GREAT PERSONALITIESTelugu Cinema

తెలుగు చలనచిత్ర సినీ ప్రపూర్ణుడు.. ఏడిద నాగేశ్వరావు..

చెట్టుకు ఎన్ని కాయలు కాశాయి అనేది ముఖ్యం కాదు. అందులో ఎన్ని పండాయి, ఎన్ని అందాయి అన్నదే ముఖ్యం. అలాగే సంఖ్యాపరంగా ఎన్ని సినిమాలు తీశామన్నది ముఖ్యం కాదు. వాటిలో ఎన్ని విజయవంతమయ్యాయి, ఎన్ని విఫలమయ్యాయి అనే దృష్టితో చూస్తే ఏడిద నాగేశ్వరరావు గారిని 99% మార్కులు సాధించిన అగ్ర నిర్మాతగా అభినందించడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. తెలుగు చలనచిత్ర సినీ ప్రపూర్ణుడు, వారు నిర్మించిన పది చిత్రాలలో తొమ్మిది చిత్రాలు ఘన విజయం సాధించాయి. చివరి చిత్రం ఆపద్బాంధవుడు రెవెన్యూ పరంగా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ , బిజినెస్ అండ్ అవార్డ్స్ చూస్తే దానిని కూడా విజయవంతం అయిన చిత్రంగానే చెప్పుకోవాలి. ఏడిద గారి చిత్రాలన్నీ తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని ఆపాదించినవే కావటం విశేషం.

సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి ఫేటు, రూటు ఎలా మారిపోతాయో చెప్పలేం. రాజు అవుతాడు అనుకున్న వాడు బంటుగానే మిగిలిపోతాడు. బంటు అనుకున్న వాడు రాజుగా ఎదిగిపోతాడు, వెలిగిపోతాడు. అలా తలరాతలు తారుమారై తలచిన దానికి భిన్నంగా జరిగిన అనూహ్య పరిణామాల పర్యవసానంగా ఒక సాధారణ డబ్బింగ్ అండ్ జూనియర్ ఆర్టిస్ట్, ఒక అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగిన వైనమే ఏడిద నాగేశ్వరావు గారి సినీ ప్రస్థానం. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, చిరు వేశాల జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం ప్రారంభించి, తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్మరణీయ విజయాలుగా నిలిచిన చిత్రాల నిర్మాతగా ఎదిగిన కమనీయ రమణీయ చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు.

పూర్ణోదయ ప్రొడక్షన్స్ పతాకంపై “తాయారమ్మ – బంగారయ్య” , “సితార”, “సీతాకోకచిలుక”, “శంకరాభరణం”, “స్వాతిముత్యం”, “స్వయంకృషి”, “ఆపద్బాంధవుడు” వంటి అపురూప చిత్రాలు నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు గారు. కలసి వచ్చిన అదృష్టానికి, కాయ కష్టం, ఆత్మస్థైర్యం, స్వయంకృషి జత చేరితే ఎవరైనా జగజ్జేయమానమైన విజయాలను సాధించవచ్చు అనడానికి నాగేశ్వరరావు గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఎవరి అండదండలు లేకుండా ఎలాంటి నేపథ్యము బలము లేకుండా ఈ గ్లామర్ ప్రపంచంలో కాలు మోపి తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆణిముత్యాలు, స్వాతిముత్యాలు వంటి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు గారు తన ప్రారంభ రోజులలో పడిన పాట్లు అంతా ఇంతా కాదు. జీవితంలో ఎదగాలనే అభిలాష , అందుకు అవసరమైన క్రమశిక్షణనే ఏడిద నాగేశ్వరరావు గారిని అపూర్వ విజయాలవైపు మళ్ళించింది.

జీవిత విశేషాలు…

జననం :   24 ఏప్రిల్ 1934

స్వస్థలం:        కొత్తపేట, తూర్పు గోదావరి..

తండ్రి    :       సత్తి రాజు నాయుడు 

తల్లి      :            పాపలక్ష్మి

చదువు :   బి. ఏ..

వృత్తి     :  నటుడు, నిర్మాత,

నిర్మాణ సంస్థ : పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ 

అభిమాన నటులు :  రాజ్ కపూర్, దిలీప్ కుమార్, యస్వీ రంగారావు, సావిత్రి..

నచ్చే రచయిత :   శరత్

నచ్చే సినిమాలు :  మల్లీశ్వరి, మాయాబజార్, పెద్ద మనుషులు, బంగారు పాప

దైవ భక్తి    :   షిర్డి సాయిబాబా భక్తులు 

మరణం   :    4 అక్టోబర్ 2015 (వయస్సు 81)

హైదరాబాద్ , భారతదేశం

జననం…

ఏడిద నాగేశ్వరావు గారు తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట లో సత్తిరాజు నాయుడు,  పాప లక్ష్మి దంపతులకు 24 ఏప్రిల్ 1934 లో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విజయనగరం, నర్సాపూర్ లాంటి చాలా ఊర్లు తిరిగి చివరకి 1953లో పదవీ విరమణ చేసి కాకినాడ లో స్థిరపడ్డారు. దాంతో ఏడిద గారి బాల్యం, విద్యార్థి జీవితం కాకినాడ తోనే ముడిపడిపోయాయి. చిన్నప్పటి నుండి తనకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. విడుదల అయ్యే ప్రతి సినిమా చూసేవారు. తాను 9వ తరగతి వరకు కొత్తపేటలో చదువుకున్నారు. అప్పట్లో కొత్తపేట నుండి సైకిల్ వేసుకొని 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురం వెళ్లి విడుదలయిన సినిమాలు చూసేవారు.

