GREAT PERSONALITIESTelugu Special Stories

తెలుగు సాహిత్యంలో తొలి విమర్శకాగ్రేసర చక్రవర్తి.. కట్టమంచి రామలింగారెడ్డి…

డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (10 డిసెంబరు 1880 – 24 ఫిబ్రవరి 1951)

“కేవలం ఓట్ల పెట్టె తుది న్యాయనిర్ణేత కాదు. చరిత్రే తుది న్యాయ నిర్ణేత. నైతిక విలువలు లేని రాజకీయాలు దేశాన్ని అభ్యుదయం వైపు నడిపించలేవు” అనే సిద్ధాంతానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు “కట్టమంచి రామలింగారెడ్డి” గారు. అప్పటి రాజకీయాలతో తన అభిప్రాయాలు పొసగక పోవడం వల్లనే తక్కువ కాలంలోనే రాజకీయాలను వీడారు. కట్టమంచి గారిది విమర్శలకు వెరవని నిండైన వ్యక్తీకరణ, సాహితీగగనంలో, విమర్శాక్షేత్రంలో దిక్సూచి, చెలియలికట్టల మధ్య బందీ అయిన సాహిత్యంలో కొండగాలి. తాను ఆధునిక తెలుగు సమాజంలో రాజకీయాలకు కొత్త రంగు, రుచి.

దేశం బ్రిటిషు వలసపాలనలో మగ్గుతున్న రోజులవి. వ్యక్తి స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం అంటేనే నిర్బంధించే సంక్షుభిత పరిస్థితులవి. అలాంటి గడ్డు రోజులలో చదువుకుని, అచంచల మేధోసంపన్నుడిగా ఎదిగిన వ్యక్తి “కళాప్రపూర్ణ” కట్టమంచి రామలింగారెడ్డి గారు. సాహితీవేత్తగా, వక్తగా, విమర్శకుడిగా, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, అనేక రంగాల్లో తెలుగునాట తనదైన ముద్రవేశారు కట్టమంచి గారు. గత శత వసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారు ఒకరు…

కట్టమంచి రామలింగారెడ్డి గారు విద్యారంగాన్నో లేక రాజకీయ రంగాన్నో, అదీకాక ఇంకా ఏదైనా రంగాన్ని ఒక్కదాన్ని ఎంచుకుంటే అందులో అత్యున్నత స్థాయికి చేరుకునేవాడని, అయితే సరిగా ఒక రంగంలో పనిచేసి మంచి స్థానానికి చేరుకునే సమయానికి మరొక రంగానికి మారిపోయేవాడని ఆవటపల్లి నారాయణరావు గారు తన “విశాలాంధ్రము” లో వ్రాశారు. ఈవిధమైన చంచలత్వం వల్లనే ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో మొదటి మెట్టు మీదే ఉంటూ వచ్చారని అతని విశ్లేషణ. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో కట్టమంచి గారు వ్రాసి ప్రచురించిన “ముసలమ్మ మరణము” తెలుగు కవిత్వంలోకి ఒక కొత్త ఆలోచనను, ఆధునిక ఇతివృత్తాన్నీ తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది.

కట్టమంచి రామలింగారెడ్డి గారు మన ప్రబంధాలను, ప్రబంధ కవులను తన విమర్శనా గ్రంథం “కవిత్వ తత్వ విచారము” లో ఉతికి ఆరేసారు. తెలుగు కావ్యాలను గురించి, తెలుగు కవులను గురించి కట్టమంచి గారు చేసిన అతి కటువైన విమర్శలు నాటి సాహిత్య లోకంలో తుఫానులను సృష్టించాయి. రామలింగారెడ్డి గారు ఆంగ్ల భాషా సాహిత్యాల వ్యామోహంలో కొట్టుకుపోతున్నారని, ఇంగ్లీషు చదువుల పొరలు కమ్మి తెలుగు భాషా సాహిత్యాల గొప్పతనం ఆయన కంటికి ఆనలేదని ఎన్నో విమర్శలు కట్టమంచి గారిపై కురిశాయి. “కవిత్వ తత్వ విచార విమర్శనము” అని తన గ్రంథాన్ని ఖండిస్తూ ఒక పుస్తకం కూడా వచ్చింది. అయినా తాను చలించలేదు. తన అభిప్రాయాన్ని కూడా మార్చుకోలేదు.

