CINEMATelugu Cinema

తెలుగు వెండితెర పై విలక్షణ హాస్యనటులు.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం..

ళాశాలలో కథానాయకుడు బృందానికి అత్యవసరంగా ధర్మవరపు ఒక చాదస్తపు ప్రిన్సిపాల్ కావాలి. ఆ పాత్రకి నప్పేది ఎవరు? నేను చాలా స్ట్రిక్ట్ అని బిల్డప్ ఇస్తూనే సరదాగా నవ్వులు పండించే ఒక యస్సై కావాలి. “మేం అసలే లెక్కల్లో వీక్‌ బాబూ”.. అంటూ విద్యార్థులకు తెలియకుండా చేతి మీద పాఠాన్ని కాపీ కొట్టుకొచ్చే ఒక లెక్చరర్ కావాలి, “నీది తెనాలే.. మాది తెనాలే”.. అంటూ తెలుగు రాష్ట్రం నుండి వచ్చిన భక్తులను బురిడీ కొట్టించే ఒక ప్రాంతీయ తెలుగువాడు కావాలి.

“ఆకాశం నీలిరంగులో ఉంది”, “ఇలాంటి పేస్ట్‌ ఉన్న ఊళ్లో ఎందుకు దొరకదు” బ్రదరూ.. అంటూ వెండితెరపై హాస్యపు జల్లుల్ని కురిపించే పాత్రలు చేసి తెలుగు వారిని మెప్పించడానికి ఒక హాస్యపు పాత్రలకు ఎవరు సరిపోతారు. ఇంకెవరు మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారే గుర్తొస్తారు. తాను సంభాషణలు చెబుతూనే చివరన అమ్మా అని దీర్ఘం తీస్తారు. ప్రేక్షకుడి మొహాల్లో చటక్కున నవ్వులు పండిస్తారు. “అంతలేదు బాబూ” అంటూ చిన్నపాటి హావాభావాలు ప్రదర్శిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బోలెడంత మంది హాస్యనటులున్నారు. అంతమంది హాస్య నటులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న “ధర్మవరపు సుబ్రహ్మణ్యం” గారి మాటలు, హావాభావాలు తనకు మాత్రమే సొంతం.

వామపక్ష భావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గారు గతంలో ప్రజా నాట్యమండలి తరపున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్ లో ప్రసారమైన “ఆనందోబ్రహ్మ” ద్వారా మంచి గుర్తింపు పొందారు. సుత్తి వీరభద్ర రావు గారి మరణంతో జంధ్యాల గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచుకున్న సుబ్రహ్మణ్యం గారు 1989లో తొలిసారిగా “జయమ్ము నిశ్చయమ్మురా ” లో తొలిసారిగా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హాస్య నటుడిగా పరిచయమై మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా పెద్దగా కష్టపడకుండా బాడీ లాంగ్వేజ్‌, మేనరిజంతో అలరించడం సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత.  ముఖ్యంగా లెక్చరర్‌ పాత్రల్లో ఆయన పంచిన నవ్వుల్ని అంత సులువుగా మనం మరిచిపోగలమా?

వెండితెర పై “ధర్మవరపు సుబ్రహ్మణ్యం” గారు కనిపించగానే ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. తాను నటించిన ప్రతీ చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు నవ్వులు పూయించారు. తన నవ్వుల నటనకు నంది పురస్కారాలు లభించాయి. బుల్లితెరపైనా తన సంతకం చేస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. “తోకలేని పిట్ట”తో దర్శకునిగానూ మారి తాను చిత్రీకరించిన చిత్రంతో నవ్వులు తెప్పించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘానికి అధ్యక్షునిగానూ వ్యవహరించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు “శోభన్ బాబు రింగు” అంటూ నుదుటన జుత్తును రింగులా చేసుకొని తాను అభినయించిన హాస్యపు పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    ధర్మవరపు సుబ్రహ్మణ్యం