అలాగే అప్పట్లో నాటక రంగం కూడా కళకళలాడుతుండడంతో నాటకాలు కూడా బాగా చూసేవారు. దాంతో చిన్న వయసులోనే నాటక, సినీ రంగాల పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అయితే ఆ రంగాలలోనే తన జీవితం, భవిష్యత్తు ముడి పడతాయని తాను ఏనాడూ ఊహించలేదు. తాను కాకినాడ హై స్కూల్లో ఫిఫ్త్ ఫారం చదువుతుండగా పాఠశాల వార్షికోత్సవంలో “లోభి” అనే నాటకం వేశారు. ఆ నాటకంలో మిగితా వేషాలు అయిపోవడంతో ఆ ఒకే ఒక్క ఆడవేషం ఉంది. మీకు ఆసక్తి ఉంటే ఆడవేషం వేయమన్నారు ఏడిద గారిని. అవకాశం ఎందుకు వదులుకోవాలని తాను నాటకంతో నటన జీవితం  ప్రారంభించారు. అలా తాను వేసిన తొలి ఆడ వేశానికి వెండి పతకం వచ్చింది. రంగస్థలం మీద తన తొలి ప్రయత్నానికి బహుమతి రావడంతో ఆ రజత పథకాన్ని చూసుకొని బంగారు పతకం లాగా మురిసిపోయేవారు.

“కళాప్రపూర్ణ రాఘవ కళా సమితి” ప్రారంభం..

ఏడిద గారు విజయనగరంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా కొన్ని నాటకాలు ఆడే అవకాశం వచ్చింది. అక్కడే తనకు జె.వి.సోమయాజులు , ఆయన తమ్ముడు జే.వి.రమణమూర్తి గార్లు పరిచయమయ్యారు సోమయాజులు గారు మంచి ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా నాటక రంగం పట్ల ఆసక్తి కనబరిచేవారు.  ఏడిద గారి నాన్నగారు పదవీ విరమణ చేసి కాకినాడలో నే ఉండాల్సి రావడంతో నాగేశ్వరావు గారు అక్కడ “పిఠాపురం రాజాస్” కళాశాలలో బి. ఏ లో చేరారు. అదే కళాశాలలో నేటి ప్రముఖ దర్శక, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ గారు బి.ఎస్సి లో చేరారు. కళాశాలలో చేరిన కొద్ది రోజులకే రాజేంద్రప్రసాద్ గారితో పాటు వడ్డాది సూర్య నారాయణ మూర్తి కూడా జత చేరడంతో, ముగ్గురు కలిసి “కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి” నాటక సమాజం స్థాపించారు. నాటకాలలో నటించాలి అంటే కళాశాల వార్షికోత్సవంలో తప్ప అవకాశం దొరికేది కాదు.

“కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి” అనే నాటక సమాజం ప్రారంభోత్సవానికి అప్పుటి రంగస్థలం ప్రముఖులు డాక్టర్ రాజారావు గారిని ఆహ్వానించారు. తొలి ప్రదర్శనగా విశ్వనాథ కవిరాజు గారు రచించిన “దొంగాటకం” ప్రదర్శించారు. అందులో మూడే మూడు పాత్రలుంటాయి. రెండు మగ పాత్రలలో ఒకటి వి.బి.రాజేంద్రప్రసాద్ గారు పోషించగా, రెండోది ఏడిద గారు పోషించారు. ఆడ పాత్రని వెంకటేశ్వరరావు అనే మిత్రుడు పోషించాడు. అలా ప్రారంభమైన నాటక సమాజంలో ఆత్రేయ గారి “కప్పలు”, “వరప్రసాదం”, అవసరాల సూర్యరావు గారు “పంజరం”, అలిశెట్టి సుబ్బారావు గారి “చెట్టు కింద పూలు”,  పినిశెట్టి శ్రీరామమూర్తి గారి “ఆడది” వంటి ఎన్నో ప్రసిద్ధి గాంచిన నాటకాలను ప్రదర్శించేవారు.

వివాహం…

ఏడిద నాగేశ్వరావు గారు నాటక రంగ కళాపోషణ లో పడడంతో చదువు పోయింది. డిగ్రీ కంపార్ట్మెంట్ లో పూర్తి చేశారు. అయితే అంతకు ముందు డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే తన మేనమామ కూతురు జయలక్ష్మి తో 24 ఏప్రిల్ 1954 లో వివాహం జరిగింది. ఏడిద నాగేశ్వరావు గారి పుట్టినరోజు కూడా అదే కావడం, అలాగే తాను నిర్మించిన శంకరాభరణం చిత్రానికి జాతీయ స్థాయిలో బంగారు నంది స్వీకరించింది కూడా అదే రోజున కావడం ఏడిద గారి జీవితంలో విచిత్రంగా అనిపిస్తుంది.

