CINEMATelugu Cinema

కుటిల రాజకీయాలను, రాజకీయ కుతంత్రాలను మనోరంజకంగా చూపిన సాంఘిక చిత్రం.. పెద్దమనుషులు..

జాతీయ చలనచిత్ర అవార్డులు అనేవి భారతదేశంలోని అత్యుత్తమ చలనచిత్ర పురస్కారాలు. వీటిని 1954లో ఏర్పాటు చేశారు. అత్యుత్తమమైనవిగా ఈ పురస్కారాలను భారతీయ చలనచిత్రాలలో అత్యుత్తమమైనవిగా భావిస్తారు. ఈ ప్రధాన వేడుకలో వివిధ ప్రాంతీయ భాషల చిత్రాలకు కూడా పురస్కారాలు అందజేస్తారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తొలి రజత పతకం గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం పెద్దమనుషులు (1954). పెద్ద మనుషులు సినిమా అనేది 1954లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం. దీనిని కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో జంధ్యాల గౌరీనాథ శాస్త్రి, ముదిగొండ లింగమూర్తి , రేలంగి , వంగర , శ్రీరంజని జూనియర్ లాంటి నటీనటులు నటించారు. ఈ సినిమా సమాజంలోని గౌరవనీయులైన వ్యక్తుల మధ్య అవినీతిని చిత్రీకరిస్తుంది.1877లో ప్రసిద్ధ నార్వేజియన్ నాటక రచయిత “హెన్రిక్ ఇబ్సెన్” రచించిన “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ” ఆధారంగా రూపొందించబడింది.

దర్శకేంద్రుడు, మార్గదర్శకుడు, “మాయాబజార్” లాంటి చరిత్రలో నిలిచిపోయిన చిత్రాలను రూపొందించిన కె.వి. రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సాంఘిక చిత్రం “పెద్దమనుషులు”. ఈ చిత్రానికి ముందు కె.వి. రెడ్డి గారు రెండు చారిత్రాత్మక చిత్రాలను, రెండు జానపద చిత్రాలను రూపొందించారు. ఈ సినిమాలో పేరున్న నటీనటులు ఎవ్వరూ లేరు. ఈ సినిమాలో సింహాభాగం ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు గుణచిత్ర నటులవే కావడం ఈ సినిమా విశేషం. పాత్రల పరంగా ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ కూడా చక్కటి కథాకథనాలతో, చక్కటి దర్శకత్వ ప్రతిభతో ఈ సాంఘిక చిత్రాన్ని విజయవంతమైన చిత్రంగా తీర్చిదిద్దారు కె.వి రెడ్డి గారు. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా కంటే ముందుగా వచ్చిన సినిమాలలో ఒకే ఒక్క ప్రతినాయకుడు ఉండేవాడు.  ఎక్కువమంది కలిసి ప్రతినాయకులుగా ఉండటం ఈ సినిమా నుండి మొదలైంది. చక్కటి మాటల రచయిత డి.వి.నరసరాజు గారు ఈ సినిమా ద్వారానే వెండితెర కు పరిచయమయ్యారు.

పెద్దమనుషులు సినిమా గొప్పదనం ఏమిటంటే ఈ సినిమాలోని పాత్రలు, సంఘటనలు, ఎత్తుకు పై ఎత్తులు, కుటిల రాజకీయాలు, రాజకీయ కుతంత్రాలు ఇవన్నీ కూడా ఈ రోజుకు కూడా కనిపిస్తూంటాయి. 70 సంవత్సరాల క్రిందటే ఆనాటి సమాజంలోని చీకటి కోణాలను ఊహించిన ఈ సినిమా రచయిత, దర్శకులను కచ్చితంగా అభినందించాలి. కాకపోతే ఆ రోజు చీకటి కోణాలు, ఈరోజుకు కూడా కొనసాగిస్తున్న రాజకీయ నాయకులను అభిశంసించాలి. “మనిషిలోని మంచి చెడ్డలను మనోరంజకంగా చిత్రించే సాంఘిక చిత్రం” అనే నినాదాన్ని ఈ సినిమా పాటల పుస్తకంలో వ్రాశారు. 11 మార్చి 1954 నాడు విడుదలై మంచి పేరు తెచ్చుకొని ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో ఆ మంచి, చెడులు ఏమిటి, ఎలా చిత్రీకరించారు, అలాగే ఆ రోజులలో ఈనాటి కుటిల రాజకీయాలను ఎలా ఊహించగాలిగారు తెలుసుకోవాలంటే ముందుగా ఈ చిత్ర కథ ఏంటో తెలుసుకుందాం.

