విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయన ప్రస్థానం 26 సంవత్సరాలు. కానీ తెరకెక్కించిన సినిమాలు 14. సినిమా రంగంలోకి రావాలని ఆయన ఏనాడూ కలలు కనలేదు. అందుకోసం ప్రత్యేక ప్రయత్నాలు ఏనాడూ చేయలేదు, పైగా అందుకోసం పడిగాపులు కూడా కాయలేదు. ఆయన జీవితం తీసుకున్న అనేకానేక మలుపులలో ఒకానొక మలుపు, ఒకానొక మజిలీ సినిమా. కె.బి.తిలక్ రెండు రకాల సినిమాలు మాత్రమే తీశారు. కుటుంబ విలువలతో కూడిన చిత్రాలు, సామాజిక స్పృహ కలిగిన సినిమాలు. తన సొంత నిర్మాణ సంస్థ “అనుపమ బ్యానర్స్” లో “ఎమ్మెల్యే”, “భూమి కోసం”, “కొల్లేటి కాపురం”, “ధర్మవడ్డీ” మొదగునవి సామాజిక స్పృహ కలిగి ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం తీసిన సినిమాలయితే, “ముద్దుబిడ్డ”, “అత్తా ఒకింటి కోడలే”, “ఉయ్యాల జంపాల”, “ఈడు జోడు”, “పంతాలు పట్టింపులు” మొదలగునవి సామాజిక స్పృహతో పాటు కుటుంబ విలువలు కలిగి మౌలికమైన ఆదర్శాలన్న సినిమాలు కూడా ఉన్నాయి.
వీటితో పాటుగా మరో ప్రత్యేకత ఆ సినిమాలలో పాటలు. ఆయన సినిమాలలోని పాటలు సంగీతం, సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీపడి తిలక్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ధర్మ వడ్డీ (1982) సినిమాకు తప్ప తిలక్ దర్శక, నిర్మాతగా వచ్చిన అన్ని సినిమాలకు ఆత్రేయ పాటలు వ్రాశారు. ఆ రోజులలో “అనుపమ పిక్చర్స్” సంస్థలో వచ్చే సినిమాలు అంటే ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు, ఎనలేని ఆదరణ ఉండేది. ఆ సినిమాలలో పాటలు ఆరుద్ర వ్రాస్తే, పెండ్యాల సంగీతం అందించేవారు. ఆ పాటలు అన్నీ విజయవంతం అయ్యేవి. ఆహ్లాదకరమైన పాటలతో పాటు, ఆలోచింపచేసే పాటలు కూడా అందించిన ఘనత “అనుపమా పిక్చర్స్ బ్యానర్” నిర్మాణ సంస్థదే. వ్యాపారం పేరుతో ప్రతీ సన్నివేశాన్ని, సందర్భాన్ని వాణిజ్యం చేసే సగటు సినీ వ్యాపార ధర్మానికి భిన్నంగా, తిలక్ చిత్రాలు ప్రతీ సన్నివేశంలోనూ సామాజిక ప్రయోజనాన్ని ఆకాంక్షించి నిజమైన సమాజ శ్రేయోభిలాషిగా, దర్శక నిర్మాతలలో కీర్తి కాంక్షకు, ధనాకాంక్షకు సినీ రూప సౌందర్యానికి అతీతంగా ఆలోచించేవిధంగా ఉంటాయి.
కె.బి. తిలక్ వ్యవహార శైలిని, జీవన విధానాన్ని గమనిస్తే తాను ప్రముఖ దర్శక నిర్మాత అయినప్పటికీ కూడా సినిమా తాలూకు భేషజ ప్రదర్శన ఎక్కడా కూడా ఆగుపించదు. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు తాను చేసిన “సేల్స్ బాయ్”, “పేపర్ బాయ్” వంటి ఉద్యోగాలలో ఎలాంటి శ్రమజీవన సౌందర్యాన్ని ఆస్వాదించారో, ప్రముఖ దర్శక నిర్మాతగా ఎదిగాక కూడా అదే తరహాలో తన వ్యవహార శైలి కొనసాగింది. ఆయన చేసిన చిత్రాల సంఖ్య చేతివేళ్లను దాటలేదు. ఆయన సినిమాల సంఖ్యను పెంచుకోవడం కోసం ఎన్నడూ తాపత్రయపడలేదు. అందువలన దర్శక నిర్మాతగా ఆయన నిండైన సామాజిక స్పృహకు, నైతిక మూల్యాలు నిలువుటద్దాలుగా నిలిచాయి. నిజానికి త్యాగనిరతి ఉన్నప్పుడే సామాజిక స్పృహకు సంబంధించిన చిత్రాలు తీయడం సాధ్యపడుతుంది. సినిమా, నాటకం, నటన, మాట, పాట వంటి సమస్త సృజనాత్మక ప్రక్రియల పరమార్థం సమాజ శ్రేయస్సే అని త్రికరణశుద్ధిగా నమ్మిన దర్శక దిగ్గజం “కొర్లిపర బాలగంగాధర తిలక్”.
జీవిత విశేషాలు.
