
భారతదేశంలో తొలి యాజమాన్య సినిమా థియేటర్ (చిత్ర ప్రదర్శన శాలను) “గెయిటీ”. దీనిని రఘుపతి వెంకయ్య నాయుడు 1912 వ సంవత్సరం మద్రాసులో నిర్మించారు. ఊరూరా తిరుగుతూ సినిమాలు ప్రదర్శించే ఆయన ప్రేక్షకులంతా కూడా ఒకే చోట కూర్చుని సినిమా చూడాలనే ఆలోచనను ఆచరణలో పెడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిగా “గెయిటీ” అనే సినిమా థియేటర్ నిర్మించారు. ఆ తరువాత “క్రౌన్”, “గ్లోబ్” అనే సినిమా థియేటర్ లను కూడా నిర్మించారు. ఆ సినిమా హాలులో అమెరికన్ మరియు బ్రిటిష్ చిత్రాలను ప్రదర్శించేవారు.
ఆయన కుమారుడు సుర్యప్రకాష్ దర్శకత్వంలో “స్టార్ ఆఫ్ ద ఈస్ట్” బ్యానరు పై 1921 లో “భీష్మ ప్రతిజ్ఞ” అనే మూకీ సినిమా రఘుపతి వెంకయ్య నిర్మించారు. ఇది తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగా చారిత్రాత్మకమైంది. సరిగ్గా అదే సంవత్సరం 1921లో ఆంధ్ర దేశంలో బెజవాడలో పోతిన బ్రదర్స్ “మారుతి టాకీస్” ను నిర్మించారు. ఇదే తెలుగు రాష్ట్రంలో తొలి చిత్ర ప్రదర్శనశాల (థియేటర్). ఆ తరువాత శ్రీనివాస థియేటర్ ని కూడా వారే నిర్మించారు. వాటి యాజమాన్యంలో ఒకరు పోతిన శ్రీనివాసరావు. ఆంధ్రదేశానికి ఆయన తొలి ఎగ్జిబిటర్ (ప్రదర్శకుడు). ఆయన రెండవ కుమారుడే పోతిన డూండేశ్వర రావు (డూండి).
పోతిన డూండేశ్వర రావు అలియాస్ డూండి. ఆయన డూండీగా సుప్రసిద్ధుడు. పేరుకు డూండి రెండక్షరాలే. కానీ ఆయన పేరు చెబితే పెద్ద పెద్ద హీరోలు కూడా లేచి నిలబడతారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో తమిళంలో నటించిన విజయవంతమైన చిత్రం “పాశమలర్” ను “డూండీ” నిర్మాతగా “రక్తసంబంధం” (1962) అను పేరుతో ఎన్టీ రామారావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో దర్శకులు వి.మధుసూదనరావు తెరకెక్కించారు. తెలుగు తెరపై ఆయన అనేక ప్రయోగాలు చేశారు.
ఆయన 70 కి పైగా సినిమాలు నిర్మించారు. “అభిమానవతి” అనే ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో డూండీ నిర్మించిన శాంతినివాసం (1960), విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన “బందిపోటు” (1963), వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కించిన “వీరాభిమన్యు” (1965) వంటి ఘనవిజయాలు డూండీ సొంతం. “గూఢచారి 116”, “మరపురాని కథ”, “భలేదొంగలు”, “దొంగలకు దొంగ”, “దొంగలవేట” లాంటి చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. కథానాయకులు సూపర్ స్టార్ కృష్ణను “గూఢచారి 116” సినిమాతో జేమ్స్ బాండ్ చేసిన ఘనత కూడా ఆయనదే.
