ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎంతో కీలకమైంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎక్కువగా ఆ పార్టీకే ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. 1983, 1985, 1999, 2009, 2014, 2019లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు.
ఇప్పటి వరకు వైసీపీ ఇక్కడ బోణీ కొట్టలేదు. ముఖ్యంగా గత (2019) ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీమోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ పడగా… టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 838 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల తర్వాత ఆయన అధికార పార్టీ వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు.
వచ్చే ఎన్నికల్లోనూ వీళ్లిద్దరే మరోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ నుంచి.. వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేస్తుండటం గన్నవరంపై అందరి దృష్టి పడింది. అభ్యర్థులు అయితే తారుమారు అయ్యారు. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.