CINEMATelugu Cinema

మనసు మమకారం, మాట నూరే కారం.. నటి గరికపాటి వరలక్ష్మి..

ది 1940 సంవత్సరం వరలక్ష్మి.. మద్రాసులోని శోభనాచల స్టూడియోలో ఓ పద్నాలుగేళ్ల పిల్ల చెట్టు ఎక్కి కూర్చుంది. ఎవరెవరో వచ్చి ఆ పిల్లని చెట్టు దిగి వచ్చి మేకప్ వేసుకోమని బ్రతిమాలుతున్నారు. కానీ ఆ అమ్మాయి ససేమిరా అంటుంది. ఈ విషయం తెలిసి శోభనాచల అధినేత మీర్జాపురం రాజా వారు కూడా అక్కడికి వచ్చారు. జేబులో నుండి డబ్బులు తీసి ఆ పిల్లకు చూపించి క్రిందికి వస్తే ఈ డబ్బంతా నీదేనని ఆశ చూపించారు. తన అస్త్రం పనిచేసింది.

ఆ పిల్ల చెట్టు దిగి వచ్చింది. రాజావారి చేతిలో నుంచి డబ్బులు తీసుకుని నేరుగా మేకప్ రూమ్ లోకి వెళ్లి బుద్ధిగా మేకప్ చేయించుకుంది. ఆరోజు అక్కడ “దక్షయజ్ఞం” సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ పిల్ల అందులో కుముదిని వేషం వేస్తోంది. ఆ అమ్మాయి పేరు జి.వరలక్ష్మి. ఆ పిల్ల జయా ఫిలిమ్స్ వారి “ప్రహ్లాద” సినిమాలో కూడా టైటిల్ రోల్ వేసింది. అక్కడ కూడా ఎవరైనా అన్నం తినకపోయినా, ఎవరికైనా జీతం డబ్బులు ముట్టకపోయినా తను వెంటనే వారి తరుపున సమ్మెకు దిగేది వారికి న్యాయం జరిగేదాకా పోరాటం చేసేది. చాలామంది ఆ పిల్లను రెబెల్ అనేవారు. తనకు అలా పిలిస్తే సంతోషంగా వుండేది.

తనకు నచ్చిన విధంగా జీవించడమే కాదు, అలాగే జీవిస్తానని కూడా వక్కాణించి చెప్పిన నటి వరలక్ష్మి గారు. ఎవరేమన్నా నేను లెక్క చేయనని బహిరంగంగా బాహాటంగా చెప్పిన నటీమణి తాను. వరలక్ష్మి గారు 1948 నుండి 1952 వరకు కొన్ని సినిమాలలో కథానాయకగా నటించినప్పటికీ, సుమారుగా 1952 నుంచి 1978 వరకు వయసు మళ్ళిన పాత్రలు, ముఖ్యంగా నిర్వేదం అహంభావం ప్రతిబింబించే పాత్రలను, అంతకుమించి కరుణరసం పండించిన పాత్రలకు పెట్టింది పేరు.

వరలక్ష్మి గారు అలనాటి ప్రముఖ దర్శకులు కె.యస్.ప్రకాశరావు గారి రెండవ భార్య. వీరిరువురికి జన్మించిన కె.యస్.ప్రకాశ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు. గరికపాటి వరలక్ష్మి గారు విలక్షణమైన నటీమణులు. ఆ విలక్షణత ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా కనిపిస్తుంది. కె.యస్.ప్రకాశరావు గారు హీరోగా నటించిన “ద్రోహి” చిత్రంలో జి.వరలక్ష్మి తొలిసారిగా కథనాయికగా నటించారు.

పుష్పవల్లి హీరోయిన్ గా నటించిన “వింధ్యారాణి” చిత్రంలో రేలంగి ప్రక్కన హాస్య పాత్ర, “శ్రీ లక్ష్మమ్మ కథ” లో గయ్యాళి పాత్ర, తెలుగువారి అజరామర చిత్రం “పెళ్లి చేసి చూడు” లో ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ పాత్ర, “కన్నతల్లి” లో తనకంటే పెద్దవాడైన ఏ.ఎన్.ఆర్ కు తల్లి పాత్ర, దొంగల్లో దొరలో మగవాడిని రెచ్చగొట్టే పాత్ర, “అంతస్తులు” లో అహంభావం మూర్తీభవించిన జీమిందారిణి పాత్ర, “వీరాంజనేయులు” లో మండోదరి, తమిళ “సంపూర్ణ రామాయణం” లో కైక, నట జీవితపు చివరి దశలో “శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్” లో నాయనమ్మ ఇలాంటి విభిన్నమైన పాత్రలకు విశిష్టతను తీసుకువచ్చిన అద్భుతమైన నటనశీలి జి. వరలక్ష్మి గారు.

