సంగీత ధ్యానంలో పడి ముప్పైయేండ్లు భార్యనే మర్చిపోయిన.. విశ్వపతి శాస్త్రి…

ఆదిలో భరతదేశంలో కళల పరిస్థితి… భారతదేశ చరిత్రను తీసుకుంటే ఆది నుండి దేశంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా కళల ఆదరణకు కొదువలేదు. దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు, రాజ్యలను పరిపాలించే రాజులు, ప్రభువులు తాము ఒకరికంటే ఇంకొకరు గొప్ప గొప్ప విద్వాంసులను తమ కొలువులో నిలుపుకోవాలనే స్పర్థలతో విద్వాంసులను ప్రత్యేకంగా పిలిపించి వారిని ఆదరించేవారు. అంతేకాకుండా చక్రవర్తులు, ప్రభువులు, రాజులు తామే స్వయంగా సంగీతాభ్యాసం చేయడం, సంగీత రచనలు చేయడం అవలంబించేవారు.
ఆవిధంగా వేల సంవత్సరాల పూర్వం నుండి మొదలైన కళారాధన మొన్న మొన్నటి సంస్థానాధిపతుల వరకు నిరంతర నదీ ప్రవాహం లాగా కొనసాగుతూనే ఉంది. క్రీ.శ. ఆరో శతాబ్దానికి చెందిన పల్లవ రాజు మహేంద్రవర్మ గొప్ప వైణికుడు. మహేంద్రవర్మ ఆంధ్ర ప్రాంతాన్ని విడిచి వెళ్లేటప్పుడు కొంతమంది ఆంధ్రగాయక విద్వాంసులను కొందరిని దక్షిణాదికి తీసుకొని వెళ్ళాడు. మహేంద్రవర్మ సంగీత గురువు అయిన “గాయనాచార్య రుద్రాచార్యుడు” సంకీర్ణజాతి తాళ భేదాలను కనిపెట్టాడు. పుదుక్కోటలోని “కుడిమియమలై” లో ఉన్న శిఖరనాథ స్వామి దేవాలయం కొండ చరియ మీద చతుష్ప్రహార స్వర రాగాన్ని చెక్కించాడు.
సంగీత కళలకు పెద్ద పీఠ వేసిన శ్రీకృష్ణదేవరాయలు..
15వ శతాబ్దంలో మహావైణిక శిఖామణి శ్రీకృష్ణదేవరాయలు సంగీత కళలకు పెద్ద పీఠాన్ని వేశారు. నాట్యమండపంలో సప్త స్వరాల స్తంభాన్ని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల వైణిక గురువు రాఘవేంద్రాచార్యులు. కర్ణాటక రాగాలను విభజించి క్రమపద్ధతిలో పెట్టిన బండారు లక్ష్మీనారాయణ శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన విద్వాంసుడే. “సంగీత సూర్యోదయం” అనే లక్ష్మణ గ్రంథాన్ని రచించి ఈయన రాయలవారిచే ఘనంగా సన్మానితుడయ్యాడు. 1550 – 65 ప్రాంతంలో అళియరామరాయల మంత్రి రామామాత్యుడు “స్వరమేళ కళానిధి” గ్రంథాన్ని వ్రాశాడు.
క్రీ.శ. 1565 లో జరిగిన తల్లి కోట లేదా రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం నేలమట్టం అయ్యింది. హంపి తీరంలో సంగీత కళలకు కళే తప్పిపోయింది. విజయనగర సామ్రాజ్యం వదిలి సదాశివరాయలు,తిరుమల రాయలు చంద్రగిరికి వెళ్లిపోయారు. అప్పటివరకు విజయనగర ప్రభువుల ఆధిపత్యంతో ప్రతినిధులుగా, దండనాధులుగా ఉన్న నాయంకరులు తాము పాలించు ప్రాంతాలకు తామే అధిపతులుగా, స్వతంత్రులై పరిపాలించడం మొదలుపెట్టారు. విజయనగ రాజులకు దాసోహం అవ్వడం మానేశారు. అలాంటి వారిలో తంజావూరు, మధుర, చెంజీ, మైసూరు పాలకులు ఉన్నారు. దక్షిణాన వెలిసిన తంజావూరు మొదలైన నగరాధిపతులు నిక్షితంగా పరిపాలిస్తూ భోగభాగ్యాలతో సంగీతాది కళలను ఆదరిస్తూ శ్రీకృష్ణదేవరాయలకు వారసులై నిలిచారు.
