HISTORY CULTURE AND LITERATURE

మానవజాతి పరిణామ క్రమంలోనే ఒక మహోధ్యాయం.. అరిస్టాటిల్..

అరిస్టాటిల్ ఒక తత్వవేత్త, ఒక భాషా శాస్త్రవేత్త, ఒక విజ్ఞాన శాస్త్రవేత్త, ఒక గణిత శాస్త్రవేత్త, ఒక కవి. అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం,  తర్కశాస్త్రం, తత్వశాస్త్రం, రాజనీతి శాస్త్రం, నీతి శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం లాంటి అనేక రంగాలలో ఆయన కృషి చేశారు. తాను చేసిన కృషి, ప్రతిపాదించిన సిద్ధాంతాలు, బోధించిన పాఠాలు, నిరూపించిన సత్యాలు గత రెండు వేల మూడు వందల సంవత్సరాలుగా ఆయా రంగాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే “అరిస్టాటిల్ వాస్ ద ప్రొఫెసర్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్”. ఆయన బోధించిన సమాచారం లో మూడో వంతు మాత్రమే ప్రస్తుతం మనకు లభ్యమవుతుంది.

మూడోవంతు సమాచారం దాదాపు వెయ్యి పుస్తకాల రూపంలో ఉంది అని పరిశోధకులు తేల్చి చెప్పేశారు. ఒక మనిషి తన జీవితకాలంలో ఇంతటి కృషి చేయడం, ఇన్ని రంగాలను అధ్యయనం చేయడం, బోధించడం గ్రంథస్తం చేయడం సాధ్యమా అని అనిపిస్తుంది. రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రిందట బోధించిన అంశాలు గనుక ఇన్ని తరాల ప్రయాణంలో అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఒరిజినల్ గా మార్పులు, చేర్పులకు గురై ఉండవచ్చు. అది సహజసిద్ధమైన పరిణామక్రమమే. ఈనాటికి కూడా 21వ శతాబ్దంలో ఆర్టిఫిషియల్, ఇంటలిజెంట్ సిద్ధాంతాలు అవి పునాది అరిస్టాటిల్ ఎప్పుడో ప్రతిపాదించిన తర్కశాస్త్రంలోనే ఉంది అని సమకాలిన పరిశోధకులు కూడా అంగీకరిస్తున్న సత్యం. ఎప్పుడో ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఈ కాలంలో కూడా ఎలా సరిపోతున్నాయి అనడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం.

ఈ రోజులలో అనేక కార్పొరేట్ సంస్థలలో బోధిస్తున్న నాయకత్వంలోని విశ్వసనీయత, ధైర్యం, నిజాయితీ, ఎదుటివారిని అర్థం చేసుకోవడం, సానుభూతి, సహానుభూతి వంటి వాటి గురించి అరిస్టాటిల్ వ్రాసిన “నికోమాచియన్ ఎథిక్స్” అనే పుస్తకంలో చాలా వివరాలు ఉన్నాయి. ఆ పుస్తకంలోని పది పాఠాలను పూర్తిగా చదివి అర్థం చేసుకొని అన్వయించుకుంటే పాశ్చాత్య శిక్షణ పాఠాలకు మూలాలన్నీ కూడా అందులో కనిపిస్తాయి. ఇంకొక ఉదాహరణగా అరిస్టాటిల్ ఆ రోజులలోనే ప్రతిపాదించిన కొన్ని రాజకీయ పాఠాలలో ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా ఉండొచ్చు చెప్పవచ్చు. మొదటిది రాజ్యాంగబద్ధమైనది, రెండోది రాజ్యాంగాన్ని ఖాతరు చేయనిది. రాజ్యాంగబద్ధమైన పాలనలో ప్రభుత్వము కొన్ని చట్టాలు, పరిమితులకు లోబడి పరిపాలన కొనసాగిస్తుంది. ఇందులో అల్పసంఖ్యాక వర్గాల ప్రజల హక్కులు రక్షింపబడతాయి. అదే రాజ్యాంగాన్ని లెక్కచేయని పాలనలో మూకపాలన ఉంటుంది. ఇందులో బలవంతులదే రాజ్యం. ప్రజాస్వామ్యంలో మధ్యతరగతి పౌరుల గురించి చాలా చెప్పారు. 

