GREAT PERSONALITIESTelugu Cinema

విలనిజానికి సరికొత్త నిర్వచనం.. నాగభూషణం.

చుండి నాగభూషణం (ఏప్రిల్ 19, 1921 – మే 5, 1995)

కళాకారులు రెండు రకాలు. పుట్టు కళాకారులు, పెట్టు కళాకారులు. స్వతఃసిద్ధంగా అబ్బే నటన కొందరి సొత్తు అయితే, కేవలం ఈ రంగం మీద గ్లామర్ తో వచ్చేవాళ్ళు మరికొందరు. నాగభూషణం మొదటి కోవకు చెందిన కళాకారుడు. అయితే అంత తొందరగా కళామ్మతల్లి ఆశీర్వాదం దొరకలేదు. చాలా పట్టుదలతో సడలని ఆత్మ విశ్వాసంతో సాధించుకోవలసి వచ్చింది. మొదట రంగస్థలం నాగభూషణం గారిని ఆదరించింది. ఆ తరువాత సినిమా రంగం తనను అక్కున చేర్చుకుంది. సినిమాలకన్నా వారికి రంగస్థలం మీదే ఆదరణ ఎక్కువ ఉండేది.

విలన్ అనగానే ఇలాగే ఉండాలి. ఇలాగే ప్రవర్తించాలి అనే మూస ధోరణిని తోసిరాజని, వ్యంగ్యాన్ని జోడించి, తనదైన ధోరణిలో ప్రతినాయక పాత్రను అద్భుతంగా అభినయించిన  అరుదైన నటుడు చుండి నాగభూషణం గారు. వారు సంభాషణలు పలికే తీరు, చూపే హావ భావాలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. విలన్ పాత్రలకు వ్యంగ్య వైభవాన్ని ఆపాదించిన నాగభూషణం అటు రంగస్థలం మీద, ఇటు సినిమాలలోనూ సమాన ప్రతిభ కనబరిచి తెలుగువారి హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.

ముఖ్యంగా రవి ఆర్ట్ థియేటర్స్ పతాకం పై “రక్త కన్నీరు” నాటకాన్ని దేశవ్యాప్తంగా 5,432 ప్రదర్శనలు ఇచ్చి రికార్డ్ నెలకొల్పారు నాగభూషణం గారు. దాదాపు 25 ఏళ్ల పాటు 300 పైగా కళాకారులకు ఈ నాటకంతో జీవన భృతి ఏర్పరిచారు. తనని పెంచి పెద్ద చేసిన నాటక రంగాన్ని ఎన్నడూ మరచిపోలేదు నాగభూషణం గారు. చిత్ర రంగంలో తను ఎంత తీరిక లేకుండా ఉన్నా దర్శక, నిర్మాతల దగ్గర అనుమతి తీసుకుని ప్రతినెలా మొదటి వారంలో “రక్త కన్నీరు” నాటకం ప్రదర్శించేవారు నాగభూషణం గారు.

జననం.

నాగభూషణం గారి పూర్తి పేరు చక్రవర్తుల నాగభూషణం. వీరు  19  ఏప్రిల్ 1921 నాడు నెల్లూరులో జన్మించారు. వీరిది సాధారణ కుటుంబం. సర్కారు వారి పుణ్యమా అని ఎలిమెంటరీ చదువు సాఫీగానే సాగినా, హైస్కూల్ దగ్గరకు వచ్చేసరికి చదువు ఖర్చుతో కూడుకున్న పని అయ్యింది. దాంతో నాగభూషణం గారు చిన్నచితకా పనులు చేసేవారు. నెల తిరిగేసరికి రూపాయి, పావలా సంపాదించి బడి ఫీజు కట్టేవారు. ఉన్నత పాఠశాల చదువులు పూర్తయినాక కూడా ప్రతీ రోజు టైర్లు రీ గ్రూపింగ్ చేస్తూ ఆ వచ్చే డబ్బులు దాచుకొని ఫీజులు కట్టుకుంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇంకా ఆ పైన చదువులు తనకు తలకు మించిన భారమైంది. దాంతో ఉద్యోగాన్వేషణలో పడ్డారు. అదృష్టం బాగుండి “సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంటు” కార్యాలయంలో ఉద్యోగం దొరికింది. మద్రాసులో పోస్టింగ్. నెల పాతిక రూపాయలు జీతం. దాంతో మకాం మద్రాసుకు మారింది.

