CINEMATelugu Cinema

తెలుగు టాకీల చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి కథానాయిక.. సురభి కమలాబాయి

కొంతమంది రికార్డులు సృష్టించడం కోసం కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు. కొంతమంది తమకు తెలియకుండానే రికార్డులు సృష్టిస్తారు. అది రికార్డు అని వారికి ఆ సమయంలో తెలియకపోవచ్చు. మిగతా వాళ్ళు కూడా చాలా కాలం పాటు ఆ రికార్డును పట్టించుకోకపోవచ్చు. తెలుగు చలనచిత్ర చరిత్రలో అలాంటి అరుదైన రికార్డులు కలిగి ఉన్న నటీమణి సురభి కమలాబాయి. ఆమె మొట్టమొదటి తెలుగు టాకీ తార. తొంభై ఏళ్ల క్రిందటే ఆమె మరికొన్ని రికార్డులు నెలకొల్పారు. తెలుగు తెరమీద మొట్టమొదటి సీత, మొట్టమొదటి శకుంతల, రెండవ ద్రౌపది లాంటి రికార్డులు ఉన్నాయి. తెలుగు టాకీలలో విడుదలైన మొట్టమొదటి రెండు చిత్రాలలో ఈమెనే ప్రధాన పాత్రధారిణి. చారిత్రాత్మక ప్రాధాన్యత దృష్ట్యా ఈ రికార్డును ఎవ్వరూ అధిగమించలేరు. ఎందుకంటే మొదటి టాకీ సినిమా అనేది ఒకటే ఉంటుంది కాబట్టి. మిగతావి కూడా అలాంటివే. ఆమె రంగస్థలం మీదనే జన్మించడం ప్రేక్షకుల నుంచి 30 రూపాయలు బహుమతులు అందుకోవడం, ఆ రికార్డులు ఇంకెవ్వరికీ ఉండకపోవచ్చు.

నిజానికి టాకీల ఆవిర్భావంతో సినిమా ఎవ్వరూ ఊహించనంత మార్పులకు లోనైంది. ఆంగ్లో ఇండియన్లు “మూకీ” మహారాజులుగా వెలుగుందిన ఎంతోమంది టాకీల రాకతో క్రమేపి తమ ప్రాభవాన్నీ, ప్రతిష్టను కోల్పోయారు. అప్పటివరకు భాషా భేదాలు లేకుండా అందరినీ సమానంగా అలరించిన సినిమా టాకీల రాకతో ప్రేక్షకుల మధ్య కొత్త గోడలను ఏర్పరచింది. దీని ప్రభావం వలన ఎవరికి వారు తమ భాషలలో సినిమాలు ఉండాలన్న కోరికను వ్యక్తం చేయసాగారు. పలానా భాషలో సినిమాలు తీస్తే ఆ భాషాభిమానులు చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తారు అన్న భావం నిర్మాతలలోనూ కలిగి వివిధ భాషలలో చిత్రాలు నిర్మించడానికి పథకాలు వేసేవారు. ఆ విధంగా భారతీయ తొలి టాకీ విడుదలైన తర్వాత 1931 లోనే మరో 22 హిందీ చిత్రాలు, మూడు బెంగాలీ చిత్రాలు, ఒక తమిళ సినిమా, ఒక తెలుగు సినిమా విడుదలయ్యాయి.

తెలుగు రంగస్థలం నాటకమే ప్రారంభంలో తెలుగు టాకీగా పరకాయ ప్రవేశం చేసిందని చెప్పాలి. ఈ నూతన కళారూపానికి అవసరమైన నటీనటులను, సాంకేతిక నిపుణులను తయారు చేసుకుందామనే ఆలోచన నిర్మాతలకు ఉండేది కాదు. ఎందుకనగా రంగస్థలం నటీనటులు వేదిక మీద ఏ పాత్రలు ధరించేవారో ఆ పాత్రలనే సినిమాలలోను ధరించడం పరిపాటి అయ్యింది. తెలుగులో కూడా టాకీని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ రోజులలో పౌరాణికాల ప్రభావం ఎక్కువ కాబట్టి తొలి టాకీకి కూడా అటువంటి కథా వస్తువునే దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి గారు ఎంచుకున్నారు. అందులో నాయకా, నాయిక ప్రాత్రధారుల కోసం ఆయన ఆంధ్రదేశంలో అన్వేషణ ప్రారంభించారు.

