ఆ రోజులలో రంగస్థలం నటీనటులకు ఎవరి ప్రత్యేకత వారికి ఉండేది. ఆ రోజుల్లో పౌరాణిక నాటకాలు ఎక్కువ కాబట్టి పౌరాణిక నాటకాలలో పద్యాలు నటీనటులందరికీ తప్పకుండా అభ్యాసం అయ్యి ఉండాలి. కొంతమంది నటులు పద్యం పాడడానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎంత సుదీర్ఘంగా రాగం తీసి పద్యం పాడితే అన్ని సార్లు వన్స్ మోర్ లు వచ్చేవి. మరికొందరు నటులు పద్యాన్ని పాడడం కంటే కూడా దానిలో అర్ధానికి ప్రాధాన్యతనిచ్చి పద్యంలోని పదాలను విడమరచి పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఎక్కడ పదాలను విడగొట్టాలో, ఎక్కడ ఏకధాటిగా పాడాలో అభ్యసించి, పద్యాలతో పాటు సంభాషణలకు కూడా ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ కోవకు చెందిన వారే మాధవపెద్ది వెంకటరామయ్య గారు.
రంగస్థలం మీద ప్రదర్శనలిచ్చి పేరు గడించిన నటులు మాధవపెద్ది గోఖలే తండ్రిగారు, మాధవపెద్ది వెంకటరామయ్య గారు అన్నదమ్ముల పిల్లలు. మాధవపెద్ది వంశంలో కళారంగంలో పేరు తెచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి మాధవపెద్ది వెంకటరామయ్య గారు. తాను ధరించిన పాత్రల మూలాలను అర్థం చేసుకొని, ఆ పాత్రలోని ఔచిత్యాన్ని ప్రతిబింబించేలా నటించడం కూడా మాధవపెద్ది వెంకటరామయ్య గారి ప్రత్యేకత. తాను ధరించిన పాత్రలను చూసి ఇతర నటీనటులు తమను అనుకరించేలా ప్రభావం కలిగించిన ఆ తరం నటీనటులలో ఒకరు మాధవపెద్ది వెంకటరామయ్య గారు.
మాధవపెద్ది వెంకటరామయ్య గారు తనకు ఫలానా పాత్ర కావాలని అడగకుండా ఏ పాత్ర ఇచ్చిన ధరించేవారు. తాను ధరించిన పాత్రకు నూరు శాతానికి మించి న్యాయం చేకూరుస్తుండేవారు. అందుకే మాధవపెద్ది వెంకటరామయ్య గారు అనగానే ఒక దుర్యోధనుడు, ఒక శ్రీకృష్ణుడు మాత్రమే కాదు తాను ధరించిన అన్ని పాత్రలు గుర్తుకు వస్తాయి. వాటిల్లో “రోషనారా” లో శివాజీ లాంటి నాయక పాత్రలు, “పాండవోద్యోగ విజయం” లో దుర్యోధనుడు లాంటి ప్రతినాయక పాత్రలు లాంటి ముఖ్యపాత్రలు కూడా ఉన్నాయి.
ఆనాటి మిగతా నటులలో చాలా తక్కువ మంది చేపట్టిన కార్యక్రమం తమ శిష్యులను తయారుచేయడం. మాధవపెద్ది వెంకటరామయ్య గారు ఆ విషయంలో ముందు వరుసలో ఉంటారు. ఎవరైనా ఔత్సాహిక నాటక బృందం నాటకాలు వేస్తుందని తనకు తెలిస్తే ఆయన స్వయంగా వెళ్లి వారికి నటనలో మెలకువలు నేర్పేటటువంటి పనులు స్వచ్ఛందంగా చేస్తుండేవారు. అప్పటికి తాను ప్రముఖ నటుడు అయినా కూడా ఎంత చిన్న నటుడికైనా శిక్షణ ఇవ్వడానికి ముందుండేవారు. మాధవపెద్ది వెంకటరామయ్య గారు 1920 నుండి మూడు దశాబ్దాలకు పైగా రంగస్థలంలో వివిధ పాత్రలు పోషించారు, 1936 – 40 సంవత్సరాలలో నాలుగు సినిమాలలో కూడా నటించారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : మాధవపెద్ది వెంకటరామయ్య
ఇతర పేర్లు : మాధవపెద్ది వెంకటరామయ్య
జననం : 1898
స్వస్థలం : బ్రాహ్మణ కోడూరు , గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
పిల్లలు : మొహియుద్దీన్, కృష్ణవేణమ్మ.