జి.వరలక్ష్మి గారు ఓ స్వాప్నికురాలు, ఓ అసాధ్యురాలు, ఓ ఆడరౌఢీ, ఓ గడుసరి, ఓ ఫైర్ బ్రాండ్. తనకు వివాహమైనా నటనను వదిలిపెట్టకపోవడమే జి.వరలక్ష్మి జీవితంలో విశేషం. సంసారం సినిమాలకు అడ్డంకి కాదని నిరూపించింది తాను. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చిన రీతిలో నచ్చిన విధంగా బ్రతకటమే జీవితం అన్నది వరలక్ష్మి గారి అంతర్యం.

సాయంత్రం మెరీనా బీచ్ కెళ్ళి సముద్రపు గాలి పీల్చడం, ఎక్కడైనా మంచి నాటకం వేస్తున్నా, వెళ్ళి చూసి ఆనందించడం, మంచి పాటలు వినడం, విలాస వంతమైన జీవితం గడపడం అందాన్ని అనుభవించడం ఇంతే. ఉన్న ఒక్క జీవితాన్ని మనసు తీరా తనకు నచ్చినట్లు జీవించాలని నిర్ణయించుకోవడం, ఎన్ని అడ్డంకులెదురైనా అలాగే జీవించడం ఎవ్వరికీ తల వంచకపోవడం జి.వరలక్ష్మి గారికే చెల్లు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    గరికపాటి వరలక్ష్మి

ఇతర పేర్లు  :    జి. వరలక్ష్మి

జననం    :     27 సెప్టెంబర్ 1926  

స్వస్థలం   :    ఒంగోలు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం)

వృత్తి      :    నటి

తండ్రి    :   జి.యస్. నాయుడు 

జీవిత భాగస్వామి    :  కె. ఎస్. ప్రకాశరావు ​(m. 1943

పిల్లలు      :     కె. రాఘవేంద్రరావు (సవతి కొడుకు)

బంధువులు  :    కె.బాపయ్య (మేనల్లుడు)

ప్రకాష్ కోవెలమూడి ​​(సవతి-మనవడు)

మరణ కారణం  :  వృద్దాప్యం 

మరణం    :   26 నవంబర్, 2006

మరణించిన స్థలం   :   చెన్నై, భారతదేశం

నేపథ్యం…

జి.వరలక్ష్మి గారు 27 సెప్టెంబరు 1926 నాడు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు లో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. తాను ఒంగోలులో జన్మించినా పెరిగింది మాత్రం గుంటూరులో. ఆ రోజుల్లో బెజవాడలో పెద్ద వస్తాదుగా పేరు గాంచిన జి.ఎస్.నాయుడు గారు పేరు గాంచిన వాడు. తనకు కుడి భుజం అయిన కోడి రామ్మూర్తి తో భాగస్వామిగా సర్కస్ లో కూడా పనిచేశారు. కొన్నాళ్ళకు సర్కస్ విచ్చిన్నమైపోయాక గుంటూరు కు వచ్చి యుర్వేద వైద్యం చేసుకుంటూ  ఉన్నారు. నిజానికి జి.ఎస్.నాయుడు గారు బహు కుటుంబీకులు.

తనకు ముగ్గురు ఆడ పిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. ఆడపిల్లలలో వరలక్ష్మి గారు రెండో సంతానం. శ్రీ వరలక్ష్మి గారికి చిన్నతనం నుండి పాటలన్నా, సినిమాలు అన్నా కూడా భలే మక్కువ. ముఖ్యంగా పోరాట సన్నివేశాలున్న సినిమాలంటే మహా పిచ్చి. ఆ రోజుల్లో వాడియా వారి నాడియా సినిమాలు బాగా ప్రసిద్ధి చెందినవి. వాటిలో నాడియా చేసిన ఫీట్లన్నీ తను కూడా తన ఇంటి దగ్గర చేసేవారు వరలక్ష్మి గారు. హంటర్ వాలీ సినిమాలో నాడియా మాదిరి తాను కూడా చెట్ల మీద నుండి గోడల మీద నుండి దూకేవారు. కాళ్లకు, చేతులకు దెబ్బలు కూడా తగిలించుకునేవారు. అలా చెట్లు ఎక్కడంలో వరలక్ష్మి గారు బాగా రాటుదేలారు. 1937 వరకు గుంటూరులో  తన చదువు, అల్లరి, వినోదం మురిపెంగా సాగాయి.