అరిస్టాటిల్ ఈ రెండు వేల సంవత్సరాలుగా వివిధ దేశాల సమాజాలలో ఏర్పడిన  ప్రభుత్వాలని అనుసరించిన విధానాలని విశ్లేషిస్తే ప్రతి ప్రభుత్వ విధానంలోనూ ఎక్కడో ఒకచోట ఎంతో కొంత అరిస్టాటిల్ ప్రతిపాదించిన రాజకీయ సిద్ధాంతం తప్పనిసరిగా కనిపిస్తుంది. అరిస్టాటిల్ కృషిచేసిన మరొక రంగం తర్కం (లాజిక్). ఆయన ప్రతిపాదించిన తర్కశాస్త్ర పాఠాలు గణితశాస్త్ర సిద్ధాంతాలలో ప్రతిబింబించినవేనని విశ్లేషకుల అభిప్రాయం. ఆ రోజులలో అరిస్టాటిల్ చేసిన కీటకాలు, జంతువులు, మొక్కలు వాటి ప్రాథమిక వర్గీకరణ ఆధారంగానే వృక్షశాస్త్రం, జంతుశాస్త్రాలు అభివృద్ధి చెందాయి. విద్యార్థి యొక్క బహుముఖ వికాసమే అసలైన విద్య అని తాను విద్యారంగం గూర్చి వ్రాసిన వ్యాసాలలో చెప్పారు అరిస్టాటిల్. ఈ మార్గదర్శక సూత్రం ఈ కాలంలో ఎంతగా ఉపయోగపడుతుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అరిస్టాటిల్ సిద్ధాంతాలు ఈ రోజుకి ఎంత ఖచ్చితత్వం సాధిస్తాయో చెప్పడానికి వేలాది ఉదాహరణలు చూపించొచ్చు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    అరిస్టాటిల్ 

జననం    :     384 క్రీ.పూ    

స్వస్థలం   :    స్టాగిరా , చాల్సిడియన్ లీగ్, గ్రీసు దేశం.

యుగం          :     ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం

ప్రాంతం       :     పాశ్చాత్య తత్వశాస్త్రం  

ప్రముఖ విద్యార్థులు  : అలెగ్జాండర్ ది గ్రేట్ , థియోఫ్రాస్టస్ , అరిస్టోక్సెనస్

ప్రధాన ఆసక్తులు    :   తర్కం, సహజ తత్వశాస్త్రం, మెటాఫిజిక్స్, నీతి శాస్త్రం, రాజకీయం, వాక్చాతుర్యం, కవిత్వము… 

మరణం        :   322 క్రీ.పూ, 

చాల్సిస్ , యుబోయా , మాసిడోనియన్ సామ్రాజ్యం

అరిస్టాటిల్ జీవితం సంక్షిప్తంగా…

అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384 నుండి క్రీస్తుపూర్వం 322 వరకు సుమారు 62 సంవత్సరాలు జీవించారు. ఆయన అత్యంత ధనికుల కుటుంబంలో జన్మించారు. బోలెడు ధనాన్ని, ఆస్తిని వారసత్వంగా పొందారు. వాళ్ళ నాన్న గారికి ఉన్న రాచరికపు పరిచయాలు అరిస్టాటిల్ జీవితములో ప్రముఖ పాత్ర పోషించాయి. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో దగ్గర చదువుకునే రోజులలోనే అరిస్టాటిల్ తన సొంత అస్థిత్వాన్ని అలవర్చుకున్నాడు. అరిస్టాటిల్ బహుముఖ ప్రజ్ఞత్వాన్ని గమనించిన మాసిడోనియా రాజైన రెండవ ఫిలిప్ కుమారుడు అలెగ్జాండర్ కు శిక్షణ ఇవ్వడానికి అరిస్టాటిల్ ని నియమించారు. అలెగ్జాండర్ కు అనేక శాస్త్రాలతో పాటు రాజనీతి శాస్త్రం కూడా బోధించారు అరిస్టాటిల్. విద్యాభ్యాసం సమయంలో అలెగ్జాండర్ తన గురువు సిద్ధాంతాలను పక్కనపెట్టి ప్రపంచాన్ని జయించాలని దండయాత్ర పరంపరను కొనసాగించడం తరువాత కాలంలో జరిగిన అధ్యాయం. ఏ రాచరికపు పరిచయం అలెగ్జాండర్ కు అరిస్టాటిల్ ని గురువును చేసిందో ఆ రాచరికపు పరిచయమే తరువాత కాలంలో అరిస్టాటిల్ కు శత్రువు అయ్యింది. అరిస్టాటిల్ కు ప్రజల దాడి నుంచి తప్పించుకుని పారిపోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.

నేపథ్యం...

గ్రీసు దేశంలోనే “స్టాగిరా” అనే అరిస్టాటిల్ క్రీస్తుపూర్వం 384 లో జన్మించారు. ఈ స్టాగిరా పట్టణం ఆధునిక థెస్సలోనికీ కి తూర్పున 55 కిమీ (34 మైళ్ళు) దూరంలో ఉన్న చాల్సిడిస్ దగ్గరలో ఉంది. ఆ రోజులలో రాజ్యాలు, రాజులు, రాచరికాలు పెరుగుతూ ప్రతీ చిన్న ప్రాంతం ఒక రాజ్యం లాగా ఉండేది. “స్టాగిరా” అనే పట్టణం మెస్సిడోనియా అనే రాజ్యం ప్రక్కన ఉండేది. “స్టాగిరా” లో ఒక ధనవంతుడైన వైద్యుడు మెస్సిడోనియా రాజు అమింటాస్‌కు వ్యక్తిగత వైద్యుడుగా సేవలందించే వాడు. ఆయన పేరు నికోమాచస్ ఆయనే అరిస్టాటిల్ తండ్రి. 

