ప్రపంచ ప్రసిద్ధ, ప్రఖ్యాత నాటక రచయిత.. విలియం షేక్స్పియర్.
“నేను ఇప్పటివరకు విన్న అద్భుతాలన్నిటిలో, మనుషులు భయపడటం నాకు అత్యంత వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే, మరణం అనేది ఒక అనివార్యమైన అంతం, అది రావలసినప్పుడు వస్తుంది”. ఈ మాటలు వ్రాసింది విలియం షేక్స్పియర్. తాను వ్రాసిన “జూలియస్ సీజర్” (ది ట్రాజెడీ ఆఫ్ జూలియస్ సీజర్) అనే చారిత్రక విషాదాంత నాటకం రెండవ అంకం, రెండవ దృశ్యంలో ఈ మాటలు చెప్పారు. విలియం షేక్స్పియర్ ఒక ఆంగ్ల నాటక రచయిత, కవి మరియు నటుడు. ఆయన వ్రాసిన నాటకాలలో, ఆయన రచించిన కవితలలో ఎన్నో అద్భుతమైన వాక్యాలు చెప్పారు, ఎన్నో శ్రేష్ఠమైన భావాలతో పాఠకులకు అలరించారు, ఎన్నో ఉత్తమమైన పదాలను ప్రపంచానికి అందించారు. ఆంగ్ల భాష యొక్క ప్రధాన చారిత్రక నిఘంటువు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లోని పూర్తి సంచికలో సుమారు 1700 పదాలు మహాకవి అయిన షేక్స్పియర్ సృష్టించాడంటే తాను ఎంత గొప్ప రచయితనో మనకు అర్థం అవుతుంది. “సంవత్సరమంతా సెలవులే అయితే, ఆటలాడటం కూడా పనిలాగే విసుగు పుట్టిస్తుంది” అంటారు ఆయన. “మనం ఎవరో మనకు తెలుసు, కానీ మనం ఏమవుతామో మనకు తెలియదు” అని ప్రతీ ఒక్కరి జీవితంలో తమను తాము విశ్లేషణ చేసుకునేలా చేస్తారు షేక్స్పియర్. 1564 నుండి 1616 వరకు ఆయన జీవించినది 52 సంవత్సరాలు మాత్రమే. అందులో 20 సంవత్సరాలు రచయితగా కొనసాగారు. 39 నాటకాలు, 150 కవితలు, 02 ప్రక్రియలు.
విలియం షేక్స్పియర్: జీవితం, రచనలు, విషాదాలు
“జీవితమే ఒక నాటక రంగం మనమంతా అందులో పాత్రధారులం”, “కొంతమంది గొప్పవాళ్ళుగా పుడతారు, కొంతమంది గొప్పతనాన్ని సంపాదించుకుంటారు, కొందరికి గొప్పతనం ఆపాదించబడుతుంది”, “విడిపోవడం తీయటి బాధ”, నీకు నీవు నిజాయితీగా వుండు”, “ప్రేమన్నది ఎప్పుడూ కూడా సరళంగా ఉండదు”, “మనం ఏంటో మనకు తెలుస్తుంది కానీ మనం ఏం కావాలో మనకు తెలియదు”, “కత్తుల కంటే కూడా మాటలే ఎక్కువగా బాధపెడతాయి” ఇలాంటి ఎన్నో అద్భుతాలు షేక్స్పియర్ కలం నుండి జాలువారినవే. తన 28 వ సంవత్సరంలో రచనలు మొదలుపెట్టిన షేక్స్పియర్ తన 48వ సంవత్సరం వరకు అనేక చారిత్రకాలు, విషాదాంతాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య కథాంశాలు, ప్రేమ కథలు ఎన్నో వ్రాశారు, ఎన్నో నాటకాలలో తాను నటించారు. ఆయన జీవితం స్ట్రాట్ఫోర్డ్ మరియు లండన్ అనే రెండు ప్రదేశాల చుట్టూనే తిరిగింది. అతను స్ట్రాట్ఫోర్డ్లో పెరిగారు, కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు, ఆస్తులు కొనుగోలు చేశారు. కానీ ఆంగ్ల నాటకరంగానికి కేంద్రమైన లండన్లో పనిచేశారు. ఒక నటుడిగా, నాటక రచయితగా మరియు ఒక ప్రముఖ నటనా సంస్థలో భాగస్వామిగా, ఒక సంపన్నుడుగా, అత్యంత ప్రసిద్ధుడుగా ఎదిగారు షేక్స్పియర్.
“మనం గులాబీ అని పిలిచే దాన్ని ఏ పేరుతో పిలిచినా దాని సువాసన అంతే మధురంగా ఉంటుంది” ఈ వాక్యం షేక్స్పియర్ వ్రాసిన రోమియో అండ్ జూలియట్, రెండవ అంకం, రెండవ దృశ్యంలోనిది. షేక్స్పియర్ నాటకాలు నవ్వును, దుఃఖాన్ని, హాస్యాస్పదమైన మరియు గంభీరమైన పాత్రలను ఏకం చేస్తాయి. వాస్తవానికి, అతని రచనలు ఏ ఒక్క నిర్దిష్ట వర్గంలోనూ ఇమడలేనంత గంభీరమైనవి. అయినప్పటికీ సౌలభ్యం కోసం తన నాటకాలను చారిత్రక, హాస్య మరియు విషాదాంత నాటకాలుగా వర్గీకరించారు. 1594 నాటికి నాటకం పట్ల ఆయనకున్న అభిరుచితో లండన్లోని నాటక బృందాల బృందమైన “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” లో ఒక ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నారు. వారి కోసం నటించడం, వ్రాయడం మాత్రమే కాకుండా, అందులో ఆయన ఒక నిర్వహణ భాగస్వామిగా కూడా అయ్యారు. థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న షోర్డిచ్లోని “ది రోజ్ థియేటర్” మరియు “ది కర్టెన్” లలో షేక్స్పియర్ నాటకాలను అతని సొంత బృందం (లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్) ప్రదర్శించేది. అప్పట్లో గడ్డి కప్పుతో దీర్ఘచతురస్రాకారంలో ఉండే బహిరంగ థియేటర్లు ఉండేవి. రంగస్థలం అనేది గోడలకు చిత్రలిపి కప్పిన ఒక ఖాళీ గది మాత్రమే, అది ప్రేక్షకుల గ్యాలరీలో కొంత భాగం కప్పబడి ఉండేది. ప్రదర్శనను ప్రారంభించడానికి బూర శబ్దం చేసేవారు. చట్టం ప్రకారం నాటకంలో మహిళలు నటించడం నిషిద్ధం. అందువలన స్త్రీ పాత్రలన్నింటినీ గడ్డం గీసుకున్న యువకులు లేదా బాలురు పోషించేవారు. హాస్య నాటకానికి రంగస్థలాన్ని నీలి రంగు తెరలతో, విషాద నాటకానికి నలుపు రంగు తెరలతో అలంకరించేవారు.