వెంకటగిరి మహారాజుతో నటశేఖర బిరుదు పొందిన వల్లూరు వెంకట సుబ్బారావు (తదనంతర కాలంలో ఆయన మునిపల్లె సుబ్బయ్యగా పేరొందారు. మునిపల్లె గ్రామంలో ఆయన జన్మించడమే దీనికి కారణం) ను హిరణ్యకశిపుని పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇక కథానాయిక పాత్ర కోసం హెచ్.ఎం.రెడ్డి “సురభి కమలాబాయి” ని ఎన్నుకున్నారు. సురభి ఆమె ఇంటిపేరు కాదు, ఆమె నటించే నాటకాల కంపెనీ పేరు. సురభి కంపెనీ ఆ రోజులలో పేరొందిన నాటక సంస్థ. అందులో పని చేసే వారంతా ఒకే కుటుంబ సభ్యులు కావడం విశేషం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల పాత్ర వరకు ఆ కుటుంబ సభ్యులు మాత్రమే పోషించేవారు. ఎక్కడైనా నాటక ప్రదర్శన ఇవ్వవలసి వచ్చినప్పుడు యాత్రలకు వెళ్లినట్టు ఆ కుటుంబం అంతా కదలి వెళ్ళేది. మహిళా పాత్రలను మహిళల చేతే పోషింప చేసిన తొలి సంస్థ “సురభి నాటక సంస్థ. గత వైభవాన్ని, ప్రాభవాన్ని కాపాడుకుంటూ సురభి కళాకారులు ఇప్పటికీ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.


జీవిత విశేషాలు…

జన్మ నామం :  సురభి కమలాబాయి

ఇతర పేర్లు   :    కమలాబాయి

జననం    :    04 ఏప్రిల్ 1908

స్వస్థలం   :    హైదరాబాదు లో నాటక రంగస్థలం మీద

తండ్రి  :     కృష్ణాజీరావు

తల్లి  :     వెంకూబాయి

జీవిత భాగస్వామి :   అవివాహితురాలు

పిల్లలు   :   పెంపుడు కొడుకు

వృత్తి      :   తెలుగు సినిమా నటీమణి

మరణం     :     30 మార్చి 1971, ఏలూరు, పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్


సురభి నాటక సమాజం…

నిజానికి సురభి అనేది కడప జిల్లాలో ఒక గ్రామం. ఆ గ్రామానికి చెందిన వనారస గోవిందరావు అనే వ్యక్తి 1885లో “సురభి” అనే నాటక సంస్థ” ను స్థాపించారు. కాలక్రమేణా ఆయన సంతానం శాఖోపశాఖలుగా విస్తరించి అనేక నాటక సమాజాలను వారు స్థాపించగలిగారు. వాళ్ల పోషించే నాటకం ఏదైనప్పటికీ కూడా వాళ్ళని “సురభి నాటక సమాజం” అని అంటుంటారు. వాళ్లకు నాటకమే జీవితం, జీవనాధారం. చిన్న – పెద్ద, ఆడ – మగ అందరూ కూడా వాళ్ల కుటుంబ పెద్దలు నడిపే సంస్థలలో ప్రదర్శించే నాటకాలలో వేషాలు వేయడం, ఇతరత్రా తెర వెనకాల సహాయం చేయడం, ఇదంతా వాళ్ళ సంస్కృతి. స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా నటిస్తూనే ఉంటారు. తెలుగు టాకీలు రాకముందు నాటక సంస్థలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకి సురభి కళాకారుల ప్రత్యేకత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అని చెప్పుకోవడం ఏమాత్రం సందేహం లేదు.

తొలిసారి దించిన సురభి నాటకతెర…

ఆ రోజులలో తెలుగు జిల్లాలలో ప్రతీ రాత్రి ఏదో ఒక ఊరిలో “సురభి నాటకం” ప్రదర్శించాల్సిందే, రాత్రి తొమ్మిది గంటలకు తెరలేచి తీరాల్సిందే. ఆ రోజులలో నాటకాలలో ఒకసారి తెరలేచింది అంటే నాటకం ముగిసే వరకు కూడా తెరదించేవారు కాదు. అలాంటిది 04 ఏప్రిల్ 1908 రాత్రి హైదరాబాదులో సురభి నాటక ప్రదర్శన జరుగుతూ ఉండగా అర్ధాంతరంగా తెరదించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ నాటకం ప్రదర్శిస్తుంది సురభి కళాకారులలో రెండవ తరానికి చెందిన వనారస పెద్ద కృష్ణాజీ రావు, ఆయన భార్య వెంకుమాంబ. వెంకుమాంబ గారు చాలా పెద్ద సంగీత విద్వాంసులు. ఆవిడ ఝంఝాటి రాగంలో చాలా ప్రావీన్యురాలు. అందువలలన ఆవిడని ఝంఝాటి వెంకుబాయి అనేవారు. ఈ నాటకం ప్రదర్శింపబడే సమయానికి వెంకుమాంబ గారు నిండు చూలాలు. తాను ఎప్పుడైనా ప్రసవించే అవకాశం కలిగి ఉన్నారు. నాటకాలలో కూడా తాను నిండు చూలాలు వేషమే వేస్తుంది.