అమింటాస్‌ రాజ కొలువులో రాజ వైద్యుడుగా కొనసాగిన ఆ పరిచయం ద్వారానే ఆ రోజులలో అలెగ్జాండర్ కు, అరిస్టాటిల్ గురువు కావడానికి కీలకమైన పాత్ర పోషించింది. ఎందుకనగా అరిస్టాటిల్ తండ్రి నికోమాచస్ పనిచేస్తున్న రాజు అమింటాస్‌ మనవడే “అలెగ్జాండర్ ది గ్రేట్”. అరిస్టాటిల్ కు ఒక అక్క కూడా ఉండేది. అరిస్టాటిల్ నాన్న నికోమాచస్ వాళ్ళు ఉండే స్టాగిరా పట్టణంలోనూ, వాళ్ళు ఉండే గ్రీసు దేశంలోనూ బాగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. పుట్టుకతోనే ధనవంతుల కుటుంబం కావడంతో అరిస్టాటిల్ చిన్నప్పటినుంచి చాలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఆ రోజులలో అందమైన దుస్తులు, రకరకాల ఆహార్యం ప్రదర్శించడంతో తాను అందరి దృష్టిలో పడ్డారు. ఆయన చిన్నతనంలోనే నాన్న నికోమాచస్ నుండి సైన్స్ పాఠాలు, మెడిసిన్ పాఠాలు నేర్చుకున్నారు. అరిస్టాటిల్ తన 13 సంవత్సరాల వయస్సులో అమ్మ, నాన్నలను కోల్పోయారు. కొన్నాళ్ళకు అరిస్టాటిల్ అక్క పెళ్లి అయిపోయింది. దాంతో బోలెడంత సంపదకు వారసుడయ్యారు. 

ప్లేటో అకాడమీలో చేరిక…

తల్లిదండ్రులు చనిపోయి ఒంటరి అవ్వడంతో తాను ఒక్కడినే వదిలేయడం ఇష్టం లేని వాళ్ళ బావ అరిస్టాటిల్ కు సంరక్షకుడిగా ఉన్నారు. అరిస్టాటిల్ ను స్టాగిరా నుండి తన బావ, తన ఊరు తీసుకెళ్లారు. దాంతో అరిస్టాటిల్ నాలుగేళ్లు అక్కడే చదువుకున్నారు. ఒకప్రక్కన చదువుకుంటూనే మరోప్రక్క చుట్టుప్రక్కల రాజ్యాలు పర్యటించి వస్తుండేవారు. ఆ రోజులలో సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ఒక పాఠశాల నడుపుతున్నారు. దానిని ప్లేటో అకాడమీ అనేవారు. ఆ అకాడమీ క్రమశిక్షణకు, వివిధ అంశాలకు బోధనకు మంచి పేరు తెచ్చుకుంది. అరిస్టాటిల్ ను వాళ్ళ బావ ఆ ప్లేటో అకాడమీలో చేర్పించారు. తన 17 సంవత్సరాల వయస్సు నుండి అరిస్టాటిల్  20  సంవత్సరాలు పాటు అంటే తనకు 37 సంవత్సరాలు వయస్సు వచ్చేవరకు కూడా ప్లేటో అకాడమీలోలోనే ఉండిపోయారు. అరిస్టాటిల్ గొప్ప తత్వవేత్త. అప్పటికే అనేక అంశాలలో ఆరితేరి ఉన్నారు. ప్లేటో అకాడమీలో చేరిన కొద్ది రోజుల్లోనే చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ప్లేటో కు ప్రియ శిష్యుడు అయ్యారు.

అతి పెద్ద గ్రంథాలయం కలిగివున్న అరిస్టాటిల్.. 

అరిస్టాటిల్ లో ఉన్న చురుకుదనాన్ని మెచ్చిన ప్లేటో ఆయనను ఉపాధ్యాయుడిగా నియమించారు. అరిస్టాటిల్ ఒకవైపు ప్లేటో అకాడమీలో చదువుకుంటూనే మరోవైపు తన తోటి విద్యార్థులకు బోధన కూడా చేస్తుండేవారు. అరిస్టాటిల్ ప్లేటోను ఎంతగా అభిమానించే వారంటే గురువుగా ఒకవైపు గౌరవిస్తూనే మరోవైపు ప్లేటో బోధనలలో అభ్యాసాత్మకంగా లేని వాటిని నిర్మోహమాటంగా విమర్శించడానికి వెనుకాడే వారు కాదు అరిస్టాటిల్.  ప్లేటో, సోక్రటీస్ తత్వాలను వంటబట్టించుకుంటూనే అరిస్టాటిల్ తనదైన సొంతబాణీలో సరికొత్త తత్వశాస్త్రాన్ని ప్రతిపాదిస్తుండేవారు. ఆ ప్రతిపాదనలే అరిస్టాటిల్ తత్వానికి దారితీసాయి. ఏ భావన అయినా సిద్ధాంతంతో ఆగిపోకూడద. దేనినైనా అభ్యాసాత్మకంగా, ప్రయోగత్మకంగా చూడొచ్చనే విషయంలో ప్లేటోతో విభేదించారు. అరిస్టాటిల్ బాగా డబ్బున్న వాడు కనుక చాలా పుస్తకాలు కొని చదువుతుండేవారు. ప్లేటో తన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నప్పటికీ అరిస్టాటిల్ దగ్గర ఉన్న పుస్తకాలను చూసి అసూయ పడుతుండేవారు. ఆ రోజులలో ఏథెన్స్‌లో వ్యక్తిగతంగా అతిపెద్ద గ్రంథాలయం కలిగి ఉన్నది అరిస్టాటిల్ మాత్రమే.