“జరిగిందేదో జరిగిపోయింది గతకాలాన్ని మార్చలేము”, “ఎంత చిమ్మ చీకటికైనా సరే ఒక ఉదయం అంటూ ఉంటుంది”, ఒక మనిషి ఎంత కాలం జీవించాడు అన్నది ముఖ్యం కాదు, జీవితకాలంలో ఎంతమందిని సానుకూలంగా ప్రభావితం చేశాడు, ఈ లోకం నుండి నిష్క్రమించాక ఆ మనిషి వదిలిన జ్ఞాపకాలు ఎన్ని, జ్ఞాపికలు ఎన్ని అన్నది ముఖ్యం”, “ఒక రచయిత సంఖ్యాపరంగా ఎన్ని రచనలు చేశాడు అన్నది ముఖ్యం కాదు, వాటిలో ఎన్ని కాలాన్ని ఎదురీది నిలబడ్డాయి అన్నది ముఖ్యం” లాంటి ఎన్నో అద్భుతమైన రచనలు షేక్స్పియర్ చేసినవే. “మనం పుట్టినప్పుడు, ఈ గొప్ప మూర్ఖుల దశకు వచ్చామని ఏడుస్తాము”, “పేరులో ఏముంది? అన్నిటికంటే ముఖ్యంగా, నీకు నువ్వే నిజాయితీగా ఉండు” అని తనదైన శైలిలో పాఠకులకు అందించారు ఆయన.
ఆయన రచనలలో శృంగారం, చమత్కారం, అద్భుత మాయ, హాస్యంల మేళవింపు ఉంటుంది. ఆయన నాటకాల పాత్రల స్వభావం రాజకీయాలు, అంతర్గత భావాలు, సమకాలీన సంఘటనలు వంటి వివిధ అంశాలు ఒకదానితో ఒకటి మిలితమై ఉంటాయి. తన నాటకాల స్వభావం మరింత వైవిధ్యంగా మరియు సంక్లిష్టంగా మారే కొద్దీ, అతని వచన వినియోగం పెరుగుతుంది. “నేను చావాల్సి వస్తే, చీకటిని పెళ్లికూతురిలా ఎదుర్కొని,
నా చేతులతో దాన్ని హత్తుకుంటాను”, “నా జాతకంలో నేను నీకంటే శ్రేష్ఠుడను; కానీ గొప్పతనానికి భయపడకు; కొందరు గొప్పగా పుడతారు, కొందరు గొప్పతనాన్ని సాధిస్తారు,
మరికొందరిపై గొప్పతనం రుద్దబడుతుంది”. గొప్పతనానికి భయపడవద్దు అంటారు ఆయన. ఎందుకంటే, కొందరు వైఫల్యానికి ఎలాగైతే భయపడతారో, మరికొందరు విజయానికి కూడా భయపడతారు. విజయం, కీర్తి, ప్రశంసలు అందరికీ అందేవి కాకపోవచ్చు. విజయం అనే కప్పును తాగడానికి భయపడవద్దు అంటారు షేక్స్పియర్.
నేపథ్యం
షేక్స్పియర్ పూర్తి పేరు విలియం షేక్స్పియర్. ఆయన ఇంగ్లాండ్ లోని లండన్ కు ఉత్తరాన సుమారు వంద మైళ్ళ దూరంలో ఉన్న వార్విక్షైర్లోని స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవాన్లో ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో 23 ఏప్రిల్ 1564 నాడు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జాన్ షేక్స్పియర్ మరియు మేరీ ఆర్డెన్. షేక్స్పియర్ జన్మించిన ఊరు స్ట్రాట్ఫోర్డ్ చాలా చిన్నది. అప్పట్లో ఆ ఊరిలో కేవలం రెండువందల మంది జనాభా మాత్రమే ఉండేవారు. ఆ ఊరి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. షేక్స్పియర్ తాత రిచర్డ్ వ్యవసాయధారి. ఆయన స్ట్రాట్ఫోర్డ్ గ్రామానికి ప్రక్కనే ఉన్న ఊరికి చెందిన భూస్వామి “రాబర్ట్ ఆర్డిన్” వద్ద భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉండేవారు.
ఆ క్రమంలో రిచర్డ్ కి , రాబర్ట్ కి మధ్య స్నేహం కుదిరింది. రిచర్డ్ లోని కష్టపడే మనస్తత్వం, రాబర్ట్ కి బాగా నచ్చింది. ఒక్కోసారి పంటలు సరిగ్గా పండకపోయినా, కౌలు సరైన సమయానికి ఇవ్వలేకపోయినా రిచర్డ్ ను ఏమీ అనేవాడు కాదు రాబర్ట్. వారిద్దరి మధ్య సాన్నిహిత్వం కాస్త ముదిరిపోయి బంధుత్వంగా మారిపోయింది. రిచర్డ్ కుమారుడు జాన్ షేక్స్పియర్ కు, భూస్వామి రాబర్ట్ కూతురు మేరీ ఆర్డెన్ కు ఇచ్చి వివాహం చేశారు. దాంతో తన తండ్రి నుండి మేరీ ఆర్డెన్ కు బోలెడు ఆస్తి వచ్చింది. తండ్రి రాబర్ట్ చనిపోయే ముందు వ్రాసిన వీలునామాను అమలుపరిచే బాధ్యత కూతురు మేరీ ఆర్డెన్ కు అప్పగించాడు. అంటే ఒకరకంగా ఆ రోజుల్లో ఉన్న ప్రమాణాల ప్రకారం మేరీ ఆర్డెన్ చదువుకున్న విద్యావంతురాలు.