వివాహం..

1941లో నాగభూషణం గారికి సుబ్బరత్నం తో వివాహం జరిగింది. అనుకోని కారణాలతో ఆమె అకాల మరణం చెందారు. దాంతో నాగభూషణం గారు శశిరేఖను మారు వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు వీరి సంతానం.

నాటకరంగం లోకి ప్రవేశం..

మద్రాసు చేరే వరకు కూడా నాగభూషణం గారికి నాటకాలు అంటే ఏమిటో తెలియదు. తనలోని నటుడిని బయటకు తీసిన వారు జి.వరలక్ష్మి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. చిన్నప్పటినుంచి నాగభూషణం గారు వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులవుతూ వచ్చారు. ప్రజానాట్యమండలి వాళ్ళిద్దరినీ (జి. వరలక్ష్మి, మిక్కినేని రాధాకృష్ణ మూర్తి) మరియు నాగభూషణం గార్లను చేరతీసింది. వారితో కలిసి ఆత్రేయ గారు వ్రాసిన “భయం”, “కప్పలు” వంటి నాటకాల్లో విరివిరిగా పాల్గొనేవారు. అలా నాగభూషణం గారి నట జీవితానికి బీజం పడింది.

ఇక నాటకాల విషయానికి వస్తే మద్రాసులో ఆ రోజుల్లో తమిళ నాటకాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎం. ఆర్.రాధ, మనోహర్ వంటి వారు సినిమాలను తలపించేలా స్టేజ్ మీదే భారీ ఎత్తున సెట్టింగులూ, డాన్సులూ, మొత్తం స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను రంజింప చేసేవారు. జనం ఆ నాటకాలకు విరగబడేవారు. మనోహర్ నాటకాలుఅయిన విశ్వామిత్ర, లంకేశ్వరన్ పూర్తిగా ద్రవిడ ఉద్యమానికి ఊతంగా ఉండేవి. రాముడు తప్పు రావణుడే రైటు, ఇంద్రుడు తప్పు విశ్వామిత్రుడే రైటు అంటూ వాదించేవి. ఇక రాధ నాటకం “రక్త కన్నీరు” సమాజంలోని అనేక అవకతవకల మీద సెటైర్లు విసిరేది.

“ఇదా ప్రపంచం” నాటక ప్రదర్శన.

 ఓ సారి ఏలూరులో “ఆంధ్ర నాటక కళాపరిషత్” ఆధ్వర్యంలో నాటక పోటీలు జరుగుతున్నాయి. నెల్లూరుకు చెందిన విశ్వనాథ రెడ్డి గారు వ్రాసిన “ఇదా ప్రపంచం” నాటకాన్ని ప్రదర్శించడానికి దరఖాస్తు పెట్టుకున్నారు నాగభూషణం గారు. అయితే అది కమ్యూనిస్టు నాటకం అని భావించిన పరిషత్ వర్గాలు దరఖాస్తును తిరస్కరించాయి. వాస్తవానికి ఆ నాటకంలో రాజకీయ అంశాలు ఏమీ లేవు. కనీస పరిశీలన కూడా చేయకుండా ఆ నాటకాన్ని తిరస్కరించడంతో నాగభూషణానికి పంతం పెరిగింది.

ఆ నాటకాన్ని ప్రదర్శించి తీరాల్సిందేనని మిగిలిన సభ్యులు కూడా అనడంతో, ఏలూరులోని నటి లక్ష్మీకాంతం కట్టిన హాలు ఉండటంతో అందులో నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి పట్టణంలో ప్రచారం చేశారు. ఈ విషయం పరిషత్ వారికి తెలిసి ఆ నాటక ప్రదర్శన ఆపడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేశారు నాగభూషణం గారు. నాగభూషణం గారి పట్టుదలకు ఇదొక నిదర్శనం.

సినీ రంగ ప్రవేశం.