రాజు పిలిప్స్ నుండి ఉత్తరం…

ప్లేటో అకాడమీలో చేరిన కొద్ది సంవత్సరాలకే అరిస్టాటిల్ ప్రతిభ గ్రీసు దేశమంతటా తెలిసిపోయింది. అరిస్టాటిల్ ని చూడడానికి పర్యాటకులు ఏథెన్స్‌ నగరానికి వస్తుండేవారు. అరిస్టాటిల్ తన 28 సంవత్సరాల వయస్సులో అంటే ఆయన ప్లేటో అకాడమీలో చేరిన 11 సంవత్సరాలకి మెసిడోనియా రాజైన రెండో పిలిప్స్ నుండి ఒక ఉత్తరం అందింది. అందులో ఇలా వ్రాసి ఉంది.

“ప్రియమైన అరిస్టాటిల్. నీ ప్రతిభా సామర్థ్యాల గురించి, నీ జ్ఞాన సంపద గురించి చాలా విశేషాలు వింటున్నాను. మీ నాన్న, మా నాన్నగారి కొలువులో అద్భుతమైన వైద్యుడుగా సేవలందించారు. ఈ ఉత్తరం వ్రాయడానికి కారణం ఏమిటంటే నాకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నాను. ఇతడు పెరిగి పెద్దయ్యాక ప్రపంచంలోని దేశాలన్నింటినీ జయించి జగత్ విజేత కావాలనేది నా కోరిక. తగిన విద్యా బుద్ధులు నేర్పే గురువు కోసం ఎప్పటినుండో అన్వేషిస్తున్నాను. ఆ గురువు మీరే కావాలని నా ఉద్దేశం. నిజానికి మీరు జీవించి ఉన్న కాలంలోనే నాకు కొడుకు పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా అబ్బాయికి 13 సంవత్సరాల వయస్సు రాగానే మీకు కబురు పంపిస్తాను. అప్పటినుంచి మా అబ్బాయి నీ శిష్యుడు అవుతాడు. ఈ విషయాన్ని చాలా సంవత్సరాలు ముందుగానే మీకు తెలియాలని ఈ ఉత్తరం వ్రాస్తున్నాను”. ఇది ఆ లేఖలోని సారాంశం. ఆ రోజులలో కొడుకు పుట్టగానే గురువును నిర్ణయించడానికి ఇది ఒక ఉదాహరణ.

హెటార్నిస్ కు రాజు అయిన మిత్రుడు హెర్మియన్..

అరిస్టాటిల్ ఏథెన్సులో ఉండగానే జరిగిన మరో సంఘటన. అరిస్టాటిల్ ప్లేటో అకాడమీలో ఉండగానే తనతో కలిసి చదువుకున్న వాళ్ళలో ఇంకొక వ్యక్తి హెర్మియన్. అతను ఎక్కువకాలం ప్లేటో అకాడమీలో చదువుకోకుండా చాలా ముందుగానే ఆ పాఠశాలలో చదువు ముగించుకొని గ్రీసు దేశంలో ఒక చిన్న రాజ్యానికి అధిపతి అయ్యారు. బంధువులు లేని హెర్మియన్ ఒక పెట్టుబడిదారుడు దగ్గర ఉండేవారు. ఆ పెట్టుబడుదారుడు హెర్మియన్ ను ప్లేటో అకాడమీలో చేర్చారు. ఆయన చదువు అయిపోయినాటికీ ఆ పెట్టుబడుదారుడు ఇచ్చిన అప్పులవారు తిరిగి ఇవ్వకపోయేసరికి వారి భూములను, ఇళ్లను స్వాధీన పరుచుకొని ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. హెర్మియన్ ప్లేటో అకాడమీ నుండి రాగానే సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. దాంతో హెర్మియన్ ఆ రాజ్యానికి తాను ఒక్కడే రాజు అయ్యారు. 