తోలు పరిశ్రమ స్థాపించిన తండ్రి జాన్ షేక్స్పియర్
విలియం షేక్స్పియర్ తండ్రి జాన్ షేక్స్పియర్ పెద్దగా చదువుకోలేదు. తండ్రి రాబర్ట్ వ్యవసాయం చేస్తుంటే కుమారుడు జాన్ తోలు పరిశ్రమలోనూ, రొట్టెల పరిశ్రమలోనూ పనిచేస్తూ ఉండేవారు. వివాహం అయిన తరువాత జాన్ షేక్స్పియర్ తన భార్య వైపు నుంచి వచ్చిన ఆస్తితో స్ట్రాట్ఫోర్డ్ గ్రామంలో ధనవంతులు జాబితాలో చేరిపోయారు. ఆ రోజుల్లో ధనవంతులు తమ చేతులకు ఒక రకమైన గ్లౌజ్ ధరించడం ఆనవాయితీ. అవి ఒక రకమైన తోలుతో చేసినవి. అయితే అవి చాలా ఖరీదు. అంతకుముందు తోలు పరిశ్రమలో పనిచేసిన అనుభవంతో జాన్ తోలు పరిశ్రమను స్థాపించాడు. చాలా తేలికగా ఉండి మన్నికగా ఉండే గ్లౌజులు తయారుచేయడంలో ప్రత్యేక అనుభవం సంపాదించారు జాన్ షేక్స్పియర్. ఆయన వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ స్ట్రాట్ఫోర్డ్ చుట్టుప్రక్కల పొలాలు, నివాస స్థలాలు కొనడం మొదలుపెట్టారు. జాన్ షేక్స్పియర్, మేరీ ఆర్డెన్ లకు 1555 వ సంవత్సరంలో వివాహం జరిగింది. పెళ్లి అయిన మూడేళ్ళ తరువాత 1558 వ సంవత్సరంలో ఒక కూతురు, 1563 వ సంవత్సరంలో మరొక కూతురు జన్మించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు కూతుర్లు చిన్నతనంలోనే కన్నుమూశారు. ఆ ఇద్దరు కూతుర్లు చనిపోయిన తరువాత విలియం షేక్స్పియర్ జన్మించారు.
ప్లేగు వ్యాధిని తట్టుకుని నిలబడిన షేక్స్పియర్
విలియం షేక్స్పియర్ తరువాత ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ఇద్దరు కుమార్తెలలో ఒక కుమార్తె ఎనిమిది సంవత్సరాల వయస్సులో మరణించింది. తల్లిదండ్రులు, తోబుట్టువులు అంటే షేక్స్పియర్ కు విపరీతమైన అభిమానం. పదహారవ శతాబ్దంలో ప్లేగు వ్యాధి తరచూ విరుచుకుపడేది. విపరీతమైన ప్రాణ నష్టం కలిగించే అంటువ్యాధి అది. షేక్స్పియర్ సొంత గ్రామం అయిన స్ట్రాట్ఫోర్డ్ లో కూడా చాలామంది పసిపిల్లలు ప్లేగు వ్యాధి బారిన పడి చనిపోతూ ఉండేవారు. ఏప్రిల్ నెలలో షేక్స్పియర్ జన్మిస్తే, జూన్ జూలై నెలలలో ప్లేగు వ్యాధి చుట్టుముట్టింది. స్ట్రాట్ఫోర్డ్ గ్రామంలో సుమారు రెండు వందల మంది పిల్లలు చనిపోయారు.
అంత భయంకరమైన పరిస్థితి కేవలం షేక్స్పియర్ తాను జన్మించిన నెలల వయస్సులోనే జరిగింది. అంతటి కఠిన పరిస్థితులను కూడా ఆయన పసివయస్సులో తట్టుకోగలిగారు. తన ఊహ తెలిసేనాటికి తన తండ్రి ఆ ఊరిలో ధనవంతుడు, ఒక హోదా కలిగిన వ్యక్తి. తండ్రి జాన్ షేక్స్పియర్ కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, స్థానిక రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవారు. విలియం షేక్స్పియర్ నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి జాన్ షేక్స్పియర్ ఆ ఊరికి మేయరు అయ్యారు. ఆయన మేయరు దుస్తులతో కార్యాలయానికి వెళుతూ ఉంటే తండ్రికి ఇరువైపులా బోలెడు మంది ఉండేవారు. ఆయన నడిచి వచ్చినప్పుడల్లా ఆ వీధి మొత్తం పెద్ద ఊరేగింపులాగా ఉండేది.
నాటకాలు చూస్తూ పెరిగిన షేక్స్పియర్
జాన్ షేక్స్పియర్ ఒకవైపు మేయర్, మరోవైపు ఆయన జరుపుతున్న వ్యాపారాలు, వీటి అవసరాలకు వచ్చే ప్రజలను చూస్తూ పెరిగారు విలియం షేక్స్పియర్. ఆయనను ఏడేళ్ల వయస్సులో తన సొంత ఊరు
“స్ట్రాట్ఫోర్డ్ అపాన్ అవాన్” ఉన్న కింగ్స్ పాఠశాలలో చేర్పించారు. ధనవంతుల పిల్లలు చదువుకునే పాఠశాల అది. ప్రతీరోజు ఉదయం మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగే ఆ పాఠశాలలో ఆ రోజుల్లో ప్రమాణాల ప్రకారం చిన్నపిల్లలకు భాషా సాహిత్యాలు బోధిస్తూ ఉండేవారు. ఆ విధంగా విలియం షేక్స్పియర్ కు గ్రీకు, లాటిన్ భాషలను అధ్యయనం చేసే అవకాశం కలిగింది. అలాగే ఆ భాషల్లోని అత్యుత్తమ సాహిత్యాన్ని చిన్నప్పటినుండే అధ్యాయం చేసే అవకాశం కలిగింది.
