హాస్య బ్రహ్మ జంధ్యాలగారు కామెడీ మూవీస్ తో కూడా బాక్సాఫీస్ హిట్స్ కొట్టవచ్చని మొట్టమొదట నిరూపించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని హాస్య రస చిత్రాలను ఆయన అందించారు. అందులో ఒకటే “అహ నా పెళ్ళంట” సినిమా. అహ నా పెళ్ళంట సినిమాతో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ పీక్స్ కి చేరగా.. బ్రహ్మానందం కెరీర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోని విధంగా మారింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తానని జంధ్యాలగారికి చెప్పగా.. ఆయన ఈ కథ రాజేంద్రప్రసాద్ కి కరెక్ట్ గా కుదురుతుందని చెప్పారు.
ఇక కథానాయికగా రజినిని సెలెక్ట్ చేశారు. హీరో తండ్రిగా నూతన ప్రసాద్ ను తీసుకున్నారు. పిసినారి లక్ష్మీపతి పాత్రకు రావుగోపాలరావుని అనుకున్నారు.. కానీ, చివరకు కోట శ్రీనివాసరావుని సెలెక్ట్ చేశారు. ఇక లక్ష్మీపతి అసిస్టెంట్ పాత్రకు సుత్తివేలుని అనుకోగా.. ఆయన బిజీగా ఉండటంతో బ్రహ్మానందంను సెలెక్ట్ చేశారు.
1987 జూలై 7న హైదరాబాద్ కి సమీపంలోని ఓ గ్రామంలో షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు ఎక్కువ సెట్లు వేయకుండా సహజంగా ఉండేందుకు ఊరిలోన ఇళ్లల్లోనే సీన్స్ తీశారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రజిని అద్భుతంగా నటించారు. అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రగా పిసినారి లక్ష్మీపతి పాత్ర నిలిచింది. నిజంగా పిసినారి అనే పదం వచ్చినట్లయితే చాలామంది ఈ సినిమాలోని కోట శ్రీనివాసరావు చేసిన పాత్రను గుర్తు చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా, అరగుండువాడి పాత్రలో నత్తితో బ్రహ్మానందం చెప్పే సంభాషణలు కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ చిత్రానికి దాదాపు రూ.18 లక్షలు ఖర్చు అయ్యింది. ఈ సినిమా 1987 నవంబర్ 27న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా, అప్పట్లోనే రూ.5 కోట్ల కలెక్షన్లను సాధించింది. హాస్యరస చిత్రాల్లో “అహ నా పెళ్ళంట” సినిమా ముందువరుసలో ఉంటుందని చెప్పవచ్చు.