కథ సంక్షిప్తంగా…

ఆదికేశవపురం అనే గ్రామానికి ధర్మారావు ఛైర్మన్. ధర్మారావు , కాంట్రాక్టరు నాగోజీ, ప్రముఖ వ్యాపారియైన చింతపులుసు శేషావతారం, దేవాలయ పూజారి సిద్ధాంతి ఆ ఊరిలో “పెద్ద మనుషులు” గా చెలామణీ అవుతుంటారు. కానీ వారంతా ఎవ్వరికీ తెలియకుండా ప్రజాధనం దోపిడీ చేస్తుంటారు. ధర్మారావు తమ్ముడు శంకరం. చెల్లెలు సుందరమ్మ విధవరాలు. ధర్మారావు పుట్టిల్లు చేరిన సుందరమ్మ ఆస్తిని కాజేయడంతో పాటు తమ్ముడి ఆస్తిని కూడా కాజేయడానికి శంకరానికి పిచ్చి అని ప్రచారం చేస్తుంటాడు. నిజానికి శంకరం  పిచ్చివాడు కాకపోయినా అలా నటిస్తూ తన అన్న చేసే మోసాలన్నీ గమనిస్తూ ఉంటాడు. వీరితో పాటు నిజాయితీపరుడైన రామదాసు “ప్రజాసేవ” అనే పేరుతో ఒక పత్రిక కూడా నడుపుతూ ఉంటాడు. దాంతో పాటు అనాథ పిల్లలకోసం ఒక అనాథ శరణాలయం కూడా నిర్వహిస్తుంటాడు.

రామాదాసు ధర్మారావును గుడ్డిగా నమ్ముతుంటాడు. తన అన్న నిజస్వరూపాన్ని రామదాసు దగ్గర శంకరం బయటపెట్ట బోతే అతన్ని తీవ్రంగా మందలిస్తాడు ధర్మారావు. శంకరం ఎప్పుడూ కొంతమంది పిల్లల్ని వెంటేసుకుని తత్వాలు, భజన పాటలు పాడుతూ పెద్ద మనుషుల కుట్రలను ప్రజలకు వెల్లడిస్తుంటాడు. ఇది గిట్టని నాగోజీ, సిద్ధాంతి తదితరులు శంకరం మీద అతని అన్న ధర్మారవుకు లేనిపోని చాడీలు చెప్పి అతనికి చీవాట్లు పెట్టిస్తారు. ప్రతిగా శంకరం కూడా సిద్ధాంతికి దేహశుద్ధి చేస్తాడు. రామదాసుకు అంధురాలైన ఒక కుమార్తె ఉంటుంది. ధర్మారావు కుమారుడు ప్రభాకరం పట్నంలో వైద్యవిద్యనభ్యసిస్తూ ఉంటాడు. రామదాసు కూతురు అంటే ప్రభాకరానికి అభిమానం.