డబ్బింగ్ కళాకారునిగా తొలి సంపాదన 500 రూపాయలు

తొలిసారిగా తమిళం నుండి తెలుగు కు అనువదింపబడిన “పార్వతి కల్యాణం” అనే సినిమాలో శివుడి పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఈ సినిమా రంగంలో తొలి పారితోషికంగా 500 అందుకున్నారు. ఆ చిత్రానికి నిర్మాత విశ్వేశ్వరరావు గారు. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన తర్వాత మెల్లమెల్లగా సినిమాలలో వేషాలు వేయడం ప్రారంభించారు. నిజానికి దారి తెన్నూ లేని జీవితం ఇంకా ఎంతకాలం కాబట్టి భార్య పిల్లలు దగ్గర ఉంటేనే మంచిదని భావించి కుటుంబంను మద్రాస్ కు  తీసుకువచ్చారు.

నటుడుగా తొలి సంపాదన 500..

ఇదిలా ఉండక ఒకరోజు నాగేశ్వరావు గారికి సారథి ఫిలిమ్స్ అధినేత రామకృష్ణ ప్రసాద్ గారి నుండి పిలుపు వచ్చింది. ఆయన ఎన్టీ రామారావు, సరోజ దేవి గార్ల కాంబినేషన్లో భానుమతి గారి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఆత్మబంధు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ప్రొడక్షన్ డైరెక్టర్. ఆయనే నాగేశ్వరావు గారిని మరియు తన రూమ్ మేట్ ను పిలిపించారు. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరికీ వేషాలు ఇచ్చారు. చెరొక 500 అడ్వాన్స్ ఇచ్చారు. అదే నటుడిగా తన తొలి సంపాదన 500 రూపాయలు.

వెంకటేశ్వర కళ్యాణం తో సినిమా నిర్మాణం ప్రారంభం..

ఏడిద నాగేశ్వరావు 1962 నుంచి 1974 మధ్యకాలంలో దాదాపు 30 – 40 సినిమాలలో కొన్ని గుర్తింపు కలిగిన వేషాలు వేశారు. 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. సంసార భారం పెరిగింది. అందుకు తగినంత సంపాదనలేదు. ఏం చేయాలి? ఎలా బ్రతుకు బండి నెట్టుకు రావాలి? ఈ వేషాలను డబ్బింగ్ లను నమ్ముకుంటే బ్రతకడం కష్టం అనుకోని ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. గార్మెంట్స్ అనే కుటీర పరిశ్రమను నడిపారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ కొద్ది రోజులకి ఆ బిజినెస్ పడిపోయింది. అప్పులు మిగిలి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

ఇల్లు గడవడం కూడా కష్టమైంది. అలా దిక్కుతోచని స్థితిలో ఉన్న తన దగ్గరకు ఒకరోజు నలుగురు వ్యక్తులు వచ్చారు. అలా వచ్చిన ఆ నలుగురు భాస్కర్ రెడ్డి, రామ కృష్ణారెడ్డి, లబ్బిరెడ్డి, వీర్రాజు కలిసి ఒక తమిళ సినిమాను తెలుగులో అనువదించే లక్ష్యంతో మద్రాసు వచ్చారు. అయితే వాళ్లకు ఈ సినిమా రంగంలో ఎలాంటి పుర పరిచయాలు లేకపోవడంతో తెలిసిన వాళ్ళ ద్వారా ఏడిద గారి చిరునామా కనుక్కొని వచ్చారు. ఏడిద గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీశ్రీ, రాజశ్రీ, ఆరుద్ర, అనిశెట్టి వంటి ప్రముఖులు అనువాద రచనలు చేసిన చిత్రాలకు పనిచేసి ఉండడం వలన వారితో ఏడిద గారికి సత్సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఆ నలుగురు వెంకటేశ్వర కళ్యాణం సినిమాను డబ్ చేయాలని వచ్చారు.

అప్పుడు రచయిత అనిశెట్టి గారి రచన, ఏడిద గారి నిర్వహణలో ఆ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆ రోజుల్లో ఆ సినిమా మీద  నలుగురు నిర్మాతలకు ఖర్చులు పోను తలా 25 వేలు మిగిలాయి. అంటే కేవలం రెండు నెలల్లో లక్ష రూపాయల లాభాన్ని కళ్ళ చూశారు. అంత తక్కువ సమయంలో అంత లాభాన్ని చూడడంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. వారితో పాటు అందుకు కారణమైన నా పట్ల గురి, నమ్మకం ఏర్పడ్డాయి. డబ్బింగ్ సినిమాకి ఇంత లాభం పేరు వస్తే, ఇక నేరుగా తెలుగులో సినిమా తీస్తే ఇంకా ఎంత గొప్పగా ఉంటుందోనని ఆలోచన మొదలైంది. వాళ్ళు మరలా నన్ను కలిసి మేము మాత్రం మంచి నిర్మాతలుగా పేరుపొందాలి. ఇది ఊర్లో మాకు పరువుతో కూడిన విషయం అన్నారు. వారి పట్టుదల ఉత్సాహం చూసి ఏడిద గారు సరే అన్నారు.

తొలి ప్రయత్నంగా తెలుగులో “సిరి సిరి మువ్వ”

తెలుగులో నేరుగా సినిమా తీయడం పెట్టుబడి పరంగా మామూలు విషయం కాదు. నలుగురు నిర్మాతలకు మంచి అభిరుచి ఉంది. కానీ అంత డబ్బు లేదు. అప్పుడు నాగేశ్వరావు గారు తమ బంధుమిత్ర వర్గాలు అందరిని కలుపుకుని మొత్తం 19 మంది భాగస్వామ్యంతో గీతాకృష్ణ కంబైన్స్ అనే సంస్థను ప్రారంభించి తనకు పది పైసలు వాటా ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమా తీసి పెట్టమన్నారు నిర్మాతలు. ఏ సినిమా తీయాలి? ఎలాంటి సినిమా తీయాలి? ఎవరితో తీయాలి? అన్న అంతర్మథనానికి సమాధానంగా కనిపించారు కే.విశ్వనాథ్ గారు.

