భారతదేశాన్ని జయించడం అలెగ్జాండర్ ది గ్రేట్ కు ఒక కలగా ఎందుకు మిగిలిపోయింది?
ప్రపంచాన్ని జయించిన వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అరిస్టాటిల్ వద్ద విద్యను అభ్యసించిన అలెగ్జాండర్ సాధారణ శకానికి పూర్వం 336 లో తన తండ్రి ఫిలిప్ హత్య తరువాత అతను సింహాసనం అథిష్టించాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సర్వసైన్యాధిపత్యం లభించింది. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే ఆయన గడిపాడు. తన ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, గ్రీస్ నుండి వాయవ్య భారతదేశం వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు.
తాను తన సామ్రాజ్యం నుండి బయలుదేరి ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో గ్రీసు నుండి మొదలుకొని భారతదేశం వరకు గల అన్ని రాజ్యాలను జయించి యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా నిలిచాడు. అయితే నాటి పాటలీపుత్ర సైనికపాటవం ముందు తట్టుకోవటం అసంభవమని గమనించి యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చేసి మార్గ మధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అవగతమైపోయింది. తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిసంపన్నులైన తన సైన్యం, అంతు లేని సంపద, తనను మరణం నుంచి దూరం చేయలేవని తెలుసుకున్న గొప్ప చక్రవర్తి సాధారణ శకం 323 లో బాబిలోనియాలో మరణించాడు. అయితే ప్రపంచాన్ని మొత్తం జయించగలిగిన అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించడం అనేది తనకు తీరని కలగానే మిగిలిపోయింది.
తెలిసిన భూభాగాలన్నీ హస్తగతం చేసుకున్న అలెగ్జాండర్
మసెడోనియా రాజరిక వంశంలో జన్మించిన అలెగ్జాండర్ తన తండ్రి రెండవ ఫిలిప్ అప్పటికే మసెడోనియా గ్రీకు దేశాలను ఏకం చేసి తన 46 సంవత్సరాల వయస్సులో మరణించగా, అతనికి వారసుడైన తాను గురువు అరిస్టాటిల్ వంటి గొప్ప తాత్వికుడి వద్ద విద్యాబుద్ధులు గడించి తన 19 వ ఏట వారసత్వం స్వీకరించి, తండ్రి చనిపోగానే గ్రీసులో వెల్లువెత్తిన అలజడులను అణచివేశాడు. తన పొరుగునే ఉన్న మహా పెర్షియన్ సామ్రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని జయించడమే కాకుండా అక్కడ ఉన్న గ్రీకు బానిసలకు స్వేచ్ఛను ప్రసాదించి ఇప్పటి ఆఫ్గనిస్తాన్ లోని గాంధారం వరకు ఉన్న పర్షియన్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు అలెగ్జాండర్. అంతేగాక భారతదేశంలోని పంజాబ్ వరకు గల సామ్రాజ్యాన్ని జయించిన మహావీరుడు అతడు. తన సైన్యం అలసట చెంది, తను గాయపడి, తన విజయ జైత్రయాత్ర ముగించి తిరిగి తన స్వదేశం వెళ్తూ, స్వదేశంలో ఘనస్వాగతం లభించక ముందే మార్గమధ్యంలో మధ్య ఆసియాలోని బాబిలోనియాలో మరణించారు. అందుకే “అలెగ్జాండర్ ది గ్రేట్” అన్నారు. గ్రీకు వీరుడు, గ్రీకు రాజ్యాలన్నిటినీ ఏకం చేసినవాడు, పర్షియాను ఆక్రమించుకున్నవాడు, ఇండియా వరకు దండయాత్రలతో తనకు తెలిసిన భూభాగాలన్నిటినీ హస్తగతం చేసుకున్నవాడు అలెగ్జాండర్. అందుకే “అలెగ్జాండర్ ది గ్రేట్”.