వృత్తి : రంగస్థలం నటుడు, సినీ నటుడు
బిరుదు : కళాశీలి, రసజ్ఞుడు, పరోపకార పరాయణుడు, అమృత హృదయుడు..
మరణ కారణం : అనారోగ్యం (పక్షవాతం)
మరణం : 19 మార్చి 1952, తెనాలి, గుంటూరు జిల్లా
నేపథ్యం…
గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది వెంకటరామయ్య గారు 1898లో జన్మించారు. ఆ రోజులలో ఆ గ్రామంలో పండితులు ఎక్కువగా ఉండేవారు. ఆ పండితులు కూడా ఎక్కువ మంది మాధవపెద్ది వంశంలోనే ఉండేవారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం బ్రాహ్మణ కోడూరు లో పూర్తయ్యాక తెనాలిలో జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశారు. ఆ తరువాత “బందరు” వెళ్లి మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి సర్టిఫికెట్ పొందారు. మాధవపెద్ది వెంకటరామయ్య గారు కొన్ని రోజులు తెనాలిలో మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉద్యోగం కూడా చేశారు.
అలా ఉద్యోగం చేసుకుంటుండగా ఒకసారి తెనాలిలో జరిగిన “పూర్వపు విద్యార్థుల సమ్మేళనం” లో ఒక నాటకం ప్రదర్శించినప్పుడు అందులో సహదేవుని పాత్ర పోషించారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు. అప్పటి నుండి తనకు నాటకాలు అంటే విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఆ రోజులలో చాలా మంది నాటకాల ప్రదర్శనకు పూర్తి కాలవ్యాపకం చేసుకునేవారు. కేవలం నాటక ప్రదర్శనలతోనే వారి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. తన ఉద్యోగం వదిలేసి మాదపెద్ది వెంకట్రామయ్య గారు కూడా ఆ నాటక ప్రదర్శన తర్వాత నాటకాన్నే పూర్తికాల వ్యాపకంగా చేసుకుందామనుకున్నారు.
“రామ విలాస సభ”…
ఆ రోజులలో 1920 – 21 ప్రాంతాలలో తెనాలిలో “భాగవతుల రాజగోపాలం”, “త్రిపురారవట్ల వీర రాఘవస్వామి” అనే వాళ్ళిద్దరూ “రామ విలాస సభ” అనే నాటక సంస్థను ప్రారంభించారు. అప్పట్లో నాటక ప్రదర్శన సంస్థ అంటే ఇప్పటి సినిమా నిర్మాణ సంస్థలాగా ఉండేది. నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు వీరంతా కూడా ఆ నాటక ప్రదర్శన సంస్థల్లో ముఖ్యమైన సభ్యులుగా ఉండేవారు. అలాగే కొత్త నటీనటులకు శిక్షణ కూడా ఇచ్చేవారు. బాల నటులు ఉంటే వారి చదువులు కూడా ఈ నాటక ప్రదర్శన సంస్థ వారే చూసుకుంటూ ఉండేవారు, వారికి చదువులు చెప్పిస్తుండేవారు. ఆ రోజులలో తెనాలిలో ప్రారంభమైన “రామ విలాస సభ” లో నటించి పేరు తెచ్చుకున్న వారిలో “పెద్దిబొట్ల చలపతి రావు” గారు, “స్థానం నరసింహారావు” గారు, “గోవిందరాజుల సుబ్బారావు” గారు, “పులిపాటి వెంకటేశ్వర్లు” గారు, “పిల్లలమర్రి సుందర రామయ్య” గారు, “ఈలేశ్వరపు కుటుంబ శాస్త్రి” గారు వీరంతా ఉన్నారు. వారితో మాధవపెద్ది వెంకటరామయ్య గారు కూడా కలిసి నటించేవారు.