పట్నంలో ఆమెకు వైద్యం చేయిస్తే చూపు వస్తుందని తెలుసుకుంటాడు. దాని ఖర్చు కోసం రామదాసు ధర్మారావు దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటాడు. వితంతువైన ధర్మారావు చెల్లెల్ని అతని కారు డ్రైవరు ప్రేమిస్తున్నాడని తెలుసుకుని అతన్ని తుపాకీతో కాలుస్తాడు ధర్మారావు. ధర్మరావు పట్ల అభిమానంతో రామదాసు ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళతాడు. రామదాసు జైలు నుండి విడుదల అయ్యేసరికి ధర్మారావు నిజ స్వరూపం తెలుసుకొంటాడు. ఆదికేశవాలయంలో నిధి ఉన్నదని సిద్ధాంతి చెప్పిన మాటలు నమ్మిన ఆ పెద్దమనుషులు ధర్మారావు, నాగోజి, శేషావతారం, సిద్ధాంతి ఆలయంలో త్రవ్వకాలు జరిపి పునాదులు కూలడంతో అక్కడికక్కడే మరణిస్తారు. చూపు వచ్చిన పద్మను ప్రభాకర్ వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :   కె.వి.రెడ్డి

నిర్మాణం   :     కె.వి.రెడ్డి

కథ    :    కె.వి.రెడ్డి, డి.వి.నరసరాజు, డి.బి.జి.తిలక్

తారాగణం  :   జంధ్యాల గౌరీనాథశాస్త్రి, ఎ.వి.సుబ్బారావు, ఎమ్.లింగమూర్తి, వంగర, రేలంగి, సి.హెచ్.కుటుంబరావు, రామచంద్ర కాశ్యప్, గోపాల్ పిళ్ళై, శ్రీరంజని, కె.పద్మావతిదేవి, సి.హెచ్.హేమలత, తాడంకి శేషమాంబ, స్వరాజ్యలక్ష్మి, ప్రభావతి, జయలక్ష్మి, సీత

సంగీతం    :    ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు

నేపథ్య గాయకులు :  ఘంటసాల, పి.లీల, కృష్ణవేణి(జిక్కి), పి.నాగేశ్వరరావు, మాధవపెద్ది, వర్మ

గీతరచన     :    ఊటుకూరి సత్యనారాయణరావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఎన్.రాఘవరావు

ఛాయాగ్రహణం  :   బి.ఎన్. కొండారెడ్డి

సంభాషణలు   :   డి.వి. నరసరాజు

కూర్పు      :    ఎమ్.ఎస్.మణి

నిర్మాణ సంస్థ    :    వాహినీ ప్రొడక్షన్స్

నిడివి      :     191 నిమిషాలు

విడుదల తేదీ   :     11 మార్చి 1954

భాష     :     తెలుగు

దర్శకేంద్రుడు కె.వి రెడ్డి ప్రస్థానం…

హెచ్.ఎం.రెడ్డి గారు “గృహలక్ష్మి” (1938) సినిమాను తీస్తూ బి.ఎన్.రెడ్డి గారిని భాగస్వామిగా పెట్టుకున్నారు. మూల నారాయణ స్వామిని కూడా “గృహలక్ష్మి” సినిమాలో భాగస్వామిగా చేర్చుకున్నారు. మూల నారాయణస్వామి గారికి మిత్రుడు అయిన కె.వి.రెడ్డి గారు బి.ఎస్సి చదువుకొని ఉపాధ్యాయుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. మూలా నారాయణస్వామి, కె.వి.రెడ్డి, బి.యన్ రెడ్డి గార్లు “గృహలక్ష్మి” సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. బి.యన్.రెడ్డి గారు నిర్మాతలలో ఒకడిగా, మూల నారాయణస్వామి పెట్టుబడిదారుగా, కె.వి రెడ్డి గారు గృహలక్ష్మి సినిమాకు క్యాషియర్ గా నియమించబడ్డారు. “గృహలక్ష్మి” సినిమా అయిపోయాక బి.ఎన్.రెడ్డి, మూల నారాయణస్వామి గార్లు హెచ్.ఎం. రెడ్డి గారి అభిరుచులకు మనం సరిపడమని, మనం మంచి సినిమాలు తీద్దామని వాహినీ పిక్చర్స్ మొదలుపెట్టారు.


వాహినీ పిక్చర్స్ ప్రారంభం..