నాగేశ్వరావు గారికి మొదటి నుంచి కె. విశ్వనాథ్ గారి సినిమాలంటే గొప్ప అభిమానం. అంతే కాకుండా వారు దర్శకత్వంలో రూపొందిన “నేరం – శిక్ష” సినిమాలో నాగేశ్వరావు గారు ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని విశ్వనాథ్ గారిని కలిశారు నాగేశ్వరావు గారు. విశ్వనాథ్ గారు మొదట్లో ఒప్పుకోలేదు. కొత్తవాళ్లు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయగలరా అన్నది విశ్వనాథ్ గారి సందేహం. అయితే నాగేశ్వరావు గారు ఒకటికి రెండు సార్లు అడగడంతో ఒప్పుకున్నారు. విశ్వనాథ్ గారు తన దగ్గర ఉన్న ఒక కథ చెప్పారు. అది నాగేశ్వరావు గారికి బాగా నచ్చింది. నిర్మాతలు కథ విని మాదేముంది మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు. వెంటనే కథా చర్చలు ప్రారంభించారు. సంభాషణలు జంధ్యాల గారు, పాటలన్నీ వేటూరి సుందర రామ్మూర్తి గారు వ్రాశారు. చంద్రమోహన్, జయప్రద లను నటీనటులను ఎంపిక చేసుకున్నారు. కే.వీ.మహదేవన్ గారు సంగీత దర్శకులు.

సినిమా చిత్రీకరణ కార్యక్రమాలు ముగించుకుని రీరికార్డింగ్ కు వెళ్లే ముందు కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు (డిస్ట్రిబ్యూటర్, నవయుగ ఫిలిమ్స్), ఇదేంటి సినిమా లాగా లేదు. డాక్యుమెంటరీ లాగా ఉంది. ఇలా అయితే లాభం లేదు. మార్పులు చేయాల్సింది గా సూచించారు. ఇష్టంతో, కసితో తీసిన సినిమా ఇది. ఎలాంటి మార్పులు చేయబోమని స్పష్టంగా చెప్పి సినిమా రిలీజ్ చేశారు నాగేశ్వరావు గారు. 24 డిసెంబర్ 1976 నాడు  విడుదలైన “సిరి సిరి మువ్వ” చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్టయింది. మద్రాసు “శుభం” థియేటర్ లో ఒక సంవత్సరం ఆడింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని నూతన నిర్మాతలకు దర్శకుడు కె.విశ్వనాథ్ గారితో గౌరవాన్ని తెచ్చిన అమూల్యమైన విజయం సిరిసిరిమువ్వ. ఈ విధంగా ఈ చలనచిత్ర రంగంలో నిర్మాతగా నాగేశ్వరావు గారి సారథ్యంలో రూపొందిన తొలి చిత్రం ఘనవిజయం సాధించడంతో వ్యక్తిగతంగా తనకు మంచి గుర్తింపు వచ్చింది.

పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ పై తొలి సినిమా…

“సిరి సిరి మువ్వ” నిర్మించిన 19 మంది భాగస్వామ్యంలో ఒక్కొక్కరికి ఎంత లాభం వచ్చిందో నాగేశ్వరావు గారి 10 పైసల వాటాకు అంతకు మించిన లాభం వచ్చింది.  అయితే తరువాతి సినిమా మొదలెట్టడానికి భాగస్వామి నిర్మాతలు సుముఖంగా లేరు. 19 మంది భాగస్వామ్యం చేయడం కష్టంగా ఉంది. అది కాకుండా వ్యాపారం పరంగా బిజీగా ఉన్నాము. కొంతకాలం ఆగుదాం అన్నారు. దాంతో నాగేశ్వరావు గారే నిర్మాతగా చేయవలసి వచ్చింది. తనతో పాటుగా వారి తోడల్లుడు, తన ముగ్గురు బావమరుదులు చేయి కలిపారు. అప్పుడు  “పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్” సంస్థలు స్థాపించి మరల కె.విశ్వనాథ్ గారిని కలిశారు. కె.విశ్వనాథ్ గారు వేరే సినిమా చేస్తూ ఉండటం వల్ల తర్వాత చేద్దాం అన్నారు. తరువాత ఇంకెవరు అనుకుంటుండగా కొమ్మినేని శేషగిరిరావు దగ్గర ఒక కథ ఉందని తెలిసికొని ఆయనను కలిశారు.