@ జీవిత విశేషాలు…

జన్మ నామం :    కట్టమంచి రామలింగారెడ్డి

ఇతర పేర్లు  :  సి.ఆర్.రెడ్డి  

జననం    :     10 డిసెంబరు 1880    

స్వస్థలం   :    కట్టమంచి , చిత్తూరు జిల్లా 

వృత్తి      :     ఉపకులపతి, కవి, పండితుడు, విద్యావేత్త

తండ్రి    :     సుబ్రహ్మణ్య రెడ్డి 

తల్లి     :     నారాయణమ్మ

జీవిత భాగస్వామి :  బ్రహ్మచారి  

మరణ కారణం   :    వృద్ధాప్యం 

మరణం   :   24 ఫిబ్రవరి 1951, మద్రాసు

@ నేపథ్యం…

కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆధునిక సాహిత్య విమర్శ ప్రస్థానంలో విప్లవాత్మకంగానూ, తెలుగు సాహిత్య విమర్శను రాబోయే తరాల వారికి అందుబాటులోకి వచ్చే విధంగాను బాటలు వేశారు. రామలింగారెడ్డి గారు 10 డిసెంబరు 1880 లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో జన్మించారు. ఆ గ్రామం చిత్తూరు – తిరుపతి మార్గంలో ఒక చిన్న పల్లె. వీరి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యంరెడ్డి, నారాయణమ్మ. ఈ దంపతులకు కట్టమంచి గారు మూడో సంతానం. సుబ్రహ్మణ్యం రెడ్డి సోదరుడు పెద్ద రామస్వామి రెడ్డి, రామలింగారెడ్డి గారిని దత్త పుత్రుడుగా స్వీకరించారు. కట్టమంచి గారి తండ్రి న్యాయవాద వృత్తిలో ఉంటూ ఋజువర్తనలుగా, నిజాయితీపరులుగా జీవించారు. తన తల్లి పండిత వంశంలో జన్మించి గొప్ప గుణాలను పుణికిపుచ్చుకున్న ఉత్తమ ఇల్లాలు. స్వతహాగా కవి అయిన తన తాత పేరు మీదుగా సీ.ఆర్.రెడ్డికి పేరు పెట్టారు.

@ బాల్యం…

కట్టమంచి రామలింగారెడ్డి గారి చదువు తన అయిదో ఏట వీధి బడిలో మొదలయ్యింది. తనకున్న పరిజ్ఞానం వల్ల చిన్న వయస్సులోనే భారతాన్ని, అమర, బాల రామాయణాన్ని చదివేవారు. ప్రస్తుతం పీ.సీ.ఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలో 1890లో మొదటిఫారంలో చేరాడు. తాను ప్రతీ పరీక్షలోనూ ఉన్నత శ్రేణి సాధించేవారు. ఉన్నతాభ్యాసం కోసం మదరాసు వెళ్ళి క్రైస్తవ కళాశాలలో 1896లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 1899 వ సంవత్సరంలో నవ్య కావ్యరచన పోటీలో, తన 19వ యేటనే ముసలమ్మ మరణము లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందారు. 1902 లో బీ.ఏ. పరీక్షలో చరిత్రలో, తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన కట్టమంచి వారు బంగారు పతకాలను కూడా గెలుచుకున్నారు.

కట్టమంచి గారు ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి వక్త. ఎన్నో బహుమతులు అందుకొన్నారు. అక్కడ గురువులందరి మెప్పు పొంది ప్రియ శిష్యుడిగా తన ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. కట్టమంచి గారు కళాశాలలో చదువుకునే రోజులలో తెలుగు భాష పై మక్కువ పెంచుకున్నారు. అనతికాలం లోనే సి.పి.బ్రౌన్ ప్రచురించిన “అనంతపురం చరిత్ర” ను చదివి స్నేహితుడైన నారాయణస్వామి చెప్పే పల్లె జీవితాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుని, ఆ ప్రేరణలో ముసలమ్మ మరణం అనే కావ్యాన్ని సాంప్రదాయ బద్ధంగా రచించి  భాషాభిరంజని సమాజం వారు నిర్వహించిన పోటీలకు పంపించారు. ఇందులో గల 107 పద్య, గద్యాల, కావ్యము ఇది. తెలుగు కవిత్వంలో ఈ కావ్యము ఒక నూతన మార్గము ప్రవేశపెట్టినది. కాల్పనిక కవిత్వంలో తీర్చిదిద్దిన కావ్యం ఇది.

