
శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఉల్లాసం సిద్ధిస్తుందని మనకు తెలుసు. శారీరక ఆరోగ్య సంరక్షణకు అనేక పద్ధతులను, జీవన విధానాలను అలవర్చుకుంటున్నాం. శారీరక వ్యాయామం, యోగాప్రాణాయామాలను నిత్య దినచర్యల్లో భాగం చేసుకుంటున్నాం. శారీరక మానసిక ఆరోగ్య సిద్ధికి మనం తీసుకునే ఆహారం కూడా ప్రధాన భూమికలను నిర్వహిస్తున్నాయని తెలుసు కోవాలి. నిత్యం పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో నిరాహార లేదా ఉపవాసాలను దీక్షగా పాటించడం కూడా అంత కన్న ఉత్తమం.
మన ఆరోగ్య సౌభాగ్యాలను కాపాడాలనే సదుద్దేశంతో మన సనాతన ధర్మం దేవుడి పూజలో భాగంగా వారానికి కనీసం ఒక రోజు ఉపవాసం లేదా నిరాహార దీక్షలో ఉండేలా సూచించింది. బరువు పెరగడం, జీవనశైలి వ్యాధుల బారిన పడడానికి ప్రధాన కారణాలుగా విచక్షణ మరిచి తిండి తినడం, అదుపు తప్పి ఫాస్ట్ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి దోహదపడుతున్నాయని తెలుసుకోవాలి.
ఆహారపు అలవాట్లే ఆరోగ్య ప్రదాతలు:
బరువును అదుపులో పెట్టుకోవడం, కొవ్వును కరిగించడం, శారీరక ఆరోగ్యానికి పునాదులు వేయడం, ప్రమాదకర ఆహారపు అలవాట్లు లాంటి అంశాల పట్ల అవగాహన కల్పించడానికి మన కర్తవ్యం కావాలి. మూఢనమ్మకాలకు మంగళం పాడుతూ సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణకు వారానికి ఒక సారి నిరాహార లేదా ఉపవాసాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీర సానుకూలత (బాడీ పాసిటివిటి) సూత్రాలు, పరిమిత ఆహారం తీసుకునే నియమాలను పాటించడం మన జీవనశైలిలా భాగం చేసుకోవాలి. “అసబద్ధ ఆహారపు అలవాట్ల కట్టడితో నిన్ను నువ్వు కాపాడుకోవడం” అనబడే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఉపవాస దీక్షలతో పలు వ్యాధులు కట్టడి చేయబడి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వేదిక ఉపయుక్తం అవుతున్నది.
ప్రతికూల ఆహార అలవాట్లు విషతుల్యం:
విచక్షణారహిత ఆహారపు అలవాట్లు విషతుల్యమని, మనం తీసుకునే ఆహారమే మనకు ఆరోగ్య ప్రదాతలని, కృత్రిమ అందాల వేటలలో అసంబద్ధ ఆహారపు అలవాట్ల చేసుకోవడం లాంటి విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలి. మనం తిన్న ఆహారం మనకు అవసర శక్తిని, చైతన్యాన్ని, పోషకాలను అందించాలి. “మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన ఆరోగ్యం మన కంచంలోనే” అనే నినాదాలను నిత్యం స్మరణ చేసుకోవాలి. ‘పరిపూర్ణ ఆరోగ్య సిద్ధికి పరిమిత సమతుల ఆహారం’ అనే సూక్తిని సదా గుర్తుంచుకోవాలి. “నిన్ను నువ్వు ప్రేమించడం అంటే ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు మానాలి” అనే విషయాలను అర్థం చేసుకొని ఆచరించడమే. ఆహారపు అలవాట్లు అదుపు తప్పితే స్థూలకాయం, రోగాలకు ఆహ్వానం, సైజ్ పెరిగి ఆత్మన్యూనత లాంటి అనారోగ్యాలు మనల్ని ఆక్రమిస్తాయి. అసంబద్ధ ఆహారపు రుచులకు లొంగితే మన శరీరం అనారోగ్యాల బారిన పడుతుంది.
నిరాహార లేదా ఉపవాసాల ప్రయోజనాలు:
మన ఇంట్లో పిల్లలకు, యువతకు సరైన ఆహారపు అలవాట్లను అందించడం పెద్దల కనీస బాధ్యత. అసాధారణ, ప్రతికూల శరీర మార్పులకు పునాది మనం నిత్యం తీసుకునే ఆహారమే అని గమనిస్తూ నిరాహార లేదా ఉపవాస క్రమశిక్షణలు పాటిస్తూ మన ఆరోగ్య పరిరక్షణకు బాటలు వేసుకుందాం. క్రమశిక్షణతో ఉపవాసాలు పాటిస్తే గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ అదుపు, జీవక్రియ ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, బరువు అదుపు, దీర్ఘాయువు, మెదడు ఆరోగ్యం, వాపులు తగ్గడం, హార్మోన్ నియంత్రణ, బిపీ అదుపు, చెడు కొలెస్టరాల్ స్థాయి తగ్గుదల, ఒత్తిడి నియంత్రణ, వృద్ధాప్య నియంత్రణ, క్యాన్సర్ కట్టడి, సానుకూల జీర్ణ క్రియ, థైరాయిడ్ రుగ్మతల కట్టడి, సరళ సుస్థిర జీవన యాత్రలు లాంటి ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పుడూ తింటేనే కాదు ఉపవాసం ఉంటే కూడా ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలుసుకుందాం, పరిమిత మోతాదులో పోషకాహారం మాత్రమే తీసుకుందాం. క్రమం తప్పకుండా ఉపవాసాలు పాటిస్తూ మన శరీరానికి ఉపశమనం, విశ్రాంతులను బహుకరిద్దాం.