జన్మనామం : కొర్లిపర బాలగంగాధర తిలక్
ఇతర పేర్లు : కె.బి. తిలక్
జన్మదినం : 14 జనవరి 1926
స్వస్థలం : దెందులూరు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
తల్లి : సుబ్బమ్మ
తండ్రి : కొర్లిపర వెంకటాద్రి
వృత్తి : దర్శకుడు, నిర్మాత
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 23 సెప్టెంబర్ 2010,
హైదరాబాద్, భారతదేశం
నేపథ్యం…
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గరలో సోమవరప్పాడు అనే మారుమూల పల్లెటూరు ఉన్నది. ఆ ఊరిలో అక్కినేని శ్రీరాములు అనే సంపన్న రైతు ఉండేవారు. వారికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమారులలో ఒకరు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ (ఎల్వీ ప్రసాద్) ఒకరు. తరువాత కాలంలో వారు ప్రముఖ దర్శకులు. అలాగే మరొకరు సంజీవి. ఈయన తరువాత కాలంలో “ధర్మదాత”, “సిసింద్రీ”, “నాటకాల రాయుడు” మొదలగు సినిమాలతో ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇక కూతురు పేరు సుబ్బమ్మ, అల్లుడు పేరు కొర్లిపర వెంకటాద్రి. వీరిది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గర గల దెందులూరు గ్రామం. వెంకటాద్రి, సుబ్బమ్మలకు పుట్టిన అబ్బాయి పేరు కొర్లిపర బాలగంగాధర తిలక్ (కె.బి.తిలక్).
కె.బి.తిలక్ 14 జనవరి 1926 నాడు జన్మించారు. అతడి తాతపేరు గంగాధరయ్య. కె.బి.తిలక్ పుట్టినప్పుడు పెట్టిన పేరు బాలగంగాధరరావు. అతని తండ్రి భారత స్వాతంత్ర్య కార్యకర్త. కావున స్వాతంత్ర్య ఉద్యమకర్త “బాలగంగాధర తిలక్” మీద ఉన్న అభిమానంతో బాలగంగాధరరావు పేరును కాస్త బాలగంగాధర తిలక్ గా మార్చారు. అందువలన ఆయనను కొర్లిపర బాలగంగాధర తిలక్ లేదా కె.బి.తిలక్ అని పిలవడం మొదలుపెట్టారు. వారిది దెందులూరు గ్రామంలో బాగా సంపన్న కుటుంబం. అందుకే ఊరిలో అందరూ వారిని పెద్దింటోళ్లు అనేవారు. నాన్న వెంకటాద్రి స్వతంత్ర్య కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉండేవారు. ఆ రోజులలో స్వతంత్ర్య ఉద్యమంలో పిల్లలు పాల్గొనాలంటే కాదనేవారు కాదు. ప్రతీ కుటుంబంలో ఎవరైనా ఒకరు స్వతంత్ర్యోద్యమంలో పాల్గొనాలనే స్వతంత్ర్య భావనలు తల్లిదండ్రులలో ఉండేవి.
బాల్యం…
కె.బి.తిలక్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా స్వంత గ్రామమైన దెందులూరు లోనే కొనసాగింది. ఆ తరువాత “థర్డ్ ఫారమ్” వరకు ఏలూరు “పురపాలక పాఠశాల” (మునిసిపల్ స్కూల్) లోనే చదువుకున్నారు. దెందులూరు నుండి ఏలూరుకు సుమారు రెండు మైళ్ళ (3.2 కిలోమీటర్లు) దూరం. అక్కడికి కాలినడకన చేరుకుని చదువుకునేవారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆయన సొంతంగా పాత సైకిల్ ఒకటి కొనుక్కున్నారు. చిన్నప్పటి నుండి కె.బి.తిలక్ కు చదువు మీద పెద్దగా ధ్యాస ఉండేది కాదు. చదువు కన్నా ఆయనను స్వాతంత్రోద్యమం ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేది. తాను పాఠశాలలో చదివే రోజులలో సంవత్సరంలో ఒక వారాన్ని ఆరోగ్య వారంగా పాటించేవారు. ఆ వారం రోజుల పిల్లలు పాఠశాల పరిసరాలను శుభ్రం చేయడం, ఆరోగ్య సూత్రాల గురించి ప్రచారం చేయడం, సాయంత్రం పూట నాటకాలు వేయడం జరిపేవారు. కె.బి.తిలక్ వాళ్ళ ఇల్లు పెద్ద మండువాలోగిలి కావడంతో పాఠశాల వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లోనే జరిపించేవారు. ఆనాటి వారోత్సవాలలో భాగంగా వేసే నాటకాలలో ఆయన హిరణ్యకశపుడిగా నటించేవారు. ఏలూరు పురపాలక పాఠశాలలో జాలయ్య అనే “డ్రిల్ మాస్టర్” ఉండేవారు. ఆయన కె.బి.తిలక్ కు హాకీలో ఉన్న ప్రతిభను కనిపెట్టి తర్ఫీదు ఇచ్చి ఆయనను పాఠశాల హాకీ టీమ్ కు కెప్టెన్ గా చేశారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో…