అగస్టస్ పాలనలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఒక రోమన్ కవి ఓవిడ్ వ్రాసిన మెటామార్ఫోసెస్ అనే ఒక రోమన్ కవిత చిన్నతనంలోనే విలియం షేక్స్పియర్ కి కంఠతః వచ్చేసింది. అదేవిధంగా ఇంటి దగ్గర తల్లి మేరీ ఆర్డెన్ కూడా ఆయనకు ప్రాచీన గాథలు చెబుతూ ఉండేది. ఇవే భవిష్యత్తులో షేక్స్పియర్ అంత గొప్ప కవి కావడానికి ఇన్ని పునాదులు వేసింది. ఇలాంటి ఉత్తమ సాహిత్యంతో పాటు పాఠశాలలో తర్కం కూడా బోధించేవారు. అప్పట్లో సంచార నాటక బృందాల వారు స్ట్రాట్ఫోర్డ్ లో తరచూ నాటకాలు ప్రదర్శించేవారు. వారు ఊరురా తిరుగుతూ ధనవంతుల ఇంటి ప్రాంగణంలో, సమాజంలో హోదా కలిగిన వాళ్ళ ఇళ్ళ ఆవరణలో ప్రదర్శిస్తూ ఉండేవారు. విలియం షేక్స్పియర్ తండ్రి జాన్ షేక్స్పియర్ కూడా ధనవంతుడే కాబట్టి వాళ్ళింట్లో ఇలాంటి నాటకాల ప్రదర్శన జరుగుతూ ఉండేది. షేక్స్పియర్ స్వయంగా చూసిన ఈ నాటకాలు తరువాత రోజులలో చేసిన తన రచనల్లో ప్రభావితం చూపాయి.
వివాహం
విలియం షేక్స్పియర్ తాను చిన్నప్పుడు చూసిన నాటకాలే భవిష్యత్తులో తాను నాటక రచయితగా ఎదగడానికి, దోహదం చేశాయి. ఈవిధంగా షేక్స్పియర్ ఎదుగుతున్న క్రమంలో వాళ్ల తండ్రి జాన్ షేక్స్పియర్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉన్నఫలంగా తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఊలు (ఉన్ని) వ్యాపారమే. రోమన్ క్యాథలిక్ అయిన జాన్ ఎప్పుడైనా కూడా చర్చికి వెళ్లేవారు కాదు. అది తెలిసే ఆయన వద్ద అధిక పన్నులు వసూలు చేసేవారు. అందుకే విలియం షేక్స్పియర్ తన చిన్న వయస్సులోనే తండ్రి వైభవాన్ని చూశారు అలాగే ఆయన ఆర్థిక పతనాన్ని కూడా చూశారు. అయితే ఆర్థికంగా పతమైన తరువాత తన తల్లిదండ్రులకు నలుగురు పిల్లల చదువులు భారం అవ్వడంతో తప్పనిసరియై విలియం షేక్స్పియర్ తన పదిహేను సంవత్సరాల వయస్సులో 1579 వ సంవత్సరంలో చదువు మానేశారు. 27 నవంబరు 1582 నాడు తన 18 సంవత్సరాల వయస్సులో తనకంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దదైన అంటే సుమారు 26 సంవత్సరాల వయసున్న ఆనిహాత్వే ని పెళ్లిచేసుకున్నారు. నిజానికి ఆమె పెళ్లికి ముందే గర్భిణీ. ఆ రోజుల్లో పెళ్లి కాకముందు గర్భిణీ కావడం పెద్ద నేరం. అయితే అప్పటికే మూడు నెలల గర్భిణీ అయినందువలన ఆమెను షేక్స్పియర్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
పిల్లలు.
పెళ్లయిన ఆరు నెలలకి ఏప్రిల్ 1583 లో సృజన్ అనే అమ్మాయి జన్మించింది. రెండేళ్ల తరువాత 1585 వ సంవత్సరంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇద్దరు కవలలు జన్మించారు. అబ్బాయి పేరు హమ్ నెట్, అమ్మాయి పేరు జూడిత్. షేక్స్పియర్ కు ఈ ముగ్గురే సంతానం. భార్య, పిల్లలు స్ట్రాట్ఫోర్డ్ లోనే ఉండిపోయారు. షేక్స్పియర్ మాత్రం 1592 నుండి 1613 వరకు సుమారు 20 సంవత్సరాలు పైనే లండన్ నగరంలో నివాసం ఉన్నారు. ఆయన తరచూ తన స్వగ్రామానికి వచ్చి కొన్ని రోజులు ఉండి తిరిగి లండన్ వచ్చేవారు. 1592 నుండి నాటకాలు వ్రాయడం, నాటకాలు ప్రదర్శించడం చేసేవారు. దాంతో తన సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆ సంపాదనతో సొంత ఊర్లో పొలాలు, ఆస్తులు కొనుక్కోవడం చేసేవారు. 17వ శతాబ్దం మొదటి నాటికి లండన్ లోని రంగస్థలంలో మార్పులు వచ్చాయి. అప్పటివరకు ప్రముఖుల ఇళ్లలో, ప్రముఖుల ఇంటి ఆవరణంలో వేసే నాటకాలకు శాశ్వత ప్రదర్శనశాలలు (థియేటర్స్) నిర్మించడం మొదలయ్యాయి. అందువలన నాటకాలు ప్రదర్శించే సంస్థలు కూడా పెరిగాయి. వాటికి అనుగుణంగా రచయితల అవసరం కూడా పెరిగింది. సరిగ్గా అదే సమయంలో వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు షేక్స్పియర్.
