
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒకటే చర్చ జరుగుతోంది. అదే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు CID తెలిపింది. దీనిపై కోర్టు కూడా వాదోపవాదాలు విన్నాక చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై టీడీపీ పార్టీ శ్రేణులు, నాయకులు రాష్ట్రమంతా తీవ్ర ఆందోళన తెలుపుతూ వ్యతిరేకిస్తున్నారు. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయని, అందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అసలు ఏంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు? ఇది ప్రతికార చర్యనా.? కోర్టులో అసలు ఏం జరిగింది? వంటి విషయాలు తెలుసుకుందాం.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు
2014–19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో APSSDC ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది.
కానీ, జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా APSSDC డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సీఐడీ ఆరోపించింది. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదని సీఐడీ చెప్పింది. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నది కూడా లేదని సీఐడీ చెబుతోంది.
సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నది చెప్పనే లేదు.
సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సీఐడీ ఆరోపించింది.
జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు పట్టించుకోలేదు.
అయినా సరే, ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది.
అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్ అకౌంటెంట్ జనరల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని సీఐడీ ఆరోపించింది.
వాదనులు ఇలా..
దీనిపై చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది లూధ్రా కోర్టు ముందు తన వాదనలు ప్రస్తవిస్తూ.. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారని తన వాదనల్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలుగా వివరించారు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందని వాదించారు. సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదని లూద్రా వాదించారు.
అంతేకాదు FIRలో చంద్రబాబు పేరు లేదని, సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించాలని కోరారు.
అంతేకాదు కనీసం చంద్రబాబు అరెస్ట్‌ను గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని వాదించారు.
ఇక దీనిపై సమాధానంగా సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన వినిపించారు.
చంద్రబాబు అరెస్ట్ చెయ్యడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. అన్ని నియమాలను తాము పాటించామని చెప్పారు.
మాజీ సీఎం అనేది గౌరవప్రదమైన హోదా మాత్రమేనని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రస్తుత హోదా ఎమ్మెల్యే మాత్రమేనన్నారు. చంద్రబాబు అవినీతి పైన పూర్తి ఆధారాలు ఉన్నాయని..
నిధులను ఎక్కడకు తరలించారనేది స్పష్టత కోసం విచారణ చేయటానికి రిమాండ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో వాదనల తరువాత న్యాయమూర్తి ఈ మేరకు సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ 14 రోజుల రిమాండ్ ఇస్తూ తీర్పు వెలువరించారు.
ఇక చంద్రబాబు అరెస్టును టీడీపీ నేతలు ఇది కక్ష పూరిత చర్యేనని , అదే విధంగా చంద్రబాబు కూడా దెబ్బ తీస్తాడని మాకు టైం వస్తుందని టీడీపీ నాయకులు నెట్టింట ట్వీట్లు కురిపిస్తున్నారు.