CINEMATelugu Cinema

భారతీయ వీణా వదనతత్వేగ్న… ఈమని శంకర శాస్త్రి..

వీణ అనేది తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే వీణా సంగీత వాయిద్యము. అలాంటి వీణ, సరస్వతి హస్త భూషణం, కాబట్టి దీనినే సరస్వతి వీణ అని కూడా అంటారు. వీణను ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు. వాస్తవానికి వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము. “అనుమందరం”, “మందరం”, “మందర పంచకం”, “షడ్జమం” అనే నాలుగు తంత్రులపై వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతి తాళాలకు ఉపయుక్తంగా “షడ్జమం”, “పంచమం”, “తారం” అనే మూడు తంత్రులను బిగిస్తారు. వీణ వాయించేటప్పుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చి ఉన్న 24 మెట్లు, దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమ చేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.

వీణానాదం శుభానికి ప్రతీక. వాస్తవానికి వీణ తెలుగునాడులో ప్రకాశించవలసినంతగా  ప్రకాశించలేదనే చెప్పాలి. అటువంటి వీణకు అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లి, వీణానాదానికి వైభవాన్ని తీసుకువచ్చిన మహనీయులు “ఈమని శంకరశాస్త్రి” గారు. వీణ యొక్క ధ్వని స్థాయి తక్కువగా ఉంటుంది. అందువలన వేయి మంది కూర్చున్న సభలో, దూరంలో కూర్చున్నవారు వీణావాదం వినలేకపోయేవారు. ఆ కారణంగా వీణ కచేరీలకు శ్రోతలు అనుకున్న స్థాయిలో హాజరయ్యేవారు కాదు.

ఈమని శంకర శాస్త్రి గారు తన మూడు సంవత్సరాల వయస్సులో వీణ వాయించడంలో ఆసక్తిని కనబరిచారు. వీణ వాయించే నైపుణ్యాన్ని తన తండ్రి అచ్యుతరామ శాస్త్రి మరియు తన తాత సుబ్బరాయశాస్త్రి గారి నుండి పొందారు. శంకర శాస్త్రి గారు తన ప్రస్థానం ప్రారంభమైన తొలినాళ్లలో హిందుస్థానీ మరియు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో పరిచయం పొందే అవకాశం కూడా పొందారు. ఇది సంగీతం పట్ల అతని దృక్పథంలో ఏకీకరణవాదిగా మారేలా చేసింది.

ఈమని గారు తాను నేర్చుకున్న కర్ణాటక సంగీతంలోని కీర్తనలను మాత్రమే వాయించకుడా, లౌకిక ప్రపంచంతో కూడా తన సంగీతాన్ని అనుసంధానించారు. “టెన్సింగ్ నార్కే” ఎవరెస్ట్ అధిరోహించిన వార్తను విన్న శంకరశాస్త్రిగారు, “ఆదర్శ శిఖరారోహణం” అని ఒక సంగీత కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలు, తాము ఎవరెస్టును అధిరోహిస్తున్న అనుభూతిని పొందారు.

వైణిక శిఖామణి, వైణిక శిరోమణి, వీణ గాన గాంధ్రవ, గానరూప కళాసరస్వతి, వీణ వదనతత్వేగ్న, గాంధ్రవ కళానిధి, గానకళాధార, వీణా చక్రవర్తి, వల్లకీ వల్లభ వంటి బిరుదులు పొందిన ఈమని గారు “మహా మహోపాధ్యాయ” బిరుదు కూడా అందుకున్నారు. ఈ బిరుదును ఇది మొదటిసారిగా దక్షిణ భారత సంగీత విద్వాంసుడికి ప్రదానం చేయబడింది.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    ఈమని శంకరశాస్త్రి

ఇతర పేర్లు  :   తెలుగు వీణా శంకరశాస్త్రి

జననం    :     23 సెప్టెంబర్ 1922  

స్వస్థలం   :    ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్

వృత్తి      :    వీణ సంగీత కళాకారుడు

తండ్రి    :   అచ్యుత రామ శాస్త్రి

మరణ కారణం  :  అనారోగ్యం 

మరణం    :   23 డిసెంబర్ 1987

మరణించిన స్థలం   :   గుంటూరు

జననం…

ఈమని శంకర శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో 22 అక్టోబరు 1922 నాడు ప్రసిద్ధ వీణా విధ్వాంసుడు అచ్యుత రామశాస్త్రి గారి ఇంట జన్మించారు. వీరు తమ తండ్రి గారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. పదిహేను యేండ్ల నాటికే వీణ వాదనలో సిద్ధాస్తులైన ఈమని వారు కాకినాడలోని పిఠాపురం మహారాజు కళాశాలలో బి.ఎ.చదివారు. ఈమని గారు వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి గారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిగారిదే. 1938లో కాకినాడ సరస్వతి సభ వారు దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత ఉత్సవాలలో తొలిసారిగా వీణ కచేరి చేసి సభకుల్లోని సంగీత విద్వాంసులను సైతం ముగ్ధులను చేశారు.

