CINEMATelugu Cinema

సినీ జీవితంలో విషాద పాత్రలే, నిజ జీవితంలోనూ విషాదమే.. నటి మీనా కుమారి..

హిందీ చిత్ర పరిశ్రమలో విషాద రాణి లేదా కన్నీటి రాణి (ట్రాజెడీ క్వీన్) గా పేరు పొందింది మీనా కుమారి. సినిమాలో మాదిరిగానే నిజ జీవితంలో అడుగడుగునా అవమానాలు, లెక్కలేనన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. కేవలం ఆరు సంవత్సరాల ప్రాయంలోనే కుటుంబ పోషణ కోసం సినిమాలలో నటించాల్సి రావడం, ఆమె కేవలం కుటుంబానికి ఒక ఆర్థిక వనరులా మారడం, తన బాల్యాన్ని నటనకే అంకితం చేయడం, ఆటపాటలు ఆడే సమయంలో తాను సినిమా సెట్స్ కే పరిమితం కావడం, తన సంతోషాలన్నిటికి దూరంగా తనకు చీకటి ప్రయాణం బాల్యం నుండే మొదలైందని చెప్పాలి. బాల నటిగా “లెదర్ ఫేస్” (1939) సినిమాతో మొదలైన తన ప్రస్థానంలో 13 ఏళ్ళకే కథానాయికగా స్థిరపడి, 21 సంవత్సరాల వయస్సుకే తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడు అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న కమల్ అమ్రోహిని పెళ్లిచేసుకొని వివాహ బంధాన్ని నరకం చేసుకున్నారు. ఇతర దర్శకులతో పని చేయొద్దని, మగవారు మేకప్ రూమ్ లోకి రావొద్దని, సాయంత్రం 6 గంటలకే ఇంటికి రావాలని షరతులతో కూడిన ఆంక్షలకు కట్టుబడిన మీనా కుమారి సంసార జీవితంలో నియంత్రణ ఎక్కువై ప్రేమ తక్కువ అవ్వడంతో వివాహ బంధం విడాకులకు దారితీసింది.

నటి సావిత్రి జీవితం, మీనా కుమారి జీవితం రెండూ అచ్చుపోలినట్లు ఉంటాయి. ఇద్దరూ పెళ్లయిన మగాళ్లనే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. ఇద్దరి జీవితం విషాదంగానే ముగిసింది. భర్త షరతులతో తట్టుకోలేక విబేధించి ఒంటరితనం, మానసిక క్షోభ నుండి బయటపడడానికి మద్యానికి బానిసయ్యారు. నటులు ధర్మేంద్రతో కొంతకాలం సహజీవనం కొనసాగించినా చివరకు తాను కూడా దూరం పెట్టడంతో తాను మద్యం సేవించడం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే డెటాల్ సీసాలలో మద్యం దాచుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అలా విపరీతమైన మద్యం అలవాటు వలన “లివర్ సిరోసిస్” వచ్చి లండన్ లో చికిత్స తీసుకున్నా కూడా కోలుకోలేకపోయారు. అద్భుతమైన చిత్ర విజయాలు సొంతం చేసుకున్నా కూడా వ్యక్తిగత జీవితం విషాదం అవ్వడంతో సినిమా జీవితంలోనే కాదు, నిజ జీవితం కూడా విషాదంగానే మిగిలిపోయింది. లండన్ లో చికిత్స అనంతరం మళ్ళీ సినిమాలలో నటించాలనుకున్నా అప్పటికే చిత్రపరిశ్రమలో పెను మార్పులు రావడంతో మునుపటి పాత్రలు లేక గుణచిత్ర నటిగా సరిపెట్టుకోవలసి వచ్చింది. 1972 వ సంవత్సరంలో “పాకీజా” చిత్రం విడుదల అయిన నెల రోజులకే కన్నుమూసిన మీనా కుమారి, ఆ చిత్రం సాధించిన ఘన విజయాన్ని చూడకుండానే నిష్క్రమించడం చెప్పలేని విషాదం.