1956 వ సంవత్సరంలో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ “కొండవీటి దొంగ” (1957) ను తెలుగులోకి అనువదించి విజయం సాధించారు. ఆయన చేసిన వైవిధ్యభరితమైన ప్రయోగాలు సఫలీకృతం అవ్వడమే గాక, నిర్మాతగా తనకు ఎనలేని పేరును తీసుకువచ్చాయి. అందులో భాగమే గూడాచారి 116 (1966) సినిమా. ఎం.మల్లికార్జునరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు చిత్రసీమలోనే కాకుండా భారతీయ చలనచిత్ర సీమలో కూడా తొలి గూఢచారి చిత్రంగా మన్ననలను అందుకుంది. వాణిజ్యపరంగా అద్భుతమైన విజయం సాధించి ఘట్టమనేని కృష్ణను సినిమా ప్రస్థానానికి కీలక మలుపుగా నిలిచి, ఆయనకు “ఆంధ్రా జేమ్స్ బాండ్” అనే మారు పేరు కూడా తెచ్చిపెట్టింది. ఎన్నో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన డూండీకి మాత్రం దక్కాల్సిన గౌరవం దక్కలేదు. బహుమతులు అయితే వచ్చాయి గానీ పురస్కారాలు లభించలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. డూండీ పురస్కారాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. సన్మానాలకు, ఇంటర్వ్యూలను పట్టించుకోరు. 2005 నంది పురస్కారాల ఎంపిక బృందానికి ఆయన సారథ్యం వహించారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : పోతిన డూండీశ్వరరావు
ఇతర పేర్లు : డూండీ
జననం : 1930
స్వస్థలం : విజయవాడ, కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్
వృత్తి : దర్శకుడు, నిర్మాత
తండ్రి : పోతిన శ్రీనివాస రావు
మరణ కారణం : కాన్సరు
మరణం : 01 జనవరి 2007
నేపథ్యం…
డూండీ అసలు పేరు పోతిన డూండేశ్వర రావు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడలో ఈయన జన్మించారు. వీరి నాన్న పోతిన శ్రీనివాసరావు, ఆంధ్రదేశంలో తెలుగు గడ్డపై విజయవాడలో తొలి సినిమా థియేటర్ నెలకొల్పిన ఘనులు. శ్రీనివాసరావు సంకల్పంతో తెలుగు రాష్ట్రంలో తొలిసారిగా 1921లో సినిమా ప్రదర్శన మొదలయ్యాయి. అప్పటివరకు ఊరూరా తిప్పుతూ ఉండే టూరింగు టాకీసులలో సినిమాల ప్రదర్శనలు జరిగేవి. అప్పటికే మూకీ చిత్ర నిర్మాణంలో తెరకెక్కించే ఒకటీ ఆరా చిత్రాలు సరిపోక పోతిన శ్రీనివాసరావు తాను నిర్మించే సినిమా థియేటర్ లలో తెలుగు భాషా చిత్రాలే కాకుండా, విభిన్న భాషా చిత్రాలను ప్రదర్శన కోసం విజయవాడకు తీసుకొస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయనకు తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ చిత్ర దర్శకులతో పరిచయాలు ఉండేవి. పోతిన శ్రీనివాసరావును స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో చాలా మంది థియేటర్లు కట్టడం మొదలుపెట్టారు. కానీ సినిమాలు ప్రదర్శించడానికి ప్రొజెక్టర్ ఆపరేటర్లు లేరు. దాంతో ఆయన ప్రొజెక్టర్ ఆపరేటర్ల కోసం ఒక సాంకేతిక శిక్షణ పాఠశాల నిర్వహించేవారు. ఆ సమయంలో ఆయన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులే ఆ తరువాత కాలంలో చిత్ర ప్రదర్శన శాల యజమానులుగా, చిత్ర నిర్మాతలుగా అభివృద్ధి చెందారు.
మద్రాసులో చదువు…
విజయవాడలో ఉంటే డూండీకి చదువు సరిగ్గా అబ్బడం లేదని నాన్న పోతిన శ్రీనివాసరావు డూండీని మద్రాసుకు పంపించారు. మద్రాసు లోని ప్రెసిడెన్సి కళాశాలలో డూండీ డిగ్రీలో చేరారు. ఆయనకు ఇంటివద్ద నుండి నెలకు 100 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపించేవారు. తనకు ఇంటి అద్దెకు పది రూపాయలు, భోజనానికి ఇరవై ఏడు రూపాయలు ఖర్చు అయ్యేది. కాగా మిగిలిన సొమ్మును ఎలా ఖర్చు పెట్టాలో ఆయనకు తెలిసేది కాదు. దాంతో ఆ డబ్బును సినిమాలు, షికార్లకు ఉపయోగిస్తూ ఉండేవారు. ఒక్కోసారి ఇంటివద్ద నుండి మనీ ఆర్డరు రావడం ఆలస్యం అయితే ప్రముఖ నిర్మాత సుందర్ లాల్ నహతా వద్ద ఖర్చులకు సరిపడా డబ్బులు తీసుకునేవారు. పోతిన శ్రీనివాసరావు కొడుకుగా డూండీకి మంచి గౌరవం లభించేది. అందువలన సుందర్ లాల్ నెహతా కూడా డూండీకి ఎప్పుడూ అడ్డు చెప్పేవారు కాదు. డూండీ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో సుందర్ లాల్ నెహతా కోరిక మేరకు తారస ఫైనాన్స్ చేసిన ఒక తమిళ సినిమా ప్రివ్యూ షో చూడడానికి వెళ్లారు. సినిమా బాగుంది. దీనిని తెలుగులోకి అనువదించమని సుందర్ లాల్ నెహతా సలహా ఇచ్చారు. అయితే సినిమాల పట్ల పెద్దగా అనుభవం లేకపోవడం వలన డూండీ తన వల్ల కాదని చెప్పేశారు.