ప్రాంతీయ బేధాలు చూడని మైసూరు మహారాజా..
త్రివేంద్రం రాజు స్వాతి తిరునాళ్ గొప్ప నాయకుడే కాదు, మంచి మంచి కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు కూడా. ఈయన వయోలిన్ వాయిద్యకారుడు వడివేలును పోషించాడు. వెన్నెల రాత్రుల్లో సముద్ర తీరాన వడివేలు వయోలిన్, మంత్రి సుబ్బారావు మృదంగం వాయిస్తుంటే స్వాతి తిరునాళ్ మహారాజు పాటలు పాడేవారట. బరోడా చక్రవర్తి ఎంతో మంది సంగీత విద్వాంసులను సన్మానించాడు. వీణ శేషన్నను రాజవీధుల్లో పల్లకిలో ఊరేగించి సత్కరించాడు. ఎట్టియాపురం ప్రభువు బాలస్వామి దీక్షితులు అనే విద్వాంసుడిని పోషించారు. కొత్తకోట సంస్థానంలో వీణ పేరుమాళ్ళయ్య ఒకే రాగానే 21 రోజులు వీణ మీద వాయించగా ప్రభువు పదివేల రూపాయలు ఇచ్చి సన్మానించాడు. అలాగే మైసూరు మహారాజా పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ సుబ్రహ్మణ్య అయ్యర్ కు బంగారు తోడాలిచ్చి సత్కరించాడు. మైసూరు మహారాజు ప్రాంతీయ భేదం లేకుండా ఉత్తర, తూర్పు, దక్షిణ విద్వాంసులందరిని ఆదరించి సన్మానించి, తన కళాభిమానాన్ని నిరూపించుకున్నారు. ఈ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడే విశ్వపతి శాస్త్రి. సంగీత ధ్యానంలో పడి సతినే మర్చిపోయారు.
పదేండ్లకే “విశ్వపతి శాస్త్రి” బొబ్బిలి నుండి తమిళనాడుకు..
విశ్వపతి శాస్త్రికి పది సంవత్సరాలు. పగలంతా సంగీత సాధన చేసి, రాత్రి ఒళ్లెరగకుండా పడుకున్నాడు. నిద్దురలో తనకు ఒక కల వచ్చింది. ఆ మనోహరమైన కలలో తంబూర నాదం. తెల్లటి పూర్ణచంద్రుడు మెల్లగా జలజలా రాలుస్తున్న వెన్నెల. తెల్లగా కుప్ప పోసినట్టు తెల్లటి కర్పూరం. తెల్లతెల్లగా హంసల గుంపు ఆ కొస నుంచి ఈ కొస వరకు. గుబాళించే తెల్లని మల్లెదండలు, తెల్లతెల్లగా చల్లచల్లగా కురుస్తున్న మంచు. చెలియలికట్ట, కట్టంతా సముద్రపు నురగతో తెల్లగా, ఉన్నట్టుంది రజతాచలం. పడుకున్న విశ్వపతి పెదాలు చల్లని, తెల్లని శారదా దేవి తల్లిని స్తుతిస్తున్నాయి. శారద, నీరదేందు, ఘనసార, పటీర, మరాల, మల్లికాహర, తుషార, ఫేన, రజతాచల కాశ ఫణీశ, కుందమందార, సుధాపయోది సితతామర సామరవాహినీ. తెల్లవారింది. విశ్వపతి శాస్త్రి లేచాడు. అమ్మ కనబడింది కలలో. తన కళ్ళ నుండి కన్నీళ్లు ధారలు కట్టేస్తున్నాయి. అమ్మ ఆశీర్వాదం అయ్యింది. అమ్మ ఆజ్ఞ కూడా అయ్యింది. అంతే పదేండ్ల విశ్వపతి శాస్త్రి చెప్పాపెట్టకుండా బొబ్బిలి నుండి తమిళ దేశం వైపు నడక సాగించాడు. తమిళనాడుకు చెందిన తంజావూరు జిల్లా తిరువయ్యారులో ఉన్న పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గర శిష్యరికంలో చేరారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ పరిచయం..