బాల్యం…

జి.వరలక్ష్మి గారి నాన్న గారు నాయుడు గారికి ఆయుర్వేదం  అచ్చి రాలేదు. దాంతో కుటుంబ పోషణ తనకు భారమైంది. దాంతో గత్యంతరం లేక ఆధ్యాత్మికతను ఆశ్రయించారు. భార్య బిడ్డలను వదిలి భైరాగులలో కలిసిపోయారు. చిన్న వయస్కురాలైన వరలక్ష్మి గారికి తన జీవితంలో ఇది ఊహించని మలుపు. అప్పటివరకు హాయిగా సాగుతున్న తన జీవితం ఒక్కసారిగా కల్లోలానికి లోనైంది. తన కుటుంబం ఒక్కసారిగా పెద్దదిక్కు లేనిదైపోయింది. ఈ కుటుంబ భారం అంతా ఎవరు మోయాలి.

చిన్న తనంలో ఆనందంగా గడపాల్సిన బాల్యంలో ఈ కష్టాలను మోయాల్సి రావడమేమిటి. ఈ ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదు. జి.వరలక్ష్మి గారు బాగా ఆలోచించారు. తన కన్నా పెద్ద పిల్లలకు ముందుగా పెళ్లి చేయాలి. కుటుంబంలోని మిగిలిన వారిని సాకాలి. పదకొండు యేండ్ల వరలక్ష్మి గారికి ఏం చేయాలో తోచలేదు. ఎవ్వరికీ చెప్పకుండా నేరుగా బెజవాడ వెళ్ళిపోయింది. నాటకాలు, వేషాలు వేసి డబ్బు సంపాదించి కుటుంబానికి పెద్ద దిక్కులా తనే అందరినీ సాకాలనేది ఆ చిన్న బుర్రకు తట్టిన ఆలోచన. నిజానికి తన వయస్సుకు అది పెద్ద మోయలేని భారం. కానీ తప్పదు. తనకు ఉన్న ఆ అవసరం తనను ఏమీ ఆలోచించనివ్వలేదు.

సినీ నేపథ్యం…

ఆ కాలంలో విజయవాడ లో తుంగల చలపతిరావు, కోటిరత్నం లాంటి ప్రభృతులు ముమ్మరంగా నాటకాలు ఆడుతుండేవారు. జి.వరలక్ష్మి గారు వారి వెంట ఊరూరు తిరుగుతూ నాటకాలు వేస్తుండేవారు. తాను “సక్కుబాయి” నాటకంలో రాధ గా, వరవిక్రయం లో “కమల” గాను, సుభద్ర గానూ, రంగూన్ రౌడీ లో ప్రభావతి గానూ వేషం వేసేవారు. 1939 వ సంవత్సరంలో వీళ్ళంతా రాజమండ్రిలో “సక్కుబాయి” నాటకం ఆడుతుండగా రఘుపతి వెంకయ్య గారి కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ గారు చూశారు. తాను తీస్తున్న “బారిష్టరు పార్వతీశం” చిత్రంలో వరలక్ష్మి గారిని కథనాయకుడి భార్యగా వేషానికి తీసుకున్నారు. ఆ విధంగా జి.వరలక్ష్మి మద్రాసుకు చేరుకున్నారు. 7 ఆగస్టు 1940 “బారిష్టరు పార్వతీశం” సినిమా విడుదలయ్యింది. 14 సంవత్సరాలకే తాను సినిమాలో మొదటిసారి నటించింది.