తొలి చిత్రం “కొండవీటి దొంగ” (1957)…
నిర్మాత “శాండో చిన్నప్ప తేవర్” “నీలమలై తిరుడాన్” (1957) తమిళ సినిమాను విజయ-వాహినీ స్టూడియోలో చిత్రీకరణ జరిపినందుకు గానూ అధినేత నాగిరెడ్డికి 24 వేల రూపాయలు బకాయి పడ్డారు. “నీలమలై తిరుడాన్” సినిమా ప్రొజెక్షన్ ను డూండీకి చూపించిన నాగిరెడ్డి, ప్రక్షేపణం పూర్తయిన తరువాత ఎలా ఉందని అడిగారు. ఆ సినిమా డూండీకి బాగా నచ్చింది. “శాండో చిన్నప్ప తేవర్” వాహినీ అధినేత బి.నాగరెడ్డికి ఇవ్వవలసిన బకాయి క్రింద “నీలమలై తిరుడాన్” సినిమా డబ్బింగ్ హక్కులను ఇచ్చేశారు. అందువలన ఆ 24,000 రూపాయలు ఇచ్చి ఈ “నేరమలై తిరుడన్” సినిమాను తెలుగులోకి అనువాదం చేసుకోవాల్సిందిగా డూండీకి నాగిరెడ్డి చెప్పేశారు. దాంతో ఆ సినిమా హక్కులను తీసుకొని దానిని తెలుగులోకి అనువదించారు డూండీ. ఆ సినిమా పేరు “కొండవీటి దొంగ” (1957). ఆ సినిమా తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో డూండీకి మంచి లాభాలు కూడా వచ్చాయి. ఈ విధంగా డూండీ సినిమాల్లోకి ప్రవేశించారు.
రక్తసంబంధం (1962)..
కొండవీటి దొంగ (1957) సినిమా తరువాత డూండీ లోని ప్రతిభను గుర్తించి పూర్తిస్థాయిలో చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టమని సుందర్ లాల్ నెహతా సూచించారు. దాంతో సుందర్ లాల్ నెహతాతో కలిసి డూండీ తమిళ చిత్రం “ధామ్ ఫిరంథాల్ వాజి పిరక్కుమ్” సినిమాని “మంచి మనసుకు మంచి రోజులు” (1958) గా పునర్నిర్మాణం చేశారు. ఇందులో సహా నిర్మాతగా టి.అశ్వత్ధ నారాయణకూడా ఉన్నారు. ఈ సినిమాతో మొదలైన నెహతా, డూండీల ప్రస్థానం ఆ తరువాత “శభాష్ రాముడు”, “శాంతినివాసం”, “రక్తసంబంధం”, “మరపురాని కథ” ఇలా 1981 చివరి వరకు కొనసాగింది. డూండీ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉండటం, తాను కళాశాల వాతావరణం నుండి నేరుగా సినిమాలలోకి రావడం వలన, డబ్బుకి తన వద్ద కొదువలేకుండా ఉండడం వలన ఆయన ఆలోచనలని ప్రయోగాల పైన కేంద్రకృతం చేసి ఖర్చుకు వెనకాడకుండా సినిమాలను తీసేవారు. తెలుగు సినిమా నిర్మాణ రంగంలో హెచ్.ఎం.రెడ్డి, చిత్తజల్లు పుల్లయ్య, బి.ఎన్.రెడ్డి వంటి ప్రముఖులు ఒక ప్రత్యేక ఒరవడిని తీసుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఆ సమయంలో పౌరాణిక మరియు జానపద చిత్రాలకే పరిమితమై ఉండేది. వారు సాంఘిక చిత్రాలు తీయడానికి పెద్దగా సాహసం చేయడానికి ప్రయత్నించలేదు.