చిన్నప్పటినుండి కె.బి.తిలక్ చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. అప్పట్లో చురుకైన చలాకీ కుర్రాళ్ళందరికీ స్వతంత్ర్య సమరమే ప్రధాన ఆకర్షగా ఉండేది. నిత్యం ఊర్లలో జరిగే సభలు, సమావేశాలు, దేశ నాయకుల ఉద్రేకపూరిత సందేశాలు, ఉద్వేగభరిత సంభాషణలతో సాగే ఉద్యమాలు యువతను విపరీతంగా ప్రేరేపించేవి. చదువుకోకుండా ఆ ఉద్యమాల వైపు ఆకర్షితులైన పిల్లలను తమ తల్లిదండ్రులు కూడా ఏమీ అనేవారు కాదు. దేశం కోసం ఇంటికొక్కడు అనే భావన ఆ రోజులలో ఉండేది. అందువలన కె.బి.తిలక్ కూడా స్వతంత్ర్య సమరం వైపు ఆకర్షతులవ్వడం వలన వాళ్ళ నాన్న గర్వపడేవారు. అంతే కానీ ఆయనను పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు. పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే కె.బి.తిలక్ “1942 క్విట్ ఇండియా ఉద్యమం” లో పాల్గొన్నారు. స్వతంత్ర్య సమరంలో పాల్గొని రైలు పట్టాలను తొలగించడం, టెలిఫోన్ తీగలు కత్తిరించడం, రైల్ రోకోలు చేయడం వంటి బ్రిటిషు వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాంటి ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్న తనలాంటి కుర్రాళ్ళకు “క్విట్ ఇండియా” ఉద్యమం మరింత ఊపునిచ్చింది.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు, విడుదల…
“క్విట్ ఇండియా” ఉద్యమం కార్యక్రమాల్లో భాగంగా భీమడోలు వెళ్లిన కె.బి.తిలక్ ను సెప్టెంబరు 1942 లో అరెస్టు చేసి “ఏలూరు” సబ్ జైలుకు పంపారు. అక్కడ కొద్దిరోజుల పాటు రిమాండ్ లో ఉంచి శిక్ష ఖరారయ్యాక వారిని “రాజమండ్రి” కేంద్ర ఖర్మాగారం (సెంట్రల్ జైలు) తరలించారు. ఆయన ఏలూరు సబ్ జైల్లో ఉన్నప్పుడు ఉద్యమంలో తనకంటే పెద్దవారైన మోతె నారాయణరావు, కట్టమంచి రామ్మూర్తి తన తోటి ఖైదీలుగా కె.బి.తిలక్ కు పరిచయమయ్యారు. ఆ సమయంలో అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ “శ్రీ శేషాద్రి” జైలుకు వచ్చి ఆ ఖైదీలను పరామర్శిస్తూ “మీతో పాటు ఎందుకు ఇంత చిన్న కుర్రాళ్ళని చెడగొడుతున్నారు” అని అడిగారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పడానికి ముందే “నన్ను వాళ్ళు చెడగొట్టడం అనేది తప్పు, మహాత్మాగాంధీ పిలుపుమేరకు నేనే స్వచ్ఛందంగా స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటున్నాను” అని సమాధానం చెప్పారు. ఆ తరువాత వారికి శిక్ష ఖరారై రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాక దాదాపు ఆరు నెలలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు. ఆ సమయంలో వారి జేబులో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో రాజమండ్రి నుండి దెందులూరు వరకు కాలినడకన వెళ్లారు
మేనమామతో కలిసి బొంబాయి ప్రయాణం…
ఉద్యమ స్ఫూర్తితో రగిలిపోయి చదువుకు స్వస్తిచెప్పిన కె.బి.తిలక్ ఏదో ఒక రూపేణా ఆ స్వాతంత్ర్య ఉద్యమానికి చేరువయ్యి ఆ కార్యకలాపాలలో తిరిగేవారు. అలాగే ముదిగొండ జగ్గన్న శాస్త్రి ప్రోద్బలంతో ముమ్మరంగా జరిగే “ప్రజానాట్యమండలి” కార్యక్రమాలలో కూడా పాల్గొనేవారు. ఒకవైపు క్విట్ ఇండియా ఉద్యమం, మరోవైపు ప్రజానాట్యమండలి, ఇలా రెండు ఉద్యమాలు ఆయనను బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా జగ్గన్న శాస్త్రి ప్రోద్బలంతో అతివాద కళాకారులతో చేతులు కలిపి “ప్రజానాట్యమండలి” వారి విప్లవ గీతాలను విశేషంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. నాటకాలు వేయడం, నాటకాలు వేయించడం, డప్పులు మ్రోగిస్తూ ఊరూరా తిరిగి విప్లవ గీతాలు ఆలపించడం వంటి కార్యక్రమాల్లో కె.బి.తిలక్ చురుగ్గా పాల్గొనేవారు. ఈవిధంగా కొంతకాలం గడిచిన పిదప ఆయన జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది.
ఆయన మేనమామ ఎల్వీ ప్రసాద్ బొంబాయికి ప్రయాణమయ్యారు. ఆయన భార్య, కె.బి.తిలక్ ను ఆమెతోబాటు తోడు తీసుకుని బొంబాయి ప్రయాణమైంది. ఏలూరు నుండి బెజవాడ చేరుకుని అక్కడ రైలెఎక్కి బొంబాయి వెళ్లాలి. దానికి ఇంకా సమయం ఉండడంతో అత్తకు చెప్పకుండా స్టేషను బయటకు వచ్చి మొగల్రాజపురంలో ఉంటున్న ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు ఇంటికి వెళ్లి, గడ్డం గీసుకుంటున్న ఆయనతో కాసేపు ఉద్యమానికి చెందిన విశేషాల గురించి చర్చించి తాను బొంబాయి వెళ్తున్న విషయం గురించి చెప్పారు. బొంబాయిలో ఉండే ఉద్యమ ప్రముఖులు “శ్రీపాద అమృత డేంగే” కు పరిచయం చేసేలా రాజేశ్వర రావు దగ్గరనుండి ఒక సిఫారసు లేఖను తీసుకుని ఉరుకులు పరుగుల మీద స్టేషనికి చేరుకునే సరికి అప్పటికి రైలు బయలుదేరబోతోంది. అప్పుడు తాను చేసిన ఆలస్యానికి అత్తయ్య పెట్టిన చీవాట్లతో రైలెక్కి బొంబాయి చేరుకున్నారు.