నేపథ్యం

మీనా కుమారి అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమె తల్లిదండ్రులు అలీ బక్ష్ మరియు ఇక్బాల్ బేగం దంపతులకు 01 ఆగస్టు 1933 నాడు జన్మించారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి పేరు ఖుర్షీద్ జూనియర్, రెండవ అమ్మాయి పేరు మహజబీన్ బానో (మీనా కుమారి) మరియు చిన్నదాని పేరు మహ్లికా (మధుగా ప్రసిద్ధి చెందింది, ఈమె ఒకప్పటి బాలనటి మరియు నటుడు మెహమూద్‌ను వివాహం చేసుకుంది). మీనా కుమారి తండ్రి అలీ బక్ష్ నాటకాలు వేస్తుండేవారు. పిల్లలకు హార్మోనియం నేర్పుతూ ఉండే తాను సినిమాలో చిన్న చిన్న వేషాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలాగే టాకీ సినిమాలు వచ్చిన కొత్తలో పెద్దగా పేరు లేని రెండు సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. ఎన్ని చేసినా దుర్భరమైన పేదరికంలో ఉండేవారు. మహజబీన్ బానో పుట్టిన కొత్తలో దవఖానలో చెల్లించడానికి డబ్బులు లేక ఆమెను అనాధ శరణాలయంలో ఉంచి ఆ తరువాత డబ్బులు కట్టి ఆ తరువాత ఆమెను దవఖాన నుండి తిరిగి తీసుకువచ్చారు. అంతటి పేదరికంలో అలీ బక్ష్ కుటుంబం ఉండేది. మహజబీన్ బానోను ఆరు సంవత్సరాల వయస్సులో పాఠశాలకు పంపించకుండా తనతో పాటు తీసుకెళ్లమని తల్లి ఇక్బాల్ బేగం తండ్రి అలీ బక్ష్ ను ఒత్తిడి చేసేది. దాంతో చేసేది లేక ఆమెను తనతో పాటే నాటకాలకు, సినిమా చిత్రీకరణ తండ్రి అలీ బక్ష్ తీసుకెళ్లేవారు.

బాల నటిగా తొలి సినిమా “లెదర్ ఫేస్” (1939)

అలీ బక్ష్ తన కూతురు మహజబీన్ బానోను పని అవకాశాల కోసం ఫిల్మ్ స్టూడియోలకు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఆ విధంగా ప్రకాష్ స్టూడియో ప్రొఫెసర్ యజమాని, నిర్మాత అయిన విజయ భట్ దగ్గరికి ఆమెను తండ్రి అలీ బక్ష్ తీసుకెళ్లారు. ఆయన అప్పుడు “లెదర్ ఫేస్” అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో హీరో కూతురుగా చిన్న పిల్ల పాత్ర కోసం ఆమెను ఇంటర్వ్యూ చేసి, ఆమె చాలా చలాకీగా ఉండడం, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడం వలన ఆమెను ఏడు సంవత్సరాల వయసులో ఆ సినిమాలో చిన్న పిల్ల పాత్రకు తీసుకున్నారు విజయ్ భట్. ఆ సినిమాలో కథానాయకుడు పైడి జయరాజ్ మన తెలుగువాడే. మహజబీన్ బానో బాలా నటిగా ఆ సినిమాలలో అరంగేట్రం చేయడం అదే తొలిసారి. ఆ సినిమాలో నటించినందుకు గానూ ఆమెకు 25 రూపాయల తొలి పారితోషికం ఇచ్చారు. అయితే విజయభట్ నిర్మాతగా తీసిన సినిమాలన్నింటిలోనూ మహజబీన్ బానో చిన్నపిల్ల పాత్రలో నటించారు. పెద్దయ్యాక కూడా ఆమె దర్శక, నిర్మాత విజయ్ భట్ తీసిన సినిమాలలో నటిస్తూ వచ్చారు. ఆయన తీసిన ఏక్ హి భూల్ (1940) అనే సినిమాలో మహజబీన్ బానో పేరును బేబీ మీనాగా మార్చారు విజయ్ బట్. అప్పటినుండి మీనాకు సినిమాలే లోకం అయిపోయింది.

తొలి సినిమా “బైజు బావ్రా” (1952).

