GREAT PERSONALITIESTelugu Cinema

భారతీయ చలనచిత్ర పితామహుడు.. దాదా సాహెబ్ ఫాల్కే.

ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే ( దాదా సాహెబ్ ఫాల్కే ) (30 ఏప్రిల్ 1870 – 16 ఫిబ్రవరి 1944)

సినిమా అనేది ఓ వినోద ప్రక్రియ. సినిమా అనేది ఓ సందేశాత్మక కళ. సినిమా అనేది కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం. అలాంటి ఒక వినోదాత్మక ప్రక్రియ ద్వారా, ఒక సందేశాత్మక కళను ప్రదర్శించి, వ్యాపార ధోరణిలో కోట్లు సంపాదించే దిశగా దిన దిన అభివృద్ధి చెందింది భారతీయ చిత్ర పరిశ్రమ. అలాంటి చిత్ర పరిశ్రమను భారతీయులకు పరిచయం చేసిన వారు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే అలియాస్ దాదా సాహెబ్ ఫాల్కే గారు. అందుకే తనని భారతీయ చలనచిత్ర పితామహులు అని పిలుస్తుంటాం.

దాదా సాహెబ్ ఫాల్కే గారికి నేడు సినీ రంగంలో ఉన్న వారందరే కాదు, నేడు సినిమా వినోదం పొందుతున్న వారంతా కూడా తనకు ఋణపడి ఉంటారు. భారతదేశం లో కోట్లాది మందికి చౌక ధరలకే వినోదం అందిస్తూ కొన్ని వేల మందికి ఉపాధినిస్తూ, పైసా పెట్టుబడి పెట్టకుండా కోట్లాది రూపాయలు ఆదాయం పొందే అవకాశం భారతీయ సినిమా రంగం. ప్రభుత్వాలకు ఆదాయం ఇచ్చే రంగం కూడా సినిమా రంగమే. అటువంటి ఒక విశేష వ్యవస్థకు పునాదివేసిన వారు దాదాసాహెబ్ ఫాల్కే గారు.

ఈ అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా శతాబ్దం క్రితమే భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కృతమైంది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం తన కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు.

జీవిత విశేషాలు.

  • జన్మ నామం :    ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే ( దాదాసాహెబ్ ఫాల్కే )
  •  జననం    :   30 ఏప్రిల్ 1870
  • స్వస్థలం   :    త్రయంబకేశ్వర్ ( మహారాష్ట్ర )
  • వృత్తి      :    భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత
  • మరణం   :  16 ఫిబ్రవరి 1944

బాల్యం.

దాదాసాహెబ్ ఫాల్కే గారు ఒక పండిత వంశంలో 30 ఏప్రిల్ 1870 నాడు మహారాష్ట్రలోని గోదావరి నది జన్మస్థానమైన త్రయంబకేశ్వర్ లో సంస్కృత పండితులు, వేద అధ్యయనాలు చేసిన ఒక గౌరవ కుటుంబంలో పుట్టారు.

తల్లిదండ్రులు పెట్టిన పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. తనలాగే కొడుకు సంస్కృత విద్యను అభ్యసించి పండితుడవ్వాలని తండ్రి కోరుకున్నారు.

ఇందుకు భిన్నంగా ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే గారు కళల మీద మక్కువ పెంచుకున్నారు.

బొంబాయి లోని జే.జే.స్కూల్ అఫ్ ఆర్ట్స్ నుండి ఉత్తీర్ణుడయ్యారు.

ఆ తర్వాత “బరోడా” కు వెళ్లి ఛాయాగ్రహనం, శిల్పకళ నేర్చుకున్నారు.

గుజరాత్ లోని గోద్రాలో కొంతకాలం ఫోటో స్టూడియో పెట్టుకున్నారు. 

ఆ తర్వాత ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కొంతకాలం ఉద్యోగిగా పనిచేశారు.

ఆ తర్వాత రాజా రవివర్మ గారు గీసిన చిత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ లో కొంతకాలం పనిచేశారు.

తర్వాత “స్వదేశీ ఉద్యమం”లో చేరారు. ప్రభుత్వ ఉద్యోగానికి తిలోదకాలిచ్చి, స్వతంత్ర జీవనంలోకి ప్రవేశించారు.

