ఒక్కటవడంపై ఇప్పుడు మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అమలులో భాగంగా మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ జులై 5న విపక్షాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం (యూబిటి), రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మద్దతు ప్రకటించాయి.
మొదట ఈ రెండు పార్టీలు వేర్వేరుగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అనంతరం ఇద్దరు నేతలు మరాఠీల ప్రయోజనాల కోసం వేర్వేరు నిరసనలు నిర్వహించడం సముచితం కాదని గ్రహించి, నిరసన ప్రదర్శనలు సంయుక్తంగా నిర్వహించాలని నిర్ణయించారు.
రాజకీయ వైరుధ్యాల కారణంగా రెండు దశాబ్దాలుగా దూరమైన థాకరే వారసులు ఇప్పుడు ఒకే వేదికను పంచుకోవడమే కాకుండా ఇకపై కూడా కలిసి ఉంటామని ప్రకటించడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే సోదరుడు శ్రీకాంత్ థాకరే కుమారుడే రాజ్ థాకరే. శ్రీకాంత్ థాకరే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా, బాల్ థాకరే వారపత్రిక ‘మార్మిక్’లో రాజ్ థాకరే కార్టూనిస్టుగా పనిచేశారు. అక్కడే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది.
90వ దశకంలో శివసేనలో రాజ్ థాకరేకు మంచి పేరు ఉండేది. బాల్ థాకరే అభిమానులు కూడా ఆయనను రాజకీయ వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాకరే తన కుమారుడు ఉద్ధవ్ థాకరేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో రాజ్ అసంతృప్తికి గురయ్యారు. అనంతరం 2006లో శివసేనను వదిలిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.
అప్పటినుంచి ఈ సోదరుల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. ఇరువురు నేతలు ఏ వేదికపైనా కలిసి కనిపించలేదు కూడా. దాదాపు 20 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒకే సమస్యపై రాజకీయ వేదికను పంచుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఒకప్పుడు మహారాష్ట్రలో తిరుగులేని శక్తిగా ఉన్న శివసేన, బాల్ థాకరే మరణానంతరం కూడా భారతీయ జనతా పార్టీతో రాజకీయ బంధాన్ని కొనసాగించింది. కానీ రానురాను ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈలోగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపారు. అనంతరం ప్రభుత్వంలో భాగస్వాములు కూడా కావడంతో శివసేన రాజకీయంగా బలహీనపడింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో కలిసి మహాఘట్బంధనంగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ అధికారం దక్కకపోయింది. ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదురైంది. మరోవైపు న్యాయస్థానాల్లో కూడా పార్టీ గుర్తు విషయంలో శివసేన చుక్కెదురైంది.
ఈ పరిస్థితుల్లో థాకరే సోదరులిద్దరూ ఒక్కటవడం వల్ల మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంత ఓటర్లలో ఇప్పటికీ శివసేనకు బలమైన ప్రభావం ఉంది. దీంతో ఈ వర్గ ఓటర్లు తమకు దూరమవుతారేమోనన్న భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అదే జరిగితే రాబోయే అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లోనూ దాని ప్రభావం కనిపించవచ్చని కమలనాథుల్లో ఆందోళన మొదలైంది.
థాకరే సోదరులు ఒక్కటవడం వల్ల బీజేపీ పక్షాన చేరి కొంతకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై మరింత ప్రభావం ఉండే అవకాశం ఉంది. శివసేనలో తిరుగుబాటు కారణంగా తనపై పడిన “నమ్మకద్రోహి” ముద్రను తొలగించుకోవడానికి ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు థాకరే సోదరుల కలయికతో ఆ అపప్రథ మరింత బలపడే అవకాశం ఉంది.
అంతేకాకుండా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం వల్ల పట్టణ ఓటర్లను ముఖ్యంగా బృహన్ ముంబై కార్పొరేషన్లో కోల్పోకుండా చూసుకోవడం ఆయన ముందున్న పెను సవాల్ అని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ నేతల్లో చాలామంది ఇప్పటికీ ఆయన్ను దీర్ఘకాలిక భాగస్వామికన్నా తాత్కాలిక మిత్రుడిగానే చూస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు మరిన్ని చిక్కులను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలను బద్ధ శత్రువులుగా చూసే, వీధి పోరాటాలకు దిగే రాజ్ థాకరేతో ఉద్ధవ్ చేతులు కలిపితే, ఆ పార్టీతో బంధాన్ని ఎలా కొనసాగించాలన్న డైలమా కాంగ్రెస్‌లో ఉంది.
అయితే రాబోయే రోజుల్లో థాకరే సోదరులు ఏ విధంగా కలిసి పని చేస్తారన్నదే రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని నిర్ణయించనుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.