అంతకుముందు కొమ్మినేని శేషగిరిరావు గారు దేవతలారా దీవించండి అనే విజయవంతమైన సినిమా తీశారు. ఆయన దగ్గర ఉన్న కథ విన్నారు నాగేశ్వరావు గారికి బాగా నచ్చింది. కథతో పాటు పేరు కూడా బాగా నచ్చింది. ఆ టైటిల్ క్యారెక్టర్ కు కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి గార్లనే అనుకోవడం ఇంకా నచ్చింది. చంద్రమోహన్ – మాధవి ఒక జంటగా, రంగనాథ్ – సంగీత మరొక జంటగా ఎంపిక చేయడం జరిగింది. చిరంజీవి గారు చిన్న ప్రతినాయక పాత్ర చేశారు. ఆ నిర్మాణంలో అందరికంటే నాగేశ్వరావు గారిదే ప్రధాన బాధ్యత. రకరకాల అంచనాల మధ్య 1979లో విడుదలైన పూర్ణోదయ తొలిచిత్రం “తాయారమ్మ బంగారయ్య” అద్భుత విజయం సాధించింది. నిర్మాతగా నాగేశ్వరావు గారి మీద ప్రశంసల జల్లు కురిసింది. విజయ సంస్థ నాగిరెడ్డి గారు ఈ చిత్ర రీమేక్ హక్కులు కొనుగోలు చేసి తమిళంలో శివాజీ గణేషన్, కె.ఆర్.విజయ జంటగా, హిందీలో సంజయ్ కుమార్, రాఖీ జంటగా పునర్నిర్మించారు.

అజరామర విజయం శంకరాభరణం..

నిర్మాతగా ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న నాగేశ్వరావు గారికి ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో మూడో ప్రయత్నంగా కె.విశ్వనాథ్ గారిని సంప్రదించారు. ఆ సమయంలో  కె.విశ్వనాథ్ గారు తన దగ్గర ఉన్న ఒక సంగీత పరమైన కథను నాగేశ్వరావు గారికి వినిపించారు. సిరిసిరిమువ్వ లాగానే ఈ సినిమాకి కూడా అన్ని పాటలు వేటూరి గారే వ్రాశారు. జంధ్యాల గారు సంభాషణలు వ్రాశారు. ఈ సినిమాలో పాత్ర ఇమేజ్ ఉన్న కళాకారుని కన్నా ఎలాంటి ఇమేజ్ లేని కొత్త ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని ఆలోచన వచ్చింది. దాంతో సోమయాజులు గారిని తీసుకోవాలని అనుకున్నారు.

విశ్వనాథ్ గారు సోమయాజులు గారిని వెంటనే మేకప్ టెస్ట్ కి పిలిపించి జుట్టు కత్తిరిస్తాం, పిలక పెడతాం. నచ్చకపోతే సినిమాకు తీసుకోం అని చెప్పారు. దానిదేముంది సెలెక్ట్ అయితే ఇదే గెటప్ సినిమాకు ఉంచుతాను. ఎంపిక కాకపోతే తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుని ఇంటికి వెళ్తాను అన్నారు సోమయాజులు గారు. మేకప్ టెస్ట్ జరిగింది సోమయాజులు గారు ఎంపికయ్యారు. మంజు భార్గవిని మరొక ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. అప్పటికే కొన్ని బాల పాత్రలలో నటించిన తులసి ని ఇందులో చాలా ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేశారు. ఇలా అన్ని ఎంపికలు పూర్తి అయ్యాక 52 రోజులలో సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తి చేశారు. 11 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అప్పటి రేట్ల ప్రకారం అది పెద్ద మొత్తమే.

ఈ సినిమాకి రివార్డులు రావడం అనేది జనానికి నచ్చడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కచ్చితంగా అవార్డులు మాత్రం వచ్చి తీరుతాయని నమ్మకం దర్శక, నిర్మాతలకు బలంగా ఉంది. సినిమా చూసిన పరిశ్రమ వ్యక్తులు గొప్పగా ఉంది. అద్భుతం, అపూర్వమని అభినందిస్తున్నారు. కానీ ఈ సినిమాకు మాకు కావాలి అనే వారెవరు లేరు. అలాంటి తరుణంలో లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు సినిమా చూశారు. ఆయన అనుభవం సినిమా సాధించే విజయాన్ని అంచనా వేసింది. అలాగే విడుదలకి ఇబ్బంది పడుతున్న ఎన్నెన్నో సినిమాలను బయటపడేసి గొప్ప పంపిణీదారుడు ఆయన. తర్వాత 2 ఫిబ్రవరి 1980 నాడు సినిమా విడుదల చేశారు. మొదటి రెండు మూడు రోజులు కలెక్షన్లు మాములుగా ఉన్నాయి. ఇక నాలుగో రోజు కలెక్షన్లు ఊపు అందుకుంది అంతే. అదొక ప్రవాహం, అదొక ప్రభంజనం. తొలి స్వర్ణకమల సౌరభం..

యువ హృదయాల మనసు దోచిన సీతాకోకచిలుక..

ఇక శంకరాభరణం తర్వాత కె.విశ్వనాథ్ గారు హిందీ సిరిసిరిమువ్వకు దర్శకత్వం వహించే పనిలో ఉన్నారు. అప్పుడు నాగేశ్వరావు గారు భారతీరాజా గారిని కలిశారు. సిరిసిరిమువ్వ , శంకరాభరణం తీసిన నిర్మాతగా నాగేశ్వరావు గారిపై భారతీరాజా గారికి మంచి అభిప్రాయం ఉంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రం సీతాకోకచిలుక. ఆ సినిమా చిత్రీకరణ మొత్తం చాలా ఆనందంగా సాగిపోయింది. అయితే చిత్ర ముగింపులో విషయంలో హీరో, హీరోయిన్లను చంపేసే క్లైమాక్స్ నాగేశ్వరావు గారికి నచ్చలేదు. పాజిటివ్ ఎండింగ్ ఇవ్వాల్సిందని భారతీరాజా గారిని కోరారు. అప్పుడు తన మాటను గౌరవిస్తూ భారతీరాజా గారు ఒకే ఒక్క రోజులో అద్భుతమైన క్లైమాక్స్ ను చిత్రీకరించారు.