ఆ సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే గారు చూసిన “లైఫ్ ఆఫ్ క్రీస్త్” అనే సినిమా తన జీవితాన్నే మార్చేసింది.

అదే పద్ధతతిలో భారతీయ పురాణ గాథలను సినిమాలుగా తీయాలానే ఆలోచన కలిగింది.

లఘుచిత్రం నిర్మాతగా…

దాదా సాహెబ్ ఫాల్కే గారు ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగానికి తిలోదకాలిచ్చి, స్వతంత్ర జీవనంలోకి ప్రవేశించారో, తన భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. తన మనసు చెడిపోయి 25 డిసెంబరు 1910 సాయంత్రం “అమెరికా-ఇండియా సినిమా”లో “లైఫ్ ఆఫ్ క్రీస్ట్” సినిమాను చూసిన తనకు అశాంతి, నిర్వేదం మటుమాయమయ్యాయి. తెరమీద జీసస్ క్రీస్తు ప్రతిబింబాలు కదలడం తనకి అనేక రాత్రులు నిద్రలేకుండా చేశాయి. రాముడు, కృష్ణుడు రూప నిర్మాణాలు అతని మస్తిష్కంలో ఊపిరి పోసుకున్నాయి. దాంతో బైస్కోపులన్నిటినీ వరుసగా చూడనారంభించారు.

రెండు నెలల పాటు థియేటర్లలో కూర్చుని, “మనం ఈ విధంగా చేయలేమా?” అన్న ప్రశ్న వేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేసే తపనను పెంచుకున్నారు. ఫాల్కే గారికి నలభై ఏళ్ళ వయసు వచ్చినా స్థిరమైన ఆదాయం లేదు. స్థిరాస్థులు లేవు. భవిష్యత్తు అభద్రతతో, నిశీధితోనూ ఉంది. ఉన్న కొద్దిపాటి డబ్బును మూట కట్టారు. చిత్రీకరణకు సంబంధించి పరికరాల జాబితాలు, పుస్తకాలు యితర వస్తు సముదాయం పోగు చేయడం ప్రారంభించారు. విస్తృతంగా చదివారు. అసంఖ్యాక బైస్కోపులను చూశారు. రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. అర్విరామ శ్రమకు తోడు ఆదుర్దా, మానసిక శ్రమ ఉండటంతో దృష్టి లోపం దాపురించింది.

సినిమా నిర్మాణమే ఫాల్కే గారికి లోకంగా తొలిగా తక్కువ నిడివి గల డాక్యుమెంటరీలు తీసి ఆ తర్వాత “సత్యహరిచంద్ర” సినిమాని నిర్మించారు. తన భార్య తన నగలు ఇచ్చి ఫాల్కే గారిని ప్రోత్సహించింది. అలా అనేక కష్టాలకు ఓర్చి తీసిన భారతీయ తొలి మూకీ సినిమా “రాజా హరిచంద్ర” ను 3 మే 1913న విడుదల చేశారు. ఎట్టకేలకు, లండన్ తదితర పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. తన ప్రయోగాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రయత్నించారు. అయిదు పౌండ్లకు సాధారణ కెమేరా తో స్వదేశం చేరారు. ఒక బఠాణీ చెట్టు ఎదుగుదలను ఒక లఘుచిత్రంగా తీసి, తన పూర్వ స్నేహితుడు యశ్వంత్ నాదకర్ణి కి చూపాడు. అతని వద్ద కొంత పెట్టుబడిని సంపాదించారు. తన భీమా పాలసీని కుదువబెట్టి మరో పదివేల రూపాయలు ఋణంగా తీసుకున్నారు.

సినిమా రంగం నుండి తప్పుకున్న ఫాల్కే..