స్వంత సంపాదన…
బొంబాయి సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు పరిచయాలు విస్తృతం చేసుకుంటున్న మేనమామ ఎల్వీ ప్రసాద్ ఇంట్లో వుండే కె.బి.తిలక్ దినసరి ఖర్చులకు ఇంట్లో అడగకుండా సొంత సంపాదన ఉండాలి అని అనుకున్నారు. నిజానికి ఆయన తాత, తల్లిదండ్రుల ఆస్తిపాస్తులతో ఎలాంటి సంబంధం లేకుండా, అందులో చిల్లిగవ్వ కూడా ఆశించను అని స్టాంప్ పేపరు మీద వ్రాసేసి సంతకం పెట్టి మరీ బొంబాయికి వచ్చారు కె.బి. తిలక్. అందుకే తనదైన సంపాదన కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పట్లో కృష్ణాజిల్లా నుండి వెళ్లి బొంబాయి లో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న మల్లికార్జున రావు అనే పెద్ద ఆయనతో పరిచయం ఏర్పడింది. మామయ్య ఉంటున్న ఇంటి క్రిందిభాగంలో ఒక సింధీ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. అతను లోటస్ అనే పేరుతో తంబోలా ప్రింట్ చేసి బొంబాయిలోని మిలటరీ క్లబ్ లో అమ్ముతుండేవాడు. ఆయనతో పరిచయం పెంచుకుని ప్రింటింగ్ ఆర్డర్లను మల్లికార్జున రావు ప్రెస్ కి ఇప్పించి ఆయన వద్ధ ముద్రణ జరిగినప్పుడల్లా మల్లికార్జున రావు కొంత కమిషన్ ఇచ్చేవారు. ఆ విధంగా కె.బి. తిలక్ జీవితంలో తనదైన తొలి సంపాదన ప్రారంభమైంది. ఇలా ఉండగా బొంబాయిలో కూడా ఉద్యమ కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించేవారు.
బాతు గుడ్ల వ్యాపారం…
మేనమామ యల్వీ ప్రసాద్ కు సహాయ దర్శకులుగా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో ఆయన వేరే ఆదాయ మార్గాలు వెతికేవారు. ఆయనకు సంపాదన సమకూర్చి పెట్టింది బాతుగుడ్ల వ్యాపారం. అయితే ఆ వ్యాపారంలో ఆయనకు ఒక సొంత మనిషి కె.బి.తిలక్ అవసరమయ్యాడు. కృష్ణాజిల్లా కైకలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు బాతు గుడ్లకు ప్రసిద్ధి. వాటితో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుండి పెద్ద పెద్ద గంపలలో వచ్చే బాతు గుడ్ల ఉత్పత్తిదారులు దళారుల మధ్య హోరాహోరి పోటీ ఉండేది. మొత్తం మీద మామయ్యకు బాతు గుడ్ల వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ లోపాయికారీగా కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారు.
ఆంధ్రజ్యోతి పత్రిక వ్యవస్థాపకులలో ప్రముఖులైన కే.ఎల్.ఈ.ఎన్.ప్రసాద్ సోదరుడు కానూరు రామానంద చౌదరి నెలకొల్పిన దానామర్ అనే కాస్మోటిక్ పంపిణీ సంస్థలో సేల్స్ బాయ్ గా చేరారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ ప్రాంతపు హస్త కళాకారులు తయారు చేసే “వరల్డ్ ఫేమస్ లేసన్” తెప్పించి బొంబాయిల మార్కెటింగ్ చేయించేవారు. మొత్తం మీద బొంబాయిలో ఉంటూ ప్రజానాట్యమండలి పార్టీ కార్యక్రమాలలో తెలుగు ప్రతినిధిగా కొనసాగడానికి అవసరమైన ఆర్థిక వనరులను తానే స్వయంగా సంపాదించుకునేవారు. ఆ విధంగా బొంబాయి మహానగరంలో పేపర్ బాయ్ గా, సేల్స్ బాయ్ గా, బాతు గుడ్ల వ్యాపారిగా, కమిషన్ ఏజెంట్ గా రకరకాల అవతారాలు ఎత్తుతూ మనుగడ సాగించారు. అలాంటి తరుణంలో మేనమామ ఎల్వీ ప్రసాద్ మకాం మద్రాసుకు మార్చారు.
సినీరంగ ప్రవేశం…
మేనమామ యల్వీ ప్రసాద్ ద్వారా ఎడిటర్ గా పనిచేస్తున్న యం.వి.రాజన్ తో కె.బి.తిలక్ కు పరిచయం ఏర్పడింది. యం.వి.రాజన్ “గృహప్రవేశం” (1946 సినిమా) సినిమాకు ఎడిటర్ గా పనిచేస్తూ ఉండేవారు. ఆ రాజన్ పరిచయంతో ఫిల్మ్ ఎడిటింగ్ లో అడుగుపెట్టారు కె.బి.తిలక్. ఆయన యం.వి.రాజన్ తో కలిసి “రోజులు మారాయి”, “ధర్మాంగద” (1949), “మంత్రదండం” (1951) లాంటి సినిమాలకు కలిసి జంటగా కూర్పు విభాగంలో (ఎడిటర్లుగా) పనిచేశారు. 1950 ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం మొదలయ్యి కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన తరువాత ప్రజానాట్యమండలి కళాకారులలో ఎక్కువ మంది సినీరంగానికి వచ్చేశారు. వారిలో “సుంకర సత్యనారాయణ”, “వాసిరెడ్డి”, “తుమ్మల వెంకట్రామయ్య”, “తాపీ ధర్మారావు” వంటి వారు సినిమాలోకి రావడం తటస్తించింది.