“బారిష్టరు పార్వతీశం” సినిమా పూర్తవ్వగానే జయ ఫిలిమ్స్ వారు తీస్తున్న “ప్రహ్లాద” సినిమాలో ప్రధాన పాత్రకు ఎంపికచేశారు. ఇంతలో యుద్ధం వచ్చింది. జనమంతా ప్రాణభయంతో మద్రాసు వీడి సొంత  నివాసాలకు వెళ్ళిపోతున్నారు. వరలక్ష్మి గారు కూడా బెజవాడ చేరి మళ్ళీ నాటకాలు వేసుకోవడం ఆరంభించారు. “వరవిక్రయం”, “బొబ్బిలి యుద్ధం”, “కృష్ణ లీలలు” నాటకాలలో వేషాలు వేయసాగింది. ఆ తరువాత బొంబాయి వెళ్లిన తాను “వనరాణి”, “డూ ఆర్ డై”, “సర్కస్ కింగ్” లాంటి సినిమాల్లో నటించారు. 1944 లో విజయవాడ తిరిగి వచ్చిన తాను కోవెలమూడి సూర్యప్రకాశరావు గారిని వివాహం చేసుకున్నారు.

ద్వితీయార్థం లో నటన…

వివాహం తరువాత రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితమైన జి.వరలక్ష్మి గారు 1946లో సినిమా రంగంలో పునః ప్రవేశం చేశారు. వింధ్యారాణి చిత్రంలో తనది “చంపా” వేశం. రేలంగితో జత కట్టారు.

నిజానికి వింధ్యారాణి సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రత్యేకత ఏమీ లేదు. కానీ సినిమా మరీ నీరసంగా ఉండడంతో చివరికి ఆ పాత్రే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1947లో తన భర్త ప్రకాశ రావు గారు కొందరు భాగస్వాములతో కలిసి “ద్రోహి” అనే సినిమాను ప్రారంభించారు. జి.వరలక్ష్మి గారు కథానాయకునికి భార్యగా నటించారు.

అయితే ఆ సినిమా విడుదలకు ముందే ప్రకాశరావు గారికి తన భాగస్వామికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో ప్రకాశరావు గారు సొంతంగా “ప్రకాష్ ప్రొడక్షన్స్” స్థాపించారు.

. ఈలోగా జి.వరలక్ష్మి గారు “వాలిసుగ్రీవ”, “శ్రీ లక్ష్మమ్మ కథ”, “మాయ రంభ”, “స్వప్న సుందరి” సినిమాల్లో నటించారు.

ప్రకాష్ ప్రొడక్షన్స్ స్థాపన…

ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి తొలి చిత్రం “మొదటి రాత్రి”. ఈ సినిమా పేరు జనానికి ఏదో బూతు లాగా తోచింది. దాంతో పెద్దగా జనం రాలేదు. అందువలన ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. జి.వరలక్ష్మి గారు హెచ్.యం.రెడ్డి దర్శకత్వం వహించిన “నిర్దోషి” సినిమాలో ప్రతినాయిక (ఆడ విలన్) గా వేషం వేశారు. నటిగా తాను ఎంత వైవిధ్యం చూపించగలదో ఆ సినిమా ప్రేక్షకులకు బాగా తెలియచెప్పింది. ప్రస్తుతం మనం చూస్తున్న టీవీ సీరియల్స్ లో ఈ ఆడ విలన్లందరిని వరలక్ష్మి గారిని ఆది గురువుగా పరిగణించవచ్చు.

ప్రకాశరావు గారి “దీక్ష” సినిమాలో వరలక్ష్మి గారు నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ఆదరగొట్టారు. వేశ్య పాత్రధారిగా ముద్రపడ్డ తనకు రెట్టించిన ఉత్సాహన్నిచ్చింది. ఈ తరహా పాత్రలు కూడా బాగా వేయగలరని పేరు తెచ్చుకున్నారు. నటిగా ఈ సినిమాలో మరిన్ని మంచి మార్కులు పడ్డాయి. తమ నిర్మాణ సంస్థకే కాకుండా బయటి వారికి కూడా సినిమాలు చేశారు. “మానవతి”, “ప్రపంచం”, “పెళ్లి చేసి చూడు”, “నా చెల్లెలు” సినిమాలు చేశారు. “పెళ్లి చేసి చూడు” సినిమా అద్భుతమైన విజయం సాధించి తనకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ సమయంలో రాయలసీమ క్షామ నివారణ నిధికి నందమూరి వారి బృందంలో పర్యటించి విరాళాలు సేకరించారు

స్టూడియో నిర్మాణం…

“దీక్ష” సినిమా కాగానే ప్రకాశరావు గారు స్టూడియో నిర్మాణానికి దిగారు. తాను స్టూడియో కట్టిన తర్వాత తొలి సినిమాగా “కన్నతల్లి” (1953) లో తీశారు. 1958 లో రాజనందిని సినిమాలో గిరిజ సంరక్షకురాలు విమలగా నటించారు. సంపూర్ణ రామాయణం సినిమాలో కైక పాత్ర ధరించారు.