వాయువ్య భారతదేశంలోకి అలెగ్జాండర్ ప్రవేశం
ప్రపంచాన్ని గెలిచిన వీరుడు అలెగ్జాండర్. పర్షియాను గెలిచాడు, ఈజిప్టును గెలిచాడు, ఎక్కడ ఓడిపోలేదు, కానీ భారతదేశంలో తన పప్పులు ఉడకలేదు, తన ఆటలు సాగలేదు. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ కన్ను భారతదేశంపై పడింది. సాధారణ శకానికి పూర్వం 326 లో అలెగ్జాండర్ హిందూ కుష్ పర్వతాలను దాటి వాయువ్య భారతదేశంలోకి అడుగుపెట్టారు. తక్షశిల రాజు అయిన అంబి వెంటనే లొంగిపోయాడు, అలెగ్జాండర్ తో స్నేహం చేశాడు. కానీ అందరూ అంబిలా కాదు కదా. అసకేనియా లాంటి తెగలు ఎదురు నిలిచాయి. అసగాన్ దగ్గర వీరోచితంగా పోరాడాయి. అయోర్నస్ కొండ కోట దగ్గర కూడా గ్రీకులను అడ్డుకున్నాయి. నిజానికి గ్రీకులకు అప్పుడు అర్థమయింది ఏమిటంటే ఇది ఇంతకుముందు తాము చూసిన యుద్ధం కాదని. కానీ అసలు పరీక్ష జీలం నది దగ్గర ఎదురైంది. అక్కడ పౌరవరాజు పురుషోత్తముడు నిలబడి ఉన్నాడు. గ్రీకులు ఆయనను పోరస్ అన్నారు. గ్రీకు రచన ప్రకారం పోరస్ ఆరున్నర అడుగులు ఉండేవాడు, ఆయన ఏనుగు మీద ఉండే పోరాడేవాడు.
పోరస్ రాజ్యాన్ని తిరిగి తనకే అప్పగించి.
అది వర్షాకాలం కావడం వలన నది పొంగి ప్రవహిస్తోంది. అలెగ్జాండర్ ఒక తెలివైన పథకం వేశాడు. ఆ తూఫాను రాత్రి చీకటిలో రహస్యంగా నదిని దాటాడు, శత్రువులను పక్కనుండి దెబ్బతీశాడు. అయినా యుద్ధం సులభంగా జరగలేదు. పోరస్ ఏనుగులు ముందుకు కదిలాయి. వాటి వాసన, ఘీంకారం గుర్రాలను చెదరగొట్టాయి. గ్రీకు అశ్వదళం చెల్లాచెదరైపోయింది. యుద్ధం భయంకరంగా జరిగింది. ఆ యుద్ధంలో పోరస్ కు సుమారు తొమ్మిది గాయాలు తగిలినా కూడా వీరోచితంగా పోరాడాడు. చివరకు గ్రీకులే గెలిచారు. ఆ గెలుపు వారికి చాలా ఖరీదు అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ యుద్ధంలో ఎంతో మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. అదే యుద్ధం తరువాత అలెగ్జాండర్ కు అత్యంత ప్రియమైన గుర్రం బుసపాలస్ చనిపోయింది. దాని జ్ఞాపకంగా ఆయన ఒక నగరమే నిర్మించాడు, దాని పేరు బుసపాల. గాయపడిన పోరస్ ను అలెగ్జాండర్ ముందుకు తెచ్చారు. నిన్ను ఎలా చూడాలి అని పోరస్ ను అలెగ్జాండర్ అడిగాడు. అలెగ్జాండర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన పౌరస్ ధైర్యంగా నన్ను ఒక రాజును చూసినట్టే చూడమన్నాడు. ఆ మాట అలెగ్జాండర్ కు చాలా బాగా నచ్చింది. పోరస్ రాజ్యాన్ని తిరిగి పోరస్ కే అప్పగించాడు అలెగ్జాండర్. తనని మిత్రుడుగా చేసుకున్నాడు.