నాగభూషణం గారు రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో, వారి దృష్టి సినిమాల మీదకి మళ్ళింది. మిక్కిలినేని, జి.వరలక్ష్మి తదితరులు కూడా సినీ రంగ ప్రవేశం చేయడంతో తను కూడా అదృష్టాన్ని పరీక్షించుకుందామని 1951 ఏప్రిల్ నెలలో మళ్లీ మద్రాసుకు చేరుకున్నారు నటుడు నాగభూషణం గారు. నటుడు పెరుమాళ్ళు తనని ఆదరించి తను ఉంటున్న గదిలోనే ఆశ్రయం కల్పించారు. నాగభూషణం గారు అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికి తటపటాయించే రోజులవి. అలాంటి తరుణంలో “కోన ప్రభాకర్ రావు” గారు నిర్మిస్తున్న “రూపవతి” సినిమాలో చిన్న వేషం దొరికింది నాగభూషణం గారికి.

నిజానికి అది కేవలం ఒక రోజు వేషం మాత్రమే. అయితే నాగభూషణం గారి నటనను చూసి సంతృప్తి చెంది తన అభినయాన్ని మరో మూడు రోజులు పొడిగించారు. అదే నాగభూషణం గారి తొలి సినిమా అనుభవం. ఆ తర్వాత “జ్యోతి”, “చిన్న కోడలు” చిత్రాల్లో వారు చిన్న వేశాలు వేశారు. గుంపులో గోవిందం లాంటి వేషాలు అయినా సరే వాటిని పోషిస్తూ తనకు బ్రేక్ ఇచ్చే పాత్రల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన “పల్లెటూరి” సినిమాలో కాస్త ప్రాధాన్యత కలిగిన వేషం దొరికింది. ఆ తర్వాత “పెంకి పెళ్ళాం” చిత్రంలో తాగుబోతుగా, “అమర సందేశం” చిత్రంలో దుష్టుడిగా నటించారు. 1956 వ సంవత్సరంలో విడుదలైన “ఏది నిజం” చిత్రం నాగభూషణం గారి నట జీవితాన్ని మలుపు తెప్పింది.

ఆ చిత్ర నిర్మాత ఘంటసాల రామకృష్ణమూర్తి గారు నాగభూషణం గారి బాల్య మిత్రుడు కావడం, నిర్మాతగా నిర్మించే తొలి చిత్రం కావడంతో నటనకే పరిమితం కాకుండా చిత్ర నిర్మాణంలో చేదోడు వాదోడుగా నిలిచి అన్ని పనులు చేశారు. రంగస్థలం అనుభవాన్ని పురస్కరించుకుని తనే దృశ్య విభజన చేశారు. సుంకర సత్యనారాయణ గారు దగ్గరుండి సంభాషణలు వ్రాయించారు. “ఏది నిజం” చిత్రానికి రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. ఆ చిత్రం విజయవంతమైనా కూడా నాగభూషణం గారికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా కూడా నిరాశ పడకుండా అవకాశాలు దొరికే వరకు వేచి ఉండి సమయాన్ని వృథా చేయకుండా నాటక రంగం మీదకు దృష్టి మరలించారు నాగభూషణం గారు.

రక్త కన్నీరు నాటకానికి శ్రీకారం…

ఆ సమయంలో తమిళనాడులో ఎమ్.ఆర్.రాధ ప్రదర్శించే “రక్త కన్నీరు” నాటకం విజయ విహారం చేస్తోంది. ఆ నాటకం యొక్క ఇతివృత్తం నాగభూషణం గారికి బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం కలగడంతో పాలగుమ్మి పద్మరాజుతో నాటకాన్ని తెలుగులోకి అనువదించి జూలై 1956లో తొలి ప్రదర్శన ఇచ్చారు. ఆ నాటకం ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటకారంగ చరిత్రలో నాగభూషణం గారికి సుస్థిరమైన స్థానాన్ని, స్థాయిని కల్పించింది. ఆనాటి నుంచి నాగభూషణం గారు “రక్తకన్నీరు నాగభూషణం” గా ప్రసిద్ధిగాంచారు. ఈ నాటకంలో నటించిన వాణిశ్రీ, శారద, రేవతి, మీనా కుమారి, ఆదోని లక్ష్మీ తదితర నటీమణులు తెలుగు, కన్నడ, తమిళ రంగాలలో హీరోయిన్లుగా స్థిరపడ్డారు.