నందమూరి గారు రాముడు, శివాజీ గణేషన్ గారు భరతుడు, పద్మిని సీత పాత్రలలో ధరించిన ఈ తమిళ  సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు.

అలా వేశ్య పాత్రలకు, రాజసం ఉట్టిపడే వేషాలకు జి.వరలక్ష్మి గారు చిరునామాగా వెలిగారు.

తనకు తానుగా వరలక్ష్మి గారు ఎవ్వరినీ వేషాలకు దేబిరించింది లేదు.

తన ప్రతిభా విస్తృతి తెలిసి ఆదుర్తి సుబ్బారావు గారు, గుత్తారామినీడు గారు లాంటి దర్శకులే పాత్రలు ఇచ్చి గౌరవించేవారు.

జి.వరలక్ష్మి గారు స్వతంత్రంగా “ప్రమోద ఫిలిమ్స్ పతాకం” పై జగ్గయ్య గారిని హీరోగా పెట్టి ఎడిటర్ “జోషి” ని దర్శకుడిగా పరిచయం చేస్తూ “పసుపు కుంకుమ” సినిమా తీశారు.

దీనికి వీణ రంగారావు సంగీత దర్శకులు. కానీ ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఆ తర్వాత “ప్రమోద ఫిలిమ్స్ పతాకం” పై తమిళంలో హరిచంద్ర చిత్రం తీశారు. ఆ సినిమా చాలాకాలం నిర్మాణంలో ఉండడంతో ఆ చిత్రం కూడా సరిగ్గా ఆడలేదు.

స్వీయ దర్శకత్వంలో “మూగజీవులు”…

1968లో “చంద్రశేఖర ఫిలిమ్స్ పతాకం” మీద తానే దర్శకత్వం వహిస్తూ “మూగజీవులు” సినిమా తీశారు.

ఈ చిత్రం అతి పెద్ద ఫ్లాప్. ఆర్థికంగా విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయారు వరలక్ష్మి గారు. తనకు సొంత ఇల్లు కూడా మిగలలేదు.

నటిగా తాను నటించిన చిత్రాలలో “వీరాంజనేయ”  సినిమాలో “మండోదరి” పాత్ర తనకు చాలా ఇష్టం.

ముఖ్యంగా సీతకు మండోదరి వీడ్కోలు పలికే సన్నివేశంలో మల్లాదివారు తన పాత్రను తీర్చిదిద్దిన వైనాన్ని వరలక్ష్మి గారు ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటారు.

ఇక తమిళ సినిమాల విషయానికొస్తే చాలా సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు.

మామియార్ మెచ్చియ మరమగల్ సినిమాలో జి.వరలక్ష్మి గారు అత్త పాత్రలో దంచేశారు.

తమిళంలో తాను సొంతంగా నిర్మించిన హరిచంద్రలో శివాజీ గణేశన్ హీరో, వరలక్ష్మి గారు చంద్రమతి పాత్రలో నటించారు.

కన్నడంలో రాజ్ కుమార్ గారితో “నాగార్జున” అనే సినిమాలో నటించారు.

వ్యక్తిగత జీవితం…

దర్శకులు సి.పుల్లయ్య గారి సహాయకుడు రమణారావు బొంబాయికి చెందిన తన మిత్రుడు మజహార్ ఖాన్ తో కలిసి తెలుగులో “తులసీదాసు” సినిమా తీయడానికి సంకల్పించాడు. నాయికగా జి.వరలక్ష్మీ గారిని తీసుకున్నారు. దాంతో బొంబాయి వెళ్ళిన వరలక్ష్మి గారికి నిరాశ ఎదురైంది. వాళ్ళు సినిమా తీయలేదు. భారత్ ఫిలిమ్స్ వారు తమ హిందీ సినిమాలకు జి.వరలక్ష్మి గారిని తీసుకున్నారు. “వనరాణి”, “డూ ఆర్ డై”, “సర్కస్ కింగ్” సినిమాల్లో నటించారు వరలక్ష్మి గారు. ఆ మూడు చిత్రాలు కూడా తనకెంతో ఇష్టమైన పోరాట సన్నివేశాలు ఉన్న సినిమాలే.  1943 చివరి వరకు బొంబాయిలోనే ఉన్న తాను 1944 లో విజయవాడ కు చేరుకున్నారు.