రంగస్థలం వేదికమీదే తొలి ఊపిరి…

నాటకం ప్రదర్శన సగంలో ఉండగా వెంకుమాంబ గారికి నొప్పులు రావడం మొదలైంది. దాంతో వాళ్లు రంగస్థలం మీద తెరదించక తప్పలేదు. ప్రేక్షకుల్లో కలకలం మొదలైంది. అక్కడ వాళ్లకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇంతలోనే నాటక నిర్వాహకుడు వచ్చి మా నటీమణి వెంకుమాంబ కు నొప్పులు మొదలయ్యాయి. ఇక నాటకం ఆడటం లేదు, మీ టికెట్ సొమ్ము మీకు వెనక్కి ఇచ్చేస్తాం తీసుకుని వెళ్లిపోండి అని చెప్పారు.  విచిత్రం ఏమిటంటే ప్రేక్షకులు ఒక్కరు కూడా కదల్లేదు. పుట్టిన బిడ్డని చూసి గాని వెళ్ళమన్నారు. తెరదించి ఉన్న రంగస్థలం మీదనే సుఖః ప్రసవం అయినది. బొడ్డు కోసి నీళ్లు పోశాక బిడ్డను తీసుకువచ్చి పెట్రో మ్యాక్స్ వెలుతురులో అక్కడున్న ప్రేక్షకులకు చూపించారు. దాంతో ప్రేక్షకులంతా ఆనందంతో వేదిక మీదకి డబ్బులు విసిరేశారు. అలా రంగస్థలం మీదనే తొలి ఊపిరి పీల్చుకున్న కళాకారిణి సురభి కమల కుమారి. ఆ తరువాత రోజులలో ఆ కమల కుమారి కమలాబాయి అయ్యింది. ఆ కమలాబాయినే కాలక్రమంలో “సురభి కమలాబాయి” అయ్యారు.

బాల్యం నుండే నాటకాలు…

వారికి నాటకాలే జీవనాధారం కాబట్టి కమలాబాయికి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటినుంచే సంగీతంలో శిక్షణ ఇప్పించారు.  సహజ సౌందర్యం, కమ్మటి కంఠం, స్వచ్ఛమైన ఉచ్చారణ కమలాభాయికి చిన్నతనం నుండే పెట్టని ఆభరణాలుగా తయారయ్యాయి. ఊహ తెలిసిన దగ్గరినుండే ఆమెకు రంగస్థలం అలవాటయ్యింది. చిన్నతనంలోనే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న గారి నాటకాలలోనే. ఆమె “బాలకృష్ణుడు”, “ప్రహ్లాదుడు”, “లవుడు” లాంటి పాత్రలు వేస్తుండేవారు. కాలక్రమంలో ఆమెకు యుక్త వయస్సుకు రాగానే ఆమె వేసే మగ పిల్లలు వేషాలు మాన్పించారు. దాంతో వాళ్ళ నాన్నగారి నాటకాలలోనే “కథానాయిక” పాత్ర పోషిస్తుండేవారు “సురభి కమలాబాయి”. ఆమె నట జీవితంలో ఆ రోజులలో వందలాది బంగారు, వెండి పతకాలు బహుమతులుగా గెలుచుకున్నారు.

సంగీతం లో శిక్షణ…

చిన్నతనం నుండి ఆమెకు సంగీతం నేర్పించినప్పటికీ, హిందుస్తానీ సంగీతం నేర్పించాలన్న ఉద్దేశంతో కృష్ణాజీరావు గారు, కమలాబాయి గారిని బొంబాయి పంపించి పరుశురాంబుధ అనే విద్వాంసుడి దగ్గర హిందుస్తానీ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణలే  కాకుండా  హార్మోనీ, వయోలిన్, సారంగి లాంటి వాయిద్యాలలో కూడా నైపుణ్యం సంపాదించాలనుకున్నారు. అందరూ మహిళలే నటించే “సావిత్రి” అనే నాటకంలో “సావిత్రి” పాత్ర పోషించారు. ఆ నాటకాన్ని ప్రదర్శించిన వందలాది ప్రదర్శనలలో ఆమె తన నటనకు అనేకమార్లు వన్స్ మోర్ లు అందుకునేవారు కమలాబాయి గారు. ఆమె కేవలం నాటకాలలో పాత్రలు మాత్రమే ధరించడం కాకుండా దృశ్యానికి, దృశ్యానికి మధ్యన నృత్యాలు కూడా చేస్తూండేవారు.  కొన్నిసార్లు చమత్కార సంభాషణలు (కామెడీ స్కిట్స్) కూడా ప్రదర్శించేవారు. కమలాబాయి గారు ఆమెకు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి నటీమణిగా గానీ, గాయనిగా గానీ మాత్రమే కాకుండా ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు  “సురభి కమలాబాయి” గారు.