గాత్రము..

వీణాపై వేదమంత్రాలు పలికించడంలోనే గాక పలు పాశ్చాత్య స్వరాలను వాయించడంలోనూ ప్రావీణ్యం గడించిన ఈమని శంకర శాస్త్రి గారు నాటి మద్రాసు రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చి పేరుపొందారు. కేవలం తాను నేర్చుకున్న కర్ణాటక సంగీతంలోని కీర్తనలను మాత్రమే వాయించకుడా, లౌకిక ప్రపంచంతో కూడా తన సంగీతాన్ని అనుసంధానించారు. వీణ వాదనలో గాత్ర ధర్మం, వాద్య ధర్మం అనే రెండు శైలులున్నాయి. ఈ రెంటిలో ఈమని వారిది గాత్ర ధర్మం.

వీణపై తాను మానవ కంఠస్వరాలను పలికించేవారు. “ముఖ్యంగా స్త్రీ స్వరాన్ని” ఏ రాగాన్ని వాయించినా దాని కనుగుణమైన గమకాలతో, శాస్త్రీయతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా రాగ హృదయాన్ని ఆవిష్కరించేవారు.

ముఖ్యంగా తోడి రాగం, శంకరాభరణం రాగాలను వయించడంలో తనది అందివేసిన చేయి.

హిందుస్తానీ సంగీతంతో బాటు పాశ్చాత్య సంగీతాన్ని సైతం ఆకళింపు చేసుకొని తనదైన వినూత్న వైణికశైలిని తాను సమకూర్చుకున్నారు.

సినీ ప్రస్థానం…

ఈమని శంకర శాస్త్రి గారు 1942 – 50 మధ్యలో మద్రాసులో గల జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావు గారికి సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశారు. ఆ సమయంలోనే చిట్టిబాబు తనకు శిష్యుడయ్యాడు. పి.బి.శ్రీనివాస్‌ను సినీ గాయకునిగా పరిచయం చేసింది కూడా శాస్త్రి గారే. 1951లో పి.బి.శ్రీనివాస్‌ ను పరిచయం చేశారు. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకునిగా తాను నిలబడగలగటానికి కారణం తనలోని ఆధునికతే. 1953 ప్రాంతాల్లో శంకరశాస్త్రి గారు జెమినీలో అనేక సినిమాలకు పనిచేశారు. “సీతారామకల్యాణం” చిత్రంలో రావణుడు వీణవాయించే ఘట్టంలో, ప్లేబ్యాక్‌లో శంకరశాస్త్రి గారు వీణ వాయించారు. “వెంకటేశ్వర మహాత్యం” చిత్రంలో తాను వాచస్పతి రాగంలో వీణ వాయించారు.

ఆకాశవాణి లో డైరెక్టర్ గా నియామకం…

ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో శాస్త్రీయ సంగీతానికి డైరెక్టర్ గా నియమితులైన శాస్త్రి గారు ఆ తర్వాత కర్ణాటక సంగీత విభాగానికి చీఫ్ ప్రొడ్యూసర్ అయ్యారు. 1960 వ సంవత్సరంలో ఫిలిమ్స్ డివిజన్ వారు రూపొందించిన “జుగల్ బందీ” డాక్యుమెంటరీలో కర్ణాటక సంగీతానికి ఈమని వారు వీణలో, హిందుస్థానీ కి సితారుతో “భారతరత్న” పండిట్ రవిశంకర్ గారు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఈమని శంకర శాస్త్రి గారు భరతుడు నాట్య శాస్త్రం నుండి, సంగీత రత్నాకరం నుండి గమకాలను గురించిన శ్లోకాలతో వివరిస్తూ వీణపై పలికించిన శైలి అనితర సామాన్యం.

తీగెల మీద డబుల్ మీటు…

తన కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ, వీణా మీద అవే సంగతులు పలికించేవారు.

మంత్రపుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు, “ప్రజా” వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా రెండు తీగెల మీద డబుల్ మీటు వేసేవారు ఈమని గారు.

ఇక సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఈమని గారు తీగెలను కుడిచేత్తో మీటే పద్ధతి గొప్పగా ఉండేది. చేతి స్థానాన్ని నాలుగైదు రకాలుగా మార్చేవారు. అది అనితరసాధ్యం.

మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ, మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో వీణను వాయించేవారు.

రాగ స్వభావాన్ని గంభీరంగా, హుందాగా వినిపించడంలో తనకు తానే సాటి.

ఈమని గారు తాను పూర్తిగా సంగీతంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించకుండానే వారిని కూడా సంగీతంలో ఓలలాడించేవారు.

ఆదర్శశిఖరారోహణ పై ప్రయోగం..

