Telugu News

బిల్ గేట్స్ తో ఏపీ సీఎం భేటీ..!

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరు సమావేశమయ్యారు. భేటీ అనంతరం బిల్ గేట్స్ తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై కూడా చర్చించాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 దార్శనికతను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నానని’ ఆయన పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

1995 నుంచి బిల్ గేట్స్ తో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, తమ భేటీ అలానే కొనసాగుతూ వస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని.. ఈ ఎంఓయూ ద్వారా ఏఐ ఆధారిత పాలన, ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో గణనీయమైన ఫలితాలను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోనే కాక దేశంలోనే అనుసరించదగ్గ ప్రభావం చూపుతుందని తెలిపారు.

ఆరోగ్య రంగంలో అధునాతన టెక్నాలజీ ద్వారా వైద్య పరీక్షలు, వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత సలహా వేదికలతోపాటు వ్యవసాయాన్ని, వనరుల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బిల్ గేట్స్ మాట్లాడుతూ.. డేటాను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పరంగా అగ్రభాగంలో నిలబెట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని ప్రశంసించారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు తక్కువ ఖర్చుతో టెక్నాలజీ వినియోగంతో రోగనిర్ధారణ పరీక్షలు, వైద్య పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు.

వైద్య, వ్యవసాయం, ప్రాథమిక విద్యలో ఎదురయ్యే సమస్యలకు ఏఐ, ఇతర సాంకేతిక పద్ధతుల ద్వారా పరిష్కారాలు చూపించనున్నట్లు తెలిపారు.

ఈ ఒప్పందం ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాక ఇతర రాష్ట్రాలకు సైతం ఒక ఉదాహరణగా నిలుస్తుందని, వారికి అవసరమైన నమూనాలను అందించేందుకు ఉపయోగపడుతుందని బిల్ గేట్స్ చెప్పారు.

Show More
Back to top button