మెగా స్టార్ చిరంజీవి హీరోగా అగ్ర స్థాయిలో కొనసాగుతుండగా తమ సోదరుడు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లను భాగస్వాములుగా చేసి ‘అంజనా ప్రొడక్షన్స్’ అనే సంస్థను నిర్మించారు. ఆ సంస్థ పతాకంపై విడుదలైన తొలి చిత్రమైన “రుద్రవీణ” మూవీ విషయాలు తెలుసుకుందాం. తమిళ అగ్ర దర్శకుడు కె.బాలచందర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. గణేశ్ పాత్రో మాటలు రాశారు. ఇళయరాజా బాణీలకు అనువుగా సీతారామశాస్త్రి రచించిన పాటలు ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. చిరంజీవి సరసన శోభనను కథానాయికగా ఎంపిక చేశారు. ఇంకా ప్రధాన పాత్రలలో జెమినిగణేశన్, పి.యల్.నారాయణ, ప్రసాద్ బాబు, సుమిత్ర, రమేశ్ అరవింద్, దేవీలలిత, బ్రహ్మానందం, ఫైట్ మాస్టర్ రాజు, కైకాల సత్యనారాయణ నటించారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా ఆర్.రఘునాధ రెడ్డి, ఎడిటర్‌గా గణేష్ కుమార్‌లు పనిచేశారు. చెన్నై, కాంచీపురం, కుర్తాళం, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను 70 రోజులలో పూర్తి చేశారు. దాదాపు రూ.80 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం .. 1988వ సంవత్సరం మార్చ్ 4న విడుదలైంది.
చిరంజీవి మాస్ సీన్స్, ఫైట్లు, డాన్సులు పెద్దగా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ కారణంగా సినిమా బాక్సఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. చిత్ర రిజల్ట్ విషయంలో నాగబాబు అసంతృప్తికి గురయ్యారు. 36వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రుద్రవీణ చిత్రం ఎవరు ఊహించని విధంగా మూడు విభాగాలలో అవార్డులను గెలుచుకుంది. అంతేకాకుండా, ఆ సంవత్సరం నాలుగు నంది అవార్డులను కైవసం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రుద్రవీణ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక గ్రామాలకు స్ఫూర్తినిచ్చినందుకు తను చాలా ఆనందపడినట్లు తెలిపారు.