@ విదేశాలలో చదువు…

కట్టమంచి గారు డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా తనకు ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్పుతో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. భారత ప్రభుత్వపు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో, సెయింట్స్ జాన్స్ కళాశాలలో ప్రవేశించిన కట్టమంచి రామలింగారెడ్డి గారు పలు పురస్కారాలు అందుకున్నారు. 1903లో అతని తెలివి తేటలకు, సామర్థ్యానికి గుర్తింపుగా “రైట్” బహుమతిని తాను అందుకున్నారు.

1904 వ సంవత్సరలో “విద్వాంసుడు” అనే పురస్కారాన్ని అందుకున్నారు. 1905 వ సంవత్సరంలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో “యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శి” గా ఎన్నికై, అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మన్ననలు, ప్రశంసలు అందుకొన్నారు కట్టమంచి వారు. ఒక భారతీయుడుగా తనకు ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రప్రథమం. 1906లో ఎం.ఏ. పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఇతని విశేష విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాగ్ధాటి, హస్య చతురతలకు విదేశీవారు ఆశ్చర్యపడేవారట.

@ ఉద్యోగ జీవితం…

బరోడా సంస్థానాదీశుడు శాయాజీరావు గైక్వాడ్ గారు కట్టమంచి రామలింగారెడ్డి గారి ప్రతిభను గుర్తించి, తన సంస్థానంలో విద్యాశాఖలో ఉద్యోగం ఇవ్వదలచి, అందుకోసం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించడానికి తనను అమెరికా పంపించాడు. తన పర్యటన పూర్తయ్యాక 1908 లో స్వదేశానికి వచ్చి తన 28వ యేట బరోడా కళాశాలలో ఆచార్యునిగాను, ఉపాధ్యక్షునిగాను తన తొలి ఉద్యోగం ప్రారంభించాడు కట్టమంచి గారు. విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలలో కూడా తాను పర్యటించారు. ఆ తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్య పదవి స్వీకరించారు కట్టమంచి గారు.

అక్కడ ఆచార్యునిగా, ప్రధానాచార్యునిగా, విశ్వవిద్యాలయ రూపకర్తగా, విద్యాశాఖాధికారిగా పలు రకాల బాధ్యతలు వెరవేర్చారు. ఇక్కడ పనిచేసిన సుమారు పన్నెండు సంవత్సరాల కాలంలో హరిజనులకు పాఠశాలలలో ప్రవేశం కల్పించడానికి కృషి చేశారు. విద్యార్థులు కట్టమంచి గారిని ఆచార్యునిగా అమితంగా గౌరవించేవారు. తన ప్రణాళిక ఆధారంగా మైసూరు విశ్వవిద్యాలయం 1916 లో ప్రారంభమయ్యింది. దానికి కళాశాల ప్రధానాచార్యులుగా ఉన్నారు. ఆ తరువాత రెండేళ్ళకు మైసూరు సంస్థానం విద్యాశాఖాధికారిగా నియమింపబడ్డారు. ఆ హోదాలో “ప్రతి ఊరికి ఒక పాఠశాల” అనే ఉద్యమం ప్రారంభించారు. 1921లో అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు కట్టమంచి రామలింగారెడ్డి గారు.