నాటక సంస్థకు ఖ్యాతి తెచ్చిన స్థానం నరసింహారావు…
“రామ విలాస సభ” లో దర్శకులు “త్రిపురారవట్ల వీరరాఘవ స్వామి” గారికి ప్రియ శిష్యుడు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు. ఓ మాదిరిగా నడుస్తున్న “రామ విలాస సభ” స్థానం నరసింహారావు గారు “స్త్రీ” పాత్రలు ధరించడం మొదలుపెట్టాక “రామ విలాస సభ” నాటక సంస్థ యొక్క ఖ్యాతి ఆంధ్రదేశం అంతటా వ్యాపించడం మొదలుపెట్టింది. “రామ విలాస సభ” వారు ఆంధ్రదేశమంతటా తిరిగి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. అలా ఇచ్చే ప్రదర్శనలలో ఎక్కువగా వినిపించే పేర్లు “స్థానం నరసింహారావు”, “పులిపాటి వెంకటేశ్వర్లు”, “మాధవపెద్ది వెంకటరామయ్య”. “మాధవపెద్ది వెంకటరామయ్య” గారు ఏర్పరచుకున్న శైలి పద్యాలను రాగం ఎక్కువగా పాడటమే కాకుండా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో పద్యం పాడి ప్రజల మన్ననలను పొందుతూ ఉండేవారు. తాను పద్యం పాడుతుంటే తెలుగు మాస్టారు తెలుగు పాఠం చెబుతున్నట్టు ఉండేదట. పద్యం పాడే సమయంలో వెంకట్రామయ్య గారి ముఖాభినయం, సాత్విక చలనాలు, కళ్ల కదలికలు చిరునవ్వుతోనే ఉదాత్తమైన భావగాంభీర్యం ప్రదర్శించేవారు.
పూర్వ నటులలో పూర్వ నటుడు…
నాటకాన్ని చాలామంది ప్రేక్షకులు వెనుకనుండి, ప్రక్కనుండి, దూరం నుండి చూస్తుండేవారు. వాళ్లందరికీ కూడా ఆగుపించేవిధంగా స్పష్టంగా ముఖ భావాలను ప్రదర్శించేవారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు. అందుకే తనను “పూర్వ నటులలో పూర్వ నటుడు అని, ఆధునిక నటులలో ఆధునిక నటుడు” అని మిక్కిలినేని గారు తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. మాధవపెద్ది వెంకటరామయ్య గారు కేవలం గురువు గారు చెప్పిన మేరకే పరిమితం కాకుండా ఒక పాత్ర పోషిస్తున్నారంటే ఆ పాత్రకు సంబంధించిన పుస్తకాలు చదివి, అవపోసన పట్టి, వాటి పూర్వపరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఈ అలవాట్ల వలన మాధవపెద్ది వెంకటరామయ్య గారిని ప్రముఖ నటులు అంటుండేవారు, ప్రశంసిస్తుండేవారు. తాను ధరించిన కొన్ని పాత్రలను పేర్కొనాలంటే “రోషనారా” లో శివాజీ, “బొబ్బిలి యుద్ధం” లో రంగారాయుడు, “పాండవోద్యోగ విజయం” లో దుర్యోధనుడు మొదలైనవి.
“రోషనారా” నాటకం…
“రోషనారా” నాటకంలో అమ్మాయి పేరు రోషనారా. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె శివాజీని ప్రేమిస్తుంది. కానీ శివాజీ స్వాతంత్ర్య కంకణబద్ధుడు. స్వాతంత్ర్య పోరాటంలో మునిగిపోయి తాను రోషనారా ప్రేమను అంగీకరించలేడు. ఈ నాటకంలో శివాజీ పాత్రను మాధవపెద్ది వెంకటరామయ్య గారు అద్భుతంగా పోషించారు. అంతేకాకుండా తాను శివాజీ పాత్ర కోసం ప్రముఖ చిత్రకారులు “రవివర్మ” చిత్రించిన శివాజీ చిత్రంలాగే అచ్చుగుద్దినట్టు అలాగే మేకప్ వేసుకునేవారు. రోషనారా పాత్రను “స్థానం నరసింహారావు” గారు ధరించేవారు. వీరిద్దరూ ఈ పాత్రలు పోషించడం ద్వారా “రామ విలాస నాటక” సభకు ఎక్కువ పేరు వచ్చిందని ఆనాటి నాటక కళా విశ్లేషకులు చెబుతుండేవారు. వీరిద్దరూ “రోషనారా” నాటకమే కాకుండా “శ్రీకృష్ణతులాభారం” నాటకంలో సత్యభామ గా స్థానం నరసింహారావు, శ్రీకృష్ణుడిగా మాధవపెద్ది వెంకట రామయ్య గార్లు నటిస్తుండేవారు. వీరిద్దరు కూడా చక్కటి కలయిక అని ఆనాటి నాటక పెద్దలు ప్రశంసిస్తుండేవారు.