జననం    :     20 సెప్టెంబరు 1954  

స్వస్థలం   :    కొమ్మినేనివారి పాలెం, బల్లికురవ మండలం, ప్రకాశం జిల్లా

వృత్తి      :    నటుడు, వ్యాఖ్యాత, దర్శకుడు

జీవిత భాగస్వామి    :    కృష్ణజ

పిల్లలు   :      సందీప్, రవిబ్రహ్మతేజ

మరణ కారణం  :  తీవ్ర అనారోగ్యం 

మరణం    :   07 డిసెంబరు 213, హైదరాబాదు

నేపథ్యం…

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ప్రకాశం జిల్లాలోని అద్దంకి కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో 20 సెప్టెంబరు 1954 లో జన్మించారు. సుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు తన చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. దాంతో నలుగురు పిల్లలను తన తల్లి గారే పెంచి పెద్ద చేశారు. వ్యవసాయం కుటుంబంలో పుట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి బాల్యం మొత్తం స్వగ్రామంలోనే గడిచింది. వీరి వంశీకులు రెడ్డి రాజుల దగ్గర మంత్రులుగా ఉంటూ వచ్చారు. అప్పటినుంచి లలిత కళలు వారి వంశంలో తరతరాలుగా వస్తూ వుండేవి. సుబ్రహ్మణ్యం గారి నాన్న గారు పద్యాలు బాగా పాడేవారు. నాటకాలు వేసేవారు. సుబ్రహ్మణ్యం గారి అన్నయ్య చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళు. సుబ్రహ్మణ్యం గారు మొదటి నుంచి చదువు మీద అంతగా శ్రద్ధ పెట్టేవారు కాదు. స్కూల్లో పాఠం వినేవారు తప్ప ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టేవారు కాదు.

విద్యాభ్యాసం…

అప్పట్లో పదవతరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ కొత్తగా పెట్టారు. వారి పాఠశాల నుండి పదవతరగతి ఉత్తీర్ణులైన అయిదుగురిలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒకరు. తన ద్రుష్టి చదువు మీద కన్నా కూడా నాటకాల మీద ఉండేది. తాను ఏడవ తరగతిలో ఉండగా వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులు “దొంగ వీరడు” నాటకం వేశారు. అందులో చిన్నపిల్లవాడి పాత్ర ఉంటే ధర్మవరపు బాగా ఉత్సాహంగా ఉన్నాడని తన చేత పిల్లవాడి పాత్ర వేయించారు. అప్పటి నుండి ఊళ్లో ప్రతి సంవత్సరం రెండు, మూడు నాటకాలు వేస్తుండేవారు. వాటికోసం ఇంటిలో డబ్బులు అడిగి తీసుకునేవారు. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉన్నా కూడా నాటకాలు వేస్తే కానీ వారికి తృప్తి ఉండేది కాదు.

ఉన్నత పాఠశాల విద్యను అద్దంకిలో అభ్యసించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, కళాశాల చదువు ఒంగోలులో గల సి.ఎస్.ఆర్.శర్మ కళాశాల లోనూ చదివారు.

అక్కడ తనకు ప్రజానాట్యమండలి నల్లూరి వెంకటేశ్వర రావు గారితో పరిచయం ఏర్పడింది.

వెంకటేశ్వర రావు గారి కొడుకులలో ఒకరిగా సుబ్రహ్మణ్యం గారు పెరిగారు.

అక్కడే తినడం, అక్కడే ఉండడం, కళాశాలకు వెళ్ళుతుండేవారు తప్ప పాఠాలు వినేవారు కాదు. ఎప్పుడూ వారికి నాటకాల గొడవనే.

కళాశాలలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సుబ్రహ్మణ్యం గారు జాయింట్ సెక్రటరీ గా ఉండేవారు, ఇసుకపల్లి మోహనరావు గారు సెక్రటరీగా ఉండేవారు.

నాటకాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులు కాలేదు.

ఇది తెలిసిన వాళ్ళ అమ్మ గారు చాలా బాధపడ్డారు. దాంతో మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులయ్యారు.

ఆ తరువాత బీకాంలో చేరారు. కానీ తన మనసు మొత్తం సినిమాల వైపే ఉండేది. తన ఇంట్లో వాళ్లకు చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయారు.

అక్కడ సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ తన సొంత ఊరుకు తిరిగివచ్చి వ్యవసాయం పనులలో మునిగిపోయారు.

ఉద్యోగంలో చేరిక…

ఒకసారి అద్దంకిలో సుబ్రహ్మణ్యం గారి స్నేహితులంతా “పబ్లిక్ సర్వీస్ కమిషన్” పరీక్షకు దరఖాస్తు చేసుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం గారికి దానిపై ఆసక్తి లేదు.

