Telugu News

పెద్దన్న దూకుడుతో వణికిపోతున్న దేశాలు!

ఇటీవల అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచి శ్వేతసౌధంలో ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ట్రంప్‌ నిర్ణయాలు, సంతకం చేయనున్న 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో ప్రపంచ మానవాళిని ఆలోచింపజేస్తూనే కలవరపరుస్తున్నాయి. అమెరికాలో దిగుమతులపై సుంకాలు విధిస్తామని, స్వర్ణయుగం రానున్నదని తెలుపుతూనే అక్రమ వలసలను అడ్డుకట్ట వేయడం, అమెరికాలో పుట్టే విదేశీ పౌరుల పిల్లలకు జన్మతః సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం లాంటి నిర్ణయాలు అమెరికన్లనే కాకుండా ప్రపంచ దేశాలను నివ్వెర పరుస్తున్నాయి.

ఇటీవల వరల్డ్‌ ఎకనమిక్ ఫోరమ్‌లో మాట్లాడిన డొనాల్ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్థలను బెదిరిస్తూ తమ దేశానికి తయారీ కేంద్రాలను తరలించాలని, విదేశీ ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తామని హెచ్చరించడంతో విస్తుపోయి చూస్తున్నాం. ‘అమెరికా ఫస్ట్’‌ అనే నినాదంతో 78 ఏండ్ల డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ఆర్థిక కండ బలాన్ని ఆసరాగా చేసుకొని పొగరుగా ప్రపంచ దేశాలను భయకంపితులను చేసే ప్రయత్నాలను అందరూ నిశితంగా గమనిస్తున్నారు. ప్రపంచ స్థాయి వాణిజ్య సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకొని, లాభాలను పెంచుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారనే చిన్న బహిరంగ రహస్యాన్ని మరిచారు స్వతహాగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన డొనాల్డ్‌ ట్రంప్‌.  

ప్రపంచ దేశాలపై ట్రంప్‌ ప్రభావం

డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు వార్త వినగానే హమాస్‌-ఇజ్రాయిల్‌ యుద్ధ ముగింపుకు దారులు పడి సత్ఫలితాలను ఇచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో మొదలైన యుద్ధం వెయ్యి రోజులు దాటి కొనసాగుతున్న వేళ ఆ యుద్ధం కూడా వంద రోజుల్లో ముగింపు పలకడానికి పావులు కదుపుతానని ట్రంప్‌ తెలియజేయడం జరిగింది. మరో మార్గమే కనబడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ యుద్ధం అంతానికి మొదటి నుంచి అంగీకారం తెలిపినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం తానే గెలుస్తాననే ధీమాతో చర్చలకు సమ్మతించక కయ్యానికి కాలు దువ్వుతూనే అధిక ప్రాణ, ఆర్థిక నష్టాలను భరిస్తూ పంతానికి పోతున్నారు. రాజకీయ అస్థిరత్వంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కెనడాతో పాటు మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం సుంకం వేస్తామని బెదిరించడం చూశాం. 

చైనా వస్తువుల దిగుమతుల వరదను ఆపడానికి కూడా ట్రంప్‌ సుంకం పెంపు పాచికలను వదులుతున్నారు. మెక్సికో అక్రమ వలసల ఉప్పెన అమెరికాకు పెద్ద చిక్కు సమస్యగా నిలిచిన వేళ సరిహద్దు గోడల నిర్మాణంతో పాటు అక్రమ వలసదారులను తిరిగి పంపడానికి భారీ ప్రణాళికలు వేసి.. అమలు పరచడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్యారిస్‌ వాతావరణ మార్పుల ఒప్పందంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగడానికి నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ, పురుషులను మాత్రమే గుర్తిస్తామని, ట్రాన్స్‌జెండర్‌ వర్గానికి తావులేదని కరాఖండిగా తెలిపారు. 2021 జనవరి 6న యూఎస్‌ క్యాపిటల్‌ భవనం వద్ద నిరసనలు చేసిన ట్రంప్‌ అభిమానులకు క్షమాభిక్ష పెట్టి బేషరతుగా విడుదల చేశారు. 

శ్రమదోపిడితో అందమెక్కాలనే ప్రయత్నాలు

అమెరికా తయారీ రంగంలో పనులు చేయడానికి తక్కువ దినసరి వేతనాలతో తృప్తి పడే ఇతర దేశాల శ్రమ జీవులు కావాలి. అమెరికాలో శ్రమజీవులకు నెలసరి సగటు వేతనాలు రూ: 4.88 లక్షలు ($5,677) ఉండగా, అదే శ్రమ జీవులకు భారత్‌లో రూ: 20,000 ($232) వేతనాలు (25 రెట్లు తక్కువగా) అందుతున్నాయి. అమెరికా వేతనాలతో పోల్చితే చైనాలో 4 రేట్లు తక్కువగా, ఇండోనేషియాలో 20 రెట్లు తక్కువగా, యూరోప్‌/ బ్రెజిల్‌లో 11 రెట్లు తక్కువగా ఉన్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అనాదిగా అమెరికా శ్రమజీవులుగా చవకైన స్థానిక ఆదివాసీ అమెరికన్ బానిసలు, ఆసియా/ఆఫ్రికన్లకు చెందిన ఒప్పంద దాస్య శ్రామికులు పని చేయడంతో యూఎస్‌ అభివృద్ధి బాటన పయనించింది. 

పేదల శ్రమ దోపిడీ పునాదుల మీద అగ్రరాజ్యం అగ్రగామిగా నిలవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్ సంచలన నిర్ణయాలు మరో చర్చకు దారి తీస్తున్నాయి. అమెరికా కరెన్సీ డాలర్‌ రూపంలో ప్రపంచ వాణిజ్యం కొనసాగడం కూడా అమెరికా ప్రగతికి గొడుగులు పడుతున్నది. జో బైడెన్ ఎఫ్ 1 విద్యార్ధి వీసాలను సులభంగా హెచ్ 1 బీ వీసాగా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇది అమెరికా కలలు కంటోన్న లక్షలాది మంది భారతీయులకు ఎంతో ప్రయోజనం కల్పించింది. భారత్ , చైనాలకు చెందిన కొంతమంది వృత్తి నిపుణులు దీని సాయంతో ప్రయోజనం పొందుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఇప్పుడు వలసలను నియంత్రించే లక్ష్యంతో ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో అమెరికా వెళ్లాలనుకునేవారు.. కలల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

Show More
Back to top button