సినిమా విడుదలైన తొలి రోజు నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అద్భుత విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభించినప్పటికీ ప్రత్యేకించి ఆనాటి యువ హృదయాల మనసు కొల్లగొట్టింది. “సీతాకోకచిలుక” లో ముఖ్యంగా ఇళయరాజా గారు అందించిన స్వరాలు చిత్రానికి ఒక మ్యూజికల్ బొనంజాగా నిలబెట్టాయి. పూర్ణోదయ సంస్థకి డబ్బును, పేరును సమస్థాయిలో తెచ్చి పెట్టిన సీతాకోకచిలుక జాతీయ పురస్కారాలతో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత పతకం, రాష్ట్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రం గా “బంగారు నంది” లభించాయి. ఆలీకి ఉత్తమ బాలు నటుడు అవార్డు లభించింది. ఆ రోజుల్లో అతనికి 5000 రూపాయలు పారితోషికం ఇస్తే ఆనందంతో మురిసిపోయాడు.

రికార్డుల సాగర సంగమం ( 575 రోజులు )..

సీతాకోకచిలుక తర్వాత మరల కె విశ్వనాథ్ గారితో సినిమా సన్నాహాలు ప్రారంభించారు నాగేశ్వరావు గారు. శంకరాభరణం సంగీత ప్రధానమైనది చిత్రం. కాబట్టి ఈసారి నృత్య ప్రధానమైన చిత్రం తీయాలనుకున్నారు.  నృత్య ప్రాధాన్యమైన చిత్రం చేయగల హీరో ఎవరు అని ఆలోచిస్తుండగా విశ్వనాథ్ గారికి, నాగేశ్వరావు గారికి తట్టిన అరుదైన నటుడు కమలహాసన్ గారు ఒక్కరే. సినిమాలో ఎక్కువ భాగం వృద్ధాప్య ఛాయలున్న పాత్రనే. కమలహాసన్ గారు అంతకుముందే “కడల్ మీన్ గళ్” అనే సినిమాలో వృద్ధ పాత్రలో నటించారు. అది ఫెయిల్ అయ్యింది. అందువల్ల సందేహిస్తున్నారు కమలహాసన్ గారు. ఏదేని తేల్చి చెప్పలేకపోతున్నారు.

అలా ఐదు నెలలు గడిచాయి. కమలహాసన్ గారికి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వం చేయాలని కోరిక బలంగా ఉండేది. చివరికి ఎలాగోలా ఒప్పించగలిగారు. అలా విశ్వనాథ్, కమలహాసన్ గార్ల తొలి కలయికకు శ్రీకారం జరిగింది. ఇళయరాజా గారు సంగీత దర్శకులు. అలాగే 16 ఏళ్ల వయస్సుకు కెమెరామన్ అయినా “నివాస్” ను దీనికి చాయ గ్రహాకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇక హీరోయిన్ గా జయసుధ గారి డేట్స్ దొరకలేదు. అప్పుడు జయప్రద గారిని అడగ్గా ఆమె వెంటనే ఆనందంగా అంగీకరించారు. ఇక జయప్రద కూతురుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ ను ఎన్నుకున్నారు. అలా ప్రతి కళాకారుని, ప్రతి సాంకేతిక నిపుణుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్మించిన నృత్య ప్రధాన చిత్రం సాగర సంగమం.

పూర్ణోదయ సంస్థ చరిత్రలో మరొక కలికితురాయిగా నిలిచి ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు సాధించిన చిత్రం సాగర సంగమం. ఈ సినిమా విషయంలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమిటంటే కొన్ని మార్పులతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. తమిళంలో “సలంగై ఒలి” అనే పేరుతో, తెలుగులో మరియు మలయాళం లో “సాగరసంగమం” పేరుతో విడుదలైన ఈ సినిమా మూడు భాషల్లో ఘనవిజయాన్ని సాధించి ఇండియన్ పనోరమాకు ఎంపిక అయ్యింది.

బాలసుబ్రమణ్యం గారికి తొలిసారి “శంకరాభరణం” ద్వారా, రెండోసారి “ఏక్ దూజ్ కేలియే” ద్వారా, మరలా మూడోసారి “సాగర సంగమం” ద్వారా బెస్ట్ సింగర్ గా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇళయరాజా గారికి తొలిసారిగా ఒక తెలుగు సినిమా ద్వారా ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు లభించడం, అది కూడా “సాగర సంగమం” కావడం గర్వంగా ఫీల్ అయ్యే విషయం. కాగా విడుదలైన అన్ని భాషల్లో సంచల విజయ సాధించిన “సాగర సంగమం” బెంగుళూరు సిటీలో 575 రోజుల రికార్డు క్రియేట్ చేసింది.

అమితాబ్ ప్రశంసలు అందుకున్న “సితార”..

