Telugu Special Stories

సీమవెతలను కళ్లకుకట్టిన తెలుగు కథకులు.. కేతువిశ్వనాథరెడ్డి!

ప్రముఖ కథకులు, నవలా రచయిత, పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, కథా రచయిత, నవలికా రచయిత, విద్యావేత్త, అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు… 

తన చుట్టూ ఉన్న సమాజాన్ని, శాస్త్రీయ దృక్పథంతో పోలుస్తూ.. మానవ సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని రచనలు సాగించారు. ముఖ్యంగా కడప గ్రామీణ జీవితంతో మమేకమై అనేక రచనలు సాగించిన తీరు.. విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది.

కథకులు, నవల, సాహిత్య విమర్శ, సంపాదకత్వం వంటి అనేక ప్రక్రియల్లో ఎనలేని కృషి సలిపారు.

విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా చాన్నాళ్లు పనిచేశారు. పాత్రికేయుడిగా మొదలై… అభ్యుదయ 

సాహితీవేత్తగా ముగిసిన ఆయన జీవనం.. ఎందరికో మార్గదర్శనం…ఆయనే ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి.

ఈరోజు(జూలై 10)న ఆయన జయంతి సందర్భంగా.. విశ్వనాథరెడ్డివార్ల వృత్తి, సాహితీ విశేషాలను మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం

1939 జూలై 10న కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలంలోని రంగశాయిపురంలో జన్మించారు కేతు విశ్వనాథరెడ్డి. తల్లిదండ్రులు నాగమ్మ వెంకటరెడ్డిలు. వీరిది వ్యవసాయ కుటుంబం. వ్యాపార నేపథ్యం ఉంది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరులలో పాఠశాల విద్యనభ్యసించారు. 1955లో కడప ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ఆ విశ్వవిద్యాలయంలో ఆయనతోపాటు కె.నాగిరెడ్డి, భాస్కర స్వర్ణాంబ, జి.నాగయ్య, నల్లపాటి రామప్పనాయుడు, కృష్ణారెడ్డి, చెన్నారెడ్డిలు.. మొదటి బ్యాచ్ విద్యార్థులుగా కలిసి చదువుకున్నారు. 

ఆ తర్వాత విశ్వనాథరెడ్డివార్లు.. ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి పర్యవేక్షణలో ‘‘కడప- ఊర్ల పేర్లు’’ అనే అంశం మీద విశేష పరిశోధన చేశారు. దీంతో ఆ కాలంలో తెలుగు శాఖలోనే ‘ఓనమాస్టెన్స్’ అనే అధ్యయన విభాగానికి పునాది పడింది.

1962 ఆగస్టు 2న ఆయనకు, పద్మావతిగారితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. 

వృత్తి జీవితం 
పాత్రికేయుడిగా వృత్తి జీవితం మొదలవ్వగా, అనంతరం అధ్యాపక వృత్తినే కొనసాగించారు.

ఆయన 1962-76 వరకు కడప, శ్రీకాళహస్తి, కందుకూరులలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్ గా కొనసాగి, కొన్నాళ్ల తర్వాత డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి రీడర్ గా వెళ్లి, అక్కడే ఆచార్యుడై.. అనేక హోదాలలో దూరవిద్యకు సేవలందించారు. దూరవిద్య తెలుగు వాచకాలతో ఆయన విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవాలి. ఈ వర్సిటీలోనే డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందారు. 

అంతేకాకుండా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎన్‌సీఈఆర్‌టీ సంపాదకునిగా కూడా వ్యవహరించారు. పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ స్థాయివరకు అనేక పాఠ్యపుస్తకాల ప్రచురణలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు పత్రికా రంగంతో బాగా అనుబంధం ఉండేది. ‘ఆంధ్రరత్న’ అనే పత్రికకు కొన్నాళ్లు ఉపసంపాదకులుగా, తర్వాత ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, అక్కడి సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. 

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కొంతకాలం ‘ఈ భూమి’కి సంపాదకత్వం వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగానూ, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహామండలి సభ్యులుగానూ ఆయన సేవలందించారు.
   
సాహిత్య కృషి

కాలేజీ రోజుల్లోనే ‘అమ్మ’ అనే కథ రాశారు. 1963లో ‘అనాది వాళ్లు’ అనే కథ ముద్రితమవ్వగా, అచ్చయిన తొలి రచన ఇదే. ఇది మొదలు.. కథకులు, నవలలు, వ్యాసాలు, నాటికలెన్నో రచించారు. అంతేకాక ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాల్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషిస్తూ రచనలు సాగించారు.

ముఖ్యంగా కడప గ్రామీణ జీవితంతో మమేకమై ఎన్నో రచనలు చేశారు. ఎంతలా అంటే, కడప ప్రాంత గ్రామ పేర్లపైన లోతైన పరిశోధన చేసి, ఏకంగా డాక్టరేట్‌ పొందారు.

అధ్యాపకుడిగా ఉంటూనే రచయితగానూ విశేష గుర్తింపు పొందారు.

అభ్యుదయ రచయితల సంఘం అయిన అరసంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు.

కేంద్రసాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులుగా చాలాకాలం పాటు పనిచేశారు.

విశాలాంధ్ర పత్రిక వారు ప్రచురించిన ‘నూరేళ్ల తెలుగు కథ’కు సంపాదకులుగా, తెలుగు చరిత్ర–సంస్కృతి, రాయలసీమ రాగాలు వంటి సంకలనాలకు సంపాదకత్వం వహించారాయన. 

