NRI News

చార్లీ కిర్క్‌ హత్య కేసులో నిందుతుడు అరెస్ట్

అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసిన చార్లీ కిర్క్‌ (31) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్‌గా పేరుగాంచిన చార్లీ, యుటా రాష్ట్రంలోని యుటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం(సెప్టెంబర్ 10) జరిగిన కార్యక్రమంలో దారుణ హత్యకు గురయ్యాడు. సుమారు మూడు వేల మంది విద్యార్థులు, అనుచరుల సమక్షంలో జరిగిన ఈ ఘటన అమెరికా అంతటా కలకలం రేపింది.

కేసు వివరాల ప్రకారం.. చార్లీ కిర్క్ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రసంగిస్తుండగా, సుమారు 200 అడుగుల దూరంలో ఉన్న భవనం పైకప్పుపై మాటువేసిన నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ చార్లీ మెడలో దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. ఈ సంఘటన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, దాడిని అడ్డుకోలేకపోయారు. చార్లీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉండటంతో ఈ హత్య దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది.

దీనికి సంబంధిచిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని పట్టించడానికి అతనికి సన్నిహితులే సహకరించారని అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. “చార్లీ మా దేశానికి గొప్ప కన్జర్వేటివ్ స్వరంగా నిలిచాడు. అతని హత్య మా అందరికీ వ్యక్తిగత నష్టమే. నిందితుడు త్వరితగతిన శిక్షించబడతాడు” అని ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ హత్య వెనుక ఉన్న ఉద్దేశాలు, కుట్రలపై లోతుగా విచారణ జరుపుతున్నాయి.

Show More
Back to top button