మొదటి నాటకం “ది కింగ్ హెన్రీ VI”
విలియం షేక్స్పియర్ తన మొదటి నాటకం “ది కింగ్ హెన్రీ VI” ను థామస్ నాష్ మరియు ఇతరుల సహకారంతో 1590 మొదట్లో వ్రాసినట్టు, వాటిని క్వీన్స్ బృందం లండన్ లో ప్రదర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. “ది కింగ్ హెన్రీ VI” నాటకం మూడు భాగాలు వ్రాసేటప్పుడు విలియం షేక్స్పియర్ తన సమకాలీన నాటక రచయితలు మార్లో, థామస్ నాష్ లాంటి వాళ్లతో చర్చిస్తూండేవారు. మొదటి భాగం ఇంగ్లాండ్ తన ఫ్రెంచ్ భూభాగాలను కోల్పోవడం , వ్యక్తిగత కలహాలు మరియు చిన్నపాటి అసూయల వల్ల ఇంగ్లీష్ రాజకీయ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో రోజెస్ యుద్ధాలకు దారితీసిన రాజకీయ కుతంత్రాల గురించి వివరిస్తుంది . హెన్రీ VI, రెండవ భాగం తన ప్రభువుల కలహాలను అణచివేయడంలో రాజు అసమర్థతను మరియు సాయుధ పోరాటం యొక్క అనివార్యతను వివరిస్తుంది. ఇక హెన్రీ VI, మూడవ భాగం ఆ సంఘర్షణ యొక్క భయానక పరిణామాలను వివరిస్తుంది.
మొదటి కవిత “వీనస్ అండ్ అడోనిస్”
“ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ” అనే ఒక హాస్య నాటకాన్ని 1590 మరియు 1592 మధ్య వ్రాశారు. అప్పటికే లండన్ పరిసర ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించడం ప్రారంభమైంది. వందల మంది ప్రజలు మరణిస్తున్నారు. అలాంటి ఆ సందర్భాల్లో నాటక ప్రదర్శనలు అన్నీ మూసివేయాల్సిందిగా రాణి గారి నుండి నుండి ఉత్తర్వులు వచ్చాయి. 1592 నుండి నుంచి 1594 వరకు దాదాపు రెండేళ్లు నాటక ప్రదర్శనలు నిషేధించారు. అప్పటికే శరవేగంగా వ్రాస్తున్న నాటక రచనను విలియం షేక్స్పియర్ ఆపలేదు. అయితే నాటకాలను ప్రదర్శించే అవకాశం లేకపోవడంతో ఆయన తన రచనలను కవితల వైపు మళ్ళించాడు. ఆ ప్రక్రియలో “వీనస్ అండ్ అడోనిస్” అనేది ఆయన మొదటి కవిత రచన.
షేక్స్పియర్ యొక్క మొదటి ప్రచురణగా పరిగణించబడిన ఈ సుదీర్ఘ కవిత ఆరు పంక్తులు ఒక చరణంగా 199 చరణాలున్న ఒక కథాత్మక కావ్యం, 1593లో ప్రచురించబడిన ఒక సుదీర్ఘ రచన. మిగతా దేశమంతా ప్లేగు వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ సుదీర్ఘ కవితను 1593లో ఆయన పుస్తకంగా అచ్చు వేయించారు. ప్రచురించిన వెంటనే దానికి అనూహ్యమైన స్పందన లభించింది. తన కవిత్వం లోని వినూత్నమైన శైలి, వినూత్న పద ప్రయోగం పాఠకులను కట్టిపడేశాయి. ఆ తరువాత 15 సంవత్సరాలలో ఆ కవితను సుమారు 50 సార్లు పునముద్రణ చేశారు. ఆ కవిత ఆధారంగా ఇప్పటికీ కూడా రంగస్థలం నాటకాలు ప్రదర్శితమవుతున్నాయి.
నాటకరంగంలో తొలినాళ్ళకే ధనవంతుడిగా
1594 వ సంవత్సరంలో ఇంగ్లాండులో ప్లేగు వ్యాధి తగ్గిపోయాక మళ్ళీ రంగస్థలం ప్రదర్శనశాలలు మొదలయ్యాయి. షేక్స్పియర్ మళ్లీ తన నాటక రచన మొదలుపెట్టారు. “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” అనే నాటక కంపెనీలో సభ్యుడై మళ్లీ చాలా సంవత్సరాలు నాటకాలు వ్రాశారు. అయితే తనకు ఇతర సంస్థలకు నాటకాలు వ్రాసే అవకాశం ఉన్నా కేవలం “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” సంస్థకు మాత్రమే నాటకాలు వ్రాశారు. షేక్స్పియర్ కేవలం నాటకాలు వ్రాయడమే కాదు, నాటకాలలో నటించేవారు కూడా కాబట్టి 1594 చివర్లోనే “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” సంస్థలో సభ్యుడు అవ్వడమే కాకుండా యాజమాన్యంలో కూడా భాగస్వామి అయ్యారు. అతనితోపాటు రిచర్డ్ బర్బేజ్ కూడా నాటకాలలో పాత్రలు ధరిస్తూ ఉండేవారు. షేక్స్పియర్ వ్రాసే నాటకాలలో హాస్య పాత్రలు మాత్రం విలియం కెంప్ ధరిస్తూ ఉండేవారు. అయితే ఈ కంపెనీ భాగస్వామ్యం వలన షేక్స్పియర్ కు క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చిపెడుతూ ఉండేది. రచయితగా, నటుడిగా వచ్చే పారితోషకానికి భాగస్వామ్యం వలన వచ్చే ఆదాయం అదనం. ఈ విధంగా నాటక రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్ళకే షేక్స్పియర్ ధనవంతుడు అయ్యారు. లండన్ లో ప్రదర్శనశాలలు ప్రారంభం అయ్యాక వాళ్ళు మొదలుపెట్టిన తొలి నాటకం “ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్” ప్రదర్శించారు.