దర్శకులు శ్రీధర్ తెలుగు, తమిళ భాషలలో “జ్యోతి” అనే సినిమాను మొదలుపెట్టి, నిర్మాతతో జరిగిన గొడవ కారణంగా ఆ సినిమా దర్శకత్వ శాఖ నుండి తప్పుకున్నారు. దాంతో ఆ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్న కె.బి.తిలక్ జ్యోతి చిత్రాన్ని పూర్తిచేశారు. ఆ సినిమాలో “కూలీ పనికి పోదంట, కావాలి చదువంట, కలకటేరు కొడుకంట, కలకటేరే కావాలా, కూలోడి కొడుకు కూలోడే కావాల” అనే ప్రబోధాత్మకమైన పాట కూడా పెట్టారు. ఈ సినిమాలో బాల నటీనటులను కూడా నటింపజేశారు. వారిలో ఒకరు జోగుమాంబ. ఆమె నటి జయసుధ తల్లి. కె.బి.తిలక్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సగం సినిమాలో జయసుధ తల్లి జోగుమాంబ నటించారు. ఈ సినిమా విడుదలైంది. తెరపై దర్శకత్వం శ్రీధర్ – తిలక్ అని, ఎడిటింగ్ రాజన్ – తిలక్ అని వేశారు.
తొలి సినిమా “ముద్దుబిడ్డ” (1956)…
ఆ రోజులలో తెలుగు సినిమాలు తీయాలంటే దర్శక నిర్మాతలు బెంగాళీ కథల మీద ఆధారపడుతూ ఉండేవారు. అందువలన మన రచయితల్ని కలకత్తా పంపించి బెంగాళీ సినిమాలు చూసి, తెలుగు సినిమాలకు పనికొచ్చే కథలు తీసుకురమ్మని పంపించేవారు. ఆ క్రమంలో ఆరుద్ర తెచ్చిన రెండు కథలలో ఒకటి కె.యస్. ప్రకాశరావు “దీక్ష” సినిమా తీశారు. రెండవ కథ “ముద్దుబిడ్డ”. ఆ కథతో కె.బి. తిలక్ తన సొంత నిర్మాణ, దర్శకత్వంలో సినిమాగా తెరకెక్కిద్దాం అనుకున్నారు. కె.యస్. ప్రకాశరావు మిత్రుడు అవ్వడంతో జి.వరలక్ష్మి “ముద్దుబిడ్డ” సినిమాలో ప్రధాన పాత్రకు ఎంచుకున్నారు.
ఎనిమిది రీళ్ళ చిత్రీకరణ అయిపోయాక ఒక సినిమా సంభాషణ విషయంలో వాదన జరిగింది. ఆ సమయంలో తన సంభాషణ మార్చమని అడిగిన జి.వరలక్ష్మికి కుదరదని చెప్పారు కె.బి. తిలక్. మార్చకపోతే ఆమె నటించను అన్నారు. దాంతో ఆమెను ఆ సినిమా నుండి తప్పించి, ఎనిమిది రీళ్ళ చిత్రీకరణ తొలిగించి, కొత్తగా మళ్లీ చిత్రీకరణ చేశారు కె.బి. తిలక్. దాంతో చాలామంది ఆయన ధైర్యానికి ప్రశంసించారు. అది ఆయనకున్న నిబద్ధత, నిజాయితీకి నిదర్శనం. జి.వరలక్ష్మి స్థానంలో లక్ష్మీరాజ్యంను ఎంచుకుని మళ్ళీ సినిమా తీసి విడుదల చేశారు. ఆ సినిమా ద్వారా జ్యోతి అనే నృత్యకారిణి కూడా పరిచయం చేశారు. ఆమె డైలాగ్ కింగ్ సాయికుమార్ తల్లి. బొంబాయికి చెందిన మీనాక్షి అనే ఆమెను కూడా పరిచయం చేశారు. ఈ సినిమాతో పూర్తి దర్శకుడుగా మారిన కె.బి.తిలక్ వయస్సు అప్పటికి 30 సంవత్సరాలు.
రెండవ సినిమా “ఎమ్మెల్యే” (1957)..
సామాజిక స్పృహతో తెరకెక్కించిన కె.బి.తిలక్ రెండవ సినిమా “ఎమ్మెల్యే” (1957). ఆ రోజులలో పెద్దపెద్ద వాళ్లు ఎన్నికలలో నిలబడకుండా, ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులను నిలబెట్టి వారితో తమ సొంత పనులు చేయించుకునేవారు. వారిని దృష్టిలో ఉంచుకొని తీసిన సినిమా “ఎమ్మెల్యే”. ఇది 19 సెప్టెంబరు 1957 విడుదల అయ్యింది. ఆనాటి రాజకీయాల్లోని ముఖ్యాంశం అయిన భూసంస్కరణలను, రాజకీయవేత్తల స్వభావాలను, ఓ చక్కని ప్రేమకథతో కలిపి తీసిన చిత్రం “ఎమ్మెల్యే”. సామాజికాంశం, నవ చైతన్యం కలిగించే గూడవల్లి రామబ్రహ్మంగారి ‘”రైతుబిడ్డ”, కె.వి.రెడ్డి “పెద్దమనుషులు” తరువాత మరో ఉత్తమ రాజకీయ చిత్రం ఎమ్మెల్యే. ఇది విడుదలైన మరుసటి సంవత్సరం భూసంస్కరణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దున్నేవాడిదే భూమి. భూసంస్కరణ నేపథ్యంలో ఈ సినిమాను తీశారు.
