GREAT PERSONALITIESTelugu News

పత్రికా రంగానికి మార్గదర్శకులు, పాత్రికేయులకు దిశా నిర్దేశకులు… నార్ల వెంకటేశ్వరరావు…

పలువిషయాలను త్రికరణశుద్దితో కల్మషం లేకుండా మనముందుంచేదే “పత్రిక”. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలన్నా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల నుంచి ప్రజలు రక్షణ పొందాలన్నా “పత్రికలు” అత్యంత ఆవకశ్యకం. పత్రికలే లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే లేదు. “అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరించినపుడు, దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రతిపక్షాల కన్నా పత్రికలే కీలకం”. “పాత్రికేయం అంటే ప్రజల పక్షాన నిలబడాలి కానీ, రాజకీయాల పక్షాలు వైపు కాదు”. “బతుకుదెరువు కోసం పత్రికా రంగంలోనికి రావద్దు. నిజాయితీగా, నిర్భీతిగా ఉండేవారే ఈ వృత్తిలోనికి రావాలి”. కానీ “దానికి భిన్నంగా నిజాలను కప్పిపుచ్చి యాజమాన్యాన్ని, రాజకీయ పక్షాలను, నాయకులను సంతృప్తిపరచడం కోసం చేపట్టే పాత్రికేయ వృత్తి తార్చుడు వృత్తి కన్నా హీనమైనది”.

అలాంటి పత్రికా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినవారు ప్రముఖ సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారు. తెలుగు పత్రిక రచనకు రూపుదిద్దిన శిల్పులు నార్ల వెంకటేశ్వరరావు గారు. పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొన్న కవి, రచయిత, సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు గారు. తెలుగు జాతిని కదిలించిన చేతనా పాళి తాను. గడుసుదనమే బాణిగా, వ్యంగ్య చమత్కారాలే పాళిగా, సూటిదనమే తన శైలిగా తెలుగు పత్రికా రంగాన్ని ఐదు దశాబ్దాలపాటు ఏలిన సంపాదక శిరోమణి నార్ల వెంకటేశ్వరరావు గారు.

1940వ దశకంలో జాతి పిత మహాత్మాగాంధీ గారి మాటకు తిరుగు లేదు. ఆయన బాటకు ఎదురు లేదు. అలాంటి సందర్భంలో గాంధీ గారి నిర్ణయాన్ని సైతం ప్రశ్నించిన నిర్భీతికలిగిన పాత్రికేయులు నార్ల. తెలుగు వారంటే చులకన భావమున్న చక్రవర్తుల రాజగోపాలాచారి గారిని 1946లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు గాంధీ గారు ప్రకటించారు. ఆ గాంధీ గారి నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే గాంధీ గారి నిర్ణయాన్ని, రాజాజీ గారి నియామకాన్ని వ్యతిరేకిస్తూ నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రశ్నించి సంచలనం కలిగించారు.

నార్ల వెంకటేశ్వరరావు గారు పాత్రికేయులు మాత్రమే కాదు. తాను సాహితీవేత్త, కవి, రచయిత, ఉద్యమకారులు, హేతువాది, మానవవాది. తాను అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు రాశారు. వివిధ దేశాల చరిత్రలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, విజ్ఞాన, నైతిక విలువలను సామాన్య ప్రజానీకానికి పరిచయం చేశారు. ఎడిటర్‌గా నార్ల వెంకటేశ్వరరావు గారు వ్రాసిన సంపాదకీయాలు ఎన్నో సంచలనాలను సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. నార్ల గారికి తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నవ్యతనూ, నాణ్యతనూ మేళవించి తెలుగు పత్రికారంగానికి తాను ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    నార్ల వెంకటేశ్వరరావు

ఇతర పేర్లు  :  వీ.ఆర్. నార్ల  

జననం    :     01 డిసెంబరు 1908    

స్వస్థలం   :    జబల్‌పూర్, మధ్య ప్రదేశ్

వృత్తి      :     పాత్రికేయుడు , ఆంధ్ర జ్యోతి సంపాదకుడు

పదవీ కాలం    :     రాజ్య సభ సభ్యులు (1958 – 1970)