“సాగర సంగమం” తర్వాత వంశీ దర్శకత్వంలో “సితార” చిత్రాన్ని ప్రారంభించారు. “సిరిసిరిమువ్వ” చిత్ర నిర్మాతలు దర్శకులు వంశీ ని నాగేశ్వరావు గారికి పరిచయం చేశారు. అంతకు ముందు వంశీ గారికి కథా రచయితగా పత్రికలలో మంచి గుర్తింపు ఉంది.

“తాయారమ్మ బంగారయ్య” సమయం నుండి  సహాయ దర్శకుడిగా చేస్తూ నాగేశ్వరావు గారి కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్నాడు.

వంశీ గారికి తమిళ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించే అవకాశం వచ్చింది. అదే ఆయన తొలి చిత్రం “మంచు పల్లకి” అది మాములుగా ఆడింది.

“మహల్లో కోకిల” అనే నవలన “సితార” పేరుతో తెరాకెక్కించే ప్రయత్నం చేశారు.

రాజా వారి  కోటలు, అంతఃపురం రహస్యాలు వంటి విషయాల మీద వంశీ చాలా పరిశోధన చేశారు.

అప్పటికప్పుడే పరిచయమవుతున్న సుమన్ ను కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నారు.

కథానాయిక వేషం కోసం చాలా మంది అమ్మాయిలను చూసి చివరకు భానుప్రియను ఎంపిక చేసుకున్నారు.

కథలో హీరోయిన్ పాత్రకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉండటంతో భానుప్రియ ను “సితార” ద్వారా తెలుగులో పరిచయం చేశారు.

కొత్త కథా అంశంతో, కొత్త నేపథ్యంలో తీసిన “సితార” చిత్రానికి మంచి స్పందన వచ్చింది. జాతీయ పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత పతకం వచ్చింది.

మద్రాసులో అమితాబచ్చన్ గారు ఒక ప్రత్యేక ప్రదర్శన చూసి అనుభూతికి గురై అభినందించారు. సితార ఆర్థికంగా, హార్దికంగా కూడా ఆ సంస్థకు మంచి లాభాన్ని ఇచ్చింది “సితార”.

పురస్కారాలతో పరవశించిన స్వాతిముత్యం…

నాగేశ్వరావు గారి “పూర్ణోదయా”లో ఆరవ చిత్రంగా “స్వాతిముత్యం” నిర్మాణ సన్నహాలు ప్రారంభమయ్యాయి.

బెంగుళూరులో “సాగర సంగమం” 575 రోజుల వేడుక జరిగింది.

ఆ వేడుకలో విశ్వనాథ్ గారు, కమలహాసన్ గారు, ఏడిద నాగేశ్వరావు గారు హోటల్ రూమ్ లో కూర్చొని కథా చర్చలు మొదలుపెట్టారు.

వయసు పెరిగినా బుద్ధి పెరగని వ్యక్తి అనే అంశంపై విశ్వనాథ్ గారు బాలచందర్ గారి దగ్గర కథా చర్చలో పాల్గొంటూ కథ చెప్పారు.

రెండు మూడు రోజుల తర్వాత ఆయన వ్రాసుకొచ్చారు. కథ ప్రకారం కమలహాసన్ పాత్ర అమాయకుడిగానే మొదలవుతుంది.

ఇలా కథ విషయంలో పట్టు కుదరగానే చిత్రికరణ మొదలుపెట్టడం, ఆర్నెళ్లలో విడుదల చేయడం జరిగింది.

అలా తీసిన “స్వాతిముత్యం” నిజంగానే మా చిత్రాల్లో ఒక స్వాతిముత్యంగా నిలిచింది.

కలెక్షన్ల పరంగా అప్పట్లో “ప్రతిఘటన” ఒక సంచలనం అయితే, దానిని మించిన విజయం సాధించింది.

అనేక పురస్కారాలు వరించింది.

స్వాతిముత్యం శత దినోత్సవ వేడుకలకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పూర్ణోదయ విజయాలలో సమగ్ర సంపూర్ణ విజయంగా నిలిచి ఆనంద పరవశుల్ని చేసింది స్వాతిముత్యం.

చిరంజీవిని ఉత్తమ నటుడిగా నిలబెట్టిన స్వయంకృషి…

పూర్ణోదయా తొలి సినిమా తాయారమ్మ బంగారయ్య లో ఒక చిన్న ప్రతికూల పాత్రలో నటించిన చిరంజీవి గారు, ఆ తర్వాత అలా చూస్తుండగానే మెగాస్టార్ గా ఎదిగారు.

కే.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పూర్ణోదయ బ్యానర్లో చిరంజీవి గారు చేసిన సినిమా  “స్వయంకృషి”.

తన స్టార్ హోదాను ప్రక్కన పెట్టి సాంబయ్య అనే చెప్పులు కుట్టుకునే పాత్రలో నటించారు.

నిజానికి స్వయంకృషి సమయానికి చిరంజీవి గారు ఒక ఫైర్ బ్రాండ్ లాగా, స్టార్ లాగా వెలుగుతున్నారు.

అలాంటి సమయంలో సాంబయ్య అనే చెప్పులు కుట్టే పాత్ర చేయడం ఆయనకు సాహాసమే, చేయించడమూ నిర్మాతలకు సాహాసమే.

అలాగే కథానాయిక విజయశాంతి కూడా గ్లామర్ హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ గా ఉన్నారు.

అలా టాప్ హీరో, హీరోయిన్స్ ఇద్దరూ ఆ పాత్రలను సవాలుగా తీసుకోవడంతో “స్వయంకృషి” అనే ఒక గొప్ప ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాన్ని అందించగలిగారు.