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు అప్పటికే చిత్రరంగంలో కథనాయకులుగా రాణిస్తున్నారు. అప్పుడు తమిళంలో “పాశమలర్” అనే సినిమా విడుదలైంది. విజయవంతమైన ఆ సినిమాలో శివాజీ గణేషన్ అద్భుతమైన కరుణ రసాన్ని పండించారు. ఆ సినిమా తెలుగులో తీయాలనుకున్నారు డూండీ. ఆయన అదే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించారు. దానికి ఎన్టీఆర్ తన పాత్ర అంతగా సరిపోదేమోననే సందేహం వ్యక్తం చేశారు. కానీ ఎన్టీఆర్ దేహ దారుద్యం మీద నమ్మకం ఉన్న డూండీ ఎలాగోలా ఎన్టీఆర్ ను ఒప్పించారు. దర్శకుడు విషయం లోనూ, మాటల రచయిత విషయంలోనూ అయోమయం ఎదురైనా కూడా దానిని చాకచక్యంగా జయించారు డూండీ. దర్శకుడిగా మధుసూదన రావుకు దర్శకత్వ భాద్యతలు అప్పగించారు. ముళ్లపూడి వెంకటరమణను మాటలు వ్రాయడానికి ఎన్నుకున్నారు. తమిళ “పాశమలర్” సినిమాను “రక్తసంబంధం” తెలుగు సినిమాగా అద్భుతంగా తెరకెక్కించగా, ఆ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, ఊహించని విజయం సాధించంది.
శాంతినివాసం (1960)…
అక్కినేని నాగేశ్వరరావు విశ్రాంతి కోసం కొద్ది రోజులు ఏకాంతంగా గడపడానికి మహాబలిపురం వెళ్లారు. ఆ సమయంలో తనతోబాటు డూండీని కూడా కాలక్షేపం కోసం వెంట తీసుకెళ్లారు. అక్కడ మాటల సందర్భంలో అక్కినేనికి డూండీ వ్రాసుకున్న శాంతినివాసం కథను చెప్పారు. అప్పటికి ఇంకా నటవర్గం ఎంపిక కాని ఆ కథకు కథానాయకుడిగా అక్కినేని నటిస్తా అని చెప్పారు. అప్పట్లో ఒక సినిమా తీయడానికి సుమారుగా ఏడాది కాలం పట్టేది. కానీ “శాంతినివాసం” సినిమాకు డూండీ తొంభై రోజులు మాత్రమే సమయం తీసుకుని, అనుకున్నట్టుగానే అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, దేవిక, కృష్ణకుమారి ప్రధాన పాత్రధారులుగా రెండు నెలల్లో “శాంతినివాసం” పూర్తి చేశారు. సినిమా విడుదలయ్యాక 25 వారాలు ప్రదర్శితమైన సినిమాగా “శాంతినివాసం” రికార్డు సృష్టించింది. నిర్మాత అనే వాడికి చిత్ర నిర్మాణానికి అవసరమైన డబ్బు పెట్టడమే కాదు, కథానాయక వర్గాన్ని ఎంపిక చేయడం, సాంకేతిక నిపుణులతో పని చేయించుకోవడం వంటి అన్ని అంశాల మీద పట్టు ఉండాలి. “శాంతినివాసం” చిత్రం నిర్మాణం జరుగుతున్నప్పుడే చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాలపై డూండీకి పూర్తి అవగాహన వచ్చేసింది.
విఠలాచార్య బందిపోటు (1963)..
శాంతినివాసం సినిమా తరువాత డూండీ నిర్మాణం చేసిన “రక్తసంబంధం”, “గుడి గంటలు” చిత్రాలు మంచి విజయం సాధించాయి. దాంతో డూండీ అంటే నందమూరి తారకరామారావుకు నమ్మకం ఏర్పడింది. అప్పుడు వారి కలయికలో మరో చిత్రం చేద్దామని ఎన్టీఆర్ అన్నారు. మరో కథను సిద్ధం చేసి “బందిపోటు” సినిమా తీయాలి అన్న ఆలోచన డూండీకి కలిగింది. ఎన్టీఆర్ కు కథ వినిపించగా సరే అన్నారు. చిత్రరంగంలో అప్పటివరకు దర్శకుడుగా అంత పేరు లేని విఠలాచార్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు డూండీ. సుందర్ లాల్ నెహతా వద్దన్నా వినకుండా “ఖైదీ కన్నయ్య” అనే సినిమాకు దర్శకత్వ బాధ్యతలను విఠలాచార్యకు అప్పగించారు డూండీ.