సినీ ప్రస్థానం…

సురభి కమలాబాయి గారికి తన ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులో ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది. అది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోలేని స్థానాన్ని సంపాదించుకునే సందర్భం.  మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” 1932 ఫిబ్రవరిలో విడుదలైంది. భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి టాకీ చిత్రం “ఆలం ఆరా” 1931లో విడుదలైంది. దానికి దర్శకులు “ఆర్దేశిర్ ఇరానీ”. ఆయన దగ్గర సహాయ దర్శకులుగా మన తెలుగు వారు “హెచ్.ఎం. రెడ్డి” గారు పనిచేస్తున్నారు. హిందీ టాకీ సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించేసరికి, “ఆర్దేశిర్ ఇరానీ” గారు తెలుగులో కూడా టాకీలు తీస్తే బాగుంటుందని ఆలోచించారు. ఆ పనిని హెచ్.ఎం.రెడ్డి గారికి అప్పగించారు. అదే మొట్టమొదటి టాకీ సినిమా “భక్త ప్రహ్లాద”. అదే మొట్టమొదటి టాకీ. అందరికీ కూడా కొత్తే. కాబట్టి కథ ఏమిటి? స్క్రిప్టు ఎలా వ్రాసుకోవాలి? పాటలు ఎలా? ఇవన్నీ ఆలోచిస్తుంటే హెచ్.ఎం.రెడ్డి గాకి వీటిని గురించి ఆలోచించి కొత్తగా పరిశోధన చేసే కంటే రంగస్థలం మీద విజయవంతమైన ఏదైనా నాటకం తీసుకుని దానిని సినిమాగా మలిస్తే బావుంటుంది అనిపించింది.


తొలి టాకీ లో “సురభి నాటక సంస్థ” నటీనటులు..

మరి ఆ రోజులలో నాటకాలలో “సురభి నాటక సంస్థ” వాళ్ళు నటించే నాటకాలే విజయవంతంగా నడుస్తుండేవి. వాళ్ళు అనేకమార్లు విజయవంతంగా ప్రదర్శించిన నాటకం “భక్త ప్రహ్లాద”. కాబట్టి ఆ నాటకాన్నే సినిమా కథగా తీసుకుందామని అనుకున్నారు హెచ్.ఎం. రెడ్డి గారు. ఆ నాటకం వేసే నటీనటులనే ఈ సినిమాలో నటీనటులుగా తీసుకోదలచి వారిని తీసుకురమ్మని మరొక రంగస్థలం నటులు సి.యస్.ఆర్ ఆంజనేయులు గారిని పంపించారు. ఆయన “సురభి నాటక సంస్థ” దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. “మేము రంగస్థలంపై నాటకాలు వేసుకుంటున్నాం. కొత్తగా ఈ కెమెరా ఏమిటి?  సినిమా ఏమిటి? పైగా బొంబాయిలో అంటున్నారు. మాకు ఇక్కడ కాంట్రాక్ట్ లు ఏమైపోతాయి? మేము రాం” అన్నారు “సురభి నాటక సంస్థ” వారు. మిమ్మల్ని మేము నెల కంటే ఎక్కువ అక్కడ ఉంచము. మాట్లాడే సినిమా ఎంత గొప్పగా ఉంటుందో ఆ ట్రూప్ వాళ్ళకు నచ్చజెప్పి బొంబాయి తీసుకెళ్లారు సి.యస్.ఆర్ ఆంజనేయులు గారు.

తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలి కథానాయిక గా…

అలా మొట్టమొదటి టాకీ సినిమా “భక్త ప్రహ్లాద” లో సురభి కమలాబాయి గారికి “లీలావతి” పాత్ర లభించింది. ఇంకొక విషయం ఏమిటంటే మొట్టమొదటి షాట్ “సురభి కమలాబాయి గారి మీదనే చిత్రీకరించారు. అది కూడా మొట్టమొదటి సినీ కవి చందాల కేశవదాసు గారు వ్రాసిన “పరితాప భారంబు” అనే పాటలో. సురభి కమలాబాయి గారిని కెమెరాకు ఎంత దూరంలో నిలబడాలో చెప్పారు. ఈ సినిమా పాట ఆమెనే పాడుకోవాలి. వాయిద్యం కళాకారులందరూ కాస్త దూరంగా కెమెరా ముందు కనిపించకుండా ఉంటూ వాళ్లు సంగీతం అందించేవారు. అలా మొదలైంది మొదటి తెలుగు టాకీ, మొదటి షాట్, మొదటి తెలుగు నటి సురభి కమలాబాయి గారు మొట్టమొదటి తెలుగు పాట పాడుతుండగా.