ఇది కూడా ఆర్థికంగాను, హార్దికంగానూ అద్భుత విజయాన్ని సాధించింది.

చిరంజీవి గారికి తొలిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందించింది ఈ స్వయంకృషి.

అలాగే ఈ సినిమా మాస్కో ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైనప్పుడు నిర్మాత నాగేశ్వరావు గారు, చిరంజీవి గారు కలిసి మాస్కో వెళ్ళటం ఆ ఫెస్టివల్ లో పాల్గొనడం గొప్ప అనుభవంగా చెప్పుకొచ్చారు ఏడిద నాగేశ్వరావు గారు.

“స్వరకల్పన” తో తొలి అపజయం…

“స్వయంకృషి” తర్వాత ఏడిద నాగేశ్వరావు గారి అబ్బాయి ఏడిద శ్రీరాం ని హీరోగా పరిచయం చేస్తూ వంశీ దర్శకత్వంలో నిర్మించిన “స్వరకల్పన” బాగా నిరాశ పరిచింది.

ఆ ఫెయిల్యూర్ తో ఆర్థికంగా నష్టపోయినప్పటికీ మోరల్ గా కొంత ఇబ్బంది పడ్డారు నాగేశ్వరావు గారు. ఎందుకంటే జీవితంలో తనకు అదే తొలి ఫెయిల్యూర్.

నిజానికి కథలు ఎంపికలో గాని ప్రొడక్షన్ లో గానీ నిర్మాతగా తాను ఫెయిల్యూర్ అవ్వలేదు.

ఏది ఏమైనా ఆ ఫెయిల్యూర్ కు నాగేశ్వరావు గారే పూర్తి బాధ్యత వహించారు..

అవార్డుల ఆపద్బాంధవుడు..

ఇక “స్వయంకృషి” తర్వాత మరలా రెండేళ్లకు కె.విశ్వనాథ్ గారు, చిరంజీవి గారి కలయిక పునరావృతం అయ్యింది. ఆ చిత్రమే “ఆపద్బాంధవుడు”.

ఒకవైపు “స్వరకల్పన” చిత్రికరణ జరుగుతుండగానే మరోవైపు ఆపద్బాంధవుడు కథా చర్చలు జరిగాయి. చిరంజీవి గారిని మొదటిసారి ఒక శాస్త్రీయ నృత్యకారుడిగా చూపాలనే లక్ష్యంతో రూపొందిన కథ అపద్భాంధవుడు.

అలాగే ఆయన సరసన మరో గొప్ప నటి డాన్సర్ ఉంటే హీరో హీరోయిన్ పాటలు సమాతూకం అవుతాయని మీనాక్షి శేషాద్రి ని ఎంపిక చేయడం జరిగింది.

ఇక జంధ్యాల గారు మాటల రచయిత గానే కాకుండా ఇందులో ఒక ప్రత్యేక పాత్రను పోషించడం జరిగింది. జంధ్యాల గారికి మేకప్ టెస్ట్ చేసి ఓకే చేశారు.

నిజానికి ఎందరినో పరిచయం చేసిన జంధ్యాల గారు తన పాత్రలో అద్భుతంగా జీవించారు.

ఏడిద నాగేశ్వరావు గారు నిర్మించిన చిత్రాలు..

సిరిసిరిమువ్వ (1978)

శంకరాభరణం (1979)

తాయారమ్మ బంగారయ్య (1979)

సీతాకోకచిలుక (1981)

సితార (1983)

సాగర సంగమం (1983)

స్వాతిముత్యం (1985)

సిరివెన్నెల (1986)

స్వయంకృషి (1987)

స్వరకల్పన (1989)

ఆపద్బాంధవుడు (1992)

పురస్కారాలు…

సంగమ్ అకాడమీ  వారు ఏడిద నాగేశ్వరావు గారికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డునిచ్చి సత్కరించారు…

నంది పురస్కారాలు…

1980 వ సంవత్సరంలో శంకరాభరణం చిత్రానికి గానూ ఉత్తమ చలన చిత్రం గా బంగారు నందిని అందుకున్నారు.

1981 వ సంవత్సరానికి గానూ సీతకోక చిలుక చిత్రానికి ఉత్తమ చలన చిత్రం గా బంగారు నందిని స్వీకరించారు..

1983 సంవత్సరానికి గానూ సాగర సంగమం చిత్రానికి మూడవ ఉత్తమ చలన చిత్రం గా కాంస్య నంది బహుమతిని దక్కించుకున్నారు.

1986 వ సంవత్సరంలో స్వాతి ముత్యం చిత్రానికి గానూ ఉత్తమ చలన చిత్రం గా బంగారు నంది ని అందుకున్నారు…

1992 వ సంవత్సరానికి గానూ ఆపద్బాంధవుడు చిత్రానికి మూడవ ఉత్తమ చలన చిత్రం గా కాంస్య నందిని స్వీకరించారు.

మరణం…

నాగేశ్వరరావు గారు 81 సంవత్సరాల వయస్సులో 4 అక్టోబర్ 2015 నాడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

తన మరణంతో తెలుగు సినిమాయే కాదు, తెలుగు జాతియే గర్వించదగ్గ గొప్ప చిత్రాలను నిర్మించిన ఓ శకం ముగిసినట్టయ్యింది.

Show More
Back to top button