కానీ తన మిత్రులే దరఖాస్తు తీసుకొచ్చి వాళ్లే పూర్తి చేసి సంతకం పెట్టించి పంపించారు. గుంటూరులో పరీక్షలు వ్రాశారు.

గమ్మత్తేమిటంటే తనతో పాటు పరీక్ష వ్రాసినవారంతా పరీక్షలో ఫెయిల్ అయితే, సుబ్రహ్మణ్యం గారు మాత్రమే పాస్ అయ్యారు.

హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో శిక్షణ, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో పంచాయితీ రాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగంలో చేరారు.

చదువు ఎంత శ్రద్ధగా చదివేవారో ఉద్యోగం కూడా అంత శ్రద్ధగానే చేశారు.

మెల్లగా రేడియోలో ప్రవేశించారు. రేడియోకి తన గొంతు ఇవ్వడం, నాటకాలు, చిన్న చిన్న నాటికలు వ్రాయడం. ఇలా తన ప్రస్థానం మొదలుపెట్టారు.

అలా తన మనస్సును రచనల మీదికి మల్లించి 1984 – 1985లో మొదటిసారి “అనగనగా శోభ” సీరియల్ వ్రాశారు.

నాటక రంగం..

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి “ప్రజానాట్యమండలి” తో అనుబంధం ఉంది. నల్లూరి వెంకటేశ్వరరావు శిష్యుడి గా ప్రజా సమస్యలపై కళాకారులతో కలిసి నాటకాలు వేసేవారు. తాను పాఠశాల రోజులలోనే నాటకాల ద్వారా ఉపాధ్యాయులను, స్నేహితులను అలరించారు. ఉద్యోగ నిమిత్తం హైదరాబాదుకు వచ్చినా కూడా సినిమా నటుడు కావాలనే లక్ష్యంతో అడుగులు సుబ్రహ్మణ్యం గారు అడుగులు వేశారు. మొదట ఆల్ ఇండియా రేడియోకి పరిచయమయ్యారు. ఆ తర్వాతే దూరదర్శన్ లో కనిపించారు.

దూరదర్శన్ లో తన ప్రస్థానం రచయితగా, నటుడుగా, సుదీర్ఘకాలం సాగింది. దూరదర్శన్ డి.డి లో ప్రసారమైన మొట్టమొదటి సీరియల్ “అనగనగా ఒక శోభ” రచయిత సుబ్రహ్మణ్యం గారే. దూరదర్శన్ కు తాను ఐదు సీరియల్స్ అందించారు. ఇలా కళాకారుడుగా బిజీ అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. దూరదర్శన్ ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు దర్శకులు జంధ్యాల దృష్టిలో పడ్డారు. “జయమ్ము నిశ్చయమ్మురా” అంటూ వెండితెరపై వెనుతిరిగి చూడకుండా ముందుకు కదిలారు.

సినీ ప్రస్థానం…

జంధ్యాల గారి వల్లనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి సినిమా రంగ ప్రవేశం జరిగింది. జంధ్యాల, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గార్ల మధ్య ఎప్పటినుండో పరిచయం ఉంది. అలాగే సుబ్రహ్మణ్యం గారంటే జంధ్యాల గారికి అభిమానం కూడా వుంది. హాస్యానికి ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చే జంధ్యాల గారు సుబ్రహ్మణ్యం గారి మాట విరుపు గానీ, తాను సంభాషణలు చెప్పే విధానం గాని, తన ఆహార్యం గాని జంధ్యాల గారికి బాగా నచ్చేది. దాంతో జంధ్యాల గారు సుబ్రహ్మణ్యం గారిని సినిమాలు చేయండి అంటుండేవారు. సందర్భం వస్తే చేద్దాం అంటుండే వారు సుబ్రహ్మణ్యం గారు.