బొబ్బిలియుద్ధం నాటకంలో రంగారాయుడి పాత్ర…
కాలక్రమంలో స్థానం నరసింహారావు గారు, మాధవపెద్ది వెంకటరామయ్య గారు ఇరువురికీ మనస్పర్ధలు వచ్చి చాలా కాలం మాట్లాడుకోలేదు, కలిసి నటించలేదు కూడానూ. కొన్నాళ్ల తర్వాత సర్దుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. మాధవపెద్ది వెంకటరామయ్య గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన మరో పాత్ర “బొబ్బిలియుద్ధం” నాటకంలో రంగారాయుడు పాత్ర. బొబ్బిలియుద్ధం లో రంగారాయుడు పాత్ర అంటే రకరకాల భావోద్వేగాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. వీరభావం ఉండాలి, కారుణ్యం ఉండాలి. వీటన్నింటిని రంగరించి మాధవపెద్ది వెంకటరామయ్య గారు నటిస్తుండేవారు. ఆ రంగారాయుడు పాత్రలో భార్య సహగమనం చేయడానికి పూనుకోవడం, మరోవైపు అంతఃపురం స్త్రీల అంధకారమైన భవితవ్యం, ఇంకోవైపు చిన రంగారాయుడి క్షేమం, మరోవైపు బావ పాపారాయుడు లేని లోటు ఇన్ని భావాలను కూడా తాను వేదికపై పలికించేటటువంటి విధానం అత్యద్భుతంగా ఉండేది.
“పాండవోద్యోగ విజయం” నాటకంలో దుర్యోధనుడి పాత్ర
మరోవైపు మాధవపెద్ది వెంకట్రామయ్య గారి నట జీవితానికి పరాకాష్ట అని చెప్పుకోదగిన పాత్ర “పాండవోద్యోగ విజయం” లో దుర్యోధనుడి పాత్ర. దుర్యోధనుడి పాత్ర అంటేనే సవాలుతో కూడిన పాత్ర. మాధవపెద్ది వెంకటరామయ్య గారు దుర్యోధనుడి పాత్రను ప్రదర్శించడానికంటే ముందు యడవల్లి సూర్యనారాయణ, బళ్లారి రాఘవ గార్లు కూడా ఈ దుర్యోధనుడు పాత్రలో నటించారు. యడవల్లి సూర్యనారాయణ గారు నటించినటువంటి దుర్యోధనుడి పాత్రలో అవమానం పొందినటువంటి రాజు గానూ, కోపం ఉన్న రాజు గానూ, బాగా కపటజూదం ఉన్న వ్యక్తిగానూ, పాండవద్వేషి గానూ ప్రదర్శిస్తూ ఉండేవారు. బళ్లారి రాఘవ గారు దుర్యోధనుడి పాత్రను కొంచెం సౌమ్యంగా ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ రెండింటి కలయికలలో మాధవపెద్ది వెంకటరామయ్య గారు అద్భుతంగా అభినయించేవారు.
ఆ పాత్ర అభినయించేటప్పుడు దుర్యోధనుడు చాలా అభిమానం ఉన్న శౌర్యవంత రాజు గాను, శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తిగానూ, తన యందు తనకు నమ్మకమున్నటువంటి రారాజు గానూ పాత్రను రూపొందించారు. ఈ విధంగా యడవల్లి సూర్యనారాయణ గారు, బళ్లారి రాఘవ గారు నటించినటువంటి దుర్యోధనుడి పాత్ర ఒక కోవకు చెందితే, మాధవపెద్ది వెంకట్రామయ్య గారు నటించిన దుర్యోధనుడు పాత్ర మరో కోవకు చెందినది. ప్రజలు ఈ రెండు రకాల నటనలను ఆదరించారు. కానీ చదువుకున్న వారు మాత్రం మాధవపెద్ది వెంకటరామయ్య గారి దుర్యోధనుడి పాత్రకే ఎక్కువ మార్కులు వేసేవారట.
