Telugu News

బర్డ్‌ ఫ్లూ ముప్పు..! మనుషులపై ప్రభావం ఎంత?

బర్డ్ ఫ్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. దాంతో కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టి.. పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటిస్తున్నారు. అయితే అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నుంచి మనుషులకు ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.

* బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464 మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.

* లక్షణాలు

కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినప్పుడు.. వాటి తల ఉబ్బుతుంది. కాళ్లు, శరీరం పర్పుల్ కలర్‌లోకి మారుతుంది. కోళ్లు సరిగా ఊపిరి పీల్చుకోలేవు, డయేరియా వస్తుంది. దగ్గు, తుమ్ములు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కోళ్లకు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే.. సడెన్‌గా చనిపోతాయి.

* ఎంత వరకు ప్రమాదం..?

ఇది మనుషులకు అరుదుగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షులను ముట్టుకున్నా, వండుకొని తిన్నా, ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన ప్రాంతంలో కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకుంటే.. అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ ఎగురుతూ ఉంటుంది. అలాంటి గాలిని పీల్చినా వైరస్ సోకగలదు. కోడిని సరిగా ఉడకబెట్టకపోయినా, కోడి గుడ్లను సరిగా వంటకపోయినా వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది.

Show More
Back to top button