తండ్రి    :     లక్ష్మణ రావు 

తల్లి     :     మహాలక్ష్మి

జీవిత భాగస్వామి :  సులోచనా దేవి

పిల్లలు      :   ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు

మరణ కారణం   :    గుండెపోటు

మరణం   :   16 ఫిబ్రవరి 1985

నేపథ్యం…

నార్ల వెంకటేశ్వరరావు గారు 01 డిసెంబరు 1908 నాడు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించారు. నార్ల వంశీకుల స్వగ్రామం కృష్ణా జిల్లాలోని కాటూరు. వారి తాత ముత్తాతలు సంపన్న కుటుంబానికి చెందినవారు. వారు సైనిక సామాగ్రిని చేరవేసే గుత్తేదార్లు (కాంట్రాక్టర్లు) గా పనిచేస్తుండేవారు. నార్ల ముత్తాతలలో ఒకరైన రమణయ్య మారాఠా పేష్వాల వద్ద యుద్ధ సామాగ్రి చేరవేసే కాంట్రాక్టర్లుగా పనిచేసేవారు. రమణయ్య కుమారుడు మాధవరావు మధ్యప్రదేశ్ లోని ఇండోర్, జబల్ పూర్ లలో పేరుమోసిన గుత్తేదారు (కాంట్రాక్టరు). సాగరులో స్థిరపడ్డారు, విశేషంగా గడించారు,  జమీందారులయ్యారు.

మాధవరావు వారసులు వెంకయ్య, హనుమయ్య. వెంకయ్య కుమారుడు లక్ష్మణరావు. లక్ష్మణరావు కు ముగ్గురు కుమారులు. పెద్దవారు నార్ల వెంకటేశ్వర రావు. నార్ల తాతారావు, గౌరీ శంకర్రావు వెంకటేశ్వర రావు సోదరులు. తాత ముత్తాతలు సంపాదనపరులైనా తండ్రులు ఖర్చు పెట్టడం తప్ప గడించడం తెలియనివారు. ఆ కారణంగా ఆస్తి తరిగి చిక్కుల్లో పడ్డారు. ఆ స్థితిలో లక్ష్మణరావు, భార్య లక్ష్మమ్మను పిల్లలను తీసుకొని 1914లో కృష్ణా జిల్లా కౌతరం వచ్చారు. అది లక్ష్మణరావు అత్తవారి ఊరు. ఇల్లు, రెండు ఎకరాల పొలం కొనుక్కొని స్థిరపడ్డారు. ఎంత చితికి పోయినా కౌతరం చేరే నాటికి వారి వద్ద రెండువందల సవరనుల బంగారం, పది పదిహేను వేల రూపాయలు డబ్బు ఉంది.

విద్యాభ్యాసం…

నార్ల వెంకటేశ్వరరావు గారి విద్యాభ్యాసం కౌతరం లోని బోర్డు ఎలిమెంటరీ పాఠశాలలో ప్రారంభమైంది. ప్రాథమిక విద్య అనంతరం తాను అదే గ్రామంలోని ఆంధ్ర లక్ష్మీ ఎడ్వర్డ్ మెమోరియల్ పాఠశాలలో సెకండ్ ఫారం వరకు చదివారు. తరువాత గుడివాడ పాఠశాలలో చేరి ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. గ్రామస్తులు నిరుత్సాహపరిచినా వెనకాడని లక్ష్మమ్మ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని తీర్మానించుకుంది. ఉన్న వస్తువులు ఒక్కొక్కటి అమ్ముతూ పిల్లలను చదివించింది. వీరి అవసరాలు తెలిసి మధ్యప్రదేశ్ లోని కట్నీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పెద్ద తండ్రి వెంకటరామన్న ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పన్నెండు సంవత్సరాల వరకు నెలనెలా గడువు మీరకుండా మనియార్డర్లు పంపారు. అలా అన్నదమ్ముల ముగ్గురు చదువులు కొనసాగాయి.