మీనా కుమారి సినిమాలలో నటించడం మొదలుపెట్టిన తరువాత ఆమెకు పాఠశాలకు వెళ్లే అవకాశం లేకపోయింది. ఆమె సినిమాలలో బాలనాటిగా నటిస్తే వచ్చే పారితోషికంతో ఇంట్లో కుటుంబాన్ని పోషించే పరిస్థితి రావడం వలన బడికి వెళ్లే అవకాశం లేకపోవడం, సినిమాలే లోకం అయిపోయి ఒక్కసారి వెండితెరపై బేబీ మీనాగా అవకాశం రావడంతో ఆమె ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా పోయింది. బేబీ మీనా 1939 నుండి బాల నటిగా లెదర్ ఫేస్, అధూరి కహాని, పూజ బినా , ఏక్ హి భూల్, నై రోష్ని, కసౌతి, బాహెన్ , గరీబ్, విజయ్, ప్రతిజ్ఞ, లాల్ హవేలీ, దునియా ఏక్ సరాయ్ తదితర చిత్రాలలో అభినయించారు. కథానాయికగా మీనా కుమారి నటించిన తొలి సినిమా బైజు బావ్రా (1952). విజయ్ భట్ తెరకెక్కించిన ఈ సినిమాలో మీనా కుమారి కథానాయికగా ప్రధాన భూమిక పోషించారు.

చలనచిత్ర పరిశ్రమ వారు ఫిలిం ఫేర్ అవార్డును ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే ఆ పురస్కారాన్ని అందుకున్న తొలి నటి మీనా కుమారి. ఆ తరువాత సంవత్సరం వచ్చిన పరిణీత చిత్రంతో వరుసగా రెండవసారి ఫిలింఫేర్ ఉత్తమ నటిగా మరొకసారి పురస్కారం అందుకున్నారు. సరిగ్గా అదే రోజులలోనే కమల్ అమ్రోహితో మీనా కుమారికి పరిచయం అయ్యింది. కమల్ అమ్రోహి అసలు పేరు సయ్యద్ అమీర్ హైదర్ కమల్ నఖ్వీ. తన ఊరు పేరు అమ్రోహి (ఉత్తర ప్రదేశ్). ఆయన అక్కడి నుండి వచ్చారు కాబట్టి ఆయనను అమ్రోహి అనేవారు. రచయితగా ఎదిగిన ఆయన మంచి సినిమాలకు స్క్రిప్టులు వ్రాసి, మహల్ (1949) అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమా అద్భుతంగా ఆడడంతో ఆయన పేరు అందరికీ తెలిసిపోయింది. ఆ సినిమాతో మీనా కుమారి తన అభిమాని అయ్యింది. ఆ అభిమానమే తరువాత రోజులలో పరిణయానికి దారితీసింది.

కమల్ అమ్రోహి తో పెళ్లి

మీనా కుమారి నటిగా ఎదుగుతున్న క్రమంలో తాను చదవడం, వ్రాయడం బాగా అలవాటు చేసుకుంది. ఆమె కవిత్వం మీద అభిమానం పెంచుకుంది. ఉర్థూ పుస్తకాలు, హిందీ పుస్తకాలు బాగా చదువుకున్నారు. ఆ క్రమంలో ఆమె కవిత్వం మీద ప్రేమ పెంచుకున్నారు. తరచి చూస్తే మీనా కుమారి జీవితం అచ్చుపోలినట్టు సావిత్రి జీవితం లాగానే ఉంటుంది. మీనా కుమారి జీవితంలో జరిగిన సంఘటనలాగే సావిత్రి జీవితంలో కూడా జరిగింది. జెమినీ గణేశన్ అనే వ్యక్తికి పెళ్లయిందని తెలిసి కూడా మళ్ళీ అతడిని వివాహం చేసుకోవడం సావిత్రి జీవితంలో జరిగింది. ఇదే సంఘటన మీనా కుమారి విషయంలో కూడా జరిగింది. 1952 వ సంవత్సరంలో 21 సంవత్సరాల వయస్సులో ఉన్న మీనా కుమారి అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సయ్యద్ అమీర్ హైదర్ కమల్ నఖ్వీ (కమల్ అమ్రోహి) కి మూడో భార్య అయ్యారు. వివాహం అనంతరం మీనా కుమారి నటిగా, కమల్ అమ్రోహి రచయితగా కొనసాగుతున్నారు.

