Telugu Featured NewsTelugu Politics
Trending

పొత్తుతో చరిత్ర పునరావృతం అవుతుందా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా.. ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఓ మాట వినిపిస్తోంది. అదేనండీ.. ప్రస్తుత ఎన్నికలు 2014 ఎన్నికల్లాగా పునరావృతం అవుతున్నాయని అంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఓ కూటమిగా పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. అయితే, అప్పుడు జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాలక్రమేణ కూటమిలో కొన్ని విభేదాలు రావడంతో 2019 ఎన్నికల్లో మూడు పార్టీలూ విడిపోయాయి. అయితే సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఆ మూడు పార్టీలు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈసారి కూడా కూటమి గెలుస్తుందా..? అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు ఏం అంటున్నారో ఒక లుక్ వేద్దాం పదండి.    

బీజేపీని చూసి టీడీపీకి ఓట్లేస్తారా?

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. దీంతో  చాలామంది ఓటర్లు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని గెలిపిస్తే.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటివి పొందే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనివల్ల బీజేపీ నుంచి పడే ఓట్లే కాకుండా అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్న ఓట్లు పడి టీడీపీ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వైసీపీకి దెబ్బ పడే అవకాశం ఉందంటున్నారు.

టీడీపీ నేతల్లో అసంతృప్తి..!

ఇటీవల టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు టీడీపీ సీనియర్లకు సీట్లు లేకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారు తమ దారి తాము చూసుకుంటామని ప్రెస్‌మీట్లలో తేల్చి చెప్తున్నారు. ఉదాహరణకు కొవ్వూరు అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావుని ప్రకటించడంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీటు కేటాయించడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వారు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల టీడీపీ ఓట్లు కొంతమేర చీలే అవకాశం ఉందని అంటున్నారు.

జనసైనికుల్లో అసంతృప్తి..

2019 ఎన్నికల్లో జనసైనికులు పవన్ ‌కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు. కానీ అనూహ్యంగా పవన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వెంటనే రెట్టింపు వేగంతో రాజకీయాల్లో పాల్గొన్నారు.  దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలవాలని చాలామంది జనసైనికులు భావించారు. కానీ పొత్తులో భాగంగా 21 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుండటంతో వాళ్లు అసంతృప్తికి లోనైనట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా 2019లో టీడీపీకి దూరం పాటించిన పవన్ మళ్లీ ఈ ఎన్నికల్లో టీడీపీతో కలవడం కొందరు జనసైనికులకు ఇష్టం లేకపోవడంతో ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేకత కూటమికి కలిసొస్తుందా?

వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలకు రెండు ఛాయిస్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకవైపు జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవడం.. లేదంటే కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీలకు పట్టం కట్టడం. అయితే ప్రజలు ఏ ఛాయిస్‌ను ఎన్నుకుంటారన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే ప్రజలు కూటమిని గెలిపించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తమకు ప్రభుత్వ పనితీరు నచ్చిందంటే మళ్లీ అదే పార్టీకి ప్రజలు ఓటు వేసే ఛాన్స్ ఉంది. మరి ప్రభుత్వ వ్యతిరేకత కూటమిని గెలిపిస్తుందో లేదో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Show More
Back to top button