విభిన్నంగా విలనీ.

నాగభూషణం గారు చిత్రరంగం ప్రవేశం చేసే నాటికే, రాజనాల గారు విలన్ గా ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. నటులు సత్యనారాయణ గారు తనదైన ధోరణిలో నటిస్తూ విలన్ గా ఎదిగే క్రమంలో ఉన్నారు. వికట్టహాసం చేసే విలన్ పాత్రలకు భిన్నంగా తను పోషించే పాత్రలు ఉండాలని ఆలోచించి పాలిష్డ్ విలన్ పాత్రలకు తన అభినయంతో ప్రాణప్రతిష్ట చేశారు నాగభూషణం గారు. నాగభూషణం గారు పోషించిన విలన్ పాత్రలను ఒక్కసారి గమనించినట్టయితే ఎక్కడ కూడా అరుపులు, భయంకరమైన నవ్వులు కనిపించవు. సుతి మెత్తగా ప్రవర్తిస్తూ ప్రత్యర్థిని దెబ్బతీసే పాత్రను పోషించిన నాగభూషణం గారు చిరకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పట్టణంలో వాచకంలో విశిష్టతను, విలక్షణతను ప్రదర్శిస్తూ నాగభూషణం గారు చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల నోళ్లలో నానేవి. “అడవి రాముడు” చిత్రంలో “చరిత్ర అడక్కు చెప్పింది విను” ఇప్పటికీ వినిపించే డైలాగ్ అది. విలన్ పాత్రనే కాదు “మోసగాళ్లకు మోసగాడు” వంటి చిత్రాలలో హాస్య భూమికలను నిర్వహించి పేరు తెచ్చుకున్నారు. అలాగే “మహమ్మద్ బిన్ తుగ్లక్” చిత్రంలో ఆయన పోషించిన తుగ్లక్ పాత్ర కూడా విభిన్నమైంది. “చెల్లెలి కాపురం”, “విచిత్ర కుటుంబం”, “అదృష్ట జాతకుడు”, “నాటకాల రాయుడు”, “కలెక్టర్ జానకి”, “ఆడపిల్లల తండ్రి” ఇలా ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రులను పోషించిన నాగభూషణం గారు తన చివరి చిత్రం “నెంబర్ వన్”. ఈ సినిమాలో నాగభూషణం పాత్రనే తాను పోషించారు.

తెలుగు సినిమాల పాక్షిక జాబితా.

 • పల్లెటూరు (1952)
 • ఏది నిజం? (1956)
 • పెంకి పెళ్ళాం (1956)
 • బికారి రాముడు (1961)
 • మంచి మనసులు (1962)
 • వింత కాపురం (1968)
 • ఆదర్శ కుటుంబం (1969)
 • కథానాయకుడు (1969)
 • ధర్మపత్ని (1969)
 • ముహూర్త బలం (1969)
 • అదృష్ట జాతకుడు (1970)
 • అల్లుడే మేనల్లుడు (1970)
 • ఆడజన్మ (1970)
 • ద్రోహి (1970)
 • పెళ్లి కూతురు (1970)
 • మా మంచి అక్కయ్య (1970)
 • కథానాయకురాలు (1971)
 • కళ్యాణ మంటపం (1971)
 • తాసిల్దారుగారి అమ్మాయి (1971)
 • వింత దంపతులు (1972)
 • ఇదా లోకం (1973)
 • పూల మాల (1973)
 • మొగుడా- పెళ్ళామా (1975)
 • గంగ యమున సరస్వతి (1976)
 • అదృష్టవంతురాలు (1977)
 • ఈనాటి బంధం ఏనాటిదో (1977)
 • విచిత్ర జీవితం (1978)
 • మేలుకొలుపు (1978)
 • శ్రీరామరక్ష (1978)
 • ముత్తయిదువ (1979)
 • వియ్యాలవారి కయ్యాలు (1979)
 • శంఖుతీర్థం (1979)
 • గయ్యాళి గంగమ్మ (1980)
 • గూటిలోని రామచిలక (1980)
 • జాతర (1980)
 • పంచ కళ్యాణి (1980)
 • పెళ్ళిగోల (1980)
 • పొదరిల్లు (1980)
 • టింగు రంగడు (1982)

విశేషాలు.

