
‘యువగళం’కు తొలి అడుగు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు నేడు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ఈరోజు(శుక్రవారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచే తొలి అడుగు వేసి పాదయాత్రను మొదలు పెట్టారు.
400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల వరకు సాగే సుదీర్ఘ పాదయాత్రకు తొలి అడుగు పడింది. కుప్పంలో ప్రారంభమై.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి, క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చాయి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణతో పాటు పలువురు తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సినీనటుడు తారకరత్న తదితరులు పాదయాత్రలో యువనేత వెంట నడిచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అట్నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం పరిధిలోని కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు నేతల అంచనాకు మించి ప్రజలు హాజరయ్యారు.
సభ జరిగే చోట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు తెదేపా నాయకులే 400 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పాదయాత్ర జరిగినన్ని రోజులూ కాన్వాయ్‌లోనే లోకేశ్ విశ్రాంతి తీసుకోనున్నారు. .



లోకేశ్ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచారు. అదనంగా మరో 200మంది వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే వీరికి భోజన ఏర్పాట్లూ చేశారు. ఎలాంటి లోటూ రాకుండా చూసుకునే బాధ్యతను చిత్తూరు జిల్లాలోని తెలుగు యువత నాయకులు, కార్యకర్తలకు అప్పగించారు.
యువగళం, మన గళం, ప్రజాబలం…
కంచుకోట అనేదానికి మారుపేరు ‘కుప్పం’ అంటూ లోకేశ్ స్పష్టం చేశారు.
యువగళం పేరు ప్రకటించిన అనంతరం వైసీపీ నేతల ప్యాంట్లు తడిశాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఎవరైనా వ్యతిరేక, కవ్వింపు చర్యలకు పాల్పడినా, దాడులకు దిగినా ఆయనను రక్షించడానికి అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు విశ్వసిస్తున్నాయి.
”నేను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల పనులు పూర్తి చేశాను. యువతకు ఉద్యోగాలిప్పించాను. మరీ మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటి?.. పొట్టి శ్రీరాములు వల్ల ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తరువాయి తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీ సీఎం ఎన్టీరామారావు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారు. మరీ అంతటి గుర్తింపును రూపుమాపేలా సీఎం జగన్ 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు” అంటూ సభాముఖంగా ధ్వజమెత్తారు.
ఏడాదిలోనే 2.30 లక్షల ఉద్యోగాలిస్తానని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? జగన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి అని కూడా దుయ్యబట్టారు.
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. ‘జే ట్యాక్స్ ఫుల్లు.. పెట్టుబడులు నిల్లు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి.
3 రాజధానులు అన్నారు.. ఇప్పటికీ ఒక్క ఇటుక అయినా వేశారా?, ఒక్క పరిశ్రమ అయినా ఏర్పాటు చేశారా అని నిలదీశారు.

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. త్వరలోనే యువత కోసం యూత్ మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఎన్ని?, స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగావకాశాలు ఉన్నాయో స్పష్టంగా ప్రకటిస్తాం.
ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే.. తనకు చీర, గాజులు పంపిస్తానని ఓ మహిళా మంత్రి అన్నారని.. చీర, గాజులు పంపించాలని వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది.. జే బ్రాండ్‌తో మహిళల మంగళసూత్రాలు తెంపుతున్న జాదూరెడ్డి అని జగన్‌పై మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉంది.. రైతులు లేని రాజ్యం చేస్తున్నారని అన్నారు.
టీడీపీ ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం. వ్యవసాయ పంట ఉత్పత్తులకు సైతం గిట్టుబాటు ధర కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో ఇసుక దొరకడం లేదు. ఇసుకను జాదూరెడ్డి దోచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం” అని లోకేష్ సభలో ఈ విధంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ పోరాటాన్ని అడ్డుకునేందుకు వారాహి వాహనానికి ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం.. కానీ యువగళం ఆగదు.. వారాహి ఆగదు..
సైకో పాలనలో అప్పులు.. ఆత్మహత్యలే మిగిలాయి..
కానీ సైకిల్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఉన్నాయి.. యువగళం పాదయాత్రకు నేడు తొలిరోజు.. ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తున్నా.. కలిసికట్టుగా ఉద్యమిద్దాం.. అని అన్నారు.
ఈ సభ తరువాయి లోకేశ్ కుప్పం ఆసుపత్రి మీదుగా రాత్రికల్లా బస ప్రాంతానికి చేరుకోనున్నారు.