వయస్సులో ఉన్నప్పుడు ప్రేమ మైకం పొరలు కమ్మేస్తుంది. జి.వరలక్ష్మి గారి జీవితంలో కూడా అలాగే జరిగింది.

ప్రముఖ దర్శకులు కోవెలమూడి సూర్యప్రకాశరావు గారితో ప్రేమలో పడ్డ తాను 1944 లో ప్రకాశరావు గారిని వివాహం చేసుకున్నారు. అప్పటికే ప్రకాశరావు గారికి పెళ్లయ్యి పిల్లలున్నారు.

అప్పటికి ప్రకాశరావు గారి సినిమాలు ప్రపంచానికి ఇంకా అంతగా అంటలేదు. గూడవల్లి రామబ్రహ్మం గారి సినిమా “అపవాది” లోను, “పత్ని” సినిమాలలో నటించారు.

తనే నిర్మాత కావాలన్న ఆలోచన అప్పుడప్పుడే ప్రకాశరావు గారి మనసులో తలెత్తుతుంది.

సరిగ్గా అదే సమయంలో జి.వరలక్ష్మీ గారు ప్రకాశరావు గారి జీవితంలో ప్రవేశించారు.

కానీ వరలక్ష్మి గారు మాత్రం ప్రకాశరావు గారి యత్నాలకు దూరంగానే మసలుకున్నారు. 1946 వరకు బెజవాడలోనే తమ ఇంటి పట్టున ఉండిపోయారు. ఎదిగిన కొడుకు ప్రకాష్ మరియు కూతురు కనకదుర్గ  ఉండగానే భర్త ప్రకాశరావు గారు ఉండగానే పహిల్వాన్ అజిత్ సింగ్ గారిని పెళ్ళాడారు. అది కూడా ఎక్కువ కాలం నిలువలేదు. “ఏ ఒంటరి తనం, ఏ ఆకర్షణ నన్ను అలా చెయ్యమని పురిగొల్పిందో సంజాయిషీ చెప్పవలసిన పని నాకు లేదు. ఇది నా జీవితం, నా ఇష్టం అంతే” అన్న వరలక్ష్మి గారు అది తప్పుడు నిర్ణయం అని తనకు ఏడాది లోనే తెలిసింది. మళ్ళీ తాను మద్రాసుకొచ్చేశారు.

శివైక్యం…

జి.వరలక్ష్మి గారు తన మరణానికి కొద్ది రోజుల ముందు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు.

“నా జీవితాన్ని తలుచుకుంటే ఓ రంగుల కలలా అనిపిస్తుంది. నేను బలహీనతలకు లోనయ్యాను, కానీ నా బలహీనతలు, నా వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా నాకు జ్ఞానం లేకపోవడం వల్లే అని ఎన్నో ప్రచారాలు జరిగాయి. రౌడీ వరలక్ష్మి అని, పిచ్చి వరలక్ష్మి అని నానా రకాల ప్రచారం చేశారు. నా విషయంలో జరిగినట్టుగా మరే ఇతర విషయంలో జరిగి ఉండదు. నాకు ఆడ జాతి అంటేనే అయిష్టమని, మగజాతి అంటేనే ఇష్టమని, అదే నా స్వభావమని ప్రచారం జరిగింది. నిజమే వంటిల్లు, వంటకాలు, పక్కింటి కబుర్లు తప్ప ఇంకొకటి మాట్లాడలేని స్త్రీల సహచరాన్ని నేను భరించలేను”.

“మనిషి జీవితాన్ని గోడల మధ్య భద్రపరుచుకుని, ఆ గోడలలోనే జీవించాలని చూస్తారు.

కానీ ఆ గోడలు నేను భరించలేను. నా జీవితాన్ని ఎప్పుడు రహస్యంగా ఉంచుకోలేదు. చాలా విలాస జీవితం గడిపాను.

ఇప్పుడు పరిశ్రమ మారిపోయింది. ఒక్క పరిశ్రమమే కాదు, మద్రాసు కూడా మారిపోయింది.

ఆ రోజుల్లో సాయంత్రం మెరీనా బీచ్ కి వెళ్లే దాన్ని, సముద్ర గాలి పీల్చే దాన్ని.

ఇప్పుడు ఇంటి నుండి బయటకు రావడం లేదు. ఎవ్వరినీ లెక్క చేసేదాన్ని కాదు.