ప్రముఖ శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుడు పట్నం సుబ్రమణ్య అయ్యర్ తమిళనాడుకు చెందిన తంజావూరు జిల్లా తిరువయ్యారులో జన్మించారు. వీరి కుటుంబానికి గొప్ప సంగీత నేపథ్యం ఉంది. పట్నం సుబ్రమణ్య అయ్యర్ తండ్రి భారతం వైద్యనాథ అయ్యర్. ఆయన సంగీతం మరియు శాస్త్రము రెండిటిలో ఉద్దండులు. సుబ్రమణ్య అయ్యర్ పితామహులు పంచానంద శాస్త్రి తంజావూరు సెర్ఫోజీ మహారాజా ఆస్థానంలో ఆస్థాన సంగీతకారులు. సుబ్రమణ్య అయ్యరు తన సంగీత విద్యాభ్యాసాన్ని మొదటగా తన మామయ్య మేలత్తూర్ గణపతి శాస్త్రి వద్ద నేర్చుకున్నారు. ఆ తరువాత మనంబుచవాది వేంకటసుబ్బయ్యర్ వద్ద నేర్చుకున్నారు. సుబ్రమణ్య అయ్యర్ చాలా యేళ్ళుగా చెన్నపట్నం (చెన్నై) లోనే నివాసం ఉన్నారు. అందువలన ఆయన ఇంటిపేరు కూడా చెన్నపట్నంగా స్థిర పడిపోయి, ఆయన పట్నం సుబ్రమణ్య అయ్యర్ గానే పిలవబడుతున్నారు.
24 గంటలు బేగడ రాగాన్ని ఆలపించిన “అయ్యర్”…
1815 లో జన్మించిన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ త్యాగరాజ స్వామికి ప్రియశిష్యులు. తంజావూర్ ఆస్థాన విద్వాంసులుగా ఉన్న సుబ్రహ్మణ్యం అయ్యర్ తాత పంచనాథ శాస్త్రి వంశపారపర్యంగా ఉన్న సంగీతాన్ని ఉగ్గుపాలతో రంగరించి, నిరంతరం సాధన చేస్తుండేవారు. అదే సుబ్రహ్మణ్యం అయ్యర్ కు అలవాటు అయ్యింది. ఈయన కూడా నిరంతరం సాధన సాధన సాధన, ఒకటే రాక్షస సాధన. “బేగడ” అనే ఒకే ఒక్క రాగాన్ని ఇరవై నాలుగు గంటలు (అంటే ఒక రోజంతా) పాడి మైసూరు మహారాజా వారి సభను దద్దరిల్లిపోయేలా చేసి, రాజు గారి వద్ద నుండి సన్మానాలు కూడా పొందారు. అందువలననే ఈయనని “బేగడ సుబ్రహ్మణ్యం అయ్యార్” అని కూడా పిలుస్తారు. ఉదయాన్నే లేచి ఆయన చేసే రాక్షస సాధన వలన, తన గొంతులోని స్వరమాధుర్యం పెరిగి సుబ్రహ్మణ్యం అయ్యర్ అతి మనోహరంగా పాడేవారట.
అయ్యర్ వద్ద “విశ్వపతి శాస్త్రి” శిష్యరికం…
సుబ్రహ్మణ్యం అయ్యర్
స్వరమాధుర్యానికి ఎంతో మంది మంది ముగ్దులయ్యేవారు. ఎంతో మంది రాజులు, జమీందారులు ఆయనను ప్రత్యేకంగా తమతమ ఆస్థానాలకు పిలిచిపించుకుని కచేరీలు చేయించుకుని మరీ సన్మానాలు చేసేవారట. సుబ్రహ్మణ్యం అయ్యర్ ఎన్నో వందల కీర్తనలు, వర్ణాలను వ్రాశారు. అదేవిధంగా ఆయన వ్రాసిన ఎన్నో కీర్తనలు చాలా ప్రసిద్ధి పొందాయి కూడా . ఈయన “వెంకటేశ” ముద్ర, “పరి దానమిచ్చితే పాలింతువేమో” అనే బిలహరి రాగ కీర్తనలు నేటికి కూడా సుప్రసిద్ధం. అలాగే తోడిరాగంలో “ఏల నాపై ఇంత చలము” అనే వర్ణం కూడా ప్రసిద్దమే. సుబ్రహ్మణ్యం అయ్యర్ త్యాగరాజ స్వామి వారి ప్రియ శిష్యుడు అవ్వడం వలన, ఈయన రచనలు కూడా స్వామివారి రచనలు పోలి ఉండేవి. ఇలాంటి మహానుభావుడు దగ్గరికి వచ్చి చేరాడు “విశ్వపతి శాస్త్రి”.