భారతీ మాస పత్రిక ప్రశంస…
ఈ సందర్భంలోనే నవంబరు 1930 భారతీ మాస పత్రికలో మాధవపెద్ది వెంకటరామయ్య గారి దుర్యోధనుడు పాత్ర గురించి వ్రాస్తూ “వెంకటరామయ్య గారు నటించిన దుర్యోధనుని పాత్ర తన శక్తి యందు అభిమానం ఉన్న వ్యక్తిగానూ, తన మీద తనకు బాగా నమ్మకం ఉన్న రారాజు గాను, మహా అయితే పాండవులతో పోయేది ఏముంది వస్తే రాజ్యం, పోతే వీర స్వర్గం అనేటటువంటి దుర్యోధనుడు గానూ నటించారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు. వీటన్నింటిలో కూడా తనలోని నటనను ప్రదర్శించడంలో ఉత్కంఠత, ప్రకృతిని తమతో చూపించిరి” అని మాధవపెద్ది వెంకటరామయ్య గారి దుర్యోధనుడు పాత్ర గురించి భారతి మాస పత్రికలో వ్రాశారు.
నాటకంలో పేరు తెచ్చిన పాత్రలు..
మాధవపెద్ది వెంకటరామయ్య గారు నాటకాలలో ధరించిన పాత్రలు “శ్రీకృష్ణ తులాభారం” లో కృష్ణుడు, “ప్రతాపరుద్రీయం” లో వలీఖాన్, “నర్తనశాల” లో కీచకుడు, “వేనరాజు” లో వేనరాజు, “సారంగధర” లో సారంగధరుడు లాంటి పాత్రలు మాధవపెద్ది వెంకటరామయ్య గారి నటనా జీవితంలో తనకు ఎనలేని కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. మాధవపెద్ది వెంకటరామయ్య గారు నాటకరంగంలో కళకు తన జీవితాన్ని ఎంతగా అంకితం చేశారంటే ఆయన జీవితపు చివరి రోజులలో కూడా “తెనాలి” లోని పూర్వపు విద్యార్థి సంఘం వాళ్లు ప్రతాపరుద్రీయం నాటకం ప్రదర్శిస్తుంటే ఆ నాటకంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
మాధవపెద్ది గురించి మిక్కిలినేని వ్యాఖ్య…
ఇంకా మాధవపెద్ది వెంకటరామయ్య గారి నాటకరంగం నటనలోని ప్రత్యేకతలను గూర్చి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు వ్రాస్తూ “మాధవపెద్ది వెంకటరామయ్య గారు నిష్క్రమించే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. తాను వేషం వేసుకొని రంగస్థలం మీదికి ప్రవేశిస్తూ ఉంటే ఆ నడకలో వచ్చేటటువంటి విధానంలోనూ ఒక ప్రత్యేకత ఉండేది. అప్పటివరకు కూడా రణగొణ ధ్వనులతో ఉన్నటువంటి నాటక ప్రదర్శనశాల ఆయన ఒక్కసారి వేదిక మీదికి రాగానే అందరూ కూడా నిశ్శబ్దం అయిపోయేవారు. ఆయన వచ్చేటటువంటి విధానాన్ని చూసి ఔరా అని అనుకునేవారు. అలాగే ఆయన నిష్క్రమణ కూడా వేదిక మీద నుండి అలాగే ఉండేది. ఒక నటుడు రంగస్థలం వేదిక మీద ప్రవేశం, నిష్క్రమణం ఎంత ముఖ్యమో మాధవపెద్ది వెంకటరామయ్య గారి నుంచి మిగతా నటులు నేర్చుకునేవారు” అని మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు వ్రాసుకొచ్చారు.
అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా…
ఆ రోజులలో అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడు కూడా మాధవపెద్ది వెంకటరామయ్య గారే. ఆయన కేవలం డబ్బు దృష్టితోనే కాకుండా కళాదృష్టితో కూడా అనేక సంవత్సరాలు “ఆంధ్ర నాటక కళ” కు సేవ చేశారు. “నాటక కళాపరిషత్తు” కార్యవర్గ సభ్యులుగా కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఆంధ్రదేశంలో అనేక నాటక సంస్థలకు, సమావేశాలకు ఆయన స్వచ్ఛందంగా హాజరవుతుండేవారు. హాజరవ్వడమే కాకుండా వాళ్లకు నటనలో మెలకువలు నేర్పుతుండేవారు. ఆ విధంగా అనేక మంది శిష్యులను కూడా తయారు చేశారు. వాళ్లలో ఒకరు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. మాధవపెద్ది వెంకటరామయ్య గారు గుమ్మడి గారి తొలి రోజులలో తన నటనకు ఎంత దోహదం చేశారు, నటనలో తనకు ఎంత ఆత్మవిశ్వాసం నింపారు అనే విషయాన్ని గుమ్మడి గారు తన “తీపి గురుతులు – చేదు జ్ఞాపకాలు” అనే పుస్తకంలో వ్రాసుకున్నారు.