ఈమని శంకర శాస్త్రి గారు వీణా వాదనలో ఎంత వైవిధ్యాన్ని చూపాలో, అంత వైవిధ్యాన్ని సృజించారు. వీణను ఒక్కోసారి సితారగా, మరోసారి సరోద్ గా, ఇంకోసారి గిటార్ గా, ఒక్కొక్కసారి గోటు వాద్యంగా, ఇంకా చెప్పాలంటే తంత్రీ వాద్యాల వ్యక్తిత్వాల నన్నిటిని తన వీణలో ప్రతిబింబించిన ప్రతిభా సంపన్నులు ఈమని గారు. మరొక విశేషమేమిటంటే ఎవరికీ సాధ్యం కానీ లౌకిక సంఘటనలను వీణవాదంలోకి అనువదించారు. “టెెన్సింగ్ నార్కే” ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడనే వార్తకు స్పందించి “ఆదర్శశిఖరారోహణ” అనే కంపోజింగ్స్ ను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు.

ఇలాంటిదే వీరు రూపొందించిన “భ్రమరగీతం” అనే సంగీత రచనం. ఇలా శాస్త్రి గారు తమ జీవితంలో వందలాది ప్రయోగాలు చేశారు. అవన్నీ వీణా వాదన సంప్రదాయంలో అనుసరణీయాలుగా నిలిచిపోయినవి. భారతీయ సంగీతంలో, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో గమకాలను స్పష్టంగా నిర్వహించిన వైణికుడు ఈమని. శాస్త్ర గ్రంథాల్లో పేర్కొన్న “పంచదశ గమకాలు”, దశవిధ గమకాల స్వరూప స్వభావాలను నిశితంగా అధ్యయనం చేశారు. కచేరిలలో ప్రసంగాలలో తన అధ్యయన తత్పరత వ్యక్తం అయ్యేది. 1954లో సుప్రసిద్ధ సితార్ విధ్వాంసులు పండిట్ రవిశంకర్ గారితో కలిసి చేసిన జుగల్బందీ తన సంగీత జీవితంలో ఒక మైలురాయి వంటిది.

గురువును మించిన శిష్యుడు “చిట్టిబాబు”…

ఈమని శంకర శాస్త్రి గారి శిశ్యరికంలో ఎందరో వీణావాదనలో నిష్ణాతులై విద్వాంసులైనారు. వీరిలో ముఖ్యులు “చిట్టిబాబు”. ఇతడు గురువును మించిన శిష్యుడుగా ఎదిగాడు.

చివరి రోజుల్లో చిట్టిబాబు ప్రభృత్తులు ఈమని వారికి గుంటూరులో కనకాభిషేకం చేశారు. శంకర శాస్త్రి గారు దేశ దేశాల్లో కచేరీలు చేశారు.

వయోలిన్ మాస్ట్రో, యాహుది మెనుహిన్ చే ప్రశంసలు అందుకున్నారు. శంకరాభరణ రాగానికి జగద్విఖ్యాతి తెచ్చిపెట్టారు.

ఒకానొక సందర్భంలో సి.మేజర్ తో సమానుడు అనిపించుకున్న ఈమని గారు “ప్రిన్స్ ఇటాలియ ఇంటర్నేషనల్” పురస్కారం అందుకున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈమని గారిని “కళా ప్రపూర్ణ”తో సన్మానించగా, భారత ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది.

ఢిల్లీ అఖిల భారత గాంధర్వ మండలి వారు “మహా మహోపాధ్యాయ” బిరుదుతో సత్కరించారు.

ఈ బిరుదాన్ని పొందిన దక్షిణ భారతీయుల్లో ఈమని గారే మొదటివారు.

నిష్క్రమణం…

ఈమని గారికి విమానం ఎక్కడమంటే చాలా భయం. అందువల్ల తనకు ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు.

చివరికి 1970వ దశకంలో ఫ్రాన్స్ వెళ్లి కచేరీలు చేశారు. అక్కడివారు ఎంతో సంబరపడ్డారు. “కాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీ” అని పత్రికలు ఈమని గారిని ప్రశంసించాయి. తనకు “ఆసియన్ రోస్ట్రం పురస్కారం” అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

ఈమని వారు చివరిసారిగా గుంటూరులో నాలుగున్నర గంటల పాటు వీణ కచేరి చేశారు. తదనంతరం 23 డిసెంబర్ 1986 నాడు “సర్కార్ ఎక్స్ ప్రెస్” లో మద్రాసు ప్రయాణమై రైలులోనే నిద్రలో అంతిమ శ్వాస విడిచారు. ఆరోజు సంగీత కచేరి వేదికలపై ఎక్కడో మూలన ఉన్న వీణను సోలో వాద్య పరికరంగా “సెంటర్ ఆఫ్ స్టేజికి” తీసుకువచ్చిన వైనిక స్వర వైతాళికులు ఈమని శంకర శాస్త్రి గారు.

Show More
Back to top button