Telugu News

సొమ్ము భారతీయ విద్యార్థులది, సోకు యూకె‌ యూనివర్సిటీలది !

దూరపు కొండలు నున్నగా కనిపిస్తాయి. పొరుగింటి పుల్ల కూర రుచిగానే ఉంటుంది. విదేశీ చదువులు ఆకర్షణీయంగా తోస్తాయి. సొమ్మొకడిది, సోకొకడిది లాగా ఉంది విదేశీ యూనివర్సిటీల తీరు. మన యూనివర్సిటీలు అంటే అంత ఇష్టం ఉండదు. మధ్య తరగతితో పాటు పేద విద్యార్థులు కూడా రుణాలు తీసుకొని విదేశీ చదువులకు క్యూ కడుతున్నారు. తీరా చదువులు పూర్తి అయ్యాక ఉద్యోగ ఉపాధులు దొరక్క, చేసేదేమీ లేక నిరాశానిస్పృహలతో మూట ముల్లె సర్దుకొని వెనుదిరుగుతున్నారు.

యూకె (యునైటెడ్‌ కింగ్‌డమ్‌) లేదా గ్రేట్‌ బ్రిటన్‌ అంటే ధనిక దేశమని ఓ అపోహ మన తల్లితండ్రులు, యువతలో కనిపిస్తున్నది. మన బలహీనతను ఆసరాగా చేసుకొని విదేశీ యూనివర్సిటీలు, ముఖ్యంగా యూకె లాంటి దేశాల ఉన్నత విద్యా సంస్థలు మన యువత చెల్లించే అపరిమిత ఫీజులతో మనుగడ సాగించడం, నాణ్యత కొరవడిన విద్యను అందించడం, కోర్సు పూర్తి కాగానే మీ దేశం వెళ్లమని గెంటేయడం అనాదిగా కొనసాగుతున్నది. 

అపరిమిత ఫీజులు గుంజుతున్న యూకె యూనివర్సిటీలు:

  విద్యా సంవత్సరం 2022-23లో దాదాపు 33 శాతం బ్రిటన్‌ లేదా యూకె విశ్వవిద్యాలయాలు నిధుల కొరతతో లోటు బడ్జెట్‌ నడుమ నత్తనడకతో కొనసాగుతున్నాయని, ఈ యూనివర్సిటీల మనుగడ విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ యువత అధిక మొత్తంలో చెల్లించే ఫీజులతో ఆధారపడుతున్నట్లు తాజా విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. యూకె పౌరుల నుంచి అతి తక్కువ ఫీజులు వసూలు చేస్తూ, విదేశీ విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ముక్కు పిండి వసూలు చేస్తూ తమ పబ్బం గడుపుతుంటున్నాయి. భారతీయ విద్యార్థులు 49 శాతం యూకెలోని తక్కువ ర్యాంకులు/నాణ్యత కొరవడిన కోర్సులు కలిగిన యూనివర్సిటీల్లో, మామూలు ర్యాంకులు పొందిన యూనివర్సిటీల్లో 41 శాతం మంది, 10 శాతం మంది ఏ ర్యాంకు పొందని యూనివర్సిటీల్లో చేరుతున్నట్లు తెలుస్తున్నది. తొలి పది అత్యుత్తమ ర్యాంకులు పొందిన యూనివర్సిటీల్లో 4 శాతం మంది భారతీయ యువత మాత్రమే అడ్మిషన్లు పొంది చదువులు కొనసాగిస్తున్నారు.

ఏరు దాచాక తెప్ప తగిలేస్తున్న యూకె యూనివర్సిటీలు: 

  ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు, అధిక ఫీజులు చెల్లించి కోర్సులు పూర్తి చేసిన భారతీయ యువత వీసా గడువులు ముగియడంతో ఉద్యోగాలు దొరక్క బలవంతంగా వెనుదిరగడం జరుగుతున్నది. 2021-22 విద్యా సంవత్సరంలో 60 శాతం యూకె యూనివర్సిటీలు లోటు బడ్జెట్‌లో పడ్డాయని, 2022-23 నాటికి వీటి సంఖ్య 33 శాతానికి చేరిందని విశ్లేషించబడింది.  రోజురోజుకు విదేశీ విద్యార్థుల సంఖ్య, వారు చెల్లించే ఫీజుల మొత్తం క్రమంగా పెరగడంతో యూకెలోని విఫల యూనివర్సిటీల మనుగడకు వరంగా మారడం గమనించారు. 2022-23లో విదేశీ విద్యార్థులు 23.7 శాతం అడ్మిషన్లు పొందగా, వారు చెల్లించే ఫీజులు మాత్రం 53 శాతం వాటాను పొందడంతో బ్రిటన్‌ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల ఫీజులతోనే నడుస్తున్నట్లు తెలుస్తున్నది. 

యూకె యూనివర్సిటీల్లో ప్రవేశాలున్నాయి, ఉద్యోగాల్లేవు:

  2022-23లో ప్రపంచ దేశాల్లోనే (చైనాను కూడా అధిగమించి) అత్యధికంగా 1.25 లక్షల భారతీయ యువత

యూకె యూనివర్సిటీల్లో చేరారని, వీరు చెల్లించే ఫీజులు అధిక మొత్తంలో ఉంటున్నాయని తెలుస్తున్నది. భారతీయ యువతకు ఐదేళ్ల కాల పరిమితులతో యూకె వీసాలు ఇస్తున్నారని, గడువు పూర్తి కాగానే 70 – 80 శాతం యువత తిరుగు ప్రయాణం చేస్తున్నారని, కేవలం 24 శాతం మంది మాత్రమే వర్క్‌ వీసాలకు అర్హత పొందుతున్నారని తెలుసుకోవాలి. యూకెలో కాల పరిమితులు లేని వీసాలు పొందడం భారతీయ యువతకు అసాధ్యంగానే తోస్తున్నది. 

ఈ విషయాలన్నించినీ క్షుణ్ణంగా విశ్లేషించుకొని నాణ్యతా ప్రమాణాలు కలిగిన యూకె యూనివర్సిటీల్లో మాత్రమే అడ్మిషన్లు పొంది తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తల్లితండ్రులకు, విద్యార్థులకు సూచిస్తున్నారు. 

Show More
Back to top button