ఆ సినిమా చిత్రికరణ చాలా గోప్యంగా ఉంచారు. బయట ఎవ్వరికీ తెలియనివ్వలేదు. నటీనటులకు కూడా సినిమా ఎలా తీస్తారు? ఎలా వస్తుంది? అని కూడా చెప్పలేదు.  మొట్టమొదటి “భక్త ప్రహ్లాద” చిత్రానికి పారితోషికంగా సురభి కమలాబాయి గారికి ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు. అయితే సినిమా పూర్తయ్యాక ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన “మాణిక్ లాల్ షిండే” గారు సురభి కమలాబాయి గారికి ఐదు వందల రూపాయలతో బాటుగా వెయ్యి నూట పదహార్లు అదనంగా ఇచ్చారు. మొట్టమొదట వెండితెరపై బొమ్మలు మాట్లాడమంటే నమ్మలేని అద్భుతం కదా. అలాంటి అద్భుతాలలో తొలి పాత్రధారిణి అయ్యారు సురభి కమలాబాయి గారు.

తెలుగు సినిమా తొలి “సీత” సురభి కమలాబాయి

తొలి టాకీ “భక్త ప్రహ్లాద” సినిమా విజయం గమనించాక బొంబాయిలో ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్న “చున్నీ భాయ్ దేశాయ్” కి రెండో సినిమా తీయాలని ఆలోచన వచ్చింది. బెంగళూరుకు చెందిన “సర్వోత్తమ బాదామి” గారు సినిమాకి సంబంధించిన పరికరాలు కొనడానికి బొంబాయికి వచ్చారు. ఆయనను పరిచయం చేసుకున్న “చున్నీ భాయ్ దేశాయ్” గారు “సర్వోత్తమ బాదామి” గారికి సినిమా దర్శకత్వం చేసే అభిరుచి ఉన్నదని తెలుసుకొని నేను తీయబోయే తెలుగు సినిమాకు మీరే దర్శకత్వం వహించండి అని బాదామిని అడిగారు. చున్నీ భాయ్ దేశాయ్ గారికి కానీ, సర్వోత్తమ బాదామికి గారికి కానీ తెలుగు రాదు. కానీ వాళ్ళు తీయాలనుకున్నది తెలుగు సినిమా.  సరిగ్గా అప్పుడే విశాఖపట్నం నుంచి వచ్చిన బాకురబండ వెంకట్రావు అనే కళాకారుడు (నటుడు, గాయకుడు, హార్మోనిస్టు) వారికి పరిచయం అవ్వడంతో ఆ ముగ్గురి కలయికలో మొదలైంది రెండవ తెలుగు టాకీ “శ్రీరామ పాదుకా పట్టాభిషేకం”.

ఈ సినిమా కూడా బొంబాయిలోనే నిర్మాణమైంది. ఇందులో శ్రీరాముని పాత్రకు యడవల్లి సూర్యనారాయణ అనే నాట్యాచార్యుని తీసుకున్నారు. సీత పాత్రధారిణిగా మొదటి సినిమాలో నటించిన సురభి కమలాబాయి గారినే ఎంచుకున్నారు. అలా చూసుకుంటే తెలుగు తెరపై కనిపించిన తొలి సీత పాత్రధారిణి కూడా సురభి కమలబాయి గారే. ఆ సినిమా తొలుత డిసెంబరు 1932 లో మద్రాసులో విడుదలైంది. ఆ తరువాత ఒక నెల రోజులకి ఆంధ్రదేశంలో కూడా విడుదలైంది. పత్రికలో ఇచ్చిన సినిమా ప్రకటనలో ఇలా వ్రాశారు “తెలుగు టాకీల కనులారా వీక్షించని ఆంధ్రుని జన్మమేల? అనేకులకు టికెట్లు దొరకక వెనకకు మరలిపోవలసి వచ్చుచున్నది. ఒకవేళ మీకు తెలుగుభాష యందు ప్రవేశం లేకున్ననూ ఒక దపా వచ్చి కన్నులారా గాంచవలసిందే” అంటూ రెండవ సినిమాకి ప్రకటనలు కూడా ఇచ్చారు. అలా తెలుగు టాకీలు మొదలైన తొలినాళ్లలో 1932 లో వచ్చిన రెండు టాకీ సినిమాలలో ప్రధాన పాత్ర సురభి కమలాబాయి గారిదే.