సుత్తి వీరభద్ర రావు గారు చనిపోవడంతో “జయంబు నిశ్చయమ్మురా” సినిమా చిత్రీకరణ సమయంలో తన కోసం కోసం తయారు చేసిన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అని అనుకొని సుబ్రహ్మణ్యం గారిని మద్రాసుకు పిలిపించి ఆ పాత్రను సుబ్రహ్మణ్యం గారితో వేయించారు. ఆ తరువాత జంధ్యాల గారు తీసే ప్రతీ సినిమాలోనూ జంధ్యాల గారికి అవకాశం ఇవ్వడం, సుబ్రహ్మణ్యం గారు నటిస్తుండడం జరిగేది. విశ్వనాథ్ గారి “స్వాతికిరణం”, బాపు గారి “పెళ్లి పుస్తకం”, “మిస్టర్ పెళ్ళాం”, “పెళ్ళికొడుకు” అలాగే కె.వాసు గారు, రేలంగి నరసింహారావు గారు లాంటి దర్శకులు మంచి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు.

తేజ గారు “నువ్వు నేను” సినిమా తీయడానికి ముందు ఫ్యామిలీ సర్కస్ తీశారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి మీ హాస్యం అంటే నాకు చాలా ఇష్టం. ఫ్యామిలీ సర్కస్ మీకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. “నువ్వు నేను” వాణిజ్య పరంగా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నిజం అని అన్నారు. అన్నట్టుగానే “నువ్వు నేను” చిత్రం సుబ్రహ్మణ్యం గారికి కమర్షియల్ గా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆ చిత్రంలో సుబ్రహ్మణ్యం గారు ఉపయోగించిన శోభన్ బాబు రింగు జుట్టు, తాను ఉపయోగించిన “అవును బాబు” అనే సంభాషణల వ్యవహార శైలి ప్రేక్షకులు బాగా నచ్చేశారు.

అలా జంధ్యాల గారి దర్శకత్వంలో “జయమ్ము నిశ్చయంబురా” చిత్రంతో నటనను ప్రారంభించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు “బావ బావ పన్నీరు”, “పెళ్లి పుస్తకం”, “స్వాతికిరణం”, “నువ్వు నేను”, “ఫ్యామిలీ సర్కస్”, “పెళ్ళికొడుకు”, “నువ్వే కావాలి”, “ఆజాద్”, “వర్షం”, “వెంకి”, “నువ్వు వస్తానంటే నేనొద్దంటానా”, “స్టైల్”, “అతడు”, “రణం”, “రెడీ”, “ఖలేజా”, “దూకుడు”, “మడత కాజా”, “దేనికైనా రెడీ”, “జూలాయి”  లాంటి సుమారు 200 పైగా చిత్రాలలో తనదైన హాస్యం పండించారు.

వీరభద్రరావు గారి మరణంతో “జయమ్ము నిశ్చయమురా” చిత్రంతో తెలుగు సినిమా తెరంగ్రేటం చేసిన “ధర్మవరపు సుబ్రహ్మణ్యం” గారు దర్శకులు తేజ గారితో సహా నవతరం దర్శకులు అనేకమంది ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో తమ చిత్రాల్లో నవ్వులు పండించారు. “మిస్టర్ పెళ్ళాం” లో ఏ.వీ.ఎస్ ను విపరీతంగా పొగిడే అసిస్టెంట్ గా, “ఒక్కడు” లో సెల్ ఫోన్ నెంబర్ వింతైన మాడినేషన్ చెప్పే పాస్ పోర్ట్ అధికారి గా, “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” లో నృత్య శిక్షకుడిగా, “మన్మథుడు” లో సీక్రెట్ మైకులు అమ్మే ఏజెంట్ గా, “చిరుత” లో హీరోయిన్ ను “పాప పాప” అంటూ ముద్దు చేసే సహాయకుడిగా ఇలా ఒక్కటేమిటి “ధర్మవరపు సుబ్రహ్మణ్యం” గారు పోషించిన ప్రతీ పాత్ర నవ్వులకు చిరునామా.

“నువ్వు నేను” లో శోభన్ బాబు రింగు జుట్టుతో గైడ్ ను వాడుకునే లెక్చరర్ గా ఆయన కడుపుబ్బ నవ్వించారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కేవలం నటుడు మాత్రమే కాదు.

రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడానూ. నరేష్ గారు హీరోగా నటించిన “తోకలేని పిట్ట” అనే చిత్రానికి తాను దర్శకత్వం కూడా వహించారు. సంగీతం కూడా అందించారు.

తాను కథానాయకుడుగా “ఒక తుపాకీ మూడు పిట్టలు” అనే సినిమా ప్రారంభమైనప్పటికీ పూర్తికాలేదు.