స్పేయుసిప్పన్ చేతికి ప్లేటో అకాడమీ…

హెర్మియన్ తనతో పాటు చదువుకున్న సహాధ్యాయి అరిస్టాటిల్ అంటే తనకు విపరీతమైన అభిమానం. తాను రాజు అయినా కూడా హెర్మియన్ తన మిత్రుడు అరిస్టాటిల్ ను మర్చిపోలేదు. తాను అరిస్టాటిల్ జీవితంలోకి అత్యంత కీలకమైన మలుపులకు కారణమయ్యారు. ఆ సమయానికి అరిస్టాటిల్ గురువు ప్లేటో క్రీస్తు పూర్వం 347లో మరణించారు. అప్పటికే అరిస్టాటిల్ అకాడమీ వచ్చి 20 ఏళ్ళు అయ్యింది. అప్పటికీ ఆయన వయస్సు 37 సంవత్సరాలు. ప్లేటో మరణించాక ప్లేటో అకాడమీ ఆయన మేనల్లుడు స్పేయుసిప్పన్ చేతికి వెళ్ళింది. స్పేయుసిప్పన్ కు మూర్ఖుడు. తనకు అస్సలు మంచి పేరు లేదు. ఒకసారి పాఠాలు చెబుతున్నప్పుడు ఒక కుక్క మొరుగగా, దానిని తీసుకెళ్లి బావిలో విసిరేసాడు. అకాడమీలో విద్యార్థులకు అతని పట్ల గౌరవం లేదు. కేవలం ప్లేటో మేనల్లుడు అని మాత్రమే అకాడమీకి తాను పెద్దగా ప్రకటించుకున్నాడు. ఇది నచ్చని అరిస్టాటిల్ అక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయానికి వచ్చి, అక్క బావల దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అంతలోనే తన రాజ్యానికి వచ్చేయమని అరిస్టాటిల్ కు హెర్మియన్ కబురు పంపారు. ఆ రాజ్యం పేరు హెటార్నిస్.

హెర్మియన్ కు పరిపాలనా సలహాదారుడిగా…

తనతో పాటు ప్లేటో అకాడమీలో సహధ్యాయి, అసంతృప్తికి గురైన జెనోక్రేట్స్‌ తో కలిసి హెర్నియాస్ పాలనలో ఉన్న హెటార్నిస్ రాజ్యానికి వెళ్ళారు అరిస్టాటిల్. తన రాజ్యాన్ని గ్రీకు రాజ్యానికి కేంద్రంగా చేయాలనేది హెర్మియన్ ఆలోచన. అందుకోసం తనతో పాటు చదువుకున్న అరిస్టాటిల్ ని పిలిపించుకున్నారు హెర్నియాస్. అప్పటికే అరిస్టాటిల్ పేరు అత్యంత ప్రతిభావంతుడిగా గ్రీసు దేశమంతా మారుమ్రోగిపోయింది. అరిస్టాటిల్ హెర్మియన్ కుడి భుజం అయ్యారు. హెర్మియన్ రాజ్యాన్ని సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో కూడా సలహాలు తీసుకుంటూ ఉండేవారు హెర్మియన్. ఆ చుట్టుప్రక్కల రాజ్యాల పాలన ఎలా ఉంది? అక్కడ ప్రజలకు ఏ రాజ్యాంగం అమలులో ఉన్నాయి అని అధ్యయనం చేసి, ఆదర్శవంతమైన రాజు ఎలా ఉండాలి? ఆయన పరిపాలనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాజ్యాంగంలోని ఏఏ వర్గాల ప్రజలను ఎలా చూసుకోవాలి? అనే అంశాల మీద హెర్మియన్ కొలువులో ఉండగానే ఒక పుస్తకం కూడా వ్రాశారు అరిస్టాటిల్. ఆ తరువాత రోజులలో ఆ పుస్తకం విస్తరించి రీపబ్లిష్ అయ్యింది.

పైథియాస్ తో వివాహం…

హెర్మియన్ వద్ద నాలుగు సంవత్సరాలు ఉన్నారు అరిస్టాటిల్. అప్పటికే తన వయస్సు 40 దాటింది. హెర్మియన్ కొలువులో ఉండగానే పైథియాస్ అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వారికి తరువాత రోజులలో వారికి ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు పైథియాస్ జూనియర్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత రోజులలో ఆ అమ్మాయిని అరిస్టాటిల్ అక్క కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. పైథియాస్ ను పెళ్లి చేసుకున్న అరిస్టాటిల్ తమ ఆవాసాన్ని దగ్గరలో ఉన్న ఒక ద్వీపానికి మారారు. అక్కడ అరిస్టాటిల్ మొక్కలపై పరిశోధన ప్రారంభించారు. ఒక పాఠశాలను కూడా స్థాపించారు. ఆ రోజులలో అరిస్టాటిల్ ప్రారంభించి కొనసాగించిన మొక్కల వర్గీకరణే 18 వ శతాబ్దం దాకా శాస్త్రజ్ఞులు ప్రామాణికంగా పరిగణిస్తూ ఉండేవారు.

ఇలా అరిస్టాటిల్ తన భార్యతో ఉంటూ పరిశోధనలు కొనసాగిస్తున్న సమయంలో క్రీస్తుపూర్వం 343లో తన 40 సంవత్సరాల వయస్సులో మాసిడోనియా రెండో రాజు ఫిలిప్ నుంచి వర్తమానం వచ్చింది. ఫిలిప్ రెండో కుమారుడు అలెగ్జాండర్ కు 13 ఏళ్లు వచ్చాయి. అలెగ్జాండర్ జన్మించినప్పుడు మీరే విద్యాబుద్ధులు నేర్పాలి అని ఎప్పుడో ఫిలిప్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు హెర్మియన్ కొలువులో సెలవు తీసుకుని మాసిడోనియా వెళ్ళిపోయారు. అరిస్టాటిల్ వెళ్లిన రెండేళ్లకు హెర్మియన్ యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కి దారుణంగా మరణించారు. ఆ సందర్భంలో హెర్మియన్ స్మృతిలో అరిస్టాటిల్ వ్రాసిన కవిత ఇప్పటికీ కూడా ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేకమైన, ప్రామాణికమైన స్మరణీకగా ప్రశంసలు అందుకుంటుంది. అది అరిస్టాటిల్ కి తన మిత్రుల పట్ల, శ్రేయోభిలాషుల పట్ల ఉన్న గౌరవం, అభిమానం.