తెలుగు సినిమా తొలి శకుంతల…

సురభి కమలాబాయి గారికి అలా వరుసగా అవకాశాలు వస్తుండడంతో తాను బొంబాయిలోనే స్థిరపడిపోయారు. “శ్రీరామ పాదుకాపట్టాభిషేకం” సినిమా నిర్మాతలే తమ రెండవ సినిమా “శకుంతల” ప్రారంభించారు. యడవెల్లి సూర్యనారాయణ, సురభి కమలాబాయి గార్లనే “శకుంతల” సినిమాలో దుష్యంతుడు, శకుంతల పాత్రలకు కొనసాగించారు. సురభి కమలాబాయి గారికి ఇది మూడవ తెలుగు సినిమా. మరో కోణంలో చెప్పాలంటే తెలుగు తెరమీద తొలి “శకుంతల” కూడా సురభి కమలాబాయి గారే అయ్యారు. అలా సురభి కమలాబాయి గారు మొదటి మూడు సినిమాలలో మూడు ప్రత్యేకతలు సంపాదించుకోగలిగారు. అలా ప్రారంభమైన ఆమె వెండితెర జీవితం మొదటి ఎనిమిది సంవత్సరాలు బొంబాయిలోనే కొనసాగారు.

తెలుగు సినిమా రెండవ ద్రౌపది…

సురభి కమలాబాయి గారు ఒకవైపు తెలుగు సినిమాలలో నటిస్తూనే మధ్య మధ్యలో హిందీ సినిమాలలో కూడా నటిస్తూ వచ్చారు. 1933 నుండి 1939 వరకు ఆమె నటించిన కొన్ని హిందీ సినిమాలు షెహర్ కా జాదూ (1934), దో దివానే (1936), బేఖరాబ్ జాన్ (1936) మొదలగున్నవి. ఆ తర్వాత సురభి కమలాబాయి గారు నటించిన చిత్రాలలో చెప్పుకోవాల్సింది ఆ రోజులలోనే వచ్చిన “ద్రౌపదీ మానసంరక్షణం” (1936). ఇందులో ద్రౌపది పాత్రలో సురభి కమలాబాయి గారు నటించారు.   తెలుగు తెరమీద మొట్టమొదటి ద్రౌపది కూడా సురభి కమలాబాయి గారు అయ్యి ఉండాల్సింది. కానీ ఒక నెల వ్యవధిలో అది తప్పిపోయింది. “ద్రౌపదీ మానసంరక్షణం” కు పోటీగా ద్రౌపది వస్త్రాహరణం నిర్మింపబడి అది ఒక నెల ముందుగా ఫిబ్రవరి 1936లో విడుదలయ్యింది. అందులో నటించిన కన్నాంబ గారు తెలుగు తెరమీద తొలి ద్రౌపది అయ్యారు. సురభి కమలాబాయి గారికి తెలుగు తెరపై రెండవ ద్రౌపదిగా ఘనత దక్కింది.

భక్త జయదేవ సినిమా కు దర్శకత్వం…

బొంబాయి లోనే ఉండిపోయిన సురభి కమలాబాయి గారిని తెలుగురాష్ట్రములోకి తీసుకువచ్చిన సినిమా “భక్త జయదేవ” (1939). ఈ సినిమా నాలుగు ఫిబ్రవరి 1939 నాడు విడుదలైంది. ఈ సినిమా నిర్మాణం అంతా విశాఖపట్నంలోనే జరిగింది. బొంబాయి, కొల్హాపూర్, కలకత్తాలలో మాత్రమే ఎందుకు జరగాలి? విశాఖపట్నంలో కూడా సినిమా నిర్మాణం జరిగితే సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది కదా అనే ఉద్దేశంతో విశాఖపట్నంకు “గొట్టిముక్కల జగన్నాధ రావు” గారు, “సాగి సూర్యనారాయణ రాజు” గారు “ఆంధ్ర సినీ టోన్” అనే ఒక స్టూడియోను విశాఖపట్నంలో నెలకొల్పారు.

“భక్త జయదేవ” అనే సినిమాను నిర్మించదలచి ఆ సినిమాను తెలుగు మరియు బెంగాలీలో తీస్తూ “హిరేన్ బోస్” అనే బెంగాలీ అతనిని చిత్రానికి దర్శకుడిని చేశారు. ఆయనే సంగీత దర్శకత్వం కూడా నిర్వహించాడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం సరిగ్గా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు సురభి కమలాబాయి గారు. అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది.