ఆడవాళ్లు సినిమాల్లో నటించేందుకు అంగీకరించని ఆ కాలంలో మగవారి చేతనే ఆడవేషం వేయించి ఒప్పించగలిగారు. హిందుస్థాన్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించిన తాను వరుసగా సినిమాలు తీయడమే కాకుండా సినీ రంగంలో అవసరమైన సాంకేతిక సిబ్బందికి శిక్షణనిచ్చారు. నటులను తయారు చేశారు. పురాణ గాథలను సినిమాలుగా మలచిన ఫాల్కే గారు “శ్రీకృష్ణ జన్మ”, “కాళీ మర్దన”, “లంకా దహన”, “భస్మాసుర మోహిని”, “సావిత్రి సత్యవాన్”, “సంత్ నామ్ దేవ్” వంటి సినిమాలను విజయవంతంగా నిర్మించారు. ఫాల్కే గారు సృజనాత్మకత అంశాలను చేసుకుంటుంటే, సినిమా ఆర్థిక వ్యవహారాలు తన భాగస్వాములు చూసుకుంటారు అనుకున్నారు. కానీ వారు పెట్టిన ఇబ్బందులు, వారి వ్యవహార శైలి నచ్చక 1920 – 21 సంవత్సరంలో తాను సినిమా రంగం నుంచి తప్పుకుంటున్నట్టు బహిరంగంగా ప్రకటించారు ఫాల్కే గారు. నాటక సంస్థను స్థాపించి, తాను స్వయంగా వ్రాసిన “రంగ భూమి” నాటక ప్రదర్శనతో ఊరూరా తిరిగారు.

మరలా చిత్ర రంగానికి తిరిగి వచ్చిన ఫాల్కే…

సినీ రంగంలోని వారు తిరిగి ఫాల్కే గారిని వెనక్కి తీసుకువచ్చారు.

అప్పటి నుండి వరుసగా ఆయన అనేక సినిమాలు, డాక్యుమెంటరీలు తీశారు.

1931 వ సంవత్సరంలో తొలి టాకీ “ఆలం అరా” విడుదలైంది. అయినా దాదాసాహెబ్ ఫాల్కే గారు 1933 లో “సేతుబంధన్” అనే మూకినీ నిర్మించి విడుదల చేశారు.

కాలంతో పాటు వేగంగా నడవలేకపోయిన దాదా సాహెబ్ ఫాల్కే గారు సినీ నిర్మాణంలో వెనుక పడ్డారు. అప్పటికే 60 యేండ్లు నిండిపోయాయి.

చిత్ర రంగంలో తాను సంపాదించింది అంతా కూడా ఆ రంగంలోనే తిరిగి ఖర్చు పెట్టాడు తప్ప ముందు కాలానికి తాను దాచుకున్నది ఏదీ లేదు.

తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో 97 సినిమాలు తీసిన ఫాల్కే గారికి చివరికి చేతులలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. కాని ఎలాగోలా బ్రతకాలి.

చివరికి తాను బరోడాలో విద్యార్థిగా నేర్చుకున్నప్పటి ఎనామిల్ బోర్డులు తయారీని గుర్తుతెచ్చుకొని వాటి తయారీకి చిన్న పరిశ్రమ పెట్టుకున్నారు.

ఈ లోగా తమ సినిమాకు దర్శకత్వం వహించమని ఒక సంస్థ పిలిచింది.

వారి కోసం “గంగావతరణ్” నిర్మించారు. ఇది కూడా పురాణ అంశమే.

ఇది దాదా సాహెబ్ ఫాల్కే గారి దర్శకత్వంలో వచ్చిన తొలి టాకీ.

ఆ చిత్ర నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు, విడుదలలో ఆలస్యం మళ్లీ సినిమా రంగంలో ఎదురు దెబ్బ.

అలాగని దాదా సాహెబ్ ఫాల్కే గారు ఇతర కథలను సినిమాలుగా తీయలేదని కాదు.

వేగంగా ఎదుగుతున్న చలనచిత్ర పరిశ్రమ ఎందరినో ఆకర్షించింది.

దేశంలో అన్ని ప్రాంతాల వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బొంబాయి చేరుతున్నారు.

వీరిలో చాలామందికి ఫాల్కే గారు ఎవరో తెలియదు.

తెలిసిన వారు తనను చూసి మొహం తిప్పుకుంటున్నారు.

అందుకని ఫాల్కేనే తనకు తానుగా బొంబాయి నుండి తప్పుకున్నారు.