ఆ సినిమా నిర్మాణానికి ఖర్చు రెండు లక్షల పదివేల రూపాయలు అవుతుందని విఠలాచార్య ముందుగానే డూండీకి చెప్పారు. కాంతారావు, రాజసులోచన, కృష్ణకుమారి, గిరిజ, గుమ్మడి వంటి ప్రధాన తారాగణంగా తీసుకున్న దర్శకులు విఠలాచార్య “ఖైదీ కన్నయ్య” సినిమా నిర్మాణాన్ని లక్షా 90 వేల రూపాయలకే పూర్తిచేసి మిగిలిన 20,000 రూపాయలు నిర్మాత డూండీకి తిరిగి ఇచ్చేశారు. ఆ నిజాయితీ డూండీని బాగా ఆకట్టుకుంది. అందువలన “ఖైదీ కన్నయ్య” తరువాత తీసిన “బందిపోటు” (1963) సినిమాకు కూడా విఠలాచార్యనే దర్శకుడిగా ఎన్నుకున్నారు డూండీ.
కానీ ఇట్టి దృగ్విషయాన్ని ఆయన ముందుగా ఎన్టీఆర్ కు చెప్పలేదు. ఆ తరువాత చెబుదామని ఫోన్ చేస్తే తన సినిమాల చిత్రీకరణలతో ఎన్టీఆర్ అందుబాటులో లేరు. చివరాఖరుకి ఎన్టీఆర్ తన సోదరునితో ఫోన్ చేయించి దర్శకులు విఠలాచార్య అని తెలుసుకున్నారు. డూండీ కూడా విఠలాచార్య పనితీరుపై నమ్మకం ఉంచి అతనికే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ ని కూడా ఒప్పించారు. వారి అంచనాలు తప్పలేదు. బందిపోటు విడుదలైన ఘనవిజయం సాధించింది. ఆ తరువాత కాలంలో ఎన్టీఆర్, విఠలాచార్య కలయికలో అనేక అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.
“గూఢచారి 116” (1966)…
నటీనటులను పరిచయం చేయడం నిర్మాతలకు మాములే. అదేవిధంగా డూండీ “మరపురాని కథ” (1967) సినిమాతో వాణిశ్రీని, “గూడుపుఠాణి” (1972) సినిమాతో శుభ, హలం లను తెలుగు తెరకు పరిచయం చేశారు. వీరాభిమన్యు (1965) సినిమా మొదలు పెట్టే సమయానికి కథానాయకులు శోభన్ బాబు లక్ష్మణుడు, భరతుడు వంటి చిన్న చిన్న పాత్రలు పోషిస్తూండేవారు. అయినా కూడా అతడిని కథానాయకుడిగా తీసుకుని, కాంచనను కథానాయికగా పరిచయం చేస్తూ వీరాభిమన్యు సినిమాను నిర్మాణం చేశారు. సాంకేతికంగా ఆ సినిమాలో అనేక ప్రయోగాలు చేశారు. దశావతారాల చిత్రీకరణ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా ఎం.మల్లికార్జునరావు దర్శకత్వంలో “గూడచారి 116” నిర్మించారు డూండీ. ఇది “జేమ్స్ బాండ్”సినిమా. ఇంగ్లీష్, హిందీ భాషలలో ఇలాంటి సినిమాలు వస్తుండేవి. అప్పటివరకు తెలుగులో “జేమ్స్ బాండ్” సినిమాలు రాలేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ తరహా సాహాస భరితమైన సన్నివేశాలను, పోరాట దృశ్యాలను చూపించేందుకు ఓ మంచి చిత్రాన్ని అందించాలనే సదుద్దేశంతో “గూడచారి 116” తీశారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అప్పటినుండి సూపర్ స్టార్ కృష్ణ చిత్రపరిశ్రమలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నేర పరిశోధన సినిమాల కథానాయకుడిగా కృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ తరువాత డూండీ, సూపర్ స్టార్ కృష్ణ కలయికలో అనేక అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.
