
మన తెలుగువాళ్లు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాలగమనంలో మార్పు తప్పదు. కల్పంలో మహాయుగాలు, యుగాలు ఉన్నాయి. ప్రతీవాటికి ధర్మాలు మారుతుంటాయి. అలానే ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లున్నాయి. ఆయా సంవత్సరాల పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు.
మళ్లీ ఈ లెక్క ప్రభవతో ప్రారంభమవుతుంది.
ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలున్నాయి. ఒక ఇతిహాసం ప్రకారం శ్రీకృష్ణుడికి 16,100మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారికి 60మంది సంతానం. వారిపేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. మరో వృత్తాంతం ప్రకారం నారదుడి సంతానం పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారన్న మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దక్షప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు.
ఏదేమైనా ఈ ఉగాదితో ప్రారంభయ్యే విశ్వవాసు తెలుగు సంవత్సరాలలో 39వది. శుభాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది.
బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి రుతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైందని, ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాల్లో మొదటిది ప్రభవ. చివరిది క్షయ అంటే నాశనమైందని.
అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సృష్టి ప్రారంభమైంది కావున ఆ రోజు యుగాది.. అదే క్రమేపీ ఉగాదిగా మారింది. మరి తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి. ఆ పేర్ల వెనుక కారణాలు, అర్థాలు ఎలా వచ్చాయంటే..
మనిషి నిజమైన ఆయుర్దాయం 120ఏళ్లు అట. ఒకప్పుడు ప్రజలు పరిపూర్ణమైన ఆయుష్షుని సాధించేవారు.. కాగా ఆ వయసు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. శాస్త్రవేత్తలు సైతం ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహార విధానాల వల్లే మనుషులు 120 ఏళ్లు బతకగలగడం సాధ్యం.. లేదంటే అసాధ్యమనీ తేల్చేశారు.
ఇక హిందూ సంవత్సరాలు చూసుకుంటే 60 ఉండటం.. మనిషి దేనినైనా రెండుతో భాగించడం కనిపిస్తుంది. అది మౌలికమైన భాగాహారం. అంతేకాదు రెండుగా భాగించిన వస్తువు కలిసి కదిలితే ఒక వలయం పూర్తవుతుంది.
ఉత్తరాయణం- దక్షిణాయనం, శుక్ల పక్షం- కృష్ణ పక్షం,
పగలు- రాత్రి… ఇలా కాలం ప్రాథమికంగా రెండు వర్గాలుగా కనిపిస్తుంది. ఈ ద్వంద్వాలతోనే జీవిత వలయం ముందుకు నడుస్తుంది. అలా 120 ఏళ్ల మనిషి జీవితాన్ని కూడా రెండు భాగాలుగా చేస్తే 60 ఏళ్లుగా తేలుతుంది. వాటిలో మొదటి 60 ఏళ్లు పూర్తయిన తరువాత షష్టిపూర్తి చేసుకునే ఆచారమూ కనిపిస్తుంది. ఇప్పుడు రెండో షష్టిపూర్తి చేసుకునే పరిస్థితులు లేవు కాబట్టి వేయి పున్నములు చూసినవారికి ‘సహస్రపూర్ణ చంద్రోదయం’ పేరుతో ఉత్సవం జరుపుతున్నారు.
మనిషి ఆయుర్దాయంలో 60 సంవత్సరాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ 60 ఏళ్లలో మనిషి తన స్వానుభవంలో రకరకాల అనుభవాలు పొందుతాడు కాబట్టి… ఒకో సంవత్సరానికీ ఒక లక్షణాన్ని ఆపాదించారు పెద్దలు. ఆ లక్షణాల ఆధారంగానే వాటి పేర్లనీ నిర్ణయించి ఉంటారు. అయితే ఈ సంవత్సరాలకి ఆ పేర్లు రావడానికి కొన్ని గాథలు కూడా ప్రచారంలో కనిపిస్తాయి. శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన సందీపని అనే రాకుమారికి 60 మంది సంతానమనీ… అవే సంవత్సరాది పేర్లుగా మారాయని చెబుతారు. మరో గాథ ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడు వివాహం చేసుకుని 60 మంది సంతానాన్ని కలుగజేశాడని.. వారి పేర్లే సంవత్సరాలకు పెట్టారనీ చెబుతారు.