నార్ల గారు 1927లో గుంటూరు హిందూ కాలేజీ పాఠశాలలో ఇంగ్లీషులో ఒక్క మార్కు తక్కువ వచ్చినందున యస్.యస్.యల్.సి పరీక్షలు తప్పారు. మరుసటి సంవత్సరం మళ్ళీ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు అయ్యారు. నార్ల మేనమామలలో ఒకరైన కొల్లి సత్యనారాయణ చౌదరి ఆ రోజుల్లో బ్రహ్మసమాజంలో పనిచేస్తూ ఉండేవారు. కనుక నార్లపై చిన్న వయస్సులోనే సమాజం పై ప్రభావం పడింది. దీనికి తోడు ఆంధ్ర లక్ష్మీ ఎడ్వర్డ్ మెమోరియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన చెరుకువాడ లక్ష్మీనరసింహం పంతులు గారు ఆ రోజుల్లో బ్రహ్మసమాజంలో చేస్తున్న ఉపన్యాసాలు కూడా నార్లపై ప్రభావం చూపాయి

ఆ ప్రభావం వల్ల నార్లలో ప్రగతివాదం, హేతువాదం, విగ్రహారాధన పట్ల విముఖత ఏర్పడ్డాయి. తర్వాత కాకినాడలో పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ ప్రధానాచార్యులు వేమూరి రామకృష్ణారావు, ఆంగ్ల ఉపన్యాసకులు పెద్దాడ రామస్వామి గార్ల భావాలు కూడా నార్లపై గట్టి ముద్రవేశాయి. దీనికి తోడు విద్యార్థిగా ఉన్నప్పుడే నార్ల మాడ్రన్ రివ్యూ, ఇండియన్ రివ్యూ లాంటి పత్రికలను చదివేవారు. అన్నీ కలిసి సమాజం బాగు కోసం పని చేయాలన్న తపలా తనలో రగిలించాయి. అప్పుడు తాను “సోదర సమితి” అనే పేరుతో యువజన సమాఖ్యను ఏర్పాటు చేశారు. దాని తరఫున లిఖిత పత్రికను కూడా ప్రచురించారు.

వ్యక్తిగత జీవితం…

నార్ల వెంకటేశ్వరరావు గారికి సులోచనా దేవి తో 1938 వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి శారద, చంద్రకళ, మీనాక్షీ, ఉమాదేవి, రమాదేవి అనే ఐదుగురు కుమార్తెలు, మోహన్ దాస్, దుర్గా దాస్, లక్ష్మణ దాస్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి ఎనిమిది మంది సంతానంలో పెద్ద కుమార్తె శారదకు కొల్లి గంగాధరరావుతో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ గుంటూరులో వైద్యాధికారులు. మూడో కూతురు మీనాక్షికి మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శరద్ తో వివాహం జరిగింది. ఆ రోజుల్లో రెండు వేర్వేరు భాషలకు చెందిన వ్యక్తుల మధ్య వివాహాలు, అంతర్భాషా వివాహాలు చాలా సాధారణం కావడం పట్ల నార్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు అమెరికాలోని ఫీనిక్స్‌లో స్థిరపడ్డారు. రెండవ, నాల్గవ మరియు ఐదవ కుమార్తెలు చంద్రకళ, ఉమ మరియు రమ లు వృత్తిరీత్యా వైద్యులు. వీరు కూడా వైద్యులను వివాహం చేసుకుని  అమెరికాలో నివసిస్తున్నారు.

నార్ల వెంకటేశ్వరరావు గారు తన భార్య తప్ప మిగతా కుటుంబం అంతా డాక్టర్లే ​​అని హేళన చేసేవారు. వాస్తవానికి, తాను అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. కానీ తాను తన పేరుకు ముందు ఎప్పుడూ డాక్టరు డిగ్రీని వ్రాసుకోలేదు. నార్లా వారి పెద్ద కుమారుడు మోహన్ దాస్ న్యూయార్క్ నగరంలో సెల్ బయాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండవ కుమారుడు దుర్గాదాస్ మరియు అతని తమ్ముడు లక్ష్మణ్ దాస్ లు కూడా వైద్యులు. వారు కూడా అమెరికాలో నివసిస్తున్నారు. నార్ల వెంకటేశ్వరరావు గారిని తన భార్యతో కలిసి అమెరికాకు రావలసిందిగా తమ కుమారులు కోరారు. కానీ నార్ల గారికి ఇష్టం లేదు. తాను భారతదేశంలో నివసించడానికే ఇష్టపడేవారు. ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణులు నార్ల తాతా రావు గారు వీరి సోదరుడే. నార్ల గారి పెద్ద కుమార్తె కొల్లి శారద గారు గుంటూరు నగర పాలక సంస్థకు మేయరుగా పనిచేశారు.