అశోక్ కుమార్, మధుబాల ప్రధాన పాత్రలో “మహల్” (1949) సినిమా తీసిన తరువాత ఆయన మీనాకుమారి ప్రధాన పాత్రలో “దాయేరా” (1953) అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా కూడా విజయవంతం అయ్యింది. వివాహం తరువాత మీనా కుమారి తన విజయ పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె నటించిన ఎన్నో సినిమాలు విజయవంతం అయ్యాయి. శరత్ చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ నవల ఆధారంగా బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన చిత్రం “దో బిఘా జమీన్” (1954), బి.ఆర్.చోప్రా దర్శకత్వం వహించిన ఒక క్లాసిక్ ముస్లిం సామాజిక నాటక చిత్రం “చాందినీ చౌక్” (1954), ‘ “ఆజాద్”, మేమ్ సాహిబ్ (1956), నయా అందాజ్ (1956), ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన “మిస్ మేరీ” (1957), దేవేంద్ర గోయెల్ దర్శక, నిర్మాణంలో రూపొందిన “చిరాగ్ కహాన్ రోష్నీ కహాన్'” (1959), అజిత్ చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన “అర్ధాంగి” (1959) ఇలా విజయవంతమైన చిత్రాలలో మీనా కుమారి నటిస్తూ వచ్చారు.

మీనా అవకాశాలను అడ్డుకున్న కమల్ అమ్రోహి

విజయవంతమైన సినిమాలలో నటించి మీనా కుమారి మంచి పేరు తెచ్చుకున్నారు. మొట్టమొదటి రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, తరువాత రెండు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. సినిమాలలో ఎక్కువగా విషాదాంత పాత్రలలో నటించారు. ఇలా వారిద్దరి జీవితం నడుస్తుంది. కాపురం కూడా బాగానే సాగుతోంది, అంతా మంచిగానే ఉంది అనుకుంటున్న రోజులలో “పాకీజా” సినిమాకు పునాది వేశారు. 08 జనవరి 1958 నాడు పాకీజా సినిమాను ప్రారంభం చేశారు. అందులో ప్రధానపాత్ర మీనా కుమారి. వివాహం తరువాత 1958 సంవత్సరంలో మీనా కుమారి, కమల్ అమ్రోహి మధ్య చిన్నచిన్న విభేదాలు వస్తూ వచ్చాయి. రానురాను వారి మధ్య విభేదాలు పెద్దవవుతూ వచ్చాయి. ఆమెకు రకరకాల ఆంక్షలు, నిబంధనలు పెట్టడం మొదలయ్యాయి. దాంతో కమల్ అమ్రోహి మాత్రం మీనా కుమారికి రావలసిన అవకాశాలు కూడా రాకుండా చేశారు. విమల్ రాయ్ తీసిన దేవదాస్ సినిమాలో పార్వతిగా మీనా కుమారిని తీసుకుందామనుకుంటే డేట్స్ ఖాళీ లేవని చెప్పేసారు కమల్ అమ్రోహి.

అలాగే గురు దత్ తీసిన సినిమాలో కూడా మీనా కుమారి నటించకుండా కమల్ అమ్రోహి ఆపేశారు. ఆ తరువాత ఆయన తీసిన సినిమా “సాహిబ్ బీబీ ఔర్ గులాం” లో మీనా కుమారి నటించారు. కానీ అందుకు కమల్ అమ్రోహి ఆమెతో గొడవపడ్డారు. నిజానికి “సాహిబ్ బీబీ ఔర్ గులాం” లో మీనా కుమారి చేసిన పాత్ర చాలా విభిన్నమైనది. సంసారంలో విబేధాల వలన కమల్ అమ్రోహితో గొడవ వలన 1958 – 59 ప్రాంతంలో మీనా కుమారి మద్యానికి బానిస అయ్యింది. భర్తతో విబేధాలు పెరగడం, మద్యానికి విపరీతంగా బానిసైపోవడం, భర్త చెప్పినా వినకపోవడం, ఇలాంటి మానసిక సంఘర్షణలో 05 మార్చి 1964 నాడు “పింజరే కే పంఛీ” (పంజరంలో పక్షి) అనే సినిమా ముహూర్తం రోజున ఈమె కంటే నాలుగేళ్ల చిన్వాడు అయిన గుల్జార్ అనే అబ్బాయిని తీసుకుని తన అక్కయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన కమల్ అమ్రోహిని చూడడానికి మీనా కుమారి నిరాకరించింది. కమల్ అమ్రోహి ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీనా కుమారి పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోలేదు కానీ భార్యాభర్తలుగానే ఉన్నారు.