కె.బి.తిలక్ దూరదృష్టితో ఆలోచించి తీసిన “ఎమ్మెల్యే” సినిమా వల్ల 1961 లో ప్రభుత్వం భూసంస్కరణ చట్టం తీసుకొచ్చింది. ఆ విధంగా సినిమాని ప్రభావితం చేశారు. “ఎమ్మెల్యే” సినిమాలో హైదరాబాద్ పై “ఇదే ఇదే భాగ్యనగరం” అంటూ ఒక పాటను కూడా వ్రాయించి చిత్రీకరించారు. ఈ సినిమాలో ఆ పాటకు కొత్త నటులు జె.వి.రమణమూర్తిని పరిచయం చేశారు. అలాగే ఈ సినిమాతో నేపథ్య గాయని యస్.జానకి కూడా పరిచయం చేశారు. ఎమ్మేల్యే సినిమాలో వారందరితో పాటు చోటా ఖుర్షీద్ అనే నృత్యకారిణిని కూడా పరిచయం చేశారు. ఆమె నటించిన కవాలి పాటలో సందేశాత్మక మాటలు కూడా చక్కగా వ్రాయించారు. “అందరాని పదవి కోసం, అందమైన పడతి కోసం, కొంగ జపం చేసేది కొందరు, దొంగ వేషాలు వేసేది ఎందరో, చేసే ఖర్చు ఒకటి రాసే పద్దు మరొకటి, దుఃఖాన్ని దాచేది కొందరు, పన్నులు ఎగవేసేది ఎందరో” అనే కవ్వాలి పాటలో వ్రాయించారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.
మానవతా విలువలకు కట్టుబడి సినిమాలు…
ఈయన తన సినిమాలను వ్యాపారాత్మక ధోరణితో తీయలేదు. సినిమాలను ఒక శక్తివంతమైన సాధనంగా చూశారు. ఆయన ఒప్పుకొని ఉంటే ఎన్నో సినిమాలుకు దర్శకత్వం చేసే అవకాశం ఉండేది. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యం అనుకుంటే ఎలాంటి సినిమాలు అయినా తీయొచ్చు. ఉదాహరణకు ఒకరు అమ్ముతారు, మరొకరు కొంటారు. వ్యాపారస్తుల నుండి ఉప్పు, పప్పు, సబ్బులు వంటివి వ్యాపారి అమ్ముతారు. వినియోగదారుడు కొంటాడు. సినిమా కూడా అంతే. దర్శక, నిర్మాత తీస్తున్నాడు, ప్రేక్షకుడు కొంటున్నాడు. ఇది కూడా వినిమయదారుడికి, కొనుగోలుదారుడుకి, వ్యాపారస్తుడికి ఉన్న సంబంధం లాంటిది. సినిమాలో నటుడికి విలువ ఉంటుంది. సినిమాలో తనకు నచ్చిన అంశం ఉంటుందా లేదా అనేదే ప్రేక్షకుడు చూస్తాడు. అందుచేత ప్రేక్షకుడి యొక్క జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని, ప్రేక్షకుడిని ప్రతిబింబింపచేసే దర్శక నిర్మాత, కేవలం సొమ్ము చేసుకోవడమే అనే విధానంతో కాకుండా ప్రేక్షకులకు మంచి ఆలోచనలను అందించాలి, మంచి జీవన విధానాన్ని అందించాలి, మంచి మానవతా విలువలను పెంపొందించాలి అనే ఆశయం దర్శక నిర్మాతలకు తప్పనిసరిగా ఉండాలి అనే ఆలోచనలను నమ్మిన దర్శకుడు కె.బి. తిలక్.
పట్టుమని పది సినిమాలు మాత్రమే…
కె.బి. తిలక్ హడావుడి పడకుండా, వరుసగా సినిమాలు తీయకుండా ఆయన దర్శక నిర్మాతగా ఒక్కొక్కటి మంచి సినిమాలు తీస్తూ 1956 లో మొదలుపెట్టి, 1982 వరకు కొనసాగుతూ 26 సంవత్సరాలలో తెలుగు చిత్రసీమలో దర్శక, నిర్మాణ బాధ్యతలను కొనసాగించారు. ఆ తరువాత ఆయన “అత్తా ఒకింటి కోడలే”, “ఈడు జోడు”, “ఉయ్యాల జంపాల”, “చిట్టి తమ్ముడు”, “పంతాలు పట్టింపులు”, “భూమికోసం”, “కొల్లేటి కాపురం” లాంటి సినిమాలు తీశారు. కె.బి. తిలక్ చిట్టచివరి సినిమా “ధర్మ వడ్డీ” (1982). ఇది గోపీచంద్ కథ ఆధారంగా తీసినది. “ముద్దుబిడ్డ” సినిమాను హిందీలో “చోటి బహు” అని, ఈడు జోడు సినిమాని “కంగన్” అనే పేరుతో హిందీలో తన దర్శకత్వం లోనే పునర్నిర్మించారు.