@ సాహితీ సేవ…

సాహిత్య రంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచనా రీతులకు మనోవికాసాత్మకమైన విమర్శలకు కట్టమంచి రామలింగారెడ్డి గారు దోహదపడ్డారు. ఒకవైపు తెలుగు కవితను, మరో వైపు కవితా విమర్శను నూతన శోభతో కొత్తకాంతులతో ఆవిష్కరించిన సాహితీమూర్తి కట్టమంచి గారు. సంభాషణలతో దెబ్బకు దెబ్బ తీయగల నేర్పు, వాదనాచాతుర్యం తన శైలి. హాస్య ప్రియత్వం, ఛలోక్తులు, చమత్కార సంభాషణా నైపుణ్యం వంటి లక్షణాలతో అందరినీ ఆకట్టుకునేవారు రామలింగారెడ్డి గారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు రచించిన “ముసలమ్మ మరణం” తొలి ముద్రణ 1900 వ సంవత్సరంలో జరిగింది.

భారత అర్థశాస్త్రం, పంచమి, లఘుపీఠికా సముచ్చయం, వేమన, కవిత్వతత్త్వవిచారం, ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి,  వ్యాసమంజరి మొదలయినవి తెలుగులో కట్టమంచి గారి రచనలు. డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు పేరుతో 1983 లో సంకలనాన్ని ప్రచురించారు. ఆంగ్లంలోను కట్టమంచి గారు చేయి తిరిగిన రచయితే. డ్రామా ఇన్‌ద ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌, స్పీచస్‌ ఆన్‌ యూనివర్శిటీ రిఫార్మ్‌, డెమోక్రసీ ఇన్‌ కాంటెపరరీ ఇండియా లాంటి రచనలు ఆంగ్లంలో రామలింగారెడ్డి గారి రచనల్లో కొన్ని. విమర్శలో విప్లవము తెచ్చి విమర్శకాగ్రేసర చక్రవర్తి అని కీర్తి తెచ్చుకున్నారు.

@ ముసలమ్మ మరణం…

కట్టమంచి రామలింగారెడ్డి గారు చిన్నతనంలోనే భారత, భాగవత, రామాయణాలు క్షుణ్ణంగా చదివారు. తన కుటుంబ నేపథ్యం వల్లనే సాహిత్యంపై ఆసక్తి కలిగింది. తాను విద్యార్థిగా 19వ ఏట వ్రాసిన “ముసలమ్మ మరణం” కావ్యం ప్రథమ బహుమతిని అందుకుంది. ఊరి సంక్షేమం కోసం ఒక మహిళ ప్రాణత్యాగం చేయడం దాని ఇతి వృత్తం. పింగళి సూరన కళాపూర్ణోదయంపై ఆయన వ్రాసిన విమర్శక వ్యాసం “వేదం వేంకటరాయ శాస్త్రి” వంటి మహా పండితుల ప్రశంసలు అందుకుంది. 1911 – 12లో అర్థశాస్త్రంపై వ్రాసిన గ్రంథం మద్రాసు విశ్వవిద్యాలయం బహుమతిని గెలుచుకుంది. ఆయన “కవితత్వ విచారం” విమర్శక గ్రంథం పండిత, విమర్శకుల మన్ననలు అందుకుంది. దీని గురించి “కవిత్వతత్వ విచారంతో విమర్శ పథాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్య సాహిత్యానికి కొత్త బోదెలు తవ్వారు” అని కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, విమర్శ మార్గమున బాహిరజగత్తు నుండి అంతర జగత్తుకు కొనిపోయిన ప్రథమాంధ్ర విమర్శన గ్రంథం అని ఆచార్య పింగళి లక్మీకాంతం శ్లాఘించారు.

@ ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు…

ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది ప్రస్తుతం వాడుకలో ఉన్న పేరు. కానీ అప్పట్లో విశాఖపట్నంలోని వాల్తేరు తీరంలో 1926లో స్థాపించినప్పుడు అది “ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు”. తెలుగువారి కోసం ఏర్పాటయిన తొలి విశ్వవిద్యాలయం అదే. ముందుగా ఆ యూనివర్సిటీని బెజవాడలో నెలకొల్పాలా లేక విశాఖలో స్థాపించాలా అనే తర్జనభర్జన సాగింది. బెజవాడలో పెట్టేద్దామనుకొని, ఒక సెంటర్‌ను కూడా కొంతకాలం తాత్కాలికంగా నడిపారని చెబుతారు. బెజవాడలో వేడి ఎక్కువగా ఉన్నదని, చల్లని విశాఖ ఒడ్డునే ఉంటే బావుంటుంది అని చివరకు ఖాయంచేశారు. నిజానికి ఈ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమ ప్రాంతంలో కూడా నెలకొల్పాలని ఆ ప్రాంత వాసులు ఒత్తిడి తెచ్చినా కూడా సీమ వాసియైన రామలింగారెడ్డి ప్రాంతీయాభిమానానికి అతీతంగా విశాల దృష్టితో ఆలోచించి విశాఖపట్నం కు అనువైన ప్రాంతంగా నిర్ణయించారు.

