అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ వ్యాపారవేత్తలకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఇచ్చే EB-5 గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి, మోసాలను అరికట్టడానికి అయ్యే ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ఇమిగ్రేషన్ శాఖ తెలిపింది. ఈ కొత్త ఫీజు నిబంధనలు నవంబరు 30 నుంచి అమలులోకి రానున్నాయి.
అమెరికా గ్రీన్ కార్డ్ ఫీజుల పెంపుతో ఇన్వెస్టర్లకు షాక్
ఈ కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తు ఫీజులు కొన్ని రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. నేరుగా పెట్టుబడి పెట్టేవారు దాఖలు చేసే I-526 ఫామ్ ఫీజు 3,675 డాలర్ల నుంచి ఏకంగా 7,615 డాలర్లకు పెరిగింది. అలాగే గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసే వారి ఫామ్ (I-526E) ఫీజు 7,850 డాలర్లకు, నివాస హోదా షరతుల తొలగింపు ఫామ్ (I-829) ఫీజు 5,000 డాలర్లకు, వ్యాపార సంస్థల అనుమతి కోసం వాడే ఫామ్ (I-956F) ఫీజు 17,795 డాలర్ల నుంచి ఏకంగా 42,675 డాలర్లకు పెరిగింది.
EB-5 గ్రీన్ కార్డ్ కోసం ఎంత పెట్టుబడి అవసరం?
అమెరికాలో కనీసం 8 లక్షల డాలర్లు (రూ. 6.6 కోట్లు) లేదా 1.05 మిలియన్ డాలర్లు (రూ. 8.7 కోట్లు) పెట్టుబడి పెట్టి, స్థానికులకు 10 ఉద్యోగాలు కల్పిస్తే ఈ EB-5 గ్రీన్ కార్డ్ ఇస్తారు. మన దేశం నుంచి ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. ఇప్పటికే అనుమతుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న భారతీయ ఇన్వెస్టర్లకు, ఈ దరఖాస్తు ఫీజుల పెంపు మరింత అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది.






