Telugu NewsTelugu Politics

రెండు కుటుంబాలు – నాలుగు పార్టీలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నాలుగు పార్టీలు సందడి చేస్తున్నాయి. కానీ, ఈ పార్టీలను నడిపిస్తున్నది రెండు కుటుంబాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. షర్మిల ఆంధ్రలో జనవరి 4వ తేదీన కాంగ్రెస్‌లో చేరితే కేవలం 10 రోజుల్లోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. ఆ పార్టీకి ఊపిరి పొయ్యాలన్నా.. గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా.. అది షర్మిల వల్లే సాధ్యం అని కాంగ్రెస్ హై కమాండ్ నమ్ముతోంది. ఎందుకంటే వైఎస్సార్‌పై అభిమానం ఉండి జగన్‌తో ఇమడ లేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తున్నారు. అందుకే మరో ఆలోచన లేకుండా.. ఆమెకు కాంగ్రెస్ పగ్గాలు కట్టబెట్టారు. అటు వైఎస్ జగన్ వైసీపీ అధినేత కాగా..  వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులే కావడంతో ఎన్నికలు మరింత వాడివేడిగా మారనున్నాయి.

మరోపక్క రాష్ట్రంలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజీపీ ఆశలు ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉన్నాయి. ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో బీజేపీ పెద్దలు పురందేశ్వరినే పార్టీ అధ్యక్షురాలిగా చేశారు. ఎన్టీఆర్ వారసత్వంతోపాటు దానికి తగ్గట్టుగానే స్వతహాగా ఆమె రాష్ట్రం మొత్తం తిరిగి పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకేళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వచ్చే ఎన్నికల సమరానికి సై అంటున్న చంద్రబాబు నాయుడు, పురందేశ్వరిలు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకరు నందమూరి తారకరామారావు ముద్దుబిడ్డ చిన్నమ్మగా పిలుచుకునే పురందేశ్వరి కాగా… మరొకరు అల్లుడు చంద్రబాబు నాయుడు. కాగా, బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే ఈ కూటమి కీలకపాత్ర పోషిస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఇలా రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు పార్టీలు ఒకే కుటుంబం చేతుల్లో ఉండడం వల్ల.. అధికారంలో వాళ్లే ఉంటారు, ప్రతిపక్షంలో వాళ్లే ఉంటారని ప్రజలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ పార్టీని కూడా ప్రజలు కుటుంబ పార్టీగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కుటుంబాల్లోనే లేని ఐక్యత, రాష్ట్ర ప్రజలను ఏవిధంగా ఐక్యం చేస్తారనే అనుమానం కూడా ప్రజల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో రెండు నేషనల్.. రెండు ప్రాంతీయ పార్టీల అధ్యక్ష పదవులు రెండు కుటుంబాల చేతుల్లోనే ఉండడం 2024 ఏపీ ఎన్నికల్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

Show More
Back to top button