గుమ్మడి “వీరాభిమన్యు” నాటకం…
గుమ్మడి గారు చెప్పిన వివరాలు ఏమిటంటే గుమ్మడి గారు గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుతూ ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద ఉన్న తమ బంధువులు, ఊరి ప్రజలు తాను వ్యవసాయం చేస్తాడులే అనుకునేవారు. కానీ గుమ్మడి గారు వ్యవసాయం పనులకు వెళ్లకుండా గ్రంథాలయానికి వెళుతుండేవారు. ఆ గ్రంథాలయంలో “ఊటుకూరు సత్యనారాయణ” గారు వ్రాసిన “వీరాభిమన్యు” అనే నాటకం కనపడింది. ఆ ఊరిలోని కుర్రాళ్ళందరిని పోగేసి ఆ నాటకం ప్రదర్శించాలనుకున్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుమ్మడి గారికి పద్యాలు పాడడం రాదు. ఆ నాటకంలో పద్యాలు లేవు. అది “వచనం” ప్రధానంగా సాగే నాటకం. అందుకని వాళ్ళ ఊరిలో ఆ నాటకాన్ని ప్రదర్శింపజేశారు గుమ్మడి గారు. తాను ఆ నాటకంలో దుర్యోధనుడు వేషం వేశారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఈ నాటకం వేసిన విషయం మాధవపెద్ది వెంకటరామయ్య గారికి తెలిసింది.
నాటకాలలో గుమ్మడికి ఓనమాలు దిద్దిన మాధవపెద్ది…
ఒకసారి మాధవపెద్ది వెంకటరామయ్య గారు బస్సులో వెళుతుండగా ఆ బస్సు అనుకోకుండా గుమ్మడి గారి ఊర్లో ఆగింది. అక్కడ ఒక కుర్రాడిని ఆపి నాటకం గురించి వాకబు చేయగా నేనే నాటకం వేయించినది, నా పేరే గుమ్మడి వెంకటేశ్వర రావు అని చెప్పారు. తెనాలి దగ్గర “కొల్లూరు”లో జరిగే నాటకానికి బస్సు చార్జీ డబ్బులు తానే పెట్టుకొని గుమ్మడి గారిని నాటకానికి తీసుకెళ్లారు. రిహర్సల్ గదికి తీసుకెళ్లి నాటకం ఎలా వేశావో ఒక్కసారి చూపించు అని అడిగారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు. వెంటనే గుమ్మడి గారు ప్రదర్శించి చూపించారు. వాళ్ళ రిహార్సల్ థియేటర్ లో గుమ్మడి గారితో “అరే అబ్బాయ్ సంభాషణలు బాగానే చెప్పావు. సంభాషణలు చెబుతుంటే నీవు కనిపించకూడదు, ఆ పాత్ర కనిపించాలి. నీలో ఇంకా ఆ నటనా పరిపక్వత రాలేదు. నువ్వు ఇంకా అభ్యాసం చేయాలి. ఇదిగో మేం నాటకం ప్రాక్టీస్ చేస్తున్నాము, చూసి నేర్చుకో అని వాళ్ళ రిహార్సల్స్ చేసి చూపించారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు.
గుమ్మడి విషయంలో నిజమైపోయిన మాధవపెద్ది జోష్యం..