తాను చివరిసారిగా “కెవ్వుకేక” అనే సినిమాలో వెండితెర పై కనిపించారు.

అలాగే తాను చివరిసారిగా “ప్రేమా గీమా జాంతానై” అనే సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు.

ఆ సినిమా చిత్రీకరణ నడుస్తుండగానే తాను అస్వస్థకు గురయ్యారు. దాంతో తన పాత్రను మరొకరికి అప్పగించారు.

వైవాహిక జీవితం…

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నలుగురు అన్నదమ్ముల్లో ఒకరు. తనది ప్రకాశం జిల్లా కొమ్మినేని వారి పాలెం. కృష్ణజ ఆరుగురు తోబుట్టువులలో ఒకరు.

ఆమెది గుంటూరు. వీరిరువురు వరుసకు బావ మరదళ్లు. వీరిద్దరి పెళ్లి చిన్ననాటి నుంచి అనుకున్న సంబంధమే.

పెళ్లినాటికి ఇద్దరు పట్టభద్రులు. అబ్బాయికి నాటకాలు అంటే ప్రాణం, అమ్మాయికి సంగీతంలో ప్రవీణ.

పెద్దల ఆశీస్సులతో 11 ఏప్రిల్ 1976 లో వివాహంతో ఒక్కటయ్యారు. ఉద్యోగరీత్యా హైదరాబాదు లోని సరూర్ నగర్ లో కాపురం పెట్టారు.

సుబ్రహ్మణ్యం గారు ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి, తనకు ప్రాణమైన నాటకం నుండి రేడియోకి, అటు నుంచి టీవీ మీదుగా రెండు తెరలకు పరిచయమయ్యారు.

సుబ్రహ్మణ్యం, కృష్ణజ దంపతులకు ఇద్దరు కుమారులు “రోహన్ సందీప్”, “రవి బ్రహ్మతేజ” ఉన్నారు.

1979 వ సంవత్సరంలో దిల్‌ సుఖ్ నగర్ లోని శారదానగర్ లో సుబ్రహ్మణ్యం గారు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

పెద్ద కుమారుడు సందీప్ వ్యాపార రంగంలో స్థిర పడగా, చిన్న కుమారుడు రవిబ్రహ్మ తేజ చదువుకునేవారు.

నిష్క్రమణం…

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నిజానికి రెండు పర్యాయాలు చావు నుండి బయటపడ్డారు.

మొదటిసారి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో  తన కారును బస్సు ఇవతల వైపు నుంచి ఎక్కేసి అవతల వైపుకు దిగింది. ఆ సమయంలో కారు చాలా వరకు దెబ్బతిన్నది.

ఆ సమయంలో వెల్డింగ్ పని చేసే వ్యక్తి అటుగా వెళుతూ ఆగారు. కారు పై భాగాన్ని కత్తిరించి సుబ్రహ్మణ్యం గారిని పైకి లాగారు.

కామినేనిలో చేతికి మరియు తలకి శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ ప్రమాదం నుంచి తాను నిదానంగా కోలుకున్నారు.

రెండవ సారి బెంగళూరు సమీపంలోని ఒక అటవీప్రాంతంలో చిత్రీకరణ జరిగింది.

ఆ తరువాత తన గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటికి రాలేదు. వెళ్లి చూస్తే మంచంపై పడిపోయి ఉన్నారు. స్పృహలో లేరు. దీంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

అటవి లో ఏదో కీటకం కుట్టడం వల్ల అలా జరిగిందని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో తాను పది రోజులు కోమాలో ఉన్నారు.

చివరిసారి గా 2012లో సుబ్రహ్మణ్యం గారికి ఆరోగ్యం పాడైన‌ప్పుడు పరీక్షలు చేసిన వైద్యులు “కాలేయ క్యాన్స‌ర్” నాలుగో దశలో వుంది కనుక 11 నెల‌ల కంటే ఎక్కువ బ్రత‌క‌లేర‌ని చెప్పారు. అప్ప‌టి నుండి తాను ఇంటికే ప‌రిమితం అయ్యారు. చివరిగా  07 డిసెంబర్‌ 2013 నాడు తన 59 ఏళ్ల వయస్సులో కాలేయ కేన్సర్‌తో సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఉన్న “గీత ఆసుపత్రి లో మరణించారు.

Show More
Back to top button