తిరుగులేని నాటక రచయితగా
షేక్స్పియర్ నటుడిగా, రచయితగా ఊపిరి సలపనంత తీరిక లేకుండా అయిపోయారు. అయితే “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” కంపెనీ వారు సంవత్సరానికి రెండు నాటకాలు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. అంటే దానిని బట్టి షేక్స్పియర్ సంవత్సరానికి రెండు నాటకాలు వ్రాయాల్సిందే. విషాదాంతాలు, చారిత్రకాలు, హాస్య కథాంశాలు, ప్రేమ కథాంశాలు ఇలా వైవిధ్యమైన కథాంశాలతో షేక్స్పియర్ వ్రాసిన ప్రతీ నాటకం కూడా ప్రజాదరణ పొందింది. 1594 – 1595 సంవత్సరాల వరకు లండన్ నాటక రంగంలో విలియం షేక్స్పియర్ తిరుగులేని నాటక రచయితగా ఎదిగిపోయారు. ఆయన కలం నుండి ఏదైనా నాటకం వస్తుందంటే చాలు కొన్ని నెలల ముందే టికెట్లు అమ్ముడయ్యేవి. “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” నాటక కంపెనీలో భాగస్వామి మరియు ప్రధాన నటుడు అయిన రిచర్డ్ బర్బేజ్ యొక్క తండ్రి జేమ్స్ బర్బేజ్ అనే వ్యక్తి లండన్ శివార్లలో “ది స్టేజ్” అనే పేరుతో 1576 వ సంవత్సరంలో మొట్టమొదటి నాటక ప్రదర్శనశాల నిర్మించారు. 1594 వ సంవత్సరంలో “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” కంపెనీ పునః ప్రారంభం అయ్యాక మళ్లీ నాటకాలన్నీ కూడా “ది స్టేజ్” అనే థియేటర్ లోనే ప్రారంభమయ్యాయి.
కుమారుడు హామ్ నేట్ మరణం
ఒకవైపు నాటకాల రచన చేస్తూ, మరోవైపు నాటకాలలో నటిస్తూ షేక్స్పియర్ నటజీవితం, రచన జీవితం వైభవంగా, దిగ్విజయంగా సాగిపోతున్న రోజుల్లోనే 1596 వ సంవత్సరంలో అతని వ్యక్తిగత జీవితంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. మొదటిది షేక్స్పియర్ తండ్రి జాన్ షేక్స్పియర్ తన అప్పులన్నీ తీర్చేసి ప్రభుత్వంతో న్యాయపరమైన చిక్కులన్నీ తీర్చుకొని తాను పుట్టి పెరిగిన నగరం “స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవాన్” లో తిరిగి తన సామాజిక హోదాను తిరిగి తెచ్చుకోవడం. ఈ క్రమంలో రాణి ఎలిజిబెత్ కూడా జాన్ షేక్స్పియర్ కు తన పాత గుర్తింపును పునరుద్ధరించింది. కుమారుడు విలియం షేక్స్పియర్ పంపించిన డబ్బులతో పోగొట్టుకున్న తన పొలాలు, స్థలాలు కొనడం ప్రారంభించారు. రెండవది విలియం షేక్స్పియర్ కవల పిల్లలలో ఒకరైన హామ్ నేట్ షేక్స్పియర్ తన పదకొండు ఏళ్ల వయస్సులో అంటే 1596 వ సంవత్సరంలో స్ట్రాట్ఫోర్డ్ లోనే అకాల మరణానికి గురయ్యారు. అయితే కొడుకు మరణం షేక్స్పియర్ ను కుదిపేసింది. ఆ సంఘటనతో ఆయన చాలా రోజులు మామూలు మనిషి కాలేకపోయాడు.
రాణి కోరికమేరకు “ది మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్”
కొడుకు మరణం తరువాత కొన్ని రోజులకు షేక్స్పియర్ తిరిగి మళ్లీ లండన్ వచ్చి నాటకరంగాన్ని మొదలుపెట్టారు. ఆయన సృష్టించిన అత్యంత ప్రసిద్ధ హాస్య పాత్ర అయిన “సర్ జాన్ ఫాల్స్టాఫ్” కొన్ని చారిత్రక మరియు హాస్య నాటకాలలో కనిపిస్తుంది. “సర్ జాన్ ఫాల్స్టాఫ్” పాత్ర లావుగా ఉండి, ఎల్లప్పుడూ మద్యం తాగుతూ, పిరికివాడుగా చాలా చమత్కారంగా మరియు హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటుంది. “సర్ జాన్ ఫాల్స్టాఫ్” అనే ఒక నాటక పాత్ర ప్రేక్షకులను ఆకర్షించడానికి రచయితగా తన ప్రత్యేకతను నిలబెట్టడానికి షేక్స్పియర్ సృష్టించారు. ఆ పాత్ర అచ్చుపోలినట్లు తెలుగు జానపద చిత్రాలలో రేలంగి పాత్రలాగే ఉంటుంది. హాస్యం కోసమే ఆ పాత్రను సృష్టించినా కూడా దానిని షేక్స్పియర్ అజరామరం చేశారు.
అయితే “సర్ జాన్ ఫాల్స్టాఫ్” ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూడాలని రాణి ఎలిజబెత్ కోరడంతో ఆమె కోరికమేరకు “ది మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్” అనే నాటకాన్ని వ్రాశారు. 1597 వ సంవత్సరంలో షేక్స్పియర్ తన స్వస్థలమైన స్ట్రాట్ఫోర్డ్ ఊరిలోకెల్లా అతిపెద్ద భవనాన్ని కొన్నారు. అప్పటికి షేక్స్పియర్ వయస్సు 33 సంవత్సరాలు. 30 గదులు ఉండి కొన్ని ఎకరాలలో ఉన్న ఆ స్థలానికి షేక్స్పియర్ చెల్లించింది 120 పౌండ్లు. దానిని కొనుగోలు చేసినాక తన కుటుంబ సభ్యులందరినీ అందులోకి మార్చారు. షేక్స్పియర్ తాను కూడా లండన్ నుంచి స్ట్రాట్ఫోర్డ్ వచ్చినప్పుడు ఆ భవంతిలోనే ఉండేవారు. తరువాత రోజులలో జీవితాంతం షేక్స్పియర్ నివాసం ఆ భవంతినే అయ్యింది. ఆయన తదనంతరం ఆ ఇల్లు పిల్లలకు వారసత్వంగా వెళ్ళింది.