పత్రికా రంగం…

నార్ల వెంకటేశ్వరరావు గారు ఇంటర్మీడియట్ రెండు సార్లు తప్పారు. దాంతో తెలిసినవారు నీవు ఏదైనా ఉద్యోగం చూసుకుంటే మంచిదని నార్ల గారిని ఒత్తిడి చేశారు. గుంటూరు తాలూకా బోర్డు ప్రెసిడెంట్ పురుషాని ప్రకాశరావు గారు తనకు తెలిసిన వారే. కాబట్టి తనను ఉద్యోగం అడుగుదామని నార్ల గారు బయలుదేరి, మంగళగిరి లో బస్సు దిగి నాలుగు మైళ్ళు నడిచి పురుషాని ప్రకాశరావు గారి ఊరికి వెళ్లారు. కానీ శిక్షణ లేని వారికి ఉద్యోగం లేదని ఆయన ఖండితంగా చెప్పారు.

1928లో మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురిస్తుండే “కాంగ్రెస్” అనే పత్రికకు నార్ల గారు ఒక ఉత్తరం వ్రాయగా దానిని ఆ పత్రికలో ప్రచురించారు. అదే నార్ల వారి తొలి పత్రికా రచన. “ఉపేంద్ర”, “రవీంద్ర” అనే పేర్లతోనూ నార్ల వారు అనేక వ్యాసాలు వ్రాశారు. “స్వరాజ్య”, “జనవాణి”, “ప్రజామిత్ర” పత్రికలలో తాను మెరుపులు మెరిపించారు. 1938 వ సంవత్సరంలో “ఆంధ్రప్రభ” లో న్యూస్ ఎడిటర్ గా చేరిన నార్ల వారు 1942 లో ఎడిటర్ గా భాద్యతలు చేపట్టి 1959 వరకు పనిచేసారు.

“ఆంధ్రప్రభ”, “ఆంధ్రజ్యోతి” పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు. సంపాదకుడిగా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల వారు విశ్వసించారు. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో వ్రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు నార్ల వారు. తాను తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు.

సంపాదకీయాలు…

ఎడిటర్‌గా నార్ల గారు వ్రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నవ్యతనూ, నాణ్యతనూ మేళవించి నార్ల వెంకటేశ్వరరావు గారు తెలుగు పత్రికా రంగానికి  ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. నార్ల వారు పాత్రికేయులు మాత్రమే కాదు సాహితీవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు, హేతువాది, మానవవాది. అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు రాశారు. వివిధ దేశాల చరిత్రలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, విజ్ఞాన, నైతిక విలువలను సామాన్య ప్రజానీకానికి పరిచయం చేశారు.

ఆయనకు తెలుగుపైనే కాదు ఆంగ్లంపైన కూడా మంచి పట్టు ఉండేది. ఆంగ్లంలో కూడా అనేక రచనలు చేసి పలువురు ప్రశంసలు పొందారు. మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు నార్ల గారు వ్రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి కూడా నార్ల వారికి “సాష్టాంగ నమస్కారం” అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను వ్రాశారు. నైజాం ప్రభుత్వం “ఆంధ్రప్రభ” పత్రికను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం చేసిన యోధులు నార్ల వెంకటేశ్వరరావు గారు. జైలులో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు తమకు ఇస్తున్న “ఆంధ్రప్రభ” దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని నార్ల గారికి ఉత్తరం వ్రాశారు.

తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయ ఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా ఒక రోజు పత్రిక మొదటి పేజీ నిండా నల్లగా తారుపూసి విడుదలచేసారు. అది పత్రికా ప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం వారు సెన్సారు చెయ్యడం మానుకున్నారు. త్రిపురనేని గోపీచంద్ గారి మానవ వాదం నుండి దూరమై, వారితో అభిప్రాయ భేదాలు ఉన్నా గోపీచంద్ గారు చనిపోయినప్పుడు “ఎంత గుండె గలవాడికీ గుండె పోటు” అంటూ గొప్ప సంపాదకీయం వ్రాశారు. నార్ల గారు ఏ రాజకీయ వాదినీ విమర్శించకుండా వదలలేదు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి.రంగా లాంటి వారు నార్ల వారి విమర్శకు గురైన వారే.

