Telugu Featured NewsTelugu Politics

ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడానికి మోడీనే కారణమా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా త్వరలో జరగబోయే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాల భేటీ చర్చినీయాంశంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు జతకట్టేయత్నాలు ఊపందుకున్నాయి. తాజాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబై భేటీతో మరి కొంత స్పష్టత వచ్చింది. రెండు రోజుల చర్చలు మూడు తీర్మానాలను తేగలిగాయి. ఉమ్మడి స్వరం పెరిగింది. కొత్త నినాదానికి జీవం పోసింది. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ప్రతి పక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రతిపక్షాల ఐక్యత యత్నాలు కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే, అనుమానాలు, అపోహలతో ప్రారంభమైన ఐక్యత యత్నాలు ఈ మాత్రం ముందుకు కదులుతాయని ఎవరూ ఊహించలేదు.

గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమీ కేంద్రంలో పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగిన దృష్ట్యా, ఈసారి కూడా ప్రతిపక్షాల కూటమి నాయకత్వాన్ని తమకే ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు తొలిదశలో ఆశించారు. తమ ఆకాంక్షను బహిరంగంగానే వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలో పని చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఆదిలోనే వ్యతిరేకించడంతో ఐక్యత యత్నాలు ముందుకు సాగలేదు.

అయితే, ఒక రకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదే. ప్రతిపక్షాలు ఇలా ముంబై వరకు రావడం అదే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతిపక్షాలను గడ్డిపోచలా తృణీకరించడం వల్లనే ఏకతాటిపైకి రావడం అనివార్యంగా భావించాయి. కేంద్రం పోకడలు చూస్తుంటే ఏ క్షణం అయినా ఎన్నికలు రావచ్చన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రతిపక్షాలు నాయకత్వం కోసం పట్టుపట్టడం వల్ల ప్రయోజనం లేదని నిర్ధారణకు వచ్చి ఉంటాయి.

అంతేకాదు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటివలే అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యం కాలేవన్న బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయని కూడా అన్నారు.

లోక్‌సభలోని అన్ని స్థానాలకూ ఇండియా కూటమి అభ్యర్థులు పోటీచేసే రీతిలో సీట్ల సర్దుబాటు చేసుకుంటామని రాహుల్ వెల్లడించారు.

ఈ ప్రకటనతో అధికారపక్షంలో  భయాందోళన పట్టుకుందని రాజకీయ మేధావులు అంటున్నారు.

 భయాందోళనలతో ఐక్యమత్యం

ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం ముందు సీట్ల సర్దుబాట్లు, వ్యక్తిగత ఆభిజాత్యాలు చాలా చిన్నవి. అయినా, ఈ కూటమిలోని పార్టీలన్నీ యూపీఏ కూటమిలో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నవే.

కొన్ని పార్టీలూ, వ్యక్తులు వ్యక్తిగత విభేదాల వల్ల వేరు పడినా, మళ్ళీ తిరిగి కలుసు కోవడంలో ఆశ్చర్యం లేదు.

ఉదాహరణకు యూపీఏ హయాంలో కాంగ్రెస్‌లో కీలక పాత్ర వహించిన కపిల్ సిబాల్ ముంబాయిలో ఇండియా కూటమి సమావేశానికి ఎవరూ పిలవకుండానే హాజరుకావడం.

ఈ సమావేశానికి 28 పార్టీల నాయకులు ప్రతినిధులు హాజరు కావడం మరింత ఆసక్తి రేపింది.

ఇక ప్రతిపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టడాన్ని ఎద్దేవా చేసిన వారు ప్రతిపక్షాల ఐక్యతాయత్నాలు ఉపేక్షించదగినవి కావని భావిస్తున్నారు.

ఇకపోతే ఈసారి కలిసి సాగకపోతే మరిన్ని బాధలు అనుభవించాల్సి వస్తుందన్న భయాందోళనలు అన్ని పార్టీల్లో కనిపిస్తున్నాయి.

ఐక్యతకు మూలసూత్రం కూడా అదే అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఈనెలలో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రతిపక్షాలు తమ వ్యూహానికి మరింత పదును పెట్టే అవకాశం ఉంది.

Show More
Back to top button