తండ్రి జాన్ షేక్స్పియర్ మరణం
అయితే తరువాత ఐదు సంవత్సరాలకు అంటే 1602 వ సంవత్సరంలో 320 పౌండ్లు చెల్లించి స్ట్రాట్ఫోర్డ్ చుట్టుప్రక్కల 107 ఎకరాల పొలాలు కొన్నారు. విలియం షేక్స్పియర్ కేవలం ఆస్తులు కొనడమే కాకుండా జీవితాంతం తన కుటుంబ సభ్యులకు నివాస గృహాలు ఏర్పాటు చేశారు. తన మిత్రులు ఆపదలో ఉన్నారంటే చాలు వాళ్లకు సహాయం చేసేవారు. 1600 సంవత్సరం వచ్చేనాటికి షేక్స్పియర్ ఖ్యాతి ఏ స్థాయికి చేరిందంటే, ఇతర నాటకాల రచయితలు తమ తమ నాటకంలో షేక్స్పియర్ ప్రసక్తి తీసుకొస్తూ ఉండేవారు. కొంతమంది అయితే నేరుగా షేక్స్పియర్ నాటకాలకు నకిలీ నాటకాలు తయారుచేస్తూ ఉండేవారు. అంటే షేక్స్పియర్ నాటకాలను తీసుకొని దానికి మార్పులు చేసి షేక్స్పియర్ కొత్త నాటకం అని ప్రచారం చేస్తూ ప్రదర్శిస్తూ ఉండేవారు. అలాంటి వారిని గుర్తించి కోర్టుకు లాగి అరికట్టడం కూడా లార్డ్ ఛాంబర్లేన్స్ మెన్ బృందం కార్యక్రలాపాలలో ఒకటయ్యింది. 1600 వ సంవత్సరం నాటికి ప్రాంతానికి షేక్స్పియర్ నాటకాలు “రోమియో అండ్ జూలియట్”, “లవ్స్ లేబర్ లాస్ట్” లాంటివి పుస్తక రూపంలో ముద్రణ చేయబడినవి. వాటికి పాఠకుల నుండి విశేషమైన ఆదరణ లభించింది. విలియం షేక్స్పియర్ తండ్రి జాన్ షేక్స్పియర్ 1601 వ సంవత్సరంలో మరణించారు. 1603 వ సంవత్సరంలో రాణి ఎలిజబెత్ స్థానంలో “కింగ్స్ జేమ్స్ వన్” అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చినాక “లార్డ్ ఛాంబర్లేన్స్ మెన్” క్లబ్ కాస్త “కింగ్ మెన్” గా మారింది.
44 సంవత్సరాల వయస్సుకే తాత
విలియం షేక్స్పియర్ తాను లండన్ లో నివాసం ఉన్న భవనం ఖరీదైనదే అయినా 1604 వ సంవత్సరం తరువాత తన సొంత ఊరైన “స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవాన్” లో ఎక్కువ కాలం గడుపుతూ వచ్చారు. ఒక నాటకం నుండి మరొక నాటకానికి షేక్స్పియర్ పేరు పెరిగిందే తప్ప తన నాటక మరియు రచనా ప్రస్థానంలో వెనుతిరిగి చూడడం జరగలేదు. అలాగే తన నాటకాలకు ఆదరణ తగ్గడం గానీ జరగలేదు. షేక్స్పియర్ రచయితగా ఎప్పుడూ కూడా పైపైకి దూసుకుపోతూ పురోగమించారు తప్ప ఏనాడూ తిరోగమించినది లేదు. 1607 వ సంవత్సరంలో తన పెద్ద కూతురు సుసన్నా హాల్ ని డాక్టర్ జాన్ హాల్ కు ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటికి షేక్స్పియర్ వయస్సు 43 సంవత్సరాలు. ఆ వివాహ సందర్భంలో కూతురికి 105 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు షేక్స్పియర్. ఆ తరువాత సంవత్సరమే ఫిబ్రవరి 1608 లో ఆమెకు కూతురు జన్మించింది. ఆ అమ్మాయి పేరు ఎలిజిబెత్. షేక్స్పియర్ 44 సంవత్సరాల వయస్సుకే తాత అయ్యారు. ఆ పాప పుట్టడానికి ఐదు నెలల ముందే సెప్టెంబరు 1607 లో షేక్స్పియర్ తల్లి మేరీ ఆర్డెన్ మరణించారు.
సంబంధం లేని కోర్టు కేసులో సాక్షిగా
షేక్స్పియర్ తల్లిదండ్రులు కొడుకు వైభవాన్ని చూశారు, వైభవాన్ని అనుభవించారు. కొడుకు విలియం షేక్స్పియర్ వల్లనే తండ్రి జాన్ షేక్స్పియర్ సమాజంలో తిరిగి తన హోదాను పొందగలిగారు. 1612 వ సంవత్సరంలో షేక్స్పియర్ తనకి ఏమాత్రం సంబంధం లేని కోర్టు కేసులో సాక్షిగా వెళ్లాల్సి వచ్చింది. తన నాటకంలో నటించే నటులకు విగ్గులు తయారు చేసే వ్యక్తి కూతురు పెళ్లికి మధ్యవర్తిగా ఉన్నారు. అయితే పెళ్లైన మూడేళ్లకే 1608 లో అమ్మాయి చనిపోయింది. దాంతో అల్లుడు తన మామగారిపై కోర్టులో కేసు వేశారు. అతని భార్య వ్రాసిన వీలునామా ప్రకారం మామగారు తనకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వలేదని, ఆ వివాదంలో సాక్షిగా షేక్స్పియర్ ను కోర్టుకు పిలిచారు. ఎవరి నాటకాల కోసం ప్రేక్షకులు తొక్కుకుంటూ, తోసుకుంటూ నాటకాల థియేటర్ కు వెళ్తున్నారో, ఎవరు వ్రాసిన నాటకాలు ప్రత్యేకతను సంపాదించుకుంటాయో, అలాంటి దిగ్గజం అయిన షేక్స్పియర్ ఒక సాధారణ పౌరునిగా కోర్టుకు వెళ్ళారు. మామ, అల్లుడు ఇద్దరూ తెలిసిన వాళ్ళే. కానీ మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ డబ్బులు వ్యవహారం గురించి కోర్టు వారు అడిగారు. దానికి షేక్స్పియర్ తనకు గుర్తులేదని సాక్ష్యం చెప్పారు. కానీ ఇతరుల సాక్షాలు బలంగా ఉండడంతో ఆ మామ గారికి శిక్ష పడక తప్పలేదు.