ఆ తరువాత కొన్ని రోజులకు గుమ్మడి వాళ్లకు పక్క ఊరిలో “వీరాభిమన్యు” అనే నాటకం ప్రదర్శించే అవకాశం వచ్చింది. అప్పుడు గుమ్మడి గారు తెనాలి వెళ్లి మాధవపెద్ది వెంకటరామయ్య గారికి తెలియజేశారు. అప్పుడు మాధవపెద్ది వెంకటరామయ్య గారు గుమ్మడి వాళ్ళ ఊరు వెళ్లి ఆ నాటకంలో నటించే నటీనటులకు శిక్షణను ఇచ్చి, తాను కూడా అందులో ఒక పాత్ర కూడా వేశారు. గుమ్మడి గారు దుర్యోధనుడి పాత్ర వేస్తే, దుర్యోధనుడు పాత్రకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన మాధవపెద్ది వెంకటరామయ్య గారు ఆ కుర్రాళ్ళతో కలిసి నటించాలనే అభిలాషతో తాను కర్ణుడి పాత్ర వేశారు.
గుమ్మడి గారు ఆ సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ “మాధవపెద్ది వెంకట్రామయ్య గారు “వీరాభిమన్యు” నాటకం అయిపోయాక నన్ను ఆప్యాయంగా కౌగిలించుకొని, ఆశీర్వదించి మెల్లగా ఒక మాట చెప్పారు. అబ్బాయి నీ వేషం బావుంది, భాష కూడా బాగుందిరా. కానీ నీ లక్షణాలు చూస్తే సాత్వికాభినయానికి ప్రాధాన్యం ఉండే సినిమా పాత్రలలో బాగా రాణిస్తావు అని అన్నారట. ఆ రోజు మాధవపెద్ది వెంకటరామయ్య గారు చెప్పిన ఆ వాక్యం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆయన ఆశీస్సులు ఎంత అనుభవ పూరకమైనవో, ఆయన ఆకాంక్ష ఎంత బలీయమైనదో, ప్రత్యేకించి నా విషయంలో నూరు శాతం ఎలా నిజమయ్యిందో ఆ తరువాత నా సినీ జీవితం నిరూపించింది” అని గుమ్మడి గారు వ్రాసుకున్నారు. ఆ విధంగా మాధవపెద్ది వెంకటరామయ్య గారు శిష్యులను తయారుచేసుకున్నారు.
సినిమా రంగంలో…
రంగస్థలం నటీనటులు సహజంగానే ఆ రోజులలో టాకీల తొలి యుగంలో టాకీ సినిమాలలో నటించినట్లుగానే మాధవపెద్ది వెంకటరామయ్య గారు కూడా మూడు, నాలుగు సినిమాలలో నటించారు. ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1936లో విడుదలైన “ద్రౌపది మాన సంరక్షణం”. ఇందులో మాధవపెద్ది వెంకటరామయ్య గారు “శిశుపాలుడు” పాత్రలో నటించేశారు. ఆ తరువాత మాధవపెద్ది వెంకటరామయ్య గారు “సతీ తులసి” లో శివుడుగా ప్రధాన పాత్ర పోషించారు. 1937లో “విజయదశమి” (లేదా) “కీచకవధ” లో ప్రధాన పాత్ర కీచకుడు, తరువాత 1941లో విడుదలైన “చంద్రహాస” లో ప్రధాన పాత్ర దుష్టబుద్ధి. ఇలా ఆయన నటించిన సినిమాలలో మూడింటిలో ప్రధాన పాత్రలు ధరించినప్పటికీ ఎందుకనో సినిమాలలో కొనసాగలేదు.
సినిమాలు మానేసి నాటకరంగంలో కొనసాగుతూ…
చాలా మంది కళాకారులు సినిమాలలో మానేసినా కూడా నాటకాలలో కొనసాగేవారు. ఆవిధంగానే మాధవపెద్ది వెంకటరామయ్య గారు కూడా నాటకాలలో కొనసాగారు. తాను సొంతంగా నాటక సమాజాన్ని కూడా ఏర్పరచుకున్నారు. “పీసపాటి నరసింహమూర్తి” తో కలిసి “పాండవోద్యోగ విజయం” నాటకాన్ని ఊరూరా ప్రదర్శించారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు. గుమ్మడి గారు వ్రాసిన “తీపి గురుతులు – చేదు జ్ఞాపకాలు” లో “గుంటూరులో ఒకసారి శ్రీకృష్ణుని పాత్ర పోటీలు జరిగాయి. ఆ పోటీలలో పీసపాటి నరసింహమూర్తి గారికి ప్రథమ బహుమతి లభించింది. దానికి మాధవపెద్ది వెంకటరామయ్య గారు న్యాయనిర్ణేతగా వెళ్లారు. అక్కడ పీసపాటి నరసింహమూర్తి గారి అభినయానికి ముగ్దుడై ఆయనను మాధవపెద్ది వెంకటరామయ్య గారు తన ఇంటికి తీసుకెళ్లి నీవు పద్యాలు బాగానే పాడావు. కానీ నీకు వాచకంలో ఇంకా పరిణితి రాలేదు అని తన ఇంట్లోనే ఉంచుకొని “వాచకాభినయం” లో కూడా పీసపాటి నరసింహమూర్తి గారిని సంపూర్ణ నటుడుగా తీర్చిదిద్దారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు” అని గుమ్మడి గారు వ్రాసుకున్నారు.