1939 ప్రాంతంలో వాహినీ పిక్చర్స్ ని బి.ఎన్.రెడ్డి గారు ప్రారంభించారు. ఆ బ్యానర్ మీద వందేమాతరం (1939) అనే సినిమా తీశారు. ఆ తర్వాత సుమంగళి (1940), దేవత (1941) సినిమాలు కూడా ఆ బ్యానర్ లోనే తీశారు. ఆ వాహినీ పిక్చర్స్ కి మూల నారాయణస్వామి భాగస్వామిగా ఉన్నారు. కె.వి. రెడ్డి గారు దర్శకత్వ శాఖలో కొనసాగుతున్నారు. అలా వాహినీ పిక్చర్స్ లో మంచి సినిమాలతో ముందుకు వెళుతూ ఉండగా బి.ఎన్.రెడ్డి గారి తమ్ముడు బి.నాగిరెడ్డి గారు సినిమాలతో సంబంధం లేకుండా ప్రెస్ నడుపుతున్నారు. బి.యన్ రెడ్డి గారు మూడు సినిమాలు తీశాక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (వాహినీ పిక్చర్స్ దర్శకుల సంఘం) అంతా కలిసి కె.వి. రెడ్డి తో కలిసి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నారు.

మిత్రుడు మూలా నారాయణస్వామి గారి ప్రోద్భలంతో కె.వి రెడ్డి గారు 1942లో భక్త పోతన అనే సినిమాను తన దర్శకత్వం లో రూపొందించారు. ఆ సినిమా చాలా బాగా ఆడింది. దాంతో కె.వి రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (వాహినీ పిక్చర్స్ దర్శకుల సంఘం) అందరూ కలిసి కె.వి రెడ్డి గారు ఒక సినిమా తీస్తే, బి.యన్ రెడ్డి గారు మరొక సినిమా తీస్తారు అని ఒప్పందం కుదుర్చుకున్నారు. మూలా నారాయణస్వామి గారు అందులో ఒక భాగస్వామి కాబట్టి కె.వి.రెడ్డి గారికి అంత బలం. మూలా నారాయణస్వామి గారు వాహినీ పిక్చర్స్ పై ఒక సినిమా తీయడమే కాకుండా వాహినీ స్టూడియోను కూడా కట్టారు.

వాహినీ స్టూడెయోను కొనుగోలు చేసిన నాగిరెడ్డి – చక్రపాణి లు..

1948 – 49 సంవత్సరాలు వచ్చేసరికి వాహినీ స్టూడియో ఇబ్బందులలో పడింది. మూలా నారాయణస్వామి గారికి ఆదాయపు పన్ను ఇబ్బందులు వచ్చి ఆ స్టూడియోను అమ్మేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు బి.యన్ రెడ్డి గారి తమ్ముడు బి.నాగిరెడ్డి మరియు అతని మిత్రుడు చక్రపాణిలు ఆ వాహినీ స్టూడియోను ముందుగా లీజుకు తీసుకున్నారు. కాలక్రమంలో ఆ స్టూడియోను కొనుగోలు చేశారు. ముందుగా  యల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో షావుకారు (1950) సినిమా తీశారు. ఈ సినిమా కాస్త నిరాశపరిచింది. ఆ తరువాత కె.వి రెడ్డి గారితో కలిసి “పాతాళభైరవి” (1951) సినిమా తీశారు. ఈ సినిమాకి కూడా అద్భుతమైన విజయం సాధించింది. దాంతో విజయా వాహినీ స్టూడియో నిర్వాహకులు నాగిరెడ్డి – చక్రపాణిలు ఆ తరువాత సినిమా కూడా కె.వి రెడ్డి గారిని తమ బ్యానర్ లో చేసి పెట్టమని అడిగారు. కానీ కె.వి.రెడ్డి గారు బి.యన్.రెడ్డి వాళ్లకు సినిమా చేస్తానన్నారు.