ఉచ్చస్థాయిలో ఉండగానే నాటక రంగానికి దూరం
తన నాటకాలలో మిత్రులతో కలిసి 1616 వ సంవత్సరంలో లండన్ లో భవంతులు కొన్నారు షేక్స్పియర్. తాను కొన్న భవంతిలోనే లండన్ లో తన చివరి రోజులలో నివసించారు. 1613 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు కూతురు వివాహంలో “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” నాటక సంస్థకు 14 నాటకాలు ప్రదర్శించే ఒప్పందం కుదిరింది. షేక్స్పియర్ భాగస్వామ్యంగా ఉన్న “లార్డ్ ఛాంబర్లెన్స్ మెన్” నాటక బృందానికి ప్రదర్శించిన 14 నాటకాలలో నాలుగు షేక్స్పియర్ వ్రాసినవే. ఇంత సంతోషకరమైన వాతావరణంలో షేక్స్పియర్ ను కొన్ని వరుస వివాదాలు వెంటాడాయి. తన తమ్ముడు రిచర్డ్ ఫిబ్రవరి 1613 లో చనిపోయారు. అంతకుముందు ఫిబ్రవరి 1612 వ సంవత్సరంలో గిల్బర్ట్ చనిపోయారు. దాంతో విలియం షేక్స్పియర్ మరియు చెల్లెలు జోన్ మాత్రమే అన్నా చెల్లెలుగా మిగిలిపోయారు.
జూన్ 1613 లో నాటక ప్రదర్శనశాల అగ్నికి ఆహుతయ్యింది. దాంతో విపరీతమైన నష్టం జరిగింది. అందులో షేక్స్పియర్ కూడా ఒక భాగస్వామి కాబట్టి తాను సగం నష్టం భరించాల్సి వచ్చింది. జూలై 1613 లో షేక్స్పియర్ కూతురుపై బయట వ్యక్తి చేసిన ఆరోపణలు ఆమె కోర్టు వరకు వెళ్ళింది. ఈ వివాదాల వల్ల 1613 వ సంవత్సరంలో తన సొంత ఊరు “స్ట్రాట్ఫోర్డ్ అపాన్ ఏవాన్” కి తన నివాసాన్ని మార్చుకున్నారు షేక్స్పియర్. అయితే ఎన్నో నాటకాలు వ్రాసి, తన నటనతో ఎందరినో సమ్మోహితులను చేసిన ఆయన 25 సంవత్సరాల నాటక రంగం నుండి విశ్రాంతి కోరుకొని 49 సంవత్సరాల వయస్సులో రచయితగా ఉచ్చస్థాయిలో ఉండగానే స్వచ్ఛందంగా నాటక రంగానికి దూరంగా వెళ్లిపోయారు.
మరణం.
1613 వ సంవత్సరం తరువాత షేక్స్పియర్ వ్రాసిన నాటకాలు చాలా తక్కువ. “ది టెంపెస్ట్” అనే నాటకం తాను వ్రాసిన చివరి నాటకాలలో ఒకటి. అదే తన చివరి రచన అని చాలామంది చెప్పారు కూడా. స్ట్రాట్ఫోర్డ్ గ్రామానికి చుట్టుప్రక్కల ఆయన పెట్టిన పెట్టుబడుల వలన సంవత్సరానికి 200 నుండి 300 పౌండ్లు పెరుగుతూ వచ్చింది. తన చెల్లెలు, తమ్ముళ్లు వాళ్ళ పిల్లల క్షేమ సమాచారాలు చూస్తూ ఉండేవారు షేక్స్పియర్. ఆయన జనవరి 1616 లో తన వీలునామా వ్రాశారు. పూర్తి సమ్మతితో, సంపూర్ణ ఆరోగ్యంతో వ్రాస్తున్న వీలునామా ఇది అని అందులో పేర్కొన్నారు షేక్స్పియర్. అయితే ఆ వీలునామాలో తన ఆస్తి మొత్తం కుటుంబ సభ్యులందరికీ చెందేలా వ్రాశారు. తన మేనల్లుళ్లు, మేనకోడలు, తన ఇద్దరు కూతుర్లు, వాళ్లకు పుట్టిన బిడ్డలు, తనతో నాటకం వేసిన వాళ్ళు, వాళ్ళ ఊళ్లోని నిరుపేదలు అందరికీ చెందేలా ఆస్తుల పంపకాలు చేశారు షేక్స్పియర్.
ఆయన విల్లు వ్రాసిన కొద్ది రోజులకే తన చిన్న కూతురు జుడిత్ 10 ఫిబ్రవరి 1616 లో స్ట్రాట్ఫోర్డ్కు చెందిన ద్రాక్షసారాయి వ్యాపారి అయిన “థామస్ క్వినీ” ని “హోలీ ట్రినిటీ చర్చి” లో వివాహం చేసుకుంది. అయితే చిన్న కూతురు భర్తపై వివాహేతర సంబంధం కేసు నమోదు చేయబడి శిక్ష పడింది. ఆ సంఘటన తరువాత తనను తీవ్రంగా కలవరపరిచింది. దాంతో చిన్న కూతురుకు చెందిన ఆస్తిపై షేక్స్పియర్ ఆంక్షలు పెట్టారు. ఆ తరువాత కొద్దిరోజులకే అంటే 23 ఏప్రిల్ 1616 నాడు సరిగ్గా తన 52 వ పుట్టినరోజునే కన్నుమూశారు షేక్స్పియర్. ఏ చర్చిలో అయితే ఆయనకు బాప్టిజం ఇచ్చారో సరిగ్గా అదే చర్చిలో షేక్స్పియర్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. అయితే ఆయన భార్య అన్నే హాతవే 1623 వ సంవత్సరంలో కన్నుమూశారు. షేక్స్పియర్ సమాధి ప్రక్కనే భార్య అన్నే హాతవే ని ఖననం చేశారు.










