GREAT PERSONALITIESTelugu Special Stories

తొలి గ్రంథాలయ పితామహులు: అయ్యంకి వెంకట రమణయ్య!

ప్రముఖ గ్రంథాలయోద్యమకారుడు వెంకట రమణయ్య పత్రికా సంపాదకులు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు,  ‘గ్రంథాలయ సర్వస్వము’ అనే పత్రికను స్థాపించి, నిర్వహించారు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి చేసి, గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచారు.
దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా కీర్తి గడించారు. అటువంటి గ్రంథాలయ ఉద్యమకర్త గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

నేపథ్యం

1890 జూలై 24న, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా  బిక్కవోలు మండలంలో ఉన్న కొంకుదురు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ. వీరిది సంపన్న కుటుంబం. ఈయన టెయిలర్ హైస్కూలులో విద్యాభ్యాసం చేశారు. తండ్రి వెంకటరత్నంగారు నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా పని చేశారు. తన 19వ ఏటనే బిపిన్ చంద్రపాల్ గారు చేసిన ఉపన్యాసాలకు ప్రభావితులయ్యారు. దీంతో చదువుకు స్వస్తి చెప్పి, ప్రజా ఉద్యమంలో పాల్గొన్నాలని భావించారు. ఈ ఉద్యమమే ఆయన గ్రంథాలయాలను స్థాపించే దిశగా ప్రేరణనిచ్చింది.
ఉద్యోగం, కుటుంబం అని వ్యక్తిగత ప్రయోజనాల గురుంచి ఆలోచన చేయకుండా సమాజసేవ కోసం పూనుకొన్నారు. అది మొదలు గ్రంథాలయ కార్య స్థానంగా విజయవాడ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు, వెంకట రమణయ్య రామమోహనధర్మ పుస్తక భాండాగారంతో అనుబంధం పెంచుకొన్నారు. అనంతరం అదే గ్రంథాలయానికి కార్యదర్శిగా సేవలు అందించారు.

గ్రంథాలయాల సంఘాలు

1910లో బందరులో ‘ఆంధ్ర సాహిత్య పత్రిక’ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రథమ ఆంధ్రరాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 

1914లో మొదటి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని వందల ఏళ్లుగా ఈ సంఘమే విశిష్ట సేవలను అందిస్తోంది.

ఇదే కాక భారతదేశంలో తొలిసారిగా అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1915లో ఆ సంఘ పక్షాన ‘గ్రంథాలయ సర్వస్వం’ పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 

1919 నవంబర్ 14న చెన్నైలో తొలి ‘అఖిల భారత పౌర గ్రంథాలయం’ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. 

పుస్తక ఉద్యమంలో భాగంగా పత్రికలు, గ్రంథాలయాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు.

ఈ సంఘాన్ని స్థాపించిన రోజునే మనం జాతీయ గ్రంథాలయ దినోత్సవం(నేషనల్ లైబ్రరీ డే)గా జరుపుకుంటున్నాం. భారతీయ గ్రంథాలయ సంస్థ దీన్ని గుర్తించి.. దేశమంతటా 1968నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవం(నేషనల్ లైబ్రరీ వీక్)ను నిర్వహించడం విశేషం.

1924లో ఆ సంఘ పక్షాన ‘ఇండియన్ లైబ్రరీ జర్నల్’ అనే ఆంగ్ల పత్రికను సైతం ప్రారంభించారు. అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, ‘‘ప్రజాగ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం’’ అని అంతటా చాటి చెప్పారు.
1934- 48ల మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటుకు నోచుకున్నాయి. ఈయన ప్రోద్బలంతో వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడంతో పాటు మూసివేసినవి తిరిగి పునరుద్ధరణ జరిగాయి. 


గ్రంథాలయోద్యమం

ఆంధ్రదేశంలో జరిగిన గ్రంథాలయోద్యమంలో అయ్యంకి వెంకట రమణయ్య గారితో పాటు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాటూరి నాగభూషణములను కలిపి గ్రంథాలయోద్యమం త్రిమూర్తులుగా పిలిచేవారు. ఆంధ్రదేశంలో బాపట్ల జిల్లా వేటపాలెంలోని సారస్వత నికేతనం చాలా పురాతన గ్రంథాలయం. 