బట్టలు కుళ్లిపోయి, ఆయుధాలు తుప్పుపట్టి.
గ్రీకు సైనికుల మనస్సులో ఒక భయం మొదలైంది. ఒక చిన్న రాజ్యమే ఇంత నష్టం చేస్తే, ఇంకా ముందుకెళితే ఏం జరుగుతుంది? నది అవతల ఏం ప్రమాదం ముంచి ఉందో అనే భయం వారిలో మొదలైంది. అలెగ్జాండర్ ఆపింది శత్రువులు కాదు, ఆయన సొంత సైనికులే. పోరస్ ను ఓడించాక అలెగ్జాండర్ ఆగలేదు ఇంకా ముందుకు తూర్పు వైపు చివర అంచు వరకు వెళ్లాలనుకున్నాడు. కానీ సైనికుల పరిస్థితి వేరుగా ఉంది. వాళ్ళు ఎనిమిది సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నారు. ఇంటిని వదిలి వేల మైళ్ళు నడిచి వచ్చారు. అడుగడుగున వారికి యుద్ధాలే. ఆగకుండా కురిసే వర్షాలు, పొంగిపొర్లుతూ, పారే నదులు, విషసర్పాలు, జబ్బులతో భారతదేశంలో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. బట్టలు కుళ్లిపోయాయి, ఆయుధాలు తుప్పుపట్టిపోయాయి. ఎంతో మంది రోగాలతో కుప్పకూలిపోయారు. ఇల్లు, ఇల్లు, ఇల్లు అంటూ సైనికుల మనసంతా ఒక మాట మీదనే ఉన్నారు. తమ ఊరు, తమ కుటుంబం. అప్పుడు వారు బియాసిస్ నది ఒడ్డుకు చేరారు, దీనిని సైనికులు పెపాసిస్ అన్నారు.
ముందుకు అడుగేయడం కష్టమని తేల్చిన సైనికులు.
ఎప్పుడైతే సైనికులు బియాసిస్ నది ఒడ్డుకి చేరిపోయారో అప్పుడు వారి చెవిని ఒక మాట పడింది. నది అవతల గంగా మైదానం ఉన్నది, అక్కడ నంద సామ్రాజ్యం ఉన్నది అని. ఆ నంద సామ్రాజ్యం అప్పటికే శక్తివంతమైన రాజ్యాలలో ఒకటిగా ఉంది. అప్పటి గ్రీకు రచనల ప్రకారం నందరాజు దగ్గర 80 వేల ఆశ్వికులతో, 2 లక్షల కాల్బలంతో, 8 వేల రథాలతో, 6 వేల యుద్ధపు టేనుగులతో భారీ యుద్ధ ప్రణాళిక ఉన్నది. అందుకే గ్రీకులు ఆ రాజును అగ్రమ్మెస్ లేదా జాన్డ్రమ్మెస్ అని పిలిచారు. నిజానికి ఆయన పుట్టుక సామాన్యమైనందున తన సొంత ప్రజలే చిన్నచూపు చూశారని గ్రీకు రచయితలు వ్రాసుకున్నారు, కానీ ఆయన దగ్గర అపారమైన ఖజానా ఉంది, స్థిరమైన సైన్యం కూడా ఉంది. గ్రీకు సైనికుల్లో భయం ఉన్న మాట నిజమే కానీ వారిని ఒక ప్రశ్న వేధించింది. పోరస్ దగ్గర కేవలం 200 యుద్ధ ఏనుగులు మాత్రమే ఉన్నాయి. అయినా కూడా అవే మన గుర్రాలను చీల్చి చెల్లాచెదురు చేశాయి. అదే 6000 ఏనుగులు ఒకేసారి వస్తే? ఎంతటి బీభత్సం జరుగుతుంది? అందుకే గ్రీకు సైనికులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందుకు అడుగు వేయడం కష్టం కాబట్టి అదే విషయాన్ని అలెగ్జాండర్ కు చెప్పేయాలని సైనికులు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.