ఆరుద్ర గారి జ్ఞాపకాలు…

సురభి కమలాబాయి గారు “భక్త జయదేవ” సినిమా చిత్రీకరణ కోసం విశాఖపట్టణం వచ్చిన రోజులలో ఒకరోజు కారు కోసం బంగ్లాలో గుమ్మం ముందు నిల్చుని ఉన్నారు. పక్కింట్లో పద్నాలుగు సంవత్సరాల కుర్రాడు బయటకు వచ్చి నిలుచున్నాడు. సురభి కమలాబాయి గారు అతనిని దగ్గరికి పిలిచి కుర్రాడి పేరు అడిగారు. అతను చెప్పలేదు. నీ పేరు శంకర్ కదా అని సురభి కమలాబాయి గారు అడుగగా, తెలిసి ఎందుకు అడగుతున్నావు అని అక్కడినుంచి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్లిపోయిన కుర్రాడిపై వాళ్ళ తల్లిదండ్రులు కోప్పడ్డారు. ఆమె సినిమాలో నటిస్తున్న నటి కదా. ఆమెను గౌరవించి పేరు చెప్పాలి కదా అన్నప్పుడు, దానికి ఆ కుర్రాడు సమాధానంగా ఆమెకు తెలిసి ఎందుకు అడగాలి అన్నాడు.

అలా అన్న ఆ కుర్రాడు సరిగ్గా ఆ సంఘటన జరిగిన ఇరవై సంవత్సరాల తరువాత ఆ కుర్రాడు రచయిత అవుతానని, సురభి కమలాబాయి గారిని సినిమాలలో కలుసుకుంటానని, ఆయన వ్రాసిన పాటకు సురభి కమలాబాయి గారు నటిస్తారని ఆ పద్నాలుగు సంవత్సరాల కుర్రవాడు అనుకోలేదు, సురభి కమలాబాయి గారికి ఆ ఆలోచనే లేదు. కానీ విధి అలా కలిపింది. ఆ కుర్రాడు ఎవరో కాదు, తరువాత రోజులలో సినిమాలలో ప్రముఖ రచయిత అయిన “ఆరుద్ర” గారు. ఆరుద్ర గారి అసలు పేరు “భాగవతుల సదా శివ శంకర శాస్త్రి”. 1959 లో జయభేరి వారి సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో నారదుడిగా రమణారెడ్డి, కృష్ణుడుగా రేలంగి, సత్యభామగా సూర్యకాంతం గార్లు నటిస్తే  సురభి కమలాబాయి గారు రుక్మిణి గా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఆరుద్ర గారు ఇరవై ఏళ్ల క్రిందట జరిగిన సంఘటనను సురభి కమలాబాయి గారికి గుర్తు చేశారు.

కీలుగుఱ్ఱం సినిమాతో పునరాగమం…

సురభి కమలాబాయి గారు చిత్రరంగ ప్రవేశం దగ్గర నుండి పది సంవత్సరాలు ఆమె నటించిన చిత్రాలన్నీ కూడా పౌరాణికాలే. అందుకే ఆమె తెలుగు తెరపై ఏ పాత్ర ధరించినా, ఆ పాత్ర పోషించిన తొలి నటీమణి అయ్యారు. అలా తొలి విడతలలో కమలాబాయి గారు నటించిన చివరి చిత్రం గూడవల్లి రామబ్రహ్మం గారు దర్శకత్వం వహించగా 17 మార్చి 1942 నాడు విడుదలైన “పత్ని” అనే చారిత్రాత్మక జానపద చిత్రం. కె.యస్ ప్రకాశరావు, ఋష్యేంద్రమణి లు నాయక, నాయికలుగానటించిన ఈ చిత్రంలో సురభి కమలాబాయి గారు ప్రత్యేక పాత్రలో నటించారు. 1942 నుంచి 1949 వరకు సురభి కమలాబాయి గారు తెలుగు సినిమాలలో నటించిన దాఖలాలు లేవు. కారణాలు తెలియవు. ఆ ఏడేళ్లలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఏమైనా పరిణామాలు సంభవించాయా అన్న విషయాలు ఎక్కడ లభ్యం కాలేదు. 1949లో విడుదలైన కీలుగుఱ్ఱం చిత్రంలో సురభి కమలాబాయి  గారు యక్షిణి పాత్ర ధరించారు. అక్కడి నుండి మరో 20 సంవత్సరాల పాటు తెలుగు సినిమాలలో సురభి కమలాబాయి గారు చిన్న చిన్న పాత్రలే ధరిస్తూ వచ్చారు.