1929లో గ్రంథాలయం కొత్త భవనానికి మహాత్మాగాంధీ శంకుస్థాపన చేయగా, తరువాత ప్రకాశం పంతులుగారిచే ప్రారంభించబడింది. ఇలా ఆంధ్రదేశం నిండా విశిష్ట గ్రంథాలయాలనేకం స్థాపనకు గ్రంథాలయోద్యమం కారణమైందని చెప్పాలి.

ఆధునిక గ్రంథాలయాలేకాక తెలుగుదేశంలో కొన్ని ప్రాచీన పుస్తక భాండాగారాలు కూడా ఉన్నాయి.

పాత గుంటూరులో శ్రీ తిక్కన సోమయాజి నివసించిన వేణుగోపాలస్వామి గుడి రోడ్డులో.. అక్కడికి దగ్గర్లోనే ఒక భవనంలో ఆయన రచనలు చేశారు. తిక్కన తరువాత కొన్ని శతాబ్దాలపాటు ఆ భవనాన్ని 1911లో దాతలు పునర్నిర్మించారు. ఆ భవనంలో శ్రీ మహాకవి తిక్కన భాండాగారము నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ గొప్ప సంఖ్యలో అమూల్య గ్రంథాలు భద్రపరచబడి ఉన్నాయి. వెంకటగిరిసంస్థానం వారు కొన్ని శతాబ్దాల పాటు సరస్వతి నిలయం పేరుతో గ్రంథాలయాన్ని నిర్వహించారు. గ్రంథాలయ నిర్వహణను సరిగా పట్టించుకోకపోవడంతో క్రమంగా శిథిలమై సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 

గుర్తింపు

1972లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు సైతం ఆయన్ను వరించాయి.

గ్రంథాలయోద్ధారక, సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య ఈయన పొందిన గౌరవసూచకాలు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు గ్రంథాలయ శాస్త్రపరీక్షలో ఉత్తమ విద్యార్థికి వీరి పేరుతో స్వర్ణపతకం ఇస్తుంది. 1979లో అయ్యంకి లైబ్రరీ కమిటీ ఏర్పడి ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రంథాలయ కార్యకర్తను సత్కరిస్తోంది.

ఇతరాంశాలు

‘ప్రజల్లో చైతన్యం నింపాలంటే సమాజానికి సంబంధించిన సమగ్ర సమాచారం వారికి తెలియాలి.

ఆ సమాచారం చేరవేయాలంటే పత్రికలు, గ్రంథాలయాలే సులభమైన మార్గం’ అని యోచన చేసిన వ్యక్తి ఆయన.

ఆరోజుల్లో దేవాలయాల్లోనే కాదు.. గ్రంథాలయాల్లోనూ దళితులకు ప్రవేశంలేదు. అటువంటి దురాచారాన్ని పారద్రోలి గ్రంథాలయాల్లోకి ప్రవేశం కల్పించారు అయ్యంకి వారు.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నారు. సావర్కర్ రాసిన పుస్తకాలను అనువదించి, ముద్రించి, పంపిణీ చేయడం ఈయన చొరవవల్లే సాధ్యపడింది.

అంతేకాక నాడు బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించిన గ్రంథాల్ని సైతం రహస్యంగా దాచి, వాటిని ప్రజలకు అందజేశారు.

నాటి మద్రాసు రాష్ట్రం మొత్తం స్థానికుల చేయూతతో పర్యటించారు. పుస్తక ప్రచారం కోసం గ్రంథాలయ యాత్రలను నిర్వహించాలనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

అప్పట్లో ఆయన పాల్గొనని సామాజిక ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు.

విద్యారంగం, సహకారరంగం, ముద్రణారంగం, ఆయుర్వేదరంగం, వైద్యరంగం, దివ్యజ్ఞాన సమాజ రంగాలన్నిటిలో ఆయన కృషి ఎనలేనిది. దాదాపు ఆరుశతాబ్దాలపాటు అవిరామంగా విశేష సేవల్ని అందించారు.

చివరి రోజుల్లో ఒంటరితనాన్ని గడిపారు. అనారోగ్యం కారణంగా 1979, మార్చి 7న ఆయన కన్నుమూశారు.

Show More
Back to top button