రాజగోపాలాచారి గారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్మా గాంధీ గారు నిర్ణయించినప్పుడు దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదక శస్త్రాలను ప్రయోగించారు. “నచ్చని నాయకుడిని ఎన్నుకోవాలని  చెప్పే హక్కు గాంధీజీకి  సహా ఎవరికీ లేదు” అని తెగేసి చెప్పారు. ఇందిరాగాంధి నిరంకుశ పాలనను, కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు నార్ల గారు. ఆ విషయంలో జయప్రకాశ్ నారాయణ గారిని మెచ్చుకునేవారు. నీళ్ళు నమలడం తనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం నార్ల వారి ప్రత్యేకత. “బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా” అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు.

ఆంధ్ర జ్యోతి...

ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం ఆంధ్రజ్యోతి పత్రిక ఆవిర్భావం. నార్ల వెంకటేశ్వరరావు గారు “ఆంధ్రప్రభ” నుంచి వైదొలిగి ఖాళీగా ఉన్నారు. దాంతో కె.యల్.ఎన్. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొందరు ముఖ్యులు పూనుకొని ఆంధ్రజ్యోతి పేరుతో ఒక దినపత్రికను స్థాపించారు. ఈ పత్రికను 01 జులై 1960 నాడు విజయవాడలో ప్రారంభించారు. “పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో”.. అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షులు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆంధ్రజ్యోతి పత్రికను పైకి తీసుకురావడానికి నార్ల గారు అనేక కొత్త ఒరవడులు ప్రవేశపెట్టారు. సంపాదకీయాలను టెలిప్రింటర్ ద్వారా పంపించేవారు.

తాపీ ధర్మారావు గారు “కాగడా”, “జనవాణి” తో ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల వారు “ఆంధ్ర ప్రభ”, “ఆంధ్రజ్యోతి” ల ద్వారా సమర్థవంతంగా కొనసాగించారు. “తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు వ్రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం” అని ఆయన తోటి పాత్రికేయులకు ఉద్బోధించారు. నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకుడు అనే మాటను  ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అని మాత్రమే వ్రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు.

“ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా” అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధులు నార్ల వెంకటేశ్వరరావు గారు. ముఖ్యంగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల వారు. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. నండూరి రామమోహనరావు గారిని గుమస్తా సంపాదకుడు అని పిలిచేవాడు.

“ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడు” అని నిష్కర్షగా చెప్పేవారు నార్ల వారు. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే “కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత ‘కారం’ ఉందో తెలియజెప్పినవాడు” నార్ల వారు. “విరామమెరుగని రాక్షసుడు నార్ల” అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు గారు అభివర్ణించారు.

నవయుగాల బాట – నార్ల మాట! 

1954 వ సంవత్సరంలో ఎం.ఎన్. రాయ్ గారు చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల వారు సంపాదకీయాలు వ్రాసినారు. కానీ నార్ల వెంకటేశ్వరరావు గారు వ్రాయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తారరాలింది”, “వటవృక్షం కూలింది” అని వ్రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవుల గోపాలకృష్ణ మూర్తి గారు, గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా విమర్శించారు. దాంతో విస్తుపోయిన నార్ల గారు వెంటనే గుత్తికొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అప్పటి నుండి నార్ల గారు ఎం.ఎన్.రాయ్ అభిమానిగా, క్రమేణా హేతువాది గా, తరువాత మానవవాది గా జీవించారు. నవయుగాల బాట నార్ల మాట లో వారి హేతువాద భావజాలం మనకు కనపడుతుంది.

ఏల ఏప్పు డెవ్వడిత్యాది ప్రశ్నలే

పశువు నుంచి వెరుపరిచె నరుని

ప్రశ్నతోనే నరుడు పరిణామమొందెరా

నవయుగాల బాట – నార్ల మాట!

ప్రకృతినే జయించి, పరమాణువును చీల్చి

శాస్త్రవేత్త కూర్చే సకల సిరులు,

రాజకీయ వేత్త రణమును కూర్చెరా!

నవయుగాల బాట – నార్ల మాట !

నార్ల వారి మాటలు…

★ యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు.

★ ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు.

★ సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.

★ బడు వాడేవాడు బడుద్ధాయి.

★ నార్ల మాట నవయుగాల బాట

★ ఆశలేని ప్రాణి అణగారిపోతుంది. ఆశ చంపుకోవడం ఆత్మహత్య.