జీవన శైలి…
మాధవపెద్ది వెంకటరామయ్య గారు చాలా సాధారణంగా ఉండేవారు. నేనొక పెద్ద నటుడిని అనే అహంభావం ఏ కోశానా కూడా ఉండేది కాదు. అతి సాధారణమైన వస్త్రధారణతో ఉండేవారు. ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు బన్నీను, లుంగీ, పైన ఒక అంగ వస్త్రం అంతే. నాటకాలలో నటించే వారికి ఆ రోజులలో ఉండే దురభ్యాసాలు ఏవి కూడా మాధవపెద్ది వెంకటరామయ్య గారి దగ్గరికి రాలేదు. ఆయన స్వచ్ఛమైన జీవితం గడిపారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండేవారు. కానీ తాను వదులుకోలేని ఒకే ఒక వ్యసనం పేకాట, దానాలు చేయడం.
తుదిశ్వాస…
మాధవపెద్ది వెంకటరామయ్య గారి వ్యక్తిగత జీవిత విశేషాలకు వస్తే మాధవపెద్ది వెంకటరామయ్య గారికి పిల్లలు లేరు. తమ్ముడు తిరుమల రావు కుమార్తె కృష్ణవేణమ్మను పెంచుకున్నారు. తన ముస్లిం మిత్రుడి కుమారుడు మొహియుద్దీన్ ను కూడా పెంచుకున్నారు. అంతటి ఉదారహృదయం గలవారు మాధవపెద్ది వెంకటరామయ్య గారు. ఆ తరువాత రోజులలో మొహియుద్దీన్ కు పెళ్లి అయ్యి ఒక కూతురు, కుమారుడు కలిగారు. వారు మంగళగిరిలో నివాసం ఉంటున్నారు. మాధవపెద్ది వెంకటరామయ్య గారు తన చిట్టచివరి రోజులలో చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో బ్రతికారు. ఎంత సంపాదించినా గానీ తన ఆస్తిని దానధర్మాలు చేయడంలోనూ, పేకాటలోనూ పోగొట్టుకున్నారట. మాధవపెద్ది వెంకటరామయ్య గారు తన చిట్టచివరి రోజులలో పక్షవాతం వచ్చి అనారోగ్యంతో చాలా బాధపడ్డారు. ఆయన అనారోగ్యం పాలైన తరువాత నాటకాలలో నటించడం పూర్తిగా మానేశారు. 19 మార్చి 1956 నాడు తుదిశ్వాస విడిచారు అలనాటి ప్రఖ్యాత నటులు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు.
అమృత హృదయలు…
అనుభవజ్ఞులైన వృద్ధ నటులతో, నటనా సామర్థ్యం కలిగి పాత, కొత్త, మేలు కలయికలతో పురోగమించిన సుప్రసిద్ధ నటకాగ్రేసరుడు మాధవపెద్ది వెంకటరామయ్య గారు కళాశీలి, రసజ్ఞుడు, పరోపకార పరాయణుడు, అమృత హృదయుడు అయిన మాధవపెద్ది వెంకటరామయ్య గారు ఆదర్శులు. ఆయన పద్ధతులు, నటనా విధానాలు ఆంధ్ర నటీనటులకు ఆస్తిపాస్తులు. మాధవపెద్ది వెంకటరామయ్య గారు మరణించాక ఆయన భార్య చాలాకాలం బ్రతికారు. వారు పెంచుకున్న అమ్మాయి కృష్ణవేణమ్మ, అల్లుడు కౌతా శ్రీరామచంద్రమూర్తి గారి వద్ద మాధవపెద్ది వెంకటరామయ్య గారు తెనాలిలో శేషజీవితం గడిపారు.