విశ్వపతి శాస్త్రి ధ్యాస, శ్వాస సంగీతమే…
తన దగ్గర శిష్యరికంలో చేరిన పదేండ్ల వయసున్న “విశ్వపతి శాస్త్రి” ని చూస్తున్న పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కి సాక్షాత్తు బాల గంధర్వుడు, ఆదిశంకరుడు, బాలసుబ్రమణ్యుడు గుర్తుకొస్తున్నారు. విశ్వపతి శాస్త్రి పట్టుదలకు సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆశ్చర్యపోయారు, ముచ్చటపడ్డారు కూడా. సంగీతం కోసం దేశం కాని దేశం నుంచి వచ్చిన విశ్వపతి శాస్త్రి ధైర్యానికి ముగ్దుడైన సుబ్రహ్మణ్య అయ్యర్ “ఎంత దూరం నుండి ఇంత దూరం వచ్చావురా” అని శాస్త్రి తల మీద చేయి వేసి ఆప్యాయంగా ఆశీర్వదించారు. పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కి ప్రియ శిష్యుడైపోయారు. విశ్వపతి శాస్త్రి సాధన మొదలుపెట్టారు. బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నారు, గొంతు దాకా నీళ్లలో మునిగి స్వరాలు సాధన చేస్తున్నారు.
వేళకు ఇంత భోజనం చేస్తున్నారు, మళ్ళీ సాధన చేస్తూనే ఉన్నారు. దానిని సాధన అనడం కంటే తపస్సు అనవచ్చు. ఆ తపస్సులో స్వరాలు కట్టలు కట్టి అట్టలు కట్టి, పుట్టలు కట్టాయి. ఆ పుట్టలో నుండి నాదయోగి సంగీతమే ఆహారం, సంగీతమే స్నానం, సంగీతమే ధ్యాస, సంగీతమే శ్వాస. విశ్వపతి శాస్త్రి నరాలు మీటితే నాదం పలుకుతుంది. రోమ రోమం రామ నామం అన్నట్టు సంగీతం విశ్వపతి శాస్త్రి ఆస్తి గతం అయిపోయింది. తనను చూసి తోటి విద్యార్థులు ముందుగా ఈర్ష్యపడ్డారు. గురువేమో ముచ్చట పడ్డారు. శిష్యులు పిచ్చెక్కిందనుకున్నారు. విశ్వపతి శాస్త్రి దారిలో పడ్డాడు అని గురువు అనుకున్నారు.
విద్యార్థులేమో వీడి వల్ల లాభం లేదనుకున్నారు, కానీ గురువు వీడివల్లే ఎంతో ఉపయోగం ఉందనుకున్నారు. తోటి విద్యార్థులు మన దరిద్రం వదిలిపోయిందనుకున్నారు. గురువు మాత్రం “సంగీతలక్ష్మి” వరించింది అనుకున్నారు. విశ్వపతి శాస్త్రి “గాన సరస్వతి” సంరక్షణలో ఎదుగుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. విశ్వపతి శాస్త్రి తన బాల్యాన్ని సంగీతానికి ధారపోశారు. ఆయన యవ్వనాన్ని కూడా సంగీతానికి హారతిగా ఇచ్చాడు. అప్పుడే విశ్వపతి శాస్త్రికి 45 యేండ్లు వచ్చాయి. వృద్ధాప్యం ఆసన్నమవుతుందని గుర్తుచేస్తున్నట్టుగా అక్కడక్కడ పలిత కేశాలు (తెల్ల వెంట్రుకలు) తొంగి చూస్తున్నాయి. అయితేనేమి? విశ్వపతి శాస్త్రి సంగీత విద్యలో తేజోవిరాజితుడై మధ్యాహ్న భాస్కరుడిలా వెలిగిపోతున్నారు.
పెళ్లి జరిగిన విషయం మర్చిపోయిన విశ్వపతి శాస్త్రి…
రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు అలా నడుం వాల్చి నిద్రపోతున్న విశ్వపతి శాస్త్రికి, అర్ధరాత్రి వేళ అక్కడ వాయిస్తున్న మంగళ వాయిద్య ఘోషకి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. బయటకు వచ్చి చూశాడు. ఇంటి ముందు పెళ్లి జరుగుతుంది. పెళ్లి పిల్లాడికి 10 సంవత్సరాలు, పెళ్లి పిల్లకు 8 సంవత్సరాలు. అష్టవర్షాత్భవేత్కన్య. వారిది అచ్చుపోలినట్లు బొమ్మల పెళ్లిలా ఉంది. ఒక్కసారి విశ్వపతి శాస్త్రి యొక్క ఆలోచనలు 35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. అలాంటి అనుభవమే తనకు ఉంది. తనకు కూడా సరిగ్గా పది సంవత్సరాలు వయస్సు ఉండగా, ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు. విశ్వపతి శాస్త్రిని పెళ్లి కొడుకుని చేశారు. పారాణి పూశారు, కాటుక పెట్టారు. తనకేమో నిద్ర ముంచుకొస్తుంది.
