CINEMATelugu Cinema

మొదటి సినిమాకు స్టూడియోలో తొలి రోజు కెమెరా అనుభవం.. ఎన్టీఆర్..

ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని చేరుకోవాలంటే తొలి అడుగుతోనే ప్రారంభించాలి. ఎంత పెద్ద ప్రయాణమైనా కూడా తొలి అడుగుతోనే మొదలవుతుంది. ఎంతో ఎత్తుకు ఎదిగే మహావృక్షం కూడా, విత్తనం రూపంలో తొలి అడుగువేస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలిసిపోయే నది ప్రవాహం కూడా తొలి అడుగుతోనే ప్రయాణం ప్రారంభిస్తుంది. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినా, ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినా, కాలి నడకన కాశీకి వెళ్లాలన్నా తొలి అడుగుతోనే ఆరంభించాలి. అలాంటి లక్ష్యాలను ఎదుర్కొనే క్రమంలో ఎన్నో కష్ఠాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. అదేవిధంగా చలనచిత్రసీమలో వెండితెరపై మహా నటులుగా వెలిగిపోయిన వారంతా కూడా ఒకప్పుడు వర్ధమాన నటులే. విశ్వవిఖ్యాత మహానటుడు, యుగపురుషుడుగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన నందమూరి తారకరామారావు కూడా ఒకప్పటి వర్ధమాన నటుడే. ఆయన కూడా రంగస్థల నటుడిగా, సినిమా నటుడిగా తొలి అడుగువేసిన వారే, తొలి రోజు షూటింగులో తికమకపడిన వారే.

28 మే 1923 వ తేదీన, సాయంత్రం 4:32 నిముషాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు నందమూరి తారక రామారావు జన్మించారు. తల్లి ఆయనకు మొదటగా కృష్ణ అనే పేరు పెట్టాలని అనుకున్నారు, కానీ మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. ఆ పేరు తరువాత రోజులలో తారక రామారావుగా మారిపోయింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో, కళాశాల విద్య విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో పూర్తిచేశారు.

అక్కడ తెలుగు విభాగానికి అధిపతిగా ఉన్న విశ్వనాథ సత్యనారాయణ ఒకసారి నాటకములో రామారావుతో ఆడవేషం వేయించారు. కానీ ఆడవేశం వేసినప్పుడు తన మీసాలు తీయటానికి రామారావు “ససేమిరా” అన్నారు. మీసాలతోటే నటించడం వలన ఎన్టీఆర్ కు “మీసాల నాగమ్మ” అనే పేరు తగిలించారు. విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో చదువు అయిపోయిన తరువాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (యన్.ఏ.టి) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన “పాపం” వంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆ తరువాత యల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మన దేశం (1949) చిత్రంతో తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు.

తొలిరోజు నిర్భయంగా కెమెరా ముందు..

నందమూరి తారకరామారావు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశం చేసిన తొలినాళ్ళలో కెమెరా ముందు తన తొలిరోజు అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వెండితెరపై కనిపించినది 1949 వ సంవత్సరంలో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా “మనదేశం”. ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ పతాకం పై అలనాటి నటి కృష్ణవేణి మరియు ఆమె భర్త మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రానికి “విప్రదాస్” అనే బెంగాలీ నవల మూలం. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఈ చిత్ర కథకు నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీసు ఇన్స్పెక్టరు పాత్ర పోషించిన ఎన్.టి.ఆర్.కు రూ.2000 పారితోషికం ఇచ్చారు. ఈ చిత్రానికి దర్శకులు యల్.వీ.ప్రసాద్. తొలిరోజు చిత్రీకరణలో పాల్గొన్న ఎన్టీఆర్ కెమెరా ముందు భయం, జంకు లేకుండా నటించారు. అదివరకే నాటకరంగంలో కొంత ప్రవేశం ఉండడం వలన సెట్ మీద తొలి రోజు నిర్భయంగా నటించేశారు. కెమెరాలు, మైకులు ఎన్టీఆర్ లోని చైతన్య స్రవంతిని ఇంకేటట్లు చేయలేకపోయాయి. మరో విషయం ఏమిటంటే నాటకరంగం మీద ఎన్నో రకాల పాత్రలను పోషించిన తాను ఎక్కువగా ఉద్రేకపూరితమైన, ఉత్తేజకరమైన పాత్రలను వేస్తుండేవారు. నాటకరంగంలో ఉన్న అనుభవంతోనే ఆయన ఎక్కువగా నటన అంటే సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తుండేవారు.