విశ్వనాథరెడ్డిగారు మొత్తంగా దాదాపు 100 కథకులు రాశారు.

అవి మొదట ‘జప్తు’, ‘ఇచ్చాగ్ని’ వంటి సంపుటాలుగా వచ్చాయి. తర్వాత ‘ కేతు విశ్వనాథరెడ్డి కథలు ‘ పేరుతో రెండు సంపుటాలుగా వెలువడ్డాయి.

వాటిలో మొదటి కథానికకు 1994లో తెలుగు విశ్వవిద్యాలయం, 1994లో భారతీయ భాషా పరిషత్తు, 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ వంటి పురస్కారాలు లభించాయి

రెండవ రచనకు 2009లో అజోవిభో కందాళ ఫౌండేషన్ పురస్కారం లభించింది. అలాగే బోధి, వేర్లు అని రెండు నవలికలు రాశారు.

ఈయన చేసిన ఉపన్యాసాలు, వ్యాసాలు ‘సంగమం’ పేరుతోనూ,  ముందుమాటలు సమీక్షలు కలిపి ‘పరిచయం’ పేరుతోనూ ప్రచురితమయ్యాయి.

ఆంగ్లంలో రాసిన వ్యాసాలు ట్రెడిషన్స్ అండ్ ట్రెండ్స్, చేంజ్ అండ్ రిలవెన్స్ అనే పేర్లతో అచ్చయ్యాయి. 

కొడవటిగంటి కుటుంబరావుగారి సాహిత్యాన్నతటిని 13 సంపుటాలుగా విభజించి, వాటికి విలువైన ముందుమాటలతో సంపాదకత్వం వహించారు. తరువాయి ‘మన కొడవటిగంటి’ పేరుతో పుస్తకంగా వచ్చాయి.

ఆయన తెలుగు కల్పనా సాహిత్యం మీద రాసిన విమర్శ అంతా.. ‘దృష్టి’ పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆయన మరో విమర్శ.. ‘దీపధారులు’. చదువు కథలు, రాయలసీమ రాగాలు వంటి పుస్తకాలకు స్వీయసంపాదకత్వం వహించారు. ఇంకా అనేక రచనలు పుస్తకాలుగా రావాల్సి ఉన్నాయి.

వాటి క్రోడీకరణ జరుగుతుండగానే ఆయన మే 22న కన్నుమూశారు. 

భౌతిక వాద కథలు, కథకుల కథలు, రాయలసీమ నిర్దిష్టత కథలు, ఆర్థికాంశాల కథలు, స్త్రీ పురుష సంబంధాల కథలు, రాజ్య వ్యవస్థ కథలు, దళిత బహుజన కథలు మొదలైన కథలను క్రోడీకరించాల్సి ఉంది.

కథలకు జీవం పోసి

రాయలసీమ జీవన పరిణామాలనే ఇతివృత్తంగా… భూస్వామ్య, మొరటు మానవ సంబంధాల్లో చిక్కుకుపోయిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని విమర్శనాత్మకంగా చూడగలిగారు.. 

ప్రాంతీయ, ప్రాదేశిక జీవితాన్ని చిత్రించడమంటే ఉన్నది ఉన్నట్లు రాయడం కాదని.. ఆయన స్త్రీలు, అంటరానికులాలు, బహుజన వృత్తి కులాల మధ్య తరగతి సమూహాలను గుర్తించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో సామాజిక, సాహిత్య రంగాల్లో ప్రవేశిస్తున్న నూతన ఆలోచనలు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశాయి. కథ, నవలతోపాటు విమర్శనాత్మకమైన రచనలు చేశారు. 

అభ్యుదయ దృక్పథం వల్ల తొలి రోజుల నుంచే స్త్రీల, దళితుల, బహుజనుల జీవన వైరుధ్యాలను కూడా చిత్రించారు.

ముఖ్యంగా వాన కురుస్తే(1971), జప్తు(1972), గడ్డి(1981), పొడి నిజం(2003), విరూపం(2002), సానుభూతి(1976), వెనకా ముందూ(1977), పీర్ల సావిడి(1980), కూలిన బురుజు(1988), స్వస్తి (1998), నిజం కాని ఒక్కనిజం కథ(1995) మొదలైన కథల ద్వారా రాయలసీమ జీవిత పరిణామాలను, గ్రామీణ జీవితాలను, అక్కడి కరువు, కక్ష్యలను విస్తృతంగా తన రచనల ద్వారా చూపించారు.

ఇలాంటివే కాక, చాలా కథలలో కరువు, కక్షలు ప్రస్తావనకు వస్తాయి.

గుర్తింపు

భారతీయ భాషాపరిషత్‌(కలకత్తా), తెలుగు విశ్వవిద్యాలయం(హైదరాబాద్‌) నుంచి కూడా పురస్కారాలు అందుకున్నారు. రావిశాస్త్రి పురస్కారం, తుమ్మల వెంకటరామయ్య బంగారు పతకం, ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం, వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కారం వంటి విశేష పురస్కారాలతో విశిష్ట ఘనత సాధించారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం సైతం ఆయననే వరించింది.  అరసం నాయకుడిగా, అభ్యుదయ రచయితగా, సీమ సాహిత్యకారుడిగా ఆయన చేసిన కృషి తెలుగు సాహిత్య రంగాన సుస్థిరం!!

Show More
Back to top button