“అత్తా ఒకింటి కోడలే” అనే సినిమాని “మామియరుమ్ ఒరు వీటు మరుమగలే” (1961) అనే పేరుతో, ఎమ్మెల్యే అనే సినిమాను అదే పేరుతో తమిళంలో పునర్నిర్మించారు. కె.బి. తిలక్ తెలుగులో పది సూటి సినిమాలలో, తమిళంలో రెండు, హిందీలో రెండు సినిమాలకు దర్శకత్వం చేశారు. ఒకటి, రెండు సినిమాలు వేరే వాళ్లకు దర్శకత్వం వహించారు. భూమి కోసం (1974) సినిమాలో రాజమండ్రి నుండి “లలిత రాణి” అనే పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని పరిచయం చేశారు. అప్పుడు ఆమెకు పది రూపాయల పారితోషికం ఇచ్చారు. తరువాత కాలంలో ఆమె భారతీయ చలనచిత్ర అగ్రనటిగా పేరొందారు. ఆమె పేరు జయప్రద.
మరణం…
“కొల్లేటి కాపురం” సినిమాను కె.బి. తిలక్ వోల్వో కలర్ లో తీశారు. సొంత నిర్మాణ సంస్థకు కాకుండా బయటివారికి తీసిన సినిమా “పంతాలు పట్టింపులు”. గోపీచంద్ వ్రాసిన కథ ఆధారంగా తాను తెరకెక్కించిన చిట్టచివరి సినిమా ధర్మ వడ్డీ (1982). సినిమాలు తెరకెక్కించడం ఆపేసిన తరువాత ఆయన రాజకీయాలలో ఉన్నారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉండి 16 ఎంఎం ప్రొజెక్టర్ తీసుకొని పల్లె పల్లెకు వెళ్లి ప్రబోధాత్మకమైన సినిమాలు చూపించడం, సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయా స్టూడియోస్ కు వెళ్లి ఆయనకు సహాయం చేస్తూ ఉండేవారు. చలనచిత్ర రంగం నుండి విశ్రాంతి తీసుకున్న తరువాత ఏదో ఒక కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉండేవారు.
నిజానికి కె.బి. తిలక్ తీసిన సినిమాలు రెండు తరగతులకు చెందినవి. ఒకటి కుటుంబ విలువలు ఉన్నవి, మరొకటి సామాజిక స్పృహ ఉన్నవి. తాను తీసిన సినిమాలు రెండు తరగతులే అయినా ఆయన సినిమాలలో వచ్చిన పాటలు ఇంకే బ్యానర్ లో వచ్చిన సినిమాలలో లేవని విశ్లేషకులు అంటుంటారు. ఆయన సినిమాలలో వ్యంగ్య గీతాలు ఉన్నాయి, భక్తి గీతాలు ఉన్నాయి, ప్రబోధ గీతాలు ఉన్నాయి, శృంగార గీతాలు ఉన్నాయి, భావ గీతాలు ఉన్నాయి, హాస్య గీతాలు ఉన్నాయి, జానపద గీతాలు ఉన్నాయి, విప్లవ గీతాలు కూడా ఉన్నాయి. ఇంకే బ్యానర్ లో కూడా ఇలాంటి పాటలు ఉన్న సినిమాలు లేవన్నది పచ్చినిజం. ఇవి కూడా కె.బి.తిలక్ అభిరుచికి అద్దం పడుతుంది. ఆయన చివరి రోజులలో అనారోగ్యం దరిచేరింది. అనారోగ్యం కారణంగా కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్‌లో చేరిన కె.బి.తిలక్ 23 సెప్టెంబరు 2010 నాడు మరణించారు.
నెరవేరని పౌరాణిక సినిమాల కల…
కె.బి. తిలక్ పౌరాణిక సినిమాలు తీద్దామనుకున్నారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఆయన “కృష్ణార్జున” అనే స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. ఆ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్, అర్జునుడి పాత్రలో జగ్గయ్య, సుభద్రగా దేవిక అనుకొన్నారు. నటీనటులను ఎంపిక చేసుకుని చిత్రీకరణ మొదలుపెట్టి జగ్గయ్య, దేవికలపై ఒక పాట కూడా తీశారు. అదే సమయంలో “గుండమ్మ కథ” విడుదలై ఎన్టీఆర్, అక్కినేని కలయికలో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో జగ్గయ్య స్థానంలో అక్కినేని తీసుకుందామనుకొని జగ్గయ్యకు నచ్చజెప్పారు. కానీ అక్కినేని ఒప్పుకోలేదు. కె.వి. రెడ్డి దర్శకత్వంలో “శ్రీకృష్ణార్జున” సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి అక్కినేని నటించారు. ఇదే విషయం కె.బి. తిలక్ అక్కినేనిని అడుగగా “కె.వి.రెడ్డి అన్నపూర్ణ బ్యానర్ లో నాకు మొట్టమొదటి సినిమా తీశారు, కాబట్టి ఒప్పుకోకపోతే బావుండదు. కనుక ఏమీ అనుకోవద్దు” అన్నారు అక్కినేని. అందువలన “కృష్ణార్జున” కె.బి.తిలక్ దర్శకత్వంలో ముందుకు సాగలేదు.