నాటకరంగంలో తొలి పాత్ర “ఆడ వేషం”…

నందమూరి తారకరామారావు కళాశాల చదువుతున్న రోజులలో తొలిసారిగా నాటకరంగంపై అడుగుపెట్టారు. ఆయన రంగస్థలంపై మొట్టమొదట ఆడవేషం ధరించారు. నిజానికి ఆయనకు ఆడవేశం వేయాలనే అభిలాష లేదు. కానీ బలీయమైన పరిస్థితులు ఆయనను ఆడవేశం వేసేలా చేశాయి. ఎన్టీఆర్ స్నేహితులు కూడా ఆయన ఆడవేశం వేయడానికి తలా ఒక చేయి వేశారు. ఉద్యోగం పురుష లక్షణం అనే సామెత మాదిరి మగవారికి మీసం కూడా ఒక లక్షణమేనని అప్పట్లో ఎన్టీఆర్ అనుకుంటూ ఉండేవారు. ఆ నమ్మకంతోనే ఆడవేశంలో మీసం కూడా తీయకుండానే నటించారు. మొత్తానికి ఆడవేశం వేసుకున్నారు. ఆడవేశం వేసుకునేంతవరకు ధైర్యంగానే ఉన్నారు, కానీ రంగస్థలం మీద కాలు మోపాలంటే ధైర్యం చేయలేకపోతున్నారు.

స్త్రీ పాత్రతో రంగస్థలంపై అభినయించాల్సిన ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆయనకు కాళ్లు, చేతులు వణకడం ఆరంభించాయి. ఆయన ఒళ్ళంతా ముచ్చెమటలు పోసాయి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాల్సిన సమయం దాటిపోతున్నది. కానీ ఎన్టీఆర్ పాదాల అడుగులు మాత్రం ముందుకు పడటం లేదు. చివరికి ఎవరో ఎన్టీఆర్ ను రంగస్థలంపై వేదిక మీదికి తోసేశారు. ఆ తోపులో రంగస్థలం వేదిక మీద పడ్డారు. వేదిక మీద దాదాపుగా ఐదు నిమిషాల వరకు తనకు ఏమీ తెలియలేదు. ఆ తరువాత కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకుని నటించడం ప్రారంభించారు ఎన్టీఆర్. మొత్తంగా చూసినట్లుయితే ఆ రోజు నాటకంలో ఎన్టీఆర్ దే పైచేయి అయ్యిందని చెప్పవచ్చు.

సినిమాల ద్వారా డబ్బు సంపాదనే ఎన్టీఆర్ లక్ష్యం కాదు..

తొలిరోజు నాటకం అయిపోయింది, ఆ నాటకం నుండి బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు ఎన్టీఆర్. “ఆడవేషం వేశాను” కదా అని తనలో తనకే సిగ్గేసింది. నిజానికి అది ఆయన నటనా జీవితానికి నాంది అని చెప్పవచ్చు. “ఆనాటి ఉదంతా తలుచుకున్నప్పుడల్లా నాకు ఎంతో సరదాగా ఉంటుంది” అని ఎన్టీఆర్ పలుమార్లు చెప్పేవారు. నాటకాలలో వేషాలు వేసి డబ్బు సంపాదించాలనే అభిలాష ఆయనకు ఎప్పుడూ ఉండేది కాదు. వేషం వేయాలనే సరదా మాత్రమే ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఆ సరదాగా చివరికి దురదగా మారి ఆయన చేత ఒక “అమెచ్యూర్ థియేటర్” స్థాపింపజేసింది. దాని ద్వారా కొన్ని అభ్యుదయ నాటికలు, నాటకాలు ఆడించడానికి ఎన్టీఆర్ అలవాటు పడిపోయారు. “అమెచ్యూర్ థియేటర్” నాటక సంస్థ పతాక ఛాయల మీదే ఎన్టీఆర్ “ఆంధ్ర నాటక కళా పరిషత్” బహుమతి కూడా అందుకున్నారు. ఆ తరువాత “నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్” (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు వేశారు. 

1947లో పట్టభద్రుడైన ఎన్టీఆర్, తదనంతరం మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష వ్రాసి 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడిగా నిలిచి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం దక్కించుకున్నారు. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు. ఎల్వీ ప్రసాదు దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఫొటోను చూసి, ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు వెంటనే ఎన్టీఆర్ ని మద్రాసుకు పిలిపించి “పల్లెటూరి పిల్ల” సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసారు. అందుకు గాను రామారావు వెయ్యి నూటపదహార్ల పారితోషికం అందుకున్నారు. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసారు. కానీ పల్లెటూరి పిల్ల” సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో అందులో నటించారు. అందువలన ఎన్టీఆర్ మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం (1949) అయ్యింది.