రచయిత గా తొలిసారి డి.వి. నరసరాజు..

“పాతాళ భైరవి”, “గుణసుందరి కథ” సినిమాలకు పనిచేసిన పింగళి నాగేంద్రరావు గారిని కథా చర్చలకు కె.వి రెడ్డి గారు పిలిచారు. కానీ పింగళి గారిని నాగిరెడ్డి – చక్రపాణిలు పంపించలేదు. చేసేదిలేక కె.వి రెడ్డి గారు పాతాళభైరవి 100 రోజుల వేడుకకు విజయవాడకు వెళ్ళినప్పుడు నాటక సమాజం వారు వేసే “నాటకం” అనే నాటకాన్ని చూశారు. అది కె.వి రెడ్డి గారికి బాగా నచ్చింది. ఆ నాటకాన్ని వ్రాసిన వారి గురించి వాకబు చేయగా డి.వి నరసరాజు గురించి చెప్పారు. అప్పుడు డి.వి నరసరాజుతో కలిసి కథాచర్చలకు కూర్చున్నారు కె.వి రెడ్డి గారు.

ఇంతకుముందు కె.వి రెడ్డి గారు “భక్త పోతన” మరియు “యోగి వేమన” లాంటి రెండు చారిత్రాత్మకాలు, అలాగే “గుణసుందరి”, “పాతాళభైరవి” లాంటి రెండు జానపదాలు తీశారు. ఇప్పుడు సాంఘికం తీద్దామని డి.వి.నరసరాజు గారితో కథా చర్చలకు కూర్చున్నారు. 16 సెప్టెంబరు 1951 నాడు కె.వి రెడ్డి గారి ఇంట్లో స్క్రిప్టు రాయడానికి కూర్చున్నారు డి.వి నరసరాజు గారు. తనకు నెలకు రెండు వందల రూపాయలు జీతం, సినిమా పూర్తిగా అయిపోయినాక రెండు వేల రూపాయల పారితోషికం ఇస్తానని చెప్పారు. ఈ సినిమా అయ్యేవరకు వేరే సినిమాలకు పని చేయకూడదనే షరతుతో కె.వి రెడ్డి గారు తన ఇంట్లోనే స్క్రిప్టు పనులు మొదలుపెట్టారు.

కథకు మూలం “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ” ఆంగ్ల నాటకం…

పెద్దమనుషులు సినిమాకి మూలం “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ” అనే ఆంగ్ల నాటకం. 1850 – 60 ఆ రోజులలో నార్వేజియన్ నాటక రచయిత హెన్రిక్ ఇబ్సెన్ అద్భుతమైన నాటకాలు వ్రాశారు. ప్రపంచ నాటక చరిత్రలో షేక్స్పియర్ తరువాత అంతటి సార్వజనీనత ఉన్న నాటకాలు వ్రాసిన రచయితగా హెన్రిక్ ఇబ్సెన్ పేరు తెచ్చుకున్నారు.  ఆయన వ్రాసిన “ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ” అనే నాటకం 1870 – 80 ఆ రోజులలో బాగా ప్రసిద్ధి. అందులోని రెండు పాత్రలను తీసుకొని కథ వ్రాసుకున్నారు కె.వి రెడ్డి, డి.వి.నరసరాజు గార్లు. అందులో ప్రధానమైన ప్రతినాయకుడు పాత్ర పేరు బెర్నెక్, జైలుకు వెళ్లి వచ్చిన పాత్ర పేరు జోహాన్. ఆ బెర్నెక్ ఈ పెద్ద మనుషులు కథలో మునిసిపల్ చైర్మన్ అయ్యారు. జోహాన్ ఇందులో మునిసిపల్ కౌన్సిలర్ అయ్యాడు. అసలైన నాటకంలో బావమరిది, కానీ ఇందులో మిత్రుడు. మిగతా కథంతా మన తెలుగు వాతావరణానికి అనుగుణంగా వ్రాసుకున్నారు. ఈ కథ తయారు చేయడంలో డి.బి.జి.తిలక్ కూడా  సహాయపడ్డారు.