ఎనిమిదేండ్ల ఆ అమ్మాయి ఏడుస్తోంది. బుగ్గన చుక్క, కల్యాణ తిలకం. ఏడ్చి ఏడ్చి కళ్ళకు ఉన్న కాటుక అంతా బుగ్గల మీద నుండి కారిపోతోంది. భజంత్రీలు మ్రోగాయి. తాళి కట్టరా అని బంధువులు అంటున్నారు. కానీ విశ్వపతి మాత్రం నిద్ర ముంచుకొస్తున్న కళ్ళతో నిద్రపోతున్నాడు. తాళి కట్టారా వెర్రి సన్నాసి అని ఎవరో పెద్దాయన కేకలు వేశారు. విశ్వపతి తాళి అందుకున్నాడు, కట్టాడు. బంధువులు అందరూ అక్షింతలు వేశారు. పెళ్లి అయిపోయింది. తన కళ్ళు మూతలు పడ్డాయి. విశ్వపతి శాస్త్రి నిద్రలోకి జారిపోయాడు. తనకు పెళ్లయి ముప్పై అయిదేండ్లు గడచిపోయాయి. సంగీత ధ్యాసలో ఉండడం వలన తనకు పెళ్లి అయిన విషయం జ్ఞాపకం రాలేదు. పాపం తన భార్య ఎలా ఉందో అని తలుచుకోగానే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి.
35 యేండ్ల తరువాత భార్యను కలుసుకుని…
ప్రాచీన కాలంలో ఆచార వ్యవహారాలు దారుణంగా ఉంటాయి. అందులోనూ ఆడవారి విషయంలో ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇల్లు వదిలి దేశాటన వెళ్లిపోయిన విశ్వపతి శాస్త్రి గురించి చాలా రోజులు వెతికారు. చాలా రోజులు ఎదురుచూశారు. అతను చనిపోయి ఉంటాడని భావించి ఘటా శ్రాద్దం పెట్టేశారు. అన్నిటికన్నా ఘోరం ఏమిటంటే ముక్కుపచ్చలారని ఆ ఆడపిల్లని గాజులు బ్రద్దలు కొట్టించి, తాళి తీయించి, గుండు గీయించి విధవను చేయించి, ఆమెకు తెల్లచీర చుట్టేశారు. తన సొంత ఊరొచ్చి భార్యను చూసిన విశ్వపతి శాస్త్రికి గుండె బద్దలైంది, గుండె ఆగినంత పనైంది. అంతా తెల్లదనం. తెల్లటి పిల్ల, తెల్లటి విభూది బొట్టెట్టుకుని, తెల్ల చీరలో, తెల్లబోయి చూస్తుంది.
“నేను బ్రతికే ఉన్నాను, నన్ను క్షమించు” అని విశ్వపతి శాస్త్రి మాట్లాడుతుండగా, ఆ మాటలు, దుఃఖంలో, ఏడుపులో కలిసిపోయాయి. ఆయన కంఠం మొదటిసారిగా బొంగురుపోయింది. ఆయనను కావలించుకున్న విశ్వపతి శాస్త్రి భార్య తన కరువుతీరా ఏడ్చింది. యేండ్ల వనవాసం తరువాత రాముడిని చూసిన సీతమ్మ వారయిపోయింది. పరమేశ్వరుని కలిసిన పార్వతైపోయింది. మళ్లీ పుణ్యస్త్రీ అయిపోయి లక్ష్మీదేవిలా తయారయ్యింది. “సంగీత సరస్వతి” ఆ దంపతులను మనసారా ఆశీర్వదించింది. ఇది కల్పిత కథ కాదు. వందేళ్ళ క్రితం బొబ్బిలిలో జరిగిన “విశ్వపతి శాస్త్రి” నిజ జీవిత కథ. ఇది సత్యం. ఎందరో పుణ్యమూర్తులు సంగీతం కోసం తమ జీవితాలని ధారపోశారు. వారందరినీ తలుచుకుని స్మరించుకోవడమే మన జాతికి నిజమైన స్ఫూర్తి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.