నటనలో సహజత్వం కూడదు అని తెలుసుకున్న ఎన్టీఆర్…

నాటకరంగంలో వేదిక మీద ఉత్తేజకరమైన, ఉద్రేకపూరితమైన పాత్రలు ఎక్కువగా వేస్తుండే ఎన్టీఆర్ నటన అంటే సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండేవారు. అయితే సనటనలో హజత్వం అనేది తనకు ఒక పెద్ద తమాషాగా పరిణమించింది. మనదేశం (1949) చిత్రంలో జైలు దృశ్యాన్ని దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తొలిరోజు చిత్రీకరణ మొదలైంది. పోలీసు అధికారి పాత్రకు కావలసిన ఆవేశాన్ని, ఉద్రేకాన్ని బాగా చూపెట్టారు. సెట్ లో ఎన్టీఆర్ అభినయం బావుందని అందరూ అన్నారు. మరునాడు ఆ సన్నివేశాలు తాలూకు రషెష్ ఎన్టీఆర్ చూడడం జరిగింది. ఇంకేముంది ఆనాడు ఆయన చేసిన హంగామాకు బల్లాలు, కిటికీలు అల్లాడాయి. భావోద్రేకంతో సహజంగా నటించడం వల్లనే అలా జరిగిందని గ్రహించడానికి ఎన్టీఆర్ కు ఎంతో సమయం పట్టలేదు.

ఎద్దుతో పోరాటంలో చేయి విరిగిన ఎన్టీఆర్…

ఎన్టీఆర్ నటనలో సహజత్వానికి సంబంధించి మరో సంఘటన కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రిచర్డ్ బ్రిన్స్లీ షెరిడాన్ రాసిన పిజారో అనే ఆంగ్ల నాటకం ఆధారంగా రూపొందించబడిన “పల్లెటూరి పిల్ల” (1950) చిత్రంలో ఎన్టీఆర్ ఎద్దుతో పోరాడవలసి వచ్చింది. నిర్మాణ సంస్థ వారు ఎద్దుతో పోరాడే ఆ సన్నివేశాలలో నటించడానికి ఎన్టీఆర్ కు నకిలీగా (డూప్ గా) నటించేందుకు వేరే ఒక మనిషిని మాట్లాడారు. కానీ అది ఎన్టీఆర్ కు నచ్చలేదు. “మన సన్నివేశాలను మనమే చేసి బాగుందనిపించుకోవాలి” అనేది ఎన్టీఆర్ ఉద్దేశ్యం. ఎవరో చేస్తే మనకు వచ్చే ఖ్యాతి ఏముంది? ఇది మూఢ అభిప్రాయమే కావచ్చు. అయినా కూడా ఎన్టీఆర్ తోచింది చేశారు. ఆ సన్నివేశంలో నేనే పాల్గొంటున్నాను అని ఎన్టీఆర్ చెప్పారు. ఆ కంపెనీ అధినేతలు కూడా ఎన్టీఆర్ తో సరే కానివ్వండి అన్నారు. చిత్రీకరణలో ఎద్దుతో పోరాటం చేయడంతో ఎన్టీఆర్ చెయ్యి విరిగింది. ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరిగేది. కానీ ఎన్టీఆర్ ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు. ఆ అనుభవం తనకు కళ్ళు తెరిపించింది. అది మొదలుకొని సినిమా నటనకు కావలసిన భావోద్రేకపు మోతాదు ఎంత ఉండాలి అన్నది ఎన్టీఆర్ క్రమేపి తెలుసుకోగలిగారు. 

280 పైగా చిత్రాలలో నటించి…

సినిమాలో సహజత్వానికి కాకుండా అసలు సిసలైన నటనకే చోటు ఇవ్వాలన్న సత్యాన్ని గ్రహించారు. ఆ విధంగా అనంతమైన చిత్ర కళా రంగంలో అనేక మైలురాళ్ళని అధిగమిస్తూ, రకరకాల అనుభూతులను, అనుభవాలను రుచిచూస్తూ నటనా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఎన్టీఆర్, కళారంగంలో నటినటుల విజయ పరంపరకు ప్రేక్షకుల ఆదరణ, అభిమానం, ప్రోత్సహం ఎంతో అవసరం అనే సత్యాన్ని ఎప్పుడూ విస్మరించలేదు. చిత్రసీమలో అసంఖ్యాక ప్రేక్షక, ప్రజానీకం ఆదరాభిమానాలు అందుకున్న ఎన్టీఆర్ 1949 నుండి చివరిగా 1993 వరకు 280 సినిమాలలో నటించారు. 194 మంది నిర్మాతలతో, 90 మంది దర్శకులతో, 58 మంది సంగీత దర్శకులతో, 137 మంది కధా రచయితలతో, 73 మంది మాటల రచయితలతో, 67 మంది పాటల రచయితలతో, 72 మంది గాయకులతో, ఆయన చిత్రజీవితం ముడిపడిపోయింది.

Show More
Back to top button