వైద్యం కోసం లండన్

ఒకవైపు సినిమాలలో నటిస్తున్నా కూడా మీనా కుమారి మాత్రం మద్యం సేవించడం మానలేదు. నరేంద్ర సూరి దర్శకత్వం వహించిన “పూర్ణిమ” (1965) సినిమాలో ధర్మేంద్రతో కలిసి మీనా కుమారి నటించారు. ఆమె మాత్రం అతనికి నటన నేర్పిస్తూనే అతనితో ప్రేమలో పడింది, కానీ అప్పటికే అతనికి వివాహమైంది. కానీ అతనికి ఆమెకు మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. ఇద్దరు కలిసి ఆ తరువాత రెండు మూడు సినిమాలలో నటించారు. అలా మొదలైన వారివురి పరిచయం 1966లో ఓపీ రల్హాన్ దర్శకత్వం వహించిన “ఫూల్ ఔర్ పత్తర్” వరకు కొనసాగింది. ఆ సినిమా విజయవంతం అయిన తర్వాత ధర్మేంద్ర మీనాకుమారి కి దూరంగా జరిగారు. దానిని ఆమె భరించలేకపోయింది. దాంతో ఆమెకు తాగుడు మరీ ఎక్కువైంది. 1968 సంవత్సరం తరువాత మద్యం వలన ఆమె ఆరోగ్యం మరింత దిగజాడంతో ఆమెను లండన్ తీసుకెళ్లి వైద్యం చేయించమని వైద్యులు చెప్పారు. కానీ దానికి ఆమె నిరాకరించింది. బొంబాయిలో వైద్యం ఇప్పించడానికి వెళ్తే స్ట్రెచర్ మీద అరచి గోల పెట్టేది. ఆ తరువాత లండన్ వెళ్లి చికిత్స తీసుకొని ఆరు ఏడు నెలలు ఉండి 1969 తరువాత వెనక్కి వచ్చేశారు.

మరణం

ఆమె వెనక్కి వచ్చేసరికి హిందీ చిత్ర పరిశ్రమంతా మారిపోయింది. ఆమె కంటే చిన్న చిన్న వాళ్ళు, కొత్త కొత్త కథనాయికలు రావడం విషాదాంత సినిమాలకు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ రావడం వలన గుణచిత్ర పాత్రలు వేస్తూ వచ్చారు. 1970వ దశకం ప్రారంభం నాటికి, మీనా కుమారి క్రమంగా తన దృష్టిని మరింత “నటనకు ప్రాధాన్యత ఉన్న” లేదా పాత్రధారి పాత్రల వైపు మళ్లించింది. చివరలో కమల్ అమ్రోహి, మీనా కుమారికి మధ్య సయోధ్య కుదిరించి పాకీజా సినిమా తీశారు. 04 ఫిబ్రవరి 1972 తేదీన పాకీజా విడుదలైంది. పాకీజా విడుదలైన మూడు వారాల తరువాత మీనా కుమారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

28 మార్చి 1972 నాడు ఆమెను సెయింట్ ఎలిజబెత్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. ఆమె రెండు రోజుల తర్వాత కోమాలోకి జారుకుని, 31 మార్చి 1972 నాడు మరణించారు. అప్పటికి ఆమె వయస్సు 38 సంవత్సరాలు. ఆమె మరణానికి కారణం లివర్ సిర్రోసిస్ అని నిర్ధారించబడింది. మీనా కుమారి చనిపోయిన తర్వాత పాకీజా సినిమాను ఆకాశానికి ఎత్తిన ప్రేక్షకులు, ఆ సినిమాను కళాఖండంగా నిలబెట్టారు. ఆమె భర్త కోరిక మేరకు, ఆమెను బొంబాయిలోని మజాగావ్‌లోని నారియల్‌వాడిలో ఉన్న రెహ్మతాబాద్ స్మశానవాటికలో ఖననం చేశారు. అతని కోరిక మేరకు, 11 ఫిబ్రవరి 1993 నాడు బొంబాయిలో అతను మరణించినప్పుడు, ఆమె భర్తను ఆమె పక్కనే ఖననం చేశారు.

Show More
Back to top button