
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తోంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో కేవలం ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షను ఆ ఏడాది సిలబస్‌తో పాటు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యలో నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించింది.
సిలబస్ సవరణ, కొత్త సబ్జెక్టు కాంబినేషన్ల ప్రతిపాదన, పరీక్షల్లో మార్కుల కేటాయింపు విధానం, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలపై నిర్ణయం వంటివి ఇందులో ఉన్నాయి.
పాఠశాల విద్యా శాఖ 2024-25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో NCERT పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టిందని ఇందుకు అనుగుణంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యాభ్యాసం ఎటువంటి ఒడుదొడుకుల్లేకుండా సాగేందుకు NCERT పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్నల్ గా నిర్వహిస్తాయి.
దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల బోర్డుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడంలేదు. ఎక్కువశాతం ఇంటర్ బోర్డులు, యూనివర్సిటీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్ని మాత్రమే నిర్వహిస్తున్నాయి. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని.. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లు ఇందుకోసం చేసిన ప్రతిపాదలనపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలను కోరుతోంది. వాటి ఆధారంగా సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృత్తికా శుక్లా వెల్లడించారు.
ప్రతిపాదిత మార్పులు..
దేశవ్యాప్తంగా ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో మార్పులను పరిగణనలోకి తీసుకోవాల్సినవసరం ఉంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారు.
ద్వితీయ ఇంటర్ పరీక్షలను ఆ ఏడాది సిలబస్ నే నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తారు.
*ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్, ప్రాక్టికల్స్ తప్పనిసరి.. ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఏకపద సమాధానాలు వంటి వాటికి మార్కుల్ని ప్రతిపాదించారు. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు బదులు 5/ 6 మార్కులు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
*గణితం సిలబస్ తగ్గింపు.. గణితం ప్రస్తుతం రెండు పేపర్లుగా ఉండగా.. దీన్ని వంద మార్కులకు ఒక్క పేపర్ కు కుదిస్తారు.
*వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం చెరో 50 మార్కుల చొప్పున వంద మార్కులకు ఒక్కటే పేపర్ గా ఇస్తారు. దీన్ని జీవశాస్త్రంగా మార్పు చేస్తారు.
*ఆర్ట్స్ గ్రూపుల్లో రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. 20 మార్కులకు అంతర్గత మార్కులు ఉంటాయి.
*ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 30 మార్కులకు ప్రస్తుతం ఉన్నట్లే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆర్ట్స్ సబ్జెక్టులకు ఇచ్చినట్లే గణితానికి సంబంధించి 20 శాతం అంతర్గత మార్కుల విధానం ఉంటుంది.
*ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ భాషలు కాకుండా గ్రూపు సబ్జెక్టులు ఉంటున్నాయి. మొదటి, రెండో ఏడాది కలిపి మొత్తం వెయ్యి మార్కులకు తీసుకొస్తున్నారు. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు జరుగుతాయి.
*మొదటి ఏడాది అన్నీ అంతర్గత పరీక్షలే కావడంతో రెండో ఏడాది మార్కులే ప్రామాణికంగా ఉండనున్నాయి.
*ఒక సబ్జెక్టుగా ఆంగ్ల భాష తప్పనిసరిగా ఉంటుంది. రెండో ఐచ్ఛికంగా విద్యార్థులు ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు.
ఉదా: ఆర్ట్స్ గ్రూప్ లో ఉన్నవారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితంలాంటి వాటిని రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు.
ఈనెల 26వ తేదీలోగా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలను కోరుతూ ప్రతిపాదిత సంస్కరణల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అఫిషియల్
వెబ్‌సైట్‌లో ప్రజలు పరిశీలించేలా అందుబాటులో ఉంచింది.