విలక్షణ బోధనతో శిక్షణనిస్తూ…

అరిస్టాటిల్ అలెగ్జాండర్ కు మాత్రమే పాఠాలు చెప్పే ట్యూషను మాష్టారుగా కొనసాగలేదు. అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ అరిస్టాటిల్ కి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఫిలిప్ కోరిక మేరకు ఆదేశాలానుసారంగా సకల సదుపాయాలు కల్పించారు. దాంతో అరిస్టాటిల్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో గురుకులం ప్రారంభించారు. అలెగ్జాండర్ తో పాటు వివిధ రాజ్యాల రాజకుమారులు ఆ గురుకులంలో అలెగ్జాండర్ వద్ద శిక్షణ తీసుకునేవారు. సైన్సు, గణితం వీటితోపాటుగా జాగ్రఫీ, ఆనాటి ప్రపంచ చరిత్ర, రాజకీయ శాస్త్రం, రాజు పరిపాలన చేసే సమయంలో కావలసిన మెలకువలు ఇలాంటివన్నీ బోధించారు అరిస్టాటిల్. ఆయన శిక్షణ విలక్షణంగా ఉండేది. ప్రశాంతమైన తోటలో పెద్ద రాయి మీద అరిస్టాటిల్ కూర్చుని ఉంటే, చుట్టూ శిష్యులు ఉండేవారు. ఆయన నడుస్తూ వుంటే తనతో పాటు శిష్యులు కూడా నడుస్తూ ఉండగా పాఠాలు చెబుతుండేవారు.

అరిస్టాటిల్ ని గురు బోధనకు దక్షిణగా ఏమి ఇవ్వాలని ఫిలిప్ అడుగగా దానికి సమాధానంగా “నేను మామూలుగానే ధనవంతుడిని, నాకు డబ్బు ఏమీ వద్దు. రెండు మూడేళ్ల క్రిందట దండయాత్రకు వెళుతూ మీరు ధ్వంసం చేసిన మా ఊరు స్టాగిరాలో ప్రజలు చెట్ల క్రింద, పుట్టల క్రింద బ్రతుకుతెరువు లేక నానా కష్టాలు పడుతున్నారు. దయచేసి మా ఊరును మళ్లీ మామూలు స్థితికి చేర్చి, అక్కడ ఏదైనా ఉపాధి కల్పించాలని చెప్పారు” అరిస్టాటిల్. ఫిలిప్ రాజు మారు మాట్లాడకుండా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. తాను ధ్వంసం చేసిన స్టాగిరా ప్రాంతాన్ని పునర్నిర్మించి అక్కడున్న ప్రజలకు ఉపాధి కల్పించి ఆ గ్రామాన్ని మామూలు స్థితికి తెచ్చారు ఫిలిప్. ఇదంతా అరిస్టాటిల్ మీద ఉన్న గౌరవంతో అరిస్టాటిల్ కు తన ఊరు మీదున్న గౌరవంతో. అరిస్టాటిల్ అంటే గురువుగా కొంత అభిమానం ఉన్నప్పటికీ అలెగ్జాండర్ తన సొంత భావాలకు రాజీ పడేవారు కాదు. 

అలెగ్జాండర్ కు “ది ఇలియడ్” పుస్తకం బాహూకరణ..

ఒకసారి అరిస్టాటిల్ శిష్యులతో  “మీరు రాజ్యాలను పరిపాలించేటప్పుడు సమస్యలు తలెత్తితే ఎలా పరిష్కరిస్తారు”? అని అడిగారు. దానికి సమాధానం గా పరిపాలన సమయంలో ఈ సలహాలు తీసుకుంటాం, పరిపాలన సవ్యంగా సాగాలంటే మీలాంటి వారి సలహాలు ఎప్పుడూ ఉండాలని శిష్యులు అన్నారు. కానీ అలెగ్జాండర్ దానికి భిన్నంగా పరిపాలన సమయంలో వచ్చే సమస్యలకు సమాధానం చెప్పలేను. వచ్చే సమస్యను బట్టి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పరిష్కారాలను ఆలోచించవలసి వస్తుంది అనే భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అలా అలెగ్జాండర్ కలిగి ఉన్న స్వతంత్ర భావాలే తన ప్రపంచాన్ని జయించడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చింది. అయితే అరిస్టాటిల్ మీద గౌరవాన్ని జీవితాంతం అలెగ్జాండర్ కొనసాగించారు. రచయిత హోమర్ వ్రాసిన “ది ఇలియడ్” అనే గ్రంథాన్ని అలెగ్జాండర్ కి బహుమతిగా ఇచ్చారు అరిస్టాటిల్. “ది ఇలియడ్” అనే వీరగాథ పుస్తకాన్ని తనతోనే ఉంచుకునేవారు అలెగ్జాండర్. వివిధ దేశాల మీద దండయాత్ర చేసినప్పుడు ఆ పుస్తకాన్ని చదువుతూ తన దిండు క్రిందనే పెట్టుకునేవారు. అలెగ్జాండర్ తండ్రి మరణంతో అలెగ్జాండర్ రాజ్యాధికారాన్ని చేపట్టాల్సి వచ్చింది. దాంతో అరిస్టాటిల్ మెసిడోనియాలోని ఆ గురుకులాన్ని మానేసి స్టాగిరాకి వెళ్లి అక్కడ ఐదేళ్లు ఉన్నారు. అక్కడ కూడా పాఠాలు చెబుతుండేవారు. 