అది తప్పని ఇప్పుడు తెలుస్తుంది. జీవితంలో తొందరపాటు నిర్ణయాలకు ప్రమాదకర ముగింపు ఉంటుందని ఆనాడు తెలుసుకోలేకపోయాను”.

జీవిత మలి సంధ్యలో జి.వరలక్ష్మి గారు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో వేసిన జయప్రద గారి బామ్మ పాత్ర, గోరంత దీపంలో వాణిశ్రీని ఆపదలో గట్టెంకించే ఇల్లాలుగా, అల్లు రామలింగయ్య గారి ఇంటి ఇల్లాలి పాత్రలో నటించారు.

తన కొడుకు కె.ఎస్.ప్రకాష్ హఠాన్మరణం తనను బాగా క్రుంగదీసింది.

తన భర్త కె.యస్. ప్రకాశరావు గారు కూడా 1996 లో మరణించారు. చెన్నై సమీపంలో తోట, ఇల్లు  ఉండేది తనకు.

తాను చెల్లెలు తో కలిసి ఉండేవారు. కూతురు కనకదుర్గ కు పెళ్ళైపోయింది.

తన కూతురు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది. తన సంతోషాలకు, తన దుఃఖాలకు ఎవ్వరినో బాధ్యులను చెయ్యడం జి.వరలక్ష్మి గారికి ఇష్టముండేది కాదు, ఏదైనా తనదే బాధ్యతగా ఉన్నారు.

మన జీవితం మనదే ఆనందం, మనదే గా బాధ్యత అనుకుని అక్షరాలా ఆచరించి చూపిన జి.వరలక్ష్మి గారు 26 నవంబరు 2006 నాడు తన 80 ఏళ్ల వయస్సులో శివునిలో ఐక్యమయ్యారు.

వ్యక్తిత్వం…

జి.వరలక్ష్మీ గారు గుంటూరు అమ్మాయే కాబట్టి మిర్చి ఘాటు కూడా మరీ ఎక్కువే. తనకు మనసు నిండా మమకారం, మాట మాత్రం నూరే కారం. అభ్యుదయ వాదులతో పరిచయాలు, ప్రజానాట్యమండలి నాటకాలు, ప్రపంచాన్ని చదివేందుకు బాగా దోహదం చేశాయి. తాను అందరితోనూ చాలా కటాపిటీగా మాట్లాడేవారు. కమ్యూనిస్టు సభల్లో ఊరేగింపుల్లో విరివిగా పాల్గొనేది. సినిమాల లోకి వచ్చాక కూడా తనను ముక్కుసూటితనం వదల్లేదు. ఆ ముక్కుసూటితనమే కొన్ని సందర్భాలలో తన సినీప్రస్థానాన్ని ఇబ్బంది కలిగించినా తాను ఏమాత్రం జంకలేదు. తనకు నచ్చని విషయాన్ని దర్శకులతో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేది. దానివల్ల తాను కొన్ని సినిమాలు కూడా కోల్పోయింది.

కె.బి.తిలక్  గారు నిర్మించిన ముద్దుబిడ్డ(1956) చిత్రీకరణలో షూటింగప్పుడు స్పాట్ లో తన సంభాషణలు మార్చి చెప్పారు వరలక్ష్మి గారు. దానికి బిత్తరపోయిన దర్శకులు తిలక్ గారు సంజాయిషీ కోరారు. దానికి సమాధానంగా మీరు వ్రాయించిన సంభాషణలు నాకు నచ్చలేదు. అందుకే ఇలా మార్చి చెప్పాను అన్నారు. అంటే  మాకేమీ తెలియదా? మేము చిత్ర దర్శకులం. మాటలు వ్రాసిన వారికీ ఏమీ తెలియదా అని ప్రశ్నిస్తే, వరలక్ష్మి గారు ఎదురు తిరిగి షూటింగ్ స్పాట్ నుండి చర చరా వెళ్ళి పోయింది. అంత వరకు షూట్ చేసిన 6 రీళ్ళు వృధా. దాంతో లక్ష్మీరాజ్యాన్ని ఆపాత్రకు ఎన్నుకుని చిత్రీకరణ పూర్తి చేస్తే ఆ సినిమా సూపర్ హిట్.