★ ఉక్కు మనిషి ఎవడో, ఊకమూట  ఎవడో కష్ట కాలమందే స్పష్టపడును. ఉత్త వేళలందు ఉత్తములందురు.

★ అవిటివానికేల అభినయశాస్త్రం? చెవిటి వానికేల  కవులగోష్టి?

★ ప్రశ్న ప్రగతికి మూలం. ప్రశ్నలేని  జగత్తు ప్రశ్నార్ధకం.

★ అస్పృశ్యులని  మనం అందరిని దూరం నెడితే మనల్ని వెనక్కి నెట్టి ప్రపంచం ముందుకు పోతుంది.

నార్ల వారి రచనలు…

నార్ల వారి రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి.

★ సీతజోశ్యం

★ జాబాలి

★ నరకంలో హరిశ్చంద్రుడు

★ ద్రౌపది

★ హిరణ్యకశ్యపవధ

★ నవయుగాలబాట నార్ల మాట

★ కొత్త గడ్డ (నాటికలు)

పిచ్చాపాటి, మాటా మంతి, కొత్తా పాత

★ మూడు దశాబ్దాలు (30 ఏళ్ళ సంపాదకీయాలు)

★ వేమన పరిశోధక గ్రంధం

నార్ల వారు వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు వ్రాసారు. నార్ల వారి కుటుంబ సభ్యులు ఆయన రచనలు అన్నీ కూర్చి “నార్ల రచనలు” పేరిట 12 భాగాలుగా వెలువరించారు.

★ నార్ల రచనలు 1 – దేశ చరిత్రలు

★ నార్ల రచనలు 2 – సాంఘిక నాటికలు, వ్యాసాలు

★ నార్ల రచనలు 3 – పౌరాణిక నాటికలు

★ నార్ల రచనలు 4 – సాహిత్య రచనలు

★ నార్ల రచనలు 5 – సంస్కృతి, సాహిత్యం, మతం

★ నార్ల రచనలు 6 – వర్తమాన సంఘటనలు

★ నార్ల రచనలు 7 – జీవిత చిత్రణలు.

పురస్కారాలు…

★ నార్ల వెంకటేశ్వరరావు గారికి 1981లో తన “సీతజోస్యం” నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

★ నార్ల వెంకటేశ్వరరావు గారిని 1983 లో ఎన్.టి. రామారావు గారు సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు.

★ “కళాప్రపూర్ణ”, “పండిత” కొత్త సత్యనారాయణ చౌదరి గారు తన రచన “రామాయణ రహస్యాలు” నార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు.

నిష్క్రమణం…

ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కాలాన్ని ప్రభావితం చేసిన వారందరూ యుగకర్తలే. తెలుగు వార్తాపత్రికా ప్రగతి ప్రయాణంలో నార్లవారిది ఒక శకం. “పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో” అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు గారు. సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి అనేవారు నార్ల వెంకటేశ్వరరావు గారు. బడు వాడేవాడు బడుద్ధాయి అంటూ పత్రిక భాష ఎలా ఉండాలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నార్ల గారు తెలుగు సాహిత్య, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు.

“ఎడిటరయిన వాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా”, “నిజము కప్పిపుచ్చి నీతిని వీడనాడి స్వామి సేవ చేయు జర్నలిస్టు, తార్చువాని కంటే తక్కువ వాడురా” అంటూ విలువలు వీడవలదు అని హితవు పలికారు. నార్ల వారు ఎప్పుడూ ఏదో ఒక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు ఉండేది. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా తాగే సిగరెట్లు అప్పటితో మానేశారు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు. అలా గుండెపోటు తోనే నిష్క్రమించిన నార్ల వెంకటేశ్వరరావు గారు 16 ఫిబ్రవరి 1985 నాడు సుదీర్ఘ నిద్రలోకి జారుకున్నారు. తాను ఈ లోకాన్ని విడిచి అప్పుడే మూడున్నర దశాబ్దాలు దాటిపోయింది. తాను వెళ్లిపోయినా, తాను వ్రాసిన అక్షరాలు మనల్ని ఎన్నటికీ వీడవు. ఆ భావాలు మనలో చాలామందిని వెంటాడుతూనే ఉంటాయి.

Show More
Back to top button