లైసియం అకాడమీ స్థాపించిన అరిస్టాటిల్…

అలెగ్జాండర్ ప్రపంచ దండయాత్ర చేస్తూ తన ఊరు మీదిగా వెళుతున్నప్పుడు అరిస్టాటిల్ తన దగ్గర బంధువైన పాలిస్తన్స్ అనే వ్యక్తిని అలెగ్జాండర్ కు సలహాదారుడిగా పంపించారు. గురువు మీద ఉన్న అభిమానంతో పాలిస్తన్స్ తనతో పాటు తీసుకెళ్లారు అలెగ్జాండర్. పాలిస్తన్స్ పెద్ద వాగుడుకాయ. అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతుండేవాడు. అలెగ్జాండర్ ఒక రాజ్యాన్ని జయించి మరో రాజ్యానికి వెళుతుంటే అతనిని విమర్శించడం, పదేపదే తప్పు ఉందని చెబుతుండడంతో భరించలేని అలెగ్జాండర్ పాలిస్తన్స్ ను ఒక బోనులో బంధించి తనతో పాటు తీసుకెళ్లారు. అలెగ్జాండర్ సైన్యం ఎడాలరుల గుండా నడిచి వెళ్లేటప్పుడు ఆ వేడిమి కి, ఎండకి పాలిస్తన్స్ శరీరం అంతా బొబ్బలెక్కి భయంకరంగా తయారయ్యింది. 

అది చూడలేని అలెగ్జాండర్ పాలిస్తన్స్ ను జంతువులకు ఆహారంగా వేశారు. ఇది తెలిసిన అరిస్టాటిల్ బాధపడ్డారు. అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వెళుతున్న సమయంలో అరిస్టాటిల్ తన గ్రామం స్టాగిరా నుంచి మకాం మార్చారు. తాను చదువుకున్న ప్లేటో అకాడమీ నిర్వహిస్తున్న స్పియుసిప్పస్ మరణించాడు. ఆ అకాడమీని తాను తీసుకోవడానికి వీలవుతుందేమోనని ప్రయత్నించారు అరిస్టాటిల్. దాంతో తన మరొక స్నేహితుడైన జెనోక్రేట్స్‌ చేతికి వెళ్ళింది. దానికి పోటీగా అరిస్టాటిల్ మరొక అకాడమీ మొదలుపెట్టారు. దాని లైసియం. ఇది 13 సంవత్సరాల పాటు కొనసాగింది. అరిస్టాటిల్ జీవితంలో ఇది చివరి అంకం.

మరణం…

అలెగ్జాండర్ వివిధ దేశాలను జయించినప్పుడు అక్కడ సేకరించిన మొక్కలను అరిస్టాటిల్ అకాడమీకి పంపేవాడు. తన గురువు పరిశోధనల కోసం మాసిడోనియాలో వెయ్యి మంది బృందాన్ని తన గురువు అరిస్టాటిల్ అవసరాల కోసం ఉంచారు అలెగ్జాండర్. జాగ్రఫీలోని అన్ని దేశాలు జయించిన అలెగ్జాండర్, చైనాను మాత్రం ముట్టుకోలేదు. ఎందుకంటే ఆ రోజులలో చైనా దేశం ఉనికి గురించి చాలామందికి తెలియదు. అలెగ్జాండర్ కు అరిస్టాటిల్ చెప్పిన పాఠాలలో చైనా గురించి తెలియదు. దండయాత్రలో మునిగి తేలుతున్నప్పటికీ అరిస్టాటిల్ కి అలెగ్జాండర్ నుండి ఎప్పుడూ మద్దతు ఉంటూ ఉండేది. 