12 పెద్ద బలిపీఠాలను ప్రతిష్టించిన అలెగ్జాండర్.
అలెగ్జాండర్ గ్రీకు సైనికులను సమావేశపరిచాడు. వారిని ఉత్తేజపరచాలని ప్రయత్నం చూశాడు. యుద్ధంలో చనిపోయిన వారికి కీర్తి దక్కుతుందని వారినుద్దేశించి చెప్పాడు. ప్రపంచపు చివరి అంచు అక్కడే ఉందని చెప్పాడు. కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు, అందరిలో నిశ్శబ్దం. అప్పుడు సైనికులందరి తరఫున సేనాపతి కోయినస్ ధైర్యంగా మాట్లాడాడు. “మహారాజా మేము అలసిపోయాం, మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం” అన్నాడు. కానీ దానికి అలెగ్జాండర్ కోపంతో ఊగిపోయాడు. ఆక్రోశంతో గుడారంలోకి వెళ్లి మూడు రోజులు బయటకు రాకుండా నిరసన తెలియజేశాడు. సైనికులు తమ మనసు మార్చుకుంటారని ఆశపడ్డాడు. కానీ వాళ్ళు మనసు మార్చుకోలేదు. అయితే దీనినిబట్టి చూస్తే అలెగ్జాండర్ ఓడిపోయింది శత్రువు చేతుల్లో కాదు, తన సొంత సైన్యం చేతిలో. చేసేదిలేక అలెగ్జాండర్ వెనక్కి తిరిగి వెళ్లడానికి ఒప్పుకున్నాడు, కానీ వెళ్లేముందు బియాసిస్ నది ఒడ్డున గ్రీకు సామ్రాజ్యపు తూర్పు సరిహద్దు గుర్తుగా, తాను ఆగిపోయిన చోటును గుర్తు చెప్పే సాక్షాలుగా అక్కడ 12 పెద్ద బలిపీఠాలు ప్రతిష్టించాడు. దాంతో తమ సైనికులు ఇంటికి వెళుతున్నామని కేకలు వేశారు. అలెగ్జాండర్ మనసులో మాత్రం అసంతృప్తి అలాగే మిగిలిపోయింది.
అలెగ్జాండర్ ఛాతిలో దిగిన బాణం.
నిజానికి యుద్ధం జరిగితే ఏమైయ్యుండేదో కానీ ఒకరకంగా అలెగ్జాండర్ ప్రాణాలతో బయటపడ్డాడనే చెప్పాలి. కానీ అతను మనసులో భారతదేశం వెంటాడుతూనే ఉంది. సైనికులతో కలిసి అలెగ్జాండర్ ప్రయాణం మొదలుపెట్టాడు. నదల గుండా, పడవల్లో సాగుతూ ఉన్నారు. దారిలో చిన్న చిన్న గణతంత్రపు తెగలు ఎదురయ్యాయి. వాటిల్లో ఒకటి మల్లులు. వారు గ్రీకు సైన్యానికి లొంగిపోలేదు. అప్పటికీ అలెగ్జాండర్ ఒక కోటపై దాడి చేశాడు. ఒక్కడే కోట ఎక్కి లోపల దూకాడు. అంతలోనే ఒక బాణం వచ్చి అతని ఛాతిలో దిగింది, రక్తం చిమ్మింది. దాంతో అతడు కుప్పకూలిపోయాడు. సైనికులు వెళ్లి అలెగ్జాండర్ ను కాపాడారు. అందరూ అతడు చనిపోయాడు అనుకున్నారు. శిబిరం అంతా భయంతో నలిగిపోయింది. కొన్ని రోజులకు అలెగ్జాండర్ బ్రతికి బట్ట కట్టాడు. సైనికులు ఆనందంతో కన్నీళ్లు పెట్టారు. కానీ ఆ గాయం అతన్ని పూర్తిగా కోలుకోనివ్వలేదు. అతనికి ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చింది. తరువాత వారి కష్టతరమైన ప్రయాణం మొదలైంది. సైన్యంలో కొంత భాగం ఫెడ్రోసియా ఎడారి భాగం గుండా సాగింది. అది నిప్పులుకక్కే ఎడారి. అక్కడ నీరు లేదు, నీడ లేదు. ఒకవైపు దాహంతో, మరోవైపు వేడితో వేలాది మంది సైన్యం చనిపోయారు. గ్రీకు సైన్యంలో చాలాభాగం ఆ ఎడారిలోనే కూలిపోయింది. యుద్ధం కంటే ఎడారిలోనే ఎక్కువ మంది చనిపోయారని చరిత్రకారుల అంచనా.