యూనివర్సిటీ ఏర్పాటు విషయమై తీవ్ర మథనం సాగించిన పెద్దలు, తొలి ఉపాధ్యక్షుని ఎంపిక విషయంలో మాత్రం పెద్దగా ఆలోచించలేదు. అంతా కూడబలుక్కొన్నట్టు “కట్టమంచి రామలింగారెడ్డి” గారి పేరునే ఆ పదవికి సూచించారట. వ్యవస్థాపక ఉప కులపతిగా నియమితులై విశ్వ విద్యాలయం అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేశారు. దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా తీర్చిదిద్దారు. విరాళాలు సేకరించి సంస్థను ప్రగతి బాట పట్టించారు. ఉప కులపతి హోదాలో వచ్చే నెలవారీ పారితోషికంలో సగం విశ్వవిద్యాలయా నికి విరాళంగా ఇచ్చారు. ప్రథమ దాతగా తమను తాము నిరూపించుకున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి విద్యావంతులు, పండితులను రప్పించి కొలువు తీర్చారు. కులమతాలకు అతీతంగా ప్రతిభకు పట్టం కట్టారు. ప్రతిభ, యోగ్యతలను బట్టే ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన హయాంలో ఈ విద్యాలయం శారదా నిలయంగా భాసించింది. సత్యాగ్రహం సందర్భంలో పరాయి పాలకుల తీరుకు నిరసనగా ఉప కులపతి పదవీ త్యాగం చేశారు. ఆరేళ్ల విరామం తరువాత 1936 నుంచి 1949 వరకు ఉపకులపతిగా వ్యవహరించారు. ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్‌గా సేవలు అందించారు. ఆయన పరిపాలన దక్షతకు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సజీవ చిహ్నంగా భావిస్తారు. ఉద్యోగ విరమణ తరువాత సాహిత్య సేవ చేయాలని ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆంధ్రాంగ్ల భాషలలో ఆయన రచనలు, అప్రకటితాలుగా అలాగే ఉండిపోయాయి.

@ రాజకీయంలో నైతిక విలువలు…

విద్యారంగంలో అందనంత ఎత్తుకు ఎదిగిన కట్టమంచి గారు రాజకీయాలతో తన అభిప్రాయాలు పొసగక పోవడం వల్ల తక్కువ కాలంలోనే రాజకీయాలను వీడారు. 1921 తరువాత రాజకీయాలలోకి రంగప్రవేశం చేసిన కట్టమంచి గారు 1922 లో ఒక స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గెలిచి శాసనసభలో ప్రవేశించారు. ఆ తరువాత 2వ సారి చిత్తూరు నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 1921 – 25 మధ్య కాలంలో మద్రాసు కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారు. జస్టిస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించిన కట్టమంచి గారు తర్వాత యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీలో చేరి డిప్యూటీ లీడర్‌గా వ్యవహరించారు.

1935 లో కాంగ్రెస్‌ తరపున మద్రాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 1936 లో కొంతకాలం పాటు చిత్తూరు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. శాసనసభలో కట్టమంచి గారి ప్రసంగాలు చాలా గొప్పగా ఉండేవి. కేవలం ఓట్ల పెట్టె తుది న్యాయనిర్ణేత కాదు. చరిత్రే తుది న్యాయ నిర్ణేత. నైతిక విలువలు లేని రాజకీయాలు దేశాన్ని అభ్యుదయం వైపు నడిపించలేవు అనే వారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. అప్పటి స్వతంత్ర మనస్తత్వం కారణంగా రాజకీయాలలో వ్యక్తగతంగా నష్టపోయారేమో కానీ, విద్యారంగం సుసంపన్నమైంది. అందుకు విశాఖలోని ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు నిదర్శనం. వివిధ దేశాలలోని విద్యా విధానాలు పరిశీలించి, వాటిలో మేలైనవి అమలు చేశారు.