చివరి సినిమా “ఉమా చండీ గౌరీ శంకరుల కథ”…

ఆమె వయస్సు వ్యత్యాసం వలన సురభి కమలాబాయి గారు 1932 నుండి తెలుగు సినిమా రంగంలో ఉన్నప్పటికీ కూడా తరువాత వచ్చిన భానుమతి, కన్నాంబ, అంజలీదేవి, కాంచనమాల గార్లతో ఎప్పుడూ పోటీ పడలేదు. తనకు వచ్చిన పాత్రలతోనే సరిపెట్టుకున్నారు. 1940 నుండి 1968 వరకు ఆమె నటించినవన్నీ కూడా చిన్నచిన్న అతిథి పాత్రలే. అయినప్పటికీ తొలి టాకీ తారగా సినిమా పరిశ్రమలలో తనను ఎప్పుడూ గౌరవిస్తూండేవారు. ఆ రోజులలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో సురభి కమలాబాయి గారివి చిన్న చిన్న పాత్రలే అయినప్పటికీ తాను తారాగణంలో ఒకరయ్యారు. ఉదాహరణకి పాతాళభైరవి సినిమాలో తోటరాముడి తల్లిగా, మల్లీశ్వరిలో బసక్క అనే పాత్రలలోనూ, దేవదాసులో పార్వతి బామ్మ గాను నటించారు. సురభి కమలాబాయి గారు 1960 తర్వాత సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు “శభాష్ రాముడు”, “కృష్ణ గారడి”, “వెలుగు నీడలు”, “ఉపాయంలో అపాయం”, “మోహినీ రుక్మాంగద” ఇలాంటి చిత్రాలలో నటించారు. సురభి కమలాబాయి గారు నటించిన చిట్టచివరి చిత్రం 11 జనవరి 1968 లో విడుదలైన “ఉమా చండీ గౌరీ శంకరుల కథ”.

బ్యాంకు దివాళాతో 30 వేల రూపాయలు నష్టం…

సురభి కమలాబాయి గారి వ్యక్తిగత విషయాలలోకి తొంగిచూస్తే ఆమె అవివాహిత. ఎందుకనో తెలియదు ఆమె పెళ్లి చేసుకోలేదు. చివరి రోజులలో సినిమాలలో అవకాశాలు తగ్గినప్పుడు “సురభి నాటక సమాజం” వారు నటించే నాటకాలకు వెళుతుండేవారు. సురభి కమలాబాయి గారి అక్క గారి అమ్మాయి “సురభి బాలసరస్వతి”. ఆమె మంచి పేరున్న నటీమణి. ఆమెతో కలిసి సురభి కమలాబాయి గారు సినిమా చిత్రీకరణలకు వెళుతుండేవారు. ఆ రోజులలో సురభి కమలాబాయి గారు తాను కష్టపడి సంపాదించిన సొమ్ము 30 వేల రూపాయలు బ్యాంకులో దాచుకున్నారు.  హఠాత్తుగా బ్యాంకు దివాలా తీసేసరికి ఆమె సంపాదనంతా ఆవిరైపోయింది. అయినా కానీ ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు. 1968 వరకు సురభి కమలాబాయి గారు మద్రాసులో ఉండేవారు. 1971 మార్చిలో ఆమె మరణించారు. సురభి పరంపరకు చెందిన వనారస గోవిందరావు అనే ఆయన ఏలూరు దగ్గరలోని పోలసానిపల్లి లో స్థిరపడ్డారు. వీరి అమ్మాయి పూర్ణిమ జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి గీతాంజలి సినిమాలో కథానాయికగా నటించారు. తమ పరంపరకు చెందిన వారు ఏలూరులో స్థిరపడ్డారు.

నిష్క్రమణం…

సురభి కమలాబాయి గారు ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. సురభి కమలాబాయి గారు సినిమాలలో నటిస్తున్న రోజులలో నాలుగు ఎకరాలు పొలం కూడా కొనిపెట్టారు. అందువలన 1968లో తన చివరి సినిమాలో నటించాక ఏలూరులో ఆమె పెంచుకున్న కొడుకు దగ్గరికి వచ్చేశారు. అక్కడ మూడు సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేని ప్రశాంత జీవనాన్ని గడిపారు. ఆ సమయంలో ఆమె అక్కడ ఉన్నారని తెలిసి నాటక సమాజం వారు ఆమెకు రెండు మూడు సార్లు సన్మానం జరిపారు. 30 మార్చి 1971 తెల్లవారుజామున మరణించారు.

స్థానికంగా ఉన్న థియేటర్ యజమానులు, నాట్యభారతి ప్రతినిధిగా ఉన్న కోరండ నరసింహారావు గారు, అలాగే ఏలూరు దగ్గరలో ఉన్న సురభి కళాకారులు పూర్ణిమ మొదలైన వాళ్ళు అందరూ వచ్చి సురభి కమలాబాయి గారి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు అందించారు. ఆమె మరణవార్త అన్ని దినపత్రికలో ప్రచురించారు. రంగస్థలం మీదనే జన్మించి, రంగలస్థలం మీదనే జీవితంగా ఎదిగి, ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులో చిత్రరంగ ప్రవేశం చేసి 36 సంవత్సరాలు సినీరంగంలోనే జీవించిన “సురభి కమలాబాయి” గారు తన అనుభవాలను తనతో పాటే తీసుకెళ్తూ, గౌరవప్రదమైన ముగింపుతో ఈ లోకాన్నుండి నిష్క్రమించారు.



Show More
Back to top button