సైనికుల గుండెల్లో భయమే అలెగ్జాండర్ ను ఆపింది.
ఎనిమిది సంవత్సరాల క్రిందట వెళ్లిన విజేత అలెగ్జాండర్ ఇప్పుడు అలసిపోయిన మనిషిగా, గాయపడిన మనిషిగా తిరిగి వచ్చాడు. ఆ తరువాత తాను బాబిలోనియాలో చేరాడు. సాధారణ శకం 323 వ సంవత్సరంలో అలెగ్జాండర్ మరణించాడు. అప్పటికి అతని వయస్సు కేవలం 32 సంవత్సరాలు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనబడే ఒక గొప్ప చక్రవర్తి, ప్రపంచాన్ని మొత్తం జయించాలి అనుకున్న రాజు, భారతదేశాన్ని జయించకుండానే వెళ్ళిపోయాడు. కానీ కథ అంతటితో అయిపోలేదు. గ్రీకు రచయిత అయిన ఫ్లూటార్క్ ఒక విషయం చెప్పాడు. అప్పట్లో అలెగ్జాండర్ ను చూశాను అని చెప్పుకున్న చంద్రగుప్తుడు ఒక యువకుడు (ఆ తరువాత రోజులలో అతడు మౌర్యుడయ్యాడు) భారతదేశాన్ని సులభంగా గెలవచ్చు అని అన్నాడు. ఆ రోజు అన్న ఆ మాటను చంద్రగుప్త మౌర్యుడు 20 ఏళ్లలోపు నిజం చేసుకున్నాడు.
చాణక్యుడి సాయంతో నంద సామ్రాజ్యాన్ని కూల్చాడు. అలెగ్జాండర్ వదిలి వెళ్ళిన ప్రాంతాలన్నీ తన రాజ్యంలో కలుపుకున్నాడు. అలగ్జాండర్ తీసుకోలేని భారతదేశాన్ని ఒక యువకుడు ఏకం చేశాడు. అలెగ్జాండర్ సేనాపతి సెల్యూకస్ నికేటర్ సాధారణ శకం పూర్వం 305 లో భారతదేశంపై దండయాత్ర చేయాలనుకున్నాడు. చంద్రగుప్తుడి బలం ముందు తాను నిలవలేకపోయాడు. ఒప్పందం చేసుకున్నాడు, తన భూభాగాలను ఇచ్చేశాడు. అందుకు బదులుగా చంద్రగుప్త మౌర్యుడి వద్ద 500 యుద్ధ ఏనుగులను తీసుకున్నాడు. ఒకప్పుడు గ్రీకులని భయపెట్టిన ఏనుగులే తరువాత రోజులలో గ్రీకు సైన్యంలో చేరాయి. సామాన్య శకం పూర్వం 301 లో ఇప్సన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ ఏనుగులు సెల్యూకస్ కు విజయం తెచ్చిపెట్టాయి. ఒకవిధంగా చెప్పాలంటే అలెగ్జాండర్ ను ఒక యుద్ధం ఆపలేదు, తాను నడిచిన దూరం, సైన్యాల గుండెల్లో నింపిన భయమే అలెగ్జాండర్ ను ఆపింది.