హిందీలోనూ చిత్రాలు నిర్మించి…
కథానాయకులు కృష్ణంరాజు నటించిన “చిలకా గోరింక” సినిమా వైఫల్యంతో ఎంతో నిరాశకు లోనయ్యారు. ఆ సమయంలో పి.మల్లిఖార్జునరావు దర్శకత్వంలో డూండీ నిర్మించిన “నేనంటే నేనే” (1968) చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించమని కోరగా నిరాకరించారు. అదే సమయంలో కృష్ణంరాజు గురువు ప్రత్యాగాత్మ సూచన మేరకు ఒప్పుకుని అందులో నటించారు. “స్వర్గం – నరకం” సినిమా ద్వారా పరిచయమైన మోహన్ బాబు చిన్న చిన్న పాత్రలు వేస్తుండేవారు. అతడికి కూడా డూండీ నిర్మాణంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడిగా తీసిన “భలే దొంగలు” చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత కాలంలో మోహన్ బాబు చాలా సినిమాలలో విలన్ పాత్రలో రాణించారు.
అనేక ప్రయోగాల సత్ఫలితంగా డూండీ తెలుగు చిత్రరంగంలో సాధించిన అనేకానేక విజయాల స్ఫూర్తితో హిందీలోను సినిమాలు తీశారు, అక్కడ కూడా ప్రయోగాలు చేశారు. ఆయన నిర్మించిన “మౌసమ్” (1975) చిత్రం షర్మిలా ఠాగూర్ కి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం రావడంతో బాటు స్వర్ణకమలం కూడా అందుకున్నారు. వీటితో బాటు ఫర్జ్ (1967), హిమ్మత్ (1970), ప్యార్ కి కహానీ (1971), కీమత్ (1973), సహస్ (1981) మొదలగు చిత్రాలను డూండీ నిర్మించారు. ఆయన నిర్మాణంలో వచ్చిన గుడిగంటలు చిత్రానికి నంది పురస్కారం వరించింది. ఆయన చివరిగా తీసిన “సుబ్బారావుకి కోపం వచ్చింది” చిత్రం కూడా ఒక ప్రయోగమే. కానీ ఆ సినిమా ఎందుకనో అనుకున్నంతగా విజయం సాధించలేదు.
మరణం…
చిత్ర రంగం 90వ దశకం ప్రారంభం నుండి అనేక మార్పులకు లోనయ్యింది. నిర్మాతల ప్రాధాన్యం తగ్గిపోయింది. చిత్ర పరిశ్రమ మొత్తం కథనాయకుల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. సినిమా నిర్మాణరంగంలో అవాంఛనీయమైన పోటీ పెరగడం, అదుపులేని నిర్మాణ వ్యయం వంటి పరిణామాల వల్ల విలువలున్న నిర్మాతలు, ముఖ్యంగా డూండీ లాంటి వారు ఇమడలేకపోయారు. చిత్రాలు నిర్మించి చేతులు కాల్చుకునే కంటే, విశ్రాంతి తీసుకోవడమే ఆయనకు సబబుగా తోచింది. కథానాయకులు కృష్ణతో ఉన్న పరిచయం కొద్దీ తన సినిమాలకు డూండీ సలహాలు, సూచనలు ఇచ్చేవారు.
ఆయన నేరుగా ఎలాంటి సినిమాలు తీయలేదు. వెండితెరతో పాటు టెలివిజన్ కు ప్రాధాన్యతన పెరిగిన పరిస్థితులలో అటువైపు దృష్టి సారించారు. ఛాయాగ్రాహకులు రవికాంత్ నగాయిచ్, నటి వాణిశ్రీ లాంటి వారిని పరిచయం చేసిన డూండీ 2005 నంది పురస్కారాల జ్యూరీ బృందానికి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆయన మరణానికి ముందు “రథ చక్రాలు” సినిమాకు సమర్పకునిగా ఉన్నారు. తన జీవన మలిసంధ్యలో క్యాన్సర్‌తో బాధపడుతూ వైజాగ్‌లోని క్వీన్స్ దవాఖానలో చికిత్స పొందుతూ 01 జనవరి 2007 నాడు డూండీ భువి నుండి దివికేగారు.