ఆర్థికంగా చితికిపోయి, గెంటి వేయబడ్డ ఫాల్కే…

తన మకాం తన సొంత ఊరైన నా నాసిక్ కు మార్చుకున్నారు. తనకు సంపాదన లేదు. పుట్టిన ఏడుగురు సంతానంలో ఒక్క కూతురు మాత్రమే బ్రతుకుంది. ఆర్థికంగా తనను ఆదుకునే వాళ్ళు లేరు. ఎవరో ఆ విషయం గుర్తించి చెబితే తప్పించి నిర్వాహకులకు దాదా సాహెబ్ ఫాల్కే ఎవరో తెలియదు. అప్పటికప్పుడు ఆ పితా మహుడిని వేదిక మీదకి తీసుకెళ్లి చిరు సన్మానం చేసి అయిదు వేల రూపాయలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంది బొంబాయి చిత్ర పరిశ్రమ. దాదా సాహెబ్ గారు సినీ రంగం నుండి తప్పుకున్నా కూడా ఇతరులు నిర్మించే సినిమాలను చూసి కొత్త దర్శకుల ప్రతిభను అభినందిస్తుండేవారు. అలా తన తర్వాత వచ్చిన ఒక కొత్త దర్శకుడి ప్రతిభను చూసి అతని దగ్గర సహాయ దర్శకుడిగా చేద్దాం అనుకున్నారు.

ఆ దర్శకుని కలుద్దామని స్టూడియో గేట్ దగ్గరికి వెళ్ళారు ఫాల్కే గారు. అప్పటికే వయసు మళ్ళి, గడ్డం పెరిగి, కాకి దుస్తులు వేసుకొని కనిపించిన దాదా సాహెబ్ ఫాల్కే ని ఎవరో అనుకుని స్టూడియో గేట్ వాచ్ మన్ పోవయ్యా అంటూ నెడితే దూరంగా వెళ్లి పడ్డారు. అలా నెట్టబడిన వ్యక్తి దాదాసాహె ఫాల్కే అని తెలిసినా అది చూసిన సినిమా ఫైనాన్సియర్ ఒకరు మారు మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. సినిమా సేవలో పడి ఈ దేశానికి సినిమాలను అందించినందుకు గానూ దాదాసాహెబ్ ఫాల్కే గారికి చలనచిత్ర రంగంలో చేసిన సత్కారం అది. అవమాన భారంతో తిరిగి నాసిక్ చేరిన దాదా సాహెబ్ ఫాల్కే గారు సినిమాల గురించి మర్చిపోయే ప్రయత్నం చేశారు.

సినీ నిర్మాణంలో ఫాల్కే గారి కుటుంబం.

ఫాల్కే గారి భార్య సరస్వతి గారు భారతీయ తొలి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆమెనే తొలి భారతీయ సినిమా సాంకేతిక నిపుణులు. సరస్వతి గారు షూటింగ్ సమయంలో వెలుతురు కెమెరాపై పడకుండా బెడ్ షీట్‌ను అడ్డుగా పట్టుకుని ఉండేవారట. షూటింగ్‌కు కావలసినవన్నీ సమకూర్చేవారు. రాత్రి పూట క్యాండిల్ వెలుగులోనే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించేవారు. సినిమా బృందం 60-70 మందికి ఆమెనే వంట చేసి పెట్టేవారు. రాజా హరిశ్చంద్రలో హరిశ్చంద్రుని కుమారునిగా ఫాల్కే గారి కుమారుడు బాలచంద్ర నటించారు. తొలి భారతీయ బాలనటుడు అతనే. శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్‌లో బాల శ్రీకృష్ణునిగా మందాకిని నటించారు. ఆమె ఫాల్కే పెద్ద కూతురు. ఆమెనే తొలి భారతీయ బాలనటి.

మరణం.