అటువంటి 60 సంవత్సరాదుల పేర్లూ ఎక్కడ చూసినా మనకు కనిపిస్తాయి.
ఉగస్య ఆదిః కలిపి ఉగాది అంటారు.
ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు. రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే… 864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలా వందేళ్లు బ్రహ్మ ఆయుర్దాయం.
ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయసు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5,114 సంవత్సరాలైంది.
ఉగాదినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఈరోజే..
ముస్లిం భక్తులు పూజించే విభిన్న సంస్కృతి..
కడప నగరంలో దేవుడి కడపగా పిల్చుకునే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. తిరుమలకు కాలినడకన వెళ్లే యాత్రికులు ఈ క్షేత్రాన్ని ముందుగా దర్శించుకునేవారు. అందుకే ఈ క్షేత్రానికి దేవుని గడప అని పిలుచుకునేవారని.. అదే కడపగా మారిందనీ చెబుతారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలాగానే ఇక్కడి వెంకన్న ఆలయం కూడా ఉగాది రోజున కిటకిటలాడిపోతుంది. ఈ సందడిలో పాలుపంచుకునే ముస్లింల భక్తిని చూసి తీరాల్సిందే!
వెంకన్న భార్యల్లో ఒకరైన బీబీ నాంచారమ్మ ముస్లింల ఆడపడుచు అయినందువల్ల కడప చుట్టుపక్కల ముస్లింలు వెంకటేశ్వరస్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. ఏటా ఉగాదినాడు తప్పకుండా ఆయనను దర్శించుకుంటారు.
ఏదో మొక్కుబడిగా గుడికి వస్తారనుకుంటే అది మన పొరపాటే..
ఉగాది రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, ఉగాది పచ్చడిలో వేసే బెల్లం, వేపపువ్వు, చెరుకు, చింతపండు మొదలైనవి తీసుకుని ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కూడా వీరి భక్తి ప్రపత్తులు హైందవులకి ఏమాత్రం తీసిపోవు. తాము తెచ్చిన పదార్థాలను స్వామివారికి నివేదించి, కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. ఈరోజంతా వారు మద్యం, మాంసాలను ముట్టరు.
ఇలా ఉగాది రోజున ముస్లింలు వెంకన్నను సేవించుకునే ఆచారం వందల ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతుందని చెబుతున్నారు. కాలం మారినా.. కల్మషాలు రేగినా, ఈ ఆచారం ఇలా సాగుతూనే ఉంటుందని అక్కడి ముస్లిం పెద్దలు భరోసాగా చెప్పడం విశేషం.
ఉగాదికి చలువనిచ్చే చలివేంద్రం..
ఉగాది అంటేనే మండు వేసవికి ముందు వచ్చే పండుగ. ఈరోజు నుంచి రోజురోజుకీ ఎండలు పెరుగుతాయి. అందువల్ల ఉగాదినాడు చేయవలసిన క్రతువుల్లో ప్రపాదాన ప్రారంభం.. ప్రపా అంటే చలిపందిరి అని అర్థం. గోమయంతో అలికిన ప్రాంతంలో, చల్లని కుండలో నీటిని నింపి వచ్చేపోయే బాటసారులకు దాహార్తిని తీర్చమంటోంది ఉగాది. కుండలో నిల్వ చేసిన నీరు అటు చల్లదనాన్ని అందిస్తూ, పరిశుభ్రమైన నీటిని తాగేందుకు తోడ్పడుతుంది. అయితే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, యథాశక్తి వచ్చేపోయేవారికి దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నించాలి.