అలెగ్జాండర్ తన 32 సంవత్సరాల వయస్సులో  క్రీస్తుపూర్వం 323లో బాబిలోన్ లో మరణించాక ఇక్కడ ఏథెన్సులో అరిస్టాటిల్ కు కూడా గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. అలెగ్జాండర్ అంటే ఇష్టం లేని వాళ్ళందరూ ఒక్కటయ్యి అలెగ్జాండర్ మద్దతుదారుల మీద దాడులు ప్రారంభించారు. ఏథెన్సులోనే లోనే ఉంటే తన మీద కూడా దాడులు జరుగుతాయని అరిస్టాటిల్ కు అర్థమైంది. అక్కడే కొనసాగితే వంద సంవత్సరాల క్రిందట సోక్రటీస్ కు పట్టిన గతి తనకు కూడా పడుతుందని, నచ్చని వాళ్లకు మరణశిక్ష విధించే ఆ రోజులలో ప్రజల చేతిలో మరొక్క తత్వవేత్త మరణించకూడదనుకున్న అరిస్టాటిల్  ఏథెన్సు నుండి వాళ్ళ అమ్మ గారి ఊరు అయిన చాల్సిస్ కు వెళ్ళిపోయారు. ఇదంతా క్రీస్తుపూర్వం 323 లోనే జరిగింది. 

అప్పటికే అరిస్టాటిల్ వయస్సు 61 సంవత్సరాలు. అప్పటికి వేలాది పుస్తకాలకు సరిపడా పాఠాల్ని, పాఠ్యాంశాలను సమకూర్చారు. అరిస్టాటిల్ చాల్సిస్ వెళ్లాక  ఏథెన్సు ఉద్యమకారులకు దొరకకుండా 11 నెలలు అజ్ఞాతంలోనే గడిపారు అరిస్టాటిల్. అలా అజ్ఞాతంలో ఉండగానే క్రీస్తుపూర్వం 322 లో తన 62 సంవత్సరాల వయస్సులో చాల్సిస్ లోనే అనారోగ్యంతో మరణించారు. అరిస్టాటిల్ మరణంతోనే ఆయన జీవితం పరిసమాప్తమయ్యింది. కానీ ఆయన బోధించిన, పరిశోధించిన, ఆవిష్కరించిన అనేక శాస్త్రాలు మాత్రం మానవజాతి చరిత్రలోనే అత్యద్భుతమైన అధ్యయనానికి పునాదులు వేశాయి, నాంది వాచకం పలికాయి. అరిస్టాటిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అరిస్టాటిల్ జీవితం మానవజాతి పరిణామ క్రమంలోనే ఒక మహోధ్యాయం.

అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు…

★ ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అతడు పదే పదే చేసే పనులమీదే ఆధారపడి ఉంటుంది. ఎక్సలెన్స్ అనేది ఒక్కసారితో అయిపోయేది కాదు, అది అలవాటు కావాలి…

★ జ్ఞాన సముపార్జన లక్ష్యం ఆనందం సంపాదించడం కాదు, బాధను తప్పించుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవడమే అన్ని జ్ఞానాలకు పునాది..

★ మనసును విద్యావంతం చేయకుండా, మెదడుకు పాఠాలు నేర్పడం వలన ఉపయోగాలు లేవు..

★ విద్యావృక్షం వేర్లు చేదుగా ఉంటాయి. కానీ దానికి కాచే ఫలాలు చాలా తియ్యగా ఉంటాయి…

★ తెలుసుకోవడం ఎక్కువైన కొద్దీ నీకేం తెలియాలో అర్థం అవుతుంది.

★ సంతోషం, ఆనందం అనేది మన యొక్క మానసిక స్థితి. అంతేకానీ బయట నుంచి వచ్చేది కాదు. 

★ అందరికీ మిత్రుడుగా ఉండాలనుకునేవారు, ఎవ్వరికీ మిత్రులుగా కాలేరు.

★ యాభై మంది శత్రువులకు విరుగుడు ఒక్క మిత్రుడు..

★ స్నేహాన్ని నిలబెట్టేది పరస్పర గౌరవం..

★ కళ యొక్క ముఖ్య ఉద్దేశం బాహ్య సౌందర్యాన్ని చిత్రీకరించడం కాదు, అంతః సౌందర్యాన్ని ఆవిష్కరించడం..

అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలలో లోపాలు…

★ బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పాడు. ఇది తప్పని గెలీలియో ఋజువు చేశాడు..

★ శూన్య ప్రదేశం సృష్టించడం అసాధ్యమన్నాడు. కాని సాధ్యమేనని తదుపరి తెలిసింది..

★ వస్తువు కదలాలంటే శక్తి అవసరమని మామూలుగా వస్తువు స్థిరంగా ఉంటుందని చెప్పాడు. కాని అది తప్పని న్యూటన్ ఋజువు చేశాడు..

★ విశ్వానికి భూమి కేంద్రమని, చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి ఉన్నదని చెప్పాడు. కాని ఈ రెండు తప్పే కదా..

రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రిందట, అప్పటికి ఆయనకున్న వనరుల పరంగా ఆయన ఆలోచించి చెప్పినటువంటి సిద్ధాంతాలలో ఇలా చిన్నచిన్న పొరపాట్లు ఉండవచ్చు. కానీ తొంభై శాతం పైగా ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం మీదనే అభివృద్ధి చెందాయి అని ఇప్పటికీ కూడా పరిశోధనలు, విశ్లేషకులు  అంగీకరించే వాస్తవం.

Show More
Back to top button