బొంబాయిలో జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బహుమతి పొందిన దాదా సాహెబ్ ఫాల్కే గారు పేదరికంతోనే స్వగ్రామం చేరుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే గారి ఫోటో కూడా ఎవరి దగ్గర దొరక్క ఒకసారి ఒక పత్రిక వారు తనని వెతుక్కుంటూ నాసిక్ వెళ్లి, మీ ఫోటో ఒకటి ఇచ్చినా లేక తీసుకోనిచ్చినా మా పత్రిక ముఖచిత్రంగా వేస్తామని అడిగారు. అందుకు దాదాసాహెబ్ ఫాల్కే గారు “నేను జన్మనిచ్చిన చిత్ర పరిశ్రమ నన్ను మర్చిపోయింది. ఇప్పుడు నువ్వెందుకు గుర్తు చేయడం. ఆయినా మర్చిపోవడం లోక సహజం నువ్వు అదే చేయి” అన్నారు నిర్వేదంతో. ఫాల్కే గారు చివరి రోజుల్లో నిరుపేదగా తిని, తినక అనామకుడిగా జీవించారు. 90 సినిమాలు నిర్మించిన భారతీయ సినిమా పితామహులు “దాదా సాహెబ్ ఫాల్కే” గారు 16 ఫిబ్రవరి  1944 న కన్ను మూశారు. ఈ నాటికీ తన జీవన మూల్యాలు ఆదర్శంగా, స్ఫూర్తినిచ్చేవి గానే ఉన్నాయి. అతని పేరు మీద జాతీయ అవార్డుల సంరంభం ప్రతి యేటా జరుగుతున్నా, అతని జీవిత చరమాంకం ఎంతటి దైన్యావస్థలో గడిచిందో ఎవరూ తలచకపోవటం కడు శోచనీయం.

సశేషం.

పత్రికలో సినిమాకు సంబంధించిన వార్త చదివిన ఫాల్కే గారిని ఆ వార్త బాగా ఆలోచింపజేసింది. మన దేశంలో కూడా సినిమాను ఎందుకు తీయకూడదు అనే ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. తన వద్ద ఉన్న డబ్బు, మిత్రుల నుంచి తీసుకున్న అప్పు, జీవిత బీమా డబ్బు మొత్తం తీసుకొని సినిమా నిర్మాణానికి సంబంధించిన పరికరాలు కొనడానికి 1912లో ఇంగ్లాండ్ వెళ్లారు దాదా సాహెబ్ ఫాల్కే గారు. అయితే ఫాల్కే గారికి సినిమా వల్ల తాను చలన చిత్ర చరిత్రలో చరిత్ర సృష్టించబోతున్నానని తెలియదు. అదే సినిమా తన జీవితాన్ని పేదరికంలోకి నెట్టివేస్తుందనీ కూడా ఊహించి ఉండడు.

ఫాల్కే గారు బాగున్న రోజుల్లో ఫోర్డ్ కారును ఉపయోగించేవారు. 1920 ప్రాంతంలో ఆ కారులోనే షూటింగ్‌కు వెళ్లేవారు. తిరిగి సినిమా తీయాలని నిర్ణయించుకున్న కాలంలో ఆ కారుని అమ్మేశారు. ఆ కారు పెళ్ళిళ్ల ఊరేగింపునకు ఉపయోగించారు. తొలి భారతీయ సినిమా కెమెరాను ఫాల్కే జర్మనీ నుంచి తెప్పించారు. సినిమా నిర్మాణానికి ఎలాంటి ఏర్పాట్లు లేని కాలంలో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఫాల్కే తొలి సినిమా తీశారు. 

1938లో భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ ఫాల్కే గారు ఒక అనామకుడిగా కూర్చోవడం చూసిన శాంతారాం గారు తనని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి అప్పటికప్పుడు వేదికపై ఐదువేల రూపాయల పర్స్ అందజేశారు.

ఆ డబ్బుతో ఫాల్కే గారు తిరిగి సినిమా తీస్తాడేమోనని చాలా మంది భయపడ్డారు.

ఎందుకంటే సినిమా అంటే ఆ మహనీయునికి అంత పిచ్చి.

అందరి ప్రోద్భలంతో, ఆ డబ్బుతో నాసిక్‌లో ఒక ఇంటిని కొనిపించారు.

అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు.

ఫాల్కే గారు ఆ ఇంటిలోనే తుది శ్వాస విడిచారు.

Show More
Back to top button