Telugu News

ఓటుకు నోటు – భవిష్యత్ తరాలకు లోటు

ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అనే తేడా లేకుండా ఓటర్లలను ఆకర్షించడానికి హామీల వర్షం తడిసి ముద్దాడిస్తున్నాయి. భారతదేశంలో పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటు హక్కు. తమ ప్రతినిధిగా తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకుని ఎన్నుకునే ప్రక్రియను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒకరికి ఒకే ఓటు.. ఒకే విలువ, పేదవాడు, ధనవంతుడు, చదువుకున్న వారు, చదువు రాని వారు, వర్ణం, ప్రాంతం, లింగ భేదం అనేది లేకుండా భారతదేశ వయోజనులందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పించారు.

ఓటు అనే వజ్రాయుధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అంబేద్కర్ అన్నారు. నోట్ల మాయలో ఓటర్లకు ఎన్నికలంటే చాలు.. సామాన్య ఓటరుకు తాత్కాలిక పండుగ, రాజకీయ పార్టీలకు, నేతలకు దీర్ఘకాల పండుగ. ఓటు విలువ ఐదేళ్లు ఉంటే, ఒక్కసారి కష్టపడి రాజకీయ రంగం ప్రవేశం చేస్తే చాలు, కొన్ని తరాలపాటు సెటిలైపోవచ్చనే విషయం గ్రహించిన రాజకీయ నేతలు ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.

క్రమక్రమంగా ఎన్నికల్లో రాజకీయ నేతల ఖర్చులకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఎన్నికల ఖర్చులు రానురాను ఒక నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్ల వరకు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. ఓటుకు 500 నుంచి 5000 వరకు ఓటర్లను కొనుక్కుంటూ సామాన్య ఓటర్లు డబ్బులు ఇస్తే గాని ఓటు వేయని పరిస్థితికి దిగజారి పోయేలా రాజకీయ నేతలు చేస్తున్నారు.  విలువలను పాటించవలసిన నేతలు కేవలం డబ్బుని నమ్ముకొని రాజకీయాలను చెలాయిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో.. ఓటర్లను ఆకర్షించుకోవడానికి రాజకీయ నేతలు తమ స్థాయి దిగజారి పవిత్రమైన ఎన్నికలను బ్రష్టు పట్టిస్తున్నారు.

ఓటర్లను గొర్రెల మందలుగా మార్చి ప్రలోభాల మత్తు జల్లి ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన రహితంగా, బావిలో దూకే గొర్రెల్లాగా చేసి, పబ్బం కడుపుకొని పదవుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత ప్రజల వైపు గాని, వాళ్ళ సమస్యల వైపు గాని కన్నెత్తి చూడరు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించడం అవసరమైతే హత్యలు కూడా వెనకాడని నేటి రాజకీయాలు మనం చూస్తున్నాం. నువ్వు ఒకటి ఉచితం అంటే రెండు నా వంతు అన్నట్టు ఉంటున్నాయి. కాబట్టి  ఓటు చైతన్యం రావాలి.. ఓటర్లలో చైతన్యం రావాలి. 

ఒక్కసారి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఖర్చు పెట్టిన కోట్లు తిరిగి ఎలా సంపాదించాలన్న ఆలోచనలలోనే ఉంటున్నాడు. పదవి వచ్చాక ఒకసారి కూడా నియోజకవర్గానికి కానీ, ప్రజలకు గాని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఓటు వేసిన పాపానికి శాపగ్రస్తులు కనీసం అవసరాలకు కూడా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి ఓటు వేయాలి.

Show More
Back to top button