 • అటు సినిమాల్లోనూ, ఇటు రంగస్థలం మీదా ఏకకాలంలో ‘బిజీస్టార్‌’ అనిపించుకున్న ఏకైక నటుడుగా నాగభూషణానికి గొప్ప పేరుంది..
 • నాగభూషణం గారు ఒక్క ‘రక్తకన్నీరు’ నాటకాన్నే దాదాపు రెండువేల ప్రదర్శనలు ఇవ్వగలిగారు..
 • నాగభూషణం గారు బిజీస్టార్‌ కాకముందు ఒకే నెలలో ముప్పయ్‌ ప్రదర్శనలు మరియు ఒకే రాత్రిలో రెండు ప్రదర్శనలు ఇవ్వగలిగిన ఘనత నాగభూషణం గారు సాధించారు.
 • సినిమాలకి సంబంధించీ, నాటకాలకి సంబంధించీ – రెండువేపుల నుంచీ ఆయనకి సత్కారాలూ, గౌరవాలూ చాలా బాగా లభించాయి.
 • ప్రముఖ నటీమణులు వాణీశ్రీ గారు, శారద గారు మొదట్లో నాగభూషణం గారి నాటక బృందంలో వుండేవారు.

మరణం.

కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఒంటపట్టించుకున్న నాగభూషణం గారు ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా 1974 నుండి 1993 వరకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. తన 80 వ జన్మదినం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గారు, నాగభూషణం గారు నటించిన “ప్రజానాయకుడు”  చిత్రం ప్రత్యేక ప్రదర్శనని తిలకించి వారిని అభినందించారు. విలనీకి సరికొత్త నిర్వచనం ఇచ్చి ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్న నాగభూషణం గారు 5 మే 1995 నాడు కన్నుమూశారు.

సశేషం.

వెండితెర పై ప్రతినాయక పాత్రకు తాను ఒక నిర్వచనం. వికృతంగా, వ్యంగ్యంగా, వేలం వెర్రిగా విలన్ కి ఓ స్టయిల్ ని నిర్మించిన వెరైటీ నటుడు నాగభూషణం గారే. ఆ రోజుల్లో దక్షిణాది తెరపై ఇంతటి ప్రతినాయకుడు లేరన్న పేరు పొందారు నాగభూషణం గారు. రంగస్థలం, వెండితెర రెండు కళ్ళుగా జీవించిన అపూర్వ ప్రతిభామూర్తి నాగభూషణం గారు. విలనిజానికి కామెడీ టచ్ ఇచ్చి దానికో కొత్త గ్లామర్ ని, కొత్త గ్రామర్ ని సంపాదించి పెట్టినవాడు నాగభూషణం గారు.

వామపక్ష భావాలతో ప్రజా ప్రయోజనం ఆశిస్తూ నాగభూషణం గారు తీసిన చిత్రాలు భాగస్తులు, ఓకే కుటుంబం వంటి కొన్ని చిత్రాలు ఘోరంగా అపజయం పొందాయి. జీవితం అంతా ఒక నిర్థిష్ఠ ప్రణాళికతో, నిర్థిష్ఠ భావజాలంతో బ్రతికిన నాగభూషణం గారు చివరి దశలో అనారోగ్యానికి గురైనారు. అదే స్థితిలో గుండె పోటుతో మరణించారు. ఆయన మరణంతో తెలుగు కళారంగంలో ఒక వెలుగు ఆరిపోయింది. ఒక మహోన్నత నటన ప్రతిభ కొడిగట్టిపోయింది.  నటనకే నడక నేర్చిన నాగభూషణం గారి పేరు ఈ తరానికి తెలియదు. ఆయన పేరిట ఏ స్మృతి చిహ్నము ఈ నాడు మనం మిగుల్చుకోలేక పోయాము. ఇదే అసలైన రక్త కన్నీరు.

Show More
Back to top button