కుదరని “భీమసేన”…
“భీమసేన” అనే సినిమాను మొదలుపెట్టాలని చూశారు కె.బి.తిలక్. అది కూడా ముందుకు సాగలేదు. అదే సినిమాను కమలాకర కామేశ్వరరావు “పాండవ వనవాసం” గా తీస్తే అద్భుతమైన విజయం సాధించింది. “ఉత్తర గోగ్రహణం” అనే స్క్రిప్టు వ్రాయించుకున్నారు కె.బి.తిలక్. అది కూడా కుదరలేదు. అదే కథతో లక్ష్మీరాజ్యం నిర్మాతగా “నర్తనశాల” గా తీశారు. అది కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఈ విధంగా మైథలాజికల్ సినిమాలు తీద్దామనుకున్న తిలక్ ఆశయాలు ముందుకు సాగలేదు. ఆయన రెండు రకాల సినిమాలు తీసిన దర్శక, నిర్మాతగానే మిగిలిపోయారు. పౌరాణిక సినిమాలు మాత్రం తనకు అచ్చిరాలేదు. “ఊరికి పెద్ద పాలేరు” అనే సినిమా తీయాలని చూసారు తిలక్. అది కూడా ముందుకు సాగలేదు. మంచి చిత్రాల దర్శక నిర్మాతగా, నిబద్ధతగల దర్శక నిర్మాతగా, చక్కటి సాహిత్యాన్ని చక్కటి సంగీతాన్ని అందించిన దర్శక నిర్మాతగా, ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేసిన దర్శక నిర్మాతగా కె.బి.తిలక్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
పాసు లేకుండా పార్లమెంటుకి…
బాలగంగాధర తిలక్ పార్లమెంటు భవనంలోకి పాస్ లేకుండా వెళ్లగలిగేవారు. ఆయనలా లోనికి వెళుతుంటే పార్లమెంటు సభ్యుడనుకునేవారు. తిలక్‌ను చూడగానే పదహారణాల కాంగ్రెస్ నాయకుడు అనే భావన కలుగుతుంది. బి.వి.రాఘవులు ఆయనను “కామ్రేడ్ తిలక్” అని సంభోదించేవారు. తిలక్ తన జీవితాంతం ప్రజాధర్మం కోసమే పోరాడడం వలన ప్రజలు తనను ఎక్కువగా “కమ్యూనిస్టు కోణం” లోనే ఎక్కువగా చూసేవారు. అన్ని రాజకీయ పార్టీల వారు తిలక్ తమ వాడే అనడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. ఆయన హైదరాబాద్‌కు వచ్చేంతవరకు సినిమా మనిషి. వచ్చిన తరువాత అక్కడి నుండి ఒక మానవతావాదిగా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారునిగా, స్వాతంత్ర సమరయోధుల్లో ఒకడిగా, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంలో కనిపించేవారు, అనిపించేవారు. ఆయన అవతారం ఏదైనా సరే తాను అనుకున్నది సాధించేంతవరకు అలుపనేది లేకుండా సాగిపోవడం ఆయన నైజం.
ముగింపు…
చాలామంది దృష్టిలో సినిమా అనేది ఫక్తు వ్యాపారం. కాని కె.బి.తిలక్ దృష్టిలో సినిమా అనేది ఒక సామాజిక ప్రయోజన సాధనం. అందుకే సినిమా రంగంలో సహజంగా కనిపించే తళుకు బెళుకులకు, గ్లామర్ పొంగులకు, సన్మాన సంబరాలకు, ప్రచార ఆర్భాటాలకు దూరంగా సాగేందుకు స్వాతంత్ర సమరంతోనూ, ఆపై కమ్యూనిస్టు ఉద్యమాలతోనూ అత్యంత సన్నిహితంగా మసలే నేపథ్యం వల్లనే వృత్తిపరంగా తన సినిమాలు అభ్యుదయ భావాలకు, వామపక్ష భావాలకు దృశ్యరూపంగా సాగాయి.
సినిమా కార్మికుల బాధామయ గాథలు విని, చలించి వారికోసం రంగంలోకి దిగిన సందర్భంలో కానీ, “గాంధి” సినిమా విషయంలో భారతీయులకు న్యాయం చేకూర్చడానికి చేసిన న్యాయపోరాటంలో కానీ, రాజభవన్ ప్రాంగణంలో కుముద్ బెన్ జోషి గవర్నర్‌గా వున్నప్పుడు తక్కువ ధర చేసే “డోమ్ హౌజ్” నిర్మాణం చేపట్టడంలో కానీ, ఇండో పాకిస్తాన్ మైత్రి సంబంధమైన కార్యక్రమాల నిర్వహణలో కానీ, “ట్విన్సీ క్లబ్” స్థాపనలో కానీ కార్యదక్షతకు తిలక్ పర్యాయపదంగా వుండేవాడు.
వామ పక్ష ఐక్యత కొరకు అహర్నిశలు కృషిచేసిన తిలక్, ఎప్పుడూ గట్టి ప్రతిపక్షం, అది కూడా వామపక్ష ప్రతిపక్షం వుండాలని కోరుకునేవారు. ఆయన అందించినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా ఆయన ద్వారా తెలుగు తెరకు అందిన ఆణిముత్యాలు వంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా మంది ఉన్నారు. తెలుగు చిత్రరంగంలో చోటు చేసుకున్న సమస్త పరిణామాలకు సాక్షిభూతంగా నిలిచిన కొద్దిమంది ప్రముఖులలో ఒకరు కె.బి.తిలక్.