@ వ్యక్తిగత జీవితం…

కట్టమంచి రామలింగారెడ్డి గారు ఎన్నో ఆణిముత్యాలాంటి సూక్తులను అందించి యువతను ఉత్సాహపరిచారు, ఉత్తేజపరిచారు. వీరు తెలుగుని “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని నిర్వచించారు. వీరు ఆజన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. తన గురించి తానే ఛలోక్తులు వేసుకోవడంలో కట్టమంచి గారు దిట్ట. తన పెళ్ళి గురించి తానే వేసుకున్న ఛలోక్తులు తనకు అపకీర్తిని తెచ్చిపెట్టాయి. ఒకసారి మద్రాసు గోఖలే హాలులో జరిగిన సన్మానంలో వక్త “బ్రహ్మచారి, సద్గుణ సంపన్నుడని” పొగడితే కట్టమంచి రామలింగారెడ్డి గారు మాత్రం ఆ ప్రసంగం మరీ అతిశయోక్తులతో ఉందనీ, తనను బ్రహ్మచారి అనడం కన్నా అవివాహితుడు అనడమే సరైనదన్నాడు. అలానే “నాకోసం ఇతరులు పెళ్ళిచేసుకుంటూంటే నేనెందుకు పెళ్ళాడాలనీ”, “కావాలనుకున్నప్పుడల్లా పాలు లభిస్తుండగా ఆవును కొనుక్కోవడం ఎందుకనీ” పలు సందర్భాల్లో అన్న ఛలోక్తులు తనను అప్రతిష్టపాలు చేశాయి.

@ శివైక్యం…

అవివాహితులైన కట్టమంచి రామలింగారెడ్డి గారు  విద్యారంగాన్నో, రాజకీయ రంగాన్నో, మరి ఏదైనా రంగాన్ని ఒక్కదాన్ని ఎంచుకుంటే అందులో అత్యున్నత స్థాయికి చేరుకునేవాడని, అయితే వారు సరిగ్గా ఏదో ఒక రంగంలో పనిచేసి మంచి స్థానానికి చేరుకునే సమయానికి, మరొక రంగానికి మారిపోయేవాడని “ఆవటపల్లి నారాయణరావు” గారు తన విశాలాంధ్రములో వ్రాశారు. ఈ చంచలత్వం వలననే ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో కట్టమంచి గారు మొదటి మెట్టు మీదే ఉంటూ వచ్చాడని అతని విశ్లేషణ. జీవిత మలిదశలో అనారోగ్యంతో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి గారు 24 ఫిబ్రవరి 1951 నాడు శివైక్యం చెందారు.

కట్టమంచి గారు బ్రహ్మచారి అయినా విద్యాలయాలే అయన కుటుంబం. మానవతా దృష్టి, ఉదార స్వభావం, మౌలిక చింతన, కళాదృష్టి లాంటి విశేష లక్షణాలు గల రామలింగారెడ్డి గారు అస్వస్థతతో  తన 71 ఏట అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వీరికి పలుచోట్ల విగ్రహాలు  ఉన్నాయి. ఏలూరులో వీరి పేరు మీద ఒక పెద్ద “కళాశాల” ను స్థాపించారు. ఆ కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్ధులు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. ఆ కళాశాలను స్వయం ప్రతిపత్తిగల ఒక విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం గుర్తించింది. కళాప్రపూర్ణ కట్టమంచి రామలింగారెడ్డి లాంటి ఉదాత్త చరితులు అరుదుగా జన్మిస్తుంటారు. ఆ మహనీయుని అడుగుజాడలలో నడుచుకోవటమే రామలింగారెడ్డి గారికి మనమిచ్చుకునే ఘనమైన నివాళి..

Show More
Back to top button