గుత్తారామినీడు దర్శకత్వం లో వచ్చిన “బంగారు సంకెళ్ళు” సినిమాను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

చివరిగా ఆవిడ కనిపించిన సినిమాలు బాపు గారి దర్శకత్వంలో వచ్చిన “రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్”,

“గోరంత దీపం”, తాను ఎన్ని సినిమాల్లో నటించిందో తాను ఏనాడూ లెక్క చూసుకున్నది లేదు.

తాను ఎప్పుడూ వైవిధ్యం గురించి తాపత్రయపడేది. జి.వరలక్ష్మి వయస్సులో ఉన్నప్పుడు కథానాయిక గా నటించింది.

నడి వయస్సులో గుణచిత్ర నటిగా మారింది. గయ్యాళి వేషాలు వేసింది. వేశ్య గానూ కనిపించారు. కరుణరసం వొలికించారు. కానీ దేనిలోను స్థిరంగా బ్రాండ్ కాలేకపోయారు.

వైవిధ్యాన్ని చూసుకున్నారే గాని తనకంటూ ఒక ముద్ర మాత్రం నిర్మించుకోలేకపోయారు. ఇది తన విజయం, అపజయం కూడా.

వరలక్ష్మి గారి తత్వశాస్త్రం….

ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయే ఈ పయనంలో నీవే ప్రాముఖ్యత గా ఉండాలి. నీ మొట్ట మొదటి ప్రాముఖ్యత నీ సౌఖ్యానికే ఇవ్వాలి.

కని పెంచిన వారైనా, తోడబుట్టిన వారైనా కట్టుకున్న వారైనా కడుపున పుట్టిన వారైనా సరే.

నీవెప్పుడూ వారికి రెండవ ప్రాధాన్యతనే ఇవ్వాలి. ప్రేమ, అభిమానం, అనురాగం వీటన్నిటి వెనుక ఉన్నది కేవలం స్వార్ధమే.

ఒక దశ తరువాత ఇతరుల ప్రేమ కోసం అర్రులు చాచడం, దిగులు పడడం శుధ్ధ దండుగ.

నీ ఈ జీవితం మళ్ళీ రాదు. వీలైనంత సుఖించు, వెళ్ళిపో. ఇదే జి.వరలక్ష్మి గారి వేదాంతం, ఇదే వరలక్ష్మి గారి తత్వశాస్త్రం.

జి.వరలక్ష్మి గారు చాలా చిన్న వయస్సులోనే బరువైన బాధ్యతలు తలకెత్తుకున్నందువల్ల తాను జీవితంలో దేనిమీద పెద్దగా మమకారం పెంచుకోలేదు.

రేపటి గురించి ఏనాడు ఆలోచించేది కాదు. ఇవాళ మాత్రమే శాశ్వతం అన్న రీతిలో బ్రతికింది.

చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. తాను ఏది దాచుకునేది కాదు. తాను చాలా ధైర్యంగాన్ని ఒప్పుకునేది, చెప్పుకునేది కూడా.

ఆనాటి వాతావరణానికి తాను చాలా ముందు కాలం మనిషి. అదే తన పాలిట చేటయ్యింది. తన మీద రకరకాల వార్తలు ప్రచారం అయ్యేవి.

రౌడీ వరలక్ష్మి అని, పిచ్చి వరలక్ష్మి అని వ్యాఖ్యలు వచ్చేవి. తాను లెక్క చేసేది కాదు.

చివరికి సంసార జీవితంలో కలతలు వచ్చిన కారణంగా కె.యస్.ప్రకాశరావు గారితో విడిపోయి మరో పెళ్లి చేసుకోవడానికి కూడా వెనుకంజ వేయలేదు.

అజిత్ సింగ్ ను మారుమనువు చేసుకుంది. జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కోల్పోయినా తాను చలించేది కాదు.

కుమారుడికి ప్రకాశ్ అకాల మరణం మాత్రం తనను బాగా క్రుంగదీసింది.

తన జీవితంలో ఇది మాత్రం తట్టుకోలేని శోకం. ఛాయాగ్రహకుడి గా, దర్శకుడిగా మంచి స్థాయికి ఎదిగిన తరుణంలో అతను కన్నుమూశాడు. “జీవితం ఓ నదీ ప్రవాహం, ప్రయాణం దాని సహజ లక్షణం”.

జి.వరలక్ష్మి గారి జీవితాన్ని సన్నిహితంగా పరిశీలించిన వారికి జి.వరలక్ష్మి గారు ఈ సూత్రాన్ని ఎంత బలంగా నమ్ముతారో అర్థం అవుతుంది.

Show More
Back to top button