ఛాయాగ్రాహకుడిగా కొండారెడ్డి…

కథ పూర్తయినాక సంభాషణలు కూడా డి.వి.నరసరాజు గారు వ్రాశారు. సంభాషణలకు తన కలం విశృంఖలంగా విహరించింది. “పెద్దమనుషులు” సినిమాలో పెద్దమనుషుల మీద చురకలు వేయడం, సమాజంలో ఉన్న చీకటి కోణాలను ఎత్తిచూపడం లాంటి అద్భుతమైన సంభాషణలు వ్రాశారు డి.వి.నరసరాజు గారు. ఈ సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసిన డి.వి.నరసరాజు గారు చిట్ట చివర వరకు కూడా సినిమాలలో అద్భుతమైన మాటలు వ్రాశారు.

నందమూరి తారకరామారావు గారి “యమగోల” చిత్రానికి కూడా డి.వి.నరసరాజు గారే మాటలు వ్రాశారు. బి.యన్.రెడ్డి, నాగిరెడ్డి గార్ల తమ్ముడు కొండారెడ్డి గారు “మల్లీశ్వరి” (1951) సినిమాతో ఛాయాగ్రాహకుడిగా సినీ పరిశ్రమలోకి వచ్చారు. ఆ తరువాత ఈ “పెద్దమనుషులు” సినిమాతో తన రెండో సినిమాగా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత రోజులలో తాను బి.యన్ రెడ్డి గారు తీసిన అన్ని సినిమాలకు కొండారెడ్డి గారే ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. “బంగారు పాప”, “భాగ్య రేఖ”, “రాజమకుటం”  బి.యన్ రెడ్డి గారి చిట్టచివరి చిత్రం “బంగారు పంజరం” వరకు కూడా కొండారెడ్డి గారే ఛాయాగ్రహకులుగా  వ్యవహారించారు.

ప్రధానపాత్రలో జంధ్యాల గౌరీనాథ శాస్త్రి…

ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర మునిసిపల్ ఛైర్మన్. ఇది ప్రధాన ప్రతినాయకుడి పాత్ర. దీనికి ముందుగా చిత్తూరు వి.నాగయ్య ను అనుకున్నారు. కె.వి.రెడ్డి గారికి చిత్తూరు వి.నాగయ్య గారిని తీసుకోవడం ఇష్టం లేదు. ఆ పాత్రకు ఎస్వీ రంగారావు గారిని కూడా అనుకున్నారు. ఆ సమయానికి “పాతాళభైరవి” సినిమాను హిందీలో ఎవరో తీస్తానన్నారు, అందులో తాను నటిస్తానని తనకు కుదరదు అని చెప్పారు. చివరగా ఆ పాత్రకు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారిని తీసుకున్నారు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారిది తెనాలి దగ్గర పల్లెటూరు. కానీ తాను విజయవాడలో స్థిరపడ్డారు. అతను బాగా డబ్బున్న వాడు, ఉద్యోగం చేయాల్సిన పనిలేదు. కాకపోతే కళాపోషకుడు. తాను వేదిక మీద నాటకాలు వేస్తుండేవారు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారికి శాస్త్రీయ సంగీతం కూడా వచ్చు. తాను కె.వి రెడ్డి గారి “భక్త పోతన” సినిమాతో చిత్రరంగ ప్రవేశం కూడా చేశారు. అందులో శ్రీనాథుడు పాత్ర వేశారు. అలాగే వేరే సినిమాలలో ఏదో ఒక పాత్ర వేస్తూనే వస్తున్నారు.

జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు ఈ పెద్దమనుషులు సినిమాలో నటించడం కంటే ముందుగా సొంతంగా రెండు సినిమాలు నిర్మించారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు. అందులో ఒకటి “గీతాంజలి”, ఇంకో సినిమా పేరు “ఆకాశరాజు”. ఆకాశరాజు సినిమాకి విశ్వనాథ సత్యనారాయణ గారు మాటలు వ్రాశారు. ఆ రెండు సినిమాలకు నిర్మాతగా పనిచేసి ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉన్నారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి మామగారిది గుంటూరు. కె.వి రెడ్డి గారి అమ్మగారికి మతి సరిగ్గా ఉండేది కాదు. ఉన్నట్టుండి ఎటో పారిపోయేవారు. ఒకసారి కె.వి రెడ్డి గారి అమ్మగారు ఇంట్లో నుండి పారిపోయి ఎక్కడో గుంటూరులో ఒక ఆలయం దగ్గర కూర్చొని ఉంటే ఆమె వివరాలు ఎవరో కనుక్కొని జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి మామ గారికి చెప్పారు.

దాంతో జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి మామగారు కె.వి రెడ్డి గారికి ఫోన్ చేసి వివరాలు కనుకొని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేర్చారు. ఈ విషయం కె.వి.రెడ్డి గారికి బాగా గుర్తుంది. అందువలన జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి మామగారు అంటే కె.వి రెడ్డి గారికి ఎనలేని గౌరవం. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు మామగారు ఒకసారి కె.వి రెడ్డి గారిని కలిసి తన అల్లుడు రెండు సినిమాలు నిర్మించి కష్టాలలో ఉన్నారని, మీ సినిమాలో ఒక పాత్ర ఇస్తే తనకు సినిమాలలో పునరుజ్జీవం వస్తుందని చెప్పారు. దాంతో కె.వి రెడ్డి గారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి మామగారి మీద ఉన్న గౌరవంతోను, అలాగే జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు “భక్తపోతన” సినిమాలో కూడా ఒక పాత్ర చేసి ఉండడంతో  “పెద్దమనుషులు” సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రకు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారిని తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా డి.వి నరసరాజు గారు తన ఆత్మకథలో వ్రాసుకున్నారు.

పత్రికాధిపతి పాత్రలో ముదిగొండ లింగమూర్తి..

గుత్తేదారు (కాంట్రాక్టరు) గా ఏ.వి.సుబ్బారావు గారు, పూజారిగా వంగర వెంకటసుబ్బయ్య గారు, వ్యాపారవేత్తగా చదలవాడ కుటుంబరావు గారు నటించారు. వీళ్ళు నలుగురు కలిసి దుష్టచతుష్టయం (పెద్దమనుషులు) గా నటించారు. ఈ సినిమాలో కథనాయకుడు మునిసిపల్ చైర్మన్ గారి అబ్బాయి ప్రభాకర్ పాత్రలో రామచంద్ర కశ్యప, కథనాయికగా మునిసిపల్ కౌన్సిలర్ కూతురుగా నటించిన అమ్మాయి జూనియర్ శ్రీరంజని, పత్రికాధిపతి పాత్ర వేసినది ముదిగొండ లింగమూర్తి. అతడు బి.యన్ రెడ్డి గారికి మిత్రుడు, సహాయకుడిగా కూడా ఉండేవారు. అప్పటివరకు తాను దుష్టపాత్రులు పోషించి వచ్చారు. ఈ సినిమాతోనే తాను మంచి పాత్ర పోషించారు. ఈ పాత్రకు గానూ పురస్కారాలలో ముదిగొండ లింగమూర్తి గారికి ఉత్తమ నటుడిగా పురస్కారం లభించింది.

భానుమతి గారు పెళ్లి చేసుకుని సినిమాల నుండి నిష్క్రమిద్దాం అని నిర్ణయించుకున్న సందర్భంలో ఆమెను ఒప్పించి “స్వర్గసీమ” సినిమాలో తనను నటింపజేసి ఆమెను సినిమాలలో కొనసాగడానికి ముఖ్య కారణం అయినది ముదిగొండ లింగమూర్తి గారే. తిక్కానంద స్వామిగా పాత్ర వేసిన వ్యక్తి పేరు రేలంగి గారు. రేలంగి గారికి ఒక సంభాషణ కూడా పెట్టారు. అది “నేనెవరో తెలుసా దుష్టశిక్షంకర శిష్టరక్షంకర ప్రతిభయంకరేత్యాది వంకర టింకర భయంకర బిరుదాంకిత శ్రీశ్రీశ్రీ తిక్క శంకరానంద స్వాముల వారిని” అని చెప్పాలి. రేలంగి గారికి సహజంగానే నాలుక మందంగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద సంభాషణలు చెప్పడానికి నోరు తిరిగేది కాదు. అందుకే ప్రక్క వాళ్ళతో ఈ సంభాషణ చెప్పించారు. ఈ సినిమా కూడా రేలంగి గారికి బాగా పేరు తెచ్చిపెట్టింది.

చిత్రీకరణ…

వాస్తవానికి “పెద్దమనుషులు” సినిమాను వాహినీ స్టూడియోలోనే చిత్రీకరణ చేయాలి. కానీ కె.వి రెడ్డి గారిపై నాగిరెడ్డి – చక్రపాణి గార్లు కోపంగా ఉన్నారు. అందువలన వాహినీ స్టూడియోలోనే చిత్రీకరణ చేయడం కుదరలేదు. దాంతో ప్రక్కనే ఉన్న రేవతి స్టూడియోలో సెట్టింగ్  వేసి చిత్రీకరణ ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత పరిస్థితులు సర్దుబాటు అయ్యాయి. దాంతో మళ్లీ చిత్రీకరణను వాహినీ స్టూడియోకు తరలించి వాహినీ స్టూడియోలోనే చిత్రీకరించారు. ఈ సినిమాకు సంగీతం ఓగిరాల రామచంద్రయ్య, అద్దేపల్లి రామారావు గార్లు సంగీతం సమకూర్చారు. సినిమాలోని పాటలను ఊటుకూరు సత్యనారాయణ, న్యాయపతి రాఘవరావులు వ్రాశారు. “నందామయా గురుడ నందామయా”, “శివ శివ మూర్తివి గణనాధా” లాంటి పాటలు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాశారు.

కొసరాజు రాఘవయ్య చౌదరి గారు కొన్ని సినిమాలలో పాటలు వ్రాసి 1941లో వెనక్కి గుంటూరు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన అనుకోకుండా మద్రాసు వచ్చినప్పుడు తన మిత్రుడు డి.వి.నరసరాజు గారిని ఒప్పించి, బలవంతంగా కూర్చోబెట్టి “పెద్దమనుషులు” సినిమాలో పాటలను వ్రాయించారు. అలా ఆ సినిమాలో పాటలు వ్రాయించబట్టి తరువాత కాలంలో సినిమాలో పాటల రచయితగా కొనసాగించడమే కాకుండా ముఖ్యంగా హాస్య గీతాలు, జానపద గీతాలు అంటే కొసరాజు రాఘవయ్య చౌదరి గారే అన్నంతగా ముద్ర వేసుకున్నారు. కొసరాజు రాఘవయ్య చౌదరి గారికి ఇష్టం లేకపోయినా తన సినీ జీవితంలో పాటల రచయితగా పునర్జన్మని ఇచ్చింది “పెద్దమనుషులు” సినిమానే.

విడుదల…

పెద్దమనుషులు సినిమా విడుదల అయ్యింది. మంచి పేరు తెచ్చుకుంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ చిత్రాలకు కూడా బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి రజత పతకం అందుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం “పెద్దమనుషులు”. ఈ సినిమాని తమిళంలో “అలై కండుమయం గాదే” పేరుతో డబ్బింగ్ కూడా చేశారు. కేవలం ప్రేక్షకులచేతనే కాకుండా, విమర్శకులతో, సమీక్షకులతో కూడా చక్కటి సమీక్షలను పొందింది